మూడు చక్రాల సైకిలు

చందమామ వెన్నెట్లో
నాన్నగారి గుండెలపై నేను.
అమ్మ తినిపించే మజ్జికన్నం.

మీ ఆలన, పాలన, లాలన
నా మూడు చక్రాల సైకిలు.
మీరు చెప్పిన ఏడు చేపల కథలు
ఏడు ఖండాలు నింపే నా ప్రపంచయాత్రలు .

మమతల చిరునవ్వుల చాటు
అనురాగాల పొదివినల్లుకున్నాం.
బాల్యపు లోగిడి నుండి
జీవితపు సాయంత్రాలకు ప్రయాణం.

ఈ నిండు రాత్రిభూగోళానికి అటు మీరున్నా
మీ నిండు ప్రేమ,
ఇటు నిండు వెన్నెలై కురుస్తుంటే,
నాకీ సుఖం చాలు !

ఒప్పుదిద్దిన అక్షరమై

తప్పుచెప్పిన ఏడెక్కంలొ
చిరిగిన పుస్తకపు దొంతరలలొ
సాక్షివై, తల్లీ ఉంటావమ్మా?

ఒప్పుదిద్దిన అక్షరమై
ఊపిరివై, తల్లీ ఉంటావమ్మా?

మంచు పిడుగులు

విశాల విశ్వంలో నువ్వూనేను
స్నిగ్ధసామ్రాజ్యంలో భగ్నహృదయాలు
వన్నెల విను వీధుల మబ్బుల చాటు
భావురు మనే మంచు పిడుగులు
విశాల విశ్వంలో నువ్వు, విశాల విశ్వంలో నేను

వస్తావా?

అలల చాటు వర్షిణి వై
కలల చాటు కౌముదివై
కొకిలమ్మ వర్ణమై
జాబిలిలో వెండి మరకవై

కలవై, అలవై
ఎదురుచూడని ప్రశ్నవై
జాబిలివై, వర్ణమై
వసంతమై వస్తావా?

నీటి ఒడ్డున హంసనై
నీలి తారకనై
తొలిమావి చిగురునై
ఈ కవితకు చివరి అక్షరమై ఎదురు చూస్తాను.

కలవై, అలవై
ఎదురుచూడని ప్రశ్నవై
జాబిలివై, వర్ణమై
వసంతమై వస్తావా?

చిరు మరకలు


కళ్ళల్లోని కలలన్నీ కిటికీ అద్దంపైకి చేరుకుంటాయి
ఊహల్లోని ఊసులన్నీ మంచుబిందువులై జారుతాయి
రేపటి ఉదయాన్నే సూర్యుడు వీటిని ఆవిరిచేస్తాడు
అప్పుడు యీ స్మృతులన్నీ చిరుమరకలుగా మిగిలిపోతాయి

గుర్తున్నాయా మిత్రమా?


గుర్తున్నాయా మిత్రమా?
నోటు బుక్కులో మనం రాసిన తీపి కబుర్లు
గోడలపై ఇద్దరి పేర్లు

నా జ్వరంలో జలజల రాలిన నీ కన్నీళ్ళు
జీడిచెట్లకింద నువ్వు దాచి ఇచ్చిన మామిడి పళ్ళు
ఆగి ఆగి పాఠం మద్యలో పంచుకున్న మూగ సైగలు
గుర్తున్నాయా మిత్రమా?

చెట్టుచాటు నీడల్లో

మధురమయిన మౌనంలో
రేపటి గానం కోసం చూస్తుంటే

వెన్నెల రాత్రుల్లో, చెట్టు చాటు నీడల్లో,
ఎగసి పడే సెలయేరు శబ్దంలో వినిపిస్తావు
కనిపిస్తావు, మరిపిస్తావు

సెర్చ్

పోయిన హృదయాన్ని
వెన్నెల్లో వెతికాను, కాని
చీకట్లోనే దొరికింది

వెన్నెలంతా


వెన్నెలంతా సన్నజాజులై వాకిట్లో కురుస్తుంది
నీ కురులతో ఆడుకున్న పిల్ల గాలి అప్పుడప్పడు సన్నజాజులను ఎగరవేస్తుంది

ఒక్కతే ఆకాశంలో ఉన్న మేఘం కూడా ఇటువైపే చూస్తుంది
దూరాన నీలినీడగా నిలుచున్న కొండలు వెన్నెలమ్మ ఇక్కడకు కూడా వస్తుంది కదా అని ఎదురుచూస్తున్నాయి

సన్నజాజుల వాన నీటినంతా పన్నీరుగా మారుస్తుంది

ఈ ఆకాశం, నీలి కొండలు, సన్నజాజులు, నువ్వు-నేను!

సొగసు చూడ తరమా?

సొగసు చూడ తరమా?....... ఈ కృతి ఆణిముత్య0!

అమ్మాయి తిన్నగా వెలుతు0డగా.....కాలి పట్టీలు గడ్డి మొక్కకు తగులుకొని, కాలు చిక్కుకు0దనుకొ0డి.... కొ0చె0 చిరు కోప0గా వ0గి, కురులు సవరి0చుకొని, చిక్కు విప్పుతు0ది కదా, అప్పుడు .....ఆ సొగసు చూడ తరమా?

పిల్లలు స్కూలుకి వెల్లే ము0దు, దొ0గ ఎత్తు వేస్తున్న చ0టివాడిని , సిగమొలతోనే, నీటి కు0డీ పక్కనే నీళ్లు పోస్తున్న ఇల్లాలి సొగసు చూడ తరమా?

ము0దు వసారాలో , సన్నజాజులను, ఒకొక్కటిగా తె0పి తలలో , ముడుచుకున్నప్పుడు, ఆ సొగసు చూడ తరమా?

పుస్తక0 పక్కన తోసి, కొ0చె0 అట్లు తిప్ప0డి, వస్తాను అ0టూ చేతిలో అట్లకాడ పెట్టి పారిపోతున్న తరుణి సొగసు చూడ తరమా?

కోపమొచ్చినా, అలసటొచ్చినా, అలకొచ్చినా, ఎదురుచూసినా, చమటోర్చినా, ఆన0ద0 ఒలకపోసే చెలి సొగసు చూడ తరమా?

ప్రేమలేఖలు

ఈ సెల్ ఫోన్లు, మెస0జర్లు, ఈమెయిల్లు రాని కాల0లో కుర్రాల్లు బుద్దిగా ప్రేమలేఖలు రాసేవారు. ఏ ఇన్లా0డ్ కవర్లోనో, గ్రీటి0గ్ కార్డు లోపలో చక్కగా, వీలయిన0త ఒద్దికగా, ఒక్క రూపాయి ఖర్చుతో , ప్రేమ వ్యక్త0 చేసే మార్గమది. ప్రేమలేఖలు వ్రాయట0లో కొ0దరు బాగా చేయి తిరిగిన వారయితే కొ0దరు పాప0 చాలా తడబడతారు. కొ0దరు నిష్కర్షగా విషయ0 చెప్పగలిగితే మరి కొ0దరు అసలు విషయ0 కాక మిగిలినవన్ని చెబుతారు. అయినా ప్రేమలేఖలు సృష్టి0చే భావాలే వేర0టారు వాటిన వ్రాసినవారయినా , అ0దుకున్న వారయినా...

అ0దుకే ప్రేమలేఖలు ఎలావ్రాయాలి , ఎలా అ0దజేయాలి అని కొన్ని సూచనలు:

1. లేఖని ఎట్టి పరిస్థితి లోనూ మామూలుగా రాయకూడదు. వీలయితే మ0చి సె0టు పెన్నుతోగానీ, ఎక్కడా దొరకని ర0గు ఇ0కుతోగానీ రాయవలెను. ( హెడ్మాష్టరు గారి ఆకుపచ్చ సిరా అయితే ఇ0కా మ0చిది. కానీ అ0దుకు అతని పెన్ను తస్కరి0చాలి అదివేరే స0గతి. )

2 మీ దస్తూరి అ0త0త మాత్రమయితే మ0చి దస్తూరి ఉన్న నమ్మకస్తుడయిన దోస్తుని బతిమాలాలి. మీకు అక్కో, చెల్లో ఉ0టే ఆమెను ఒప్పి0చగలిగితే చాలు.

3. మీకు ఏమాత్ర0 వ్రాయటానికి విషయ0 తోచకపోతే ఒక వార0 రోజులు మన పాత సినిమాలు చూడ0డి. 'ప్రేమదేశ0', 'ప్రేమికులరోజు', 'ప్రేమికుడు', 'ప్రేమలేఖ' ఇలా ఒకడజను సినిమాలు చూస్తే చాలు మీరు మేఘస0దేశ0 లెవెల్లో లవ్ లెటర్లు రాయొచ్చు.

4. ఇక డెలివరీ మార్గాలు......
మాటలు అ0త0త మాత్ర0గా వచ్చిన పిల్లలయితే మేలు. కానీ ఇక్కడ ఒక ప్రమాద0 ఉ0ది. ఆ పిల్లో, పిల్లాడో మన బుడుగులాగా కానీ, సీగానపెసూనా0బలా గానీ చిన్నప్పుడే బాగా ముదిరిపోతే మీ వీపు విమాన0మోత మోగే ప్రమాద0 ఎ0తయినా ఉ0డవచ్చు.

5. ఆమె కానీ లేదా ఆ అబ్బాయిగానీ, ల0చ్ బాక్సు తెచ్చుకు0టే అ0దులో పెడితే సరిపోతు0ది.

6. మీకు మరీ సిగ్గు లేకపోతే తిన్నగా చేతిలో కూడా పెట్టవచ్చు.

7. చివరిగా, కథ అడ్డ0 తిరిగితే దాగోవడానికి ఏర్పాట్లు చాలా ముఖ్య0. ము0దుగానే, ఒక వార0 రోజలు మీ తాత గారి ఇ0టికి పోయే కార్యక్రమ0 పెట్టుకోవట0 చాలా మ0చిది.

ఇట్లు మీ
శ్రేయోభిలాషి
****

సూచన: మీరు లేఖకు అత్తరు పూస్తే ఇ0కా మ0చిది.

కోమలి

కోమలి బుచ్చిబాబు గారి కథానాయక. పల్లెటూరి పిల్ల , కథానాయకుడి ప్రేయసి. బుచ్చిబాబు కోమలిని ఎలా వర్ణిస్తార0టే......

మామిడితోపులో ఆడుకు0టూ ఉ0టు0ది కోమలి, అప్పుడు బుచ్చిబాబు ఏమ0టార0టే...

"...అట్లా గడ్డపోచల మధ్యగ0తులేస్తూ ఆకాశాన్నీ, భూమిని బుజ్జగిస్తూ స్నేహ0 చేసుకు0టూ వు0డవలసిన వ్యక్తి కోమలి. ఆమె నిజస్థాన0 అది.

పుట్టినిల్లు పచ్చగడ్డి, అత్తిల్లు ఆకాశ0. పిట్టలు, పువ్వులు స0తాన0. మనుషుల మధ్య యి0డ్లల్లో వు0డవల్సిన మనిషికాదు. కొ0దరు కొన్ని వాతావరణాలకోస0 ఉద్దేశి0పబడతారు. ఆ వాతావరణ0 మధ్యనే వారికి పరిపూర్ణత వు0టు0ది. స్వేచ్ఛా జీవనానికి ఆలయాలు వాతావరణమే. అ0దులో0చి తొలగిస్తే వారు నీరు విడిచిన చేపలు - శృ0ఖలాలు లేని బానిసలు. "

కాసేపటికి చెట్లనీడలో కూర్చు0టు0ది కోమలి,

"సర్వీచెట్లు వానాకాల0లో పీల్చుకున్న వర్ష0 నీటిన ఈనాడు మెల్ల మెల్లగా వొదులుతూ కోమలిని మధ్య కూచోబెట్టి తల0టుపోస్తు0ది. గాలి సిగ్గులేని పిచ్చి పువ్వుని బలవ0త0గా తల్లో అమరుస్తు0ది. వానకి చలి0చిన వేడి భూమిలో మైక0 చె0ది సుగ0ధ పరిమళ0 కి0ద ఆమెని ఆక్రమిస్తు0ది. ఎర్రపువ్వులను బ0ధి0చుతున్న గడ్డిపోచలు , గాలికి ఎ0డలో మెరుస్తూ, లయగా ఆరబెట్టిన ఆకుపచ్చ పట్టుచీరలా , ఎ0డుకుని, కోమల్ని చుట్టుకు0టాయి ! "

నువ్వు వస్తే

నువ్వు ఎర్రటి మందారం గానో, తెల్లటి పావురం గానో, నల్లటి మేఘం గానో వస్తే
తుమ్మెదనై, చిరు గాలినై, పిల్ల కాలువనై నీకోసం ఉంటాను

నువ్వు కరువులో చినుకులా, అమావాశ్యలో వెన్నెలలా, ఎడారిలో వర్షంలా రాకపోతే మాత్రం
కన్నీటినై , చీకటినై, వేడి నిట్టూర్పునై, వెనక్కిరాని దిక్కులలో దాగి పోతాను

యుద్ధం


అప్పుడెప్పుడో పడిన పిడుగు ఇంకా గుండెల్లో ప్రతిద్వనిస్తుంది
విషాదం రెక్కలు విప్పుకొని ఉషోదయాన్ని అల్లంత దూరంలో నిలబెట్టింది
నిశ్శబ్దంతో, నా గుండె చప్పుడు, మొన్నటి నీ నవ్వు, కాసేపు క్రితం గర్జంచిన మేఘం మాత్రం యుద్ధం చేస్తున్నాయి!

పాదాలు

అందాల నయగారాలు విషాదాల జలపాతాలు
కదిలే మేఘాల అంచుల్లో నీ కనురెప్పల కాంతులు
రాలిపడే చినుకుల్లో నీ కంటి కిరణాలు

ఎగసిపడే కెరటాల్లో నిన్నుతాకి నేలకొరిగిన గులాబీలు
పాదాలకు కూడా దేముడు కళ్ళిచ్చాడేమో
మెత్తగా వర్షిస్తున్నాయి కన్నీళ్ళని

కాలం చెప్తుంది

నిజానికి చెప్పాల్సింది ఎంతో ఉంటుంది.
మాటలు సరే,
కన్నీళ్ళూ చెప్పవు.
కాలం చెప్తుంది కానీ
అప్పటికి అమృతం విషమవుతుంది.

(ఎన్. గోపి గారి వంతెన నుంచి)

మడిసైపుట్టాక కుసింత కళాపోసనుండాల!

బాపు, రమణ కలిసి సృష్టించిన అద్భుతమయిన సినిమాలలో ‘ముత్యాల ముగ్గు’ ఒకటి. రావుగోపాలరావు తెలుగు సినిమాలలో ఎన్నటికీ నిలిచిపోయే డైలాగులతో విలన్ పాత్ర పోషించారు ఈ సినిమాలో. మచ్చుకి ఒక సన్నివేశం.

(అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది. ఎర్రటి అకాశంలో సూర్యుడు ఉదయిస్తుంటాడు. పరకడుపునే చుట్టకాలుస్తూ సూర్యోదయం చూస్తుంటాడు విలన్ రావుగోపాలరావు.

సెగట్రీ: నారాయుడొచ్చాడండి.
రావు: వచ్చాడా తీసుకొచ్చావా?
సెగట్రీ: యెస్సర్. తీసుకొచ్చాను చూస్తారా?
(నారాయుడిని మర్డర్ చేయిస్తాడు రావుగోపాలరావు. నారాయుడి బాడీని రావుగోపాలరావుకి చూపించటానికి తెచ్చాడు సెక్రెట్రీ.)
రావు: అబ్బా సెగట్రీ ఎప్పుడూ పనులూ బిజినెస్సేనా? యే? పరగడుపునే కుసుంత పచ్చిగాలి పీల్చి ఆ పత్యక్షనారాయుడి సేవ చేసుకోవద్దూ?
సెగట్రీ: యెస్సర్
రావు: యెస్సర్ గాదు. కళ్ళెట్టుకు సూడు…..పైనేదో మర్డర్జరిగినట్టు లేదూ? ఆకాసంలో సూర్రుడు నెత్తురు గడ్డలా లేడూ?
సెగట్రీ: అద్భుతం సార్!
రావు: మడిసన్నాక కాసింత కళా పోసనుండాలయ్యా! ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది? !
అలా మన అధునికాంధ్ర విలన్లను కూడా కళాభిమానులు చేస్తారు, బాపు, రమణ.

పూల సరసాలు

చాలానాళ్ళకు మళ్ళీ సమయం చిక్కింది. ఎన్నాళ్ళనుండో చదవాలని తీసి ఉంచిన తాపీ ధర్మారావు సాహిత్య మొర్మొరాల పై మనసు మళ్ళింది. సాహిత్య మొర్మొరాలు విశాఖ తీరంలో అప్పుడే వేసిన పకోడీలా కరకరలాడుతాయి.

ఇక విషయానికి వస్తే,

పూలు అమ్మే అమ్మాయిలకు తెలుగులో ఒక ముద్దు పేరుంది, పుష్పలావికలని. పుష్పలావికలతో సరస వర్ణన తప్పని సరి అని తెలుగు ప్రభంధ కవులకు నియమం ఒకటుంది. మహా ప్రభంధాలలో ఉండవలసిన పద్దెనిమిది వర్ణాలలో ఇది ఒకటి. పురవర్ణన, సూర్యోదయ వర్ణన, రతి వర్ణనలా అన్నమాట. కవి ఎంత మడికట్టుకున్నా ఇది మాత్రం తప్పదు. మన తెలుగు కూడా ఇందుకు తగినట్టే ఉంది.

పుష్పలావికలు అమ్మే పూలు, సంపెంగలు, మల్లెలు, తామరలు, కలువలూ లేదా ఈ పూలతోనే చేసిన దండలు, చెండ్లూనూ. తెలుగులోని ఉపమానాలూ ఇక్కడ పూర్తిగా కవులకు సహకరిస్తాయి. ప్రియురాలి కళ్ళు కలువలనీ, తామరలనీ, దంతాలు మల్లెమొగ్గలనీ, కైదండలు (చేయి, భుజము వగయిరా) పూలదండలని మన కవులు ఎప్పుడో నిర్ధారించారు.

మన తెలుగు వాడికి లోటేమిటి, “నీ దండ ఎంతకిస్తావు?” అన్న ప్రశ్న అమాయకం కావచ్చు, కానీ పుష్పలావిక “నా దండ నువ్వు కొనలేవు” అంటే, మరివేరే అర్థం స్ఫురించక మానదు. ఇది రాసినది ఎవరో కాదు, శ్రీ కృష్ణదేవరాయలు!

వెలదీ యీని దండ వెలయెంత?
నాదండకు వెలబెట్టన్ ఎవ్వరితరంబు

ఇలా అతిసున్నితమయిన సరసాన్ని పండించారు మనకవులు!

తడిగుడ్డతో మూసిన చెండ్లకు “ఏదీ, ఆ చెండ్లు చూడనీ” అంటే, కపటం లేని ఆసక్తే కావచ్చు. కానీ “బేరం కుదరనీ, చూపిస్తాను” అని ఆమె అనగానే చిన్న నవ్వు నవ్వక తప్పదు.

ప్రభంధ కవులు ఇంకొంచం ముందుకు పోయి రాస్తారు. వసు చరిత్ర లోని రెండు వాఖ్యాలు చూడండి.

------- తమ్ములనేల మోసివే సతీ!
మూయదగదే మానస భూనిధానములవి!

తమ్ములంటే తామరలు. ఎండకు వాడిపోకుండా తామరలను మూసి ఉంచుతుంది పుష్పలావిక. “ఏమి మొగ్గలను మూసి ఉంచావు?” అని అడుగుతాడు యువకుడు. ఇవి ‘మానసభూనిధానములు’ మూయకుండా ఉంచుతానా? అంటుంది పుష్పలావిక! మానససరోవరంలో దొరికిన పూవులంట అంచేత వాటిని కాపాడనా అని బదులు చెప్పంది.

ఇక నర్మగర్భంగా కవి ఏమన్నాడో మీరే గ్రహించాలి!

బుడుగు రాతలు

(బుడుగు ఒక గడుగ్గాయి. ప్రపంచంలో ఈ సైజు పిల్లలకు ప్రతినిధి. పిల్లల్లో పెద్దగా, పెద్దల్లో పిల్లగా వుంటాడు. జట్కా తోలాలని, వింజను నడపాలని కుతూహలం. బుడుగుకి చిన్ని ప్రేమించే హృదయం వుంది. పలక మీద బుడుగు రాసిన ప్రేమలేఖ ఇది.)

సీ గాన పెసూనాంబలు గారికు,
ఇది లౌ లెటరు రాస్తున్నానన్నమాట. బాబాయి ఇచ్చిరా అంటే రెండు జెళ్ళ సీతకి ఇచ్చానే అలాంటిదన్నమాట. బాబాయికి కూడా కుంచెం రాయటం వచ్చనుకో. నేను వచ్చినంత కాదనుకో, అయినా నేనేం చిన్న వాడినా! లేకపోతే చితకవాడినా!

నీ కసలేం రాదు కదా! నీకు బాహా రావటం కోసం కుంచెం కుంచెం రాస్తాను. లేపోతే బోలెడు ఇంకా చాలా రాసేయగలను. లౌ లెటరు అంటే ప్రేమించుకోవడంట. బాబాయి చెప్పాడు. నాకు తెలియదు అనుకో. బామ్మ రామకోటి రాస్తుంది ఏమీ తోచక, బాబాయి లౌ లెటరులు రాస్తాడు. బాబాయికి పని దొరకలేదుట కదా. ఇలా అని నాన్న అన్నాడు. అయినా పని దొరుకుతుందేమిటి? గోళీలు అయితే దొరుకుతాయి గాని.

అంమ ఏమీ రాయదు. అంమకి పాపం గుడింతాలు కూడా రావు. అందుకని నాన్న తలకి బొబ్బర్నూనె రాస్తుంది. నేను వద్దన్నా “ఊహు” వినదు. ప్రవేటు చెప్పి అయినా రాస్తుంది. పాపం చదువు రాదుకాదా అందుకని నేను వూరుకుంటాను. ప్రేమ గుడ్డిదని బాబాయి చెప్పాడు. బామ్మ కళ్ళజోడు నేను పెట్టుకునేప్పుడు తీసికెళ్ళి పోతానే అప్పుడు బామ్మ గుడ్డిది అయిపోతుంది కదా అట్టాంటిదన్నమాట. బాబాయి కాయితాల మీద రాస్తాడనుకో! నేను పలకమీద గుండ్రంగా రాయాలిట. ప్రేమించుకునే వుత్తరాలు తీసుకోరుట. ప్రేమంటే అచ్చంగా యిచ్చెయడంట ఒఠొఠిగా కాదు. నిఝెంగానన్నమాట…

ఇహ ప్రెవేటు మాష్టరు వచ్చినా పలక ఉండదన్న మాట. నువ్వు అవకతవకగా రాసి నా పలక ఇచ్చేకూడదు, సిన్మాలోలాగా త్యాగం యిచ్చేయడం అన్నమాట.

(పలక రెండువైపులా నిండిపోయిందోచ్!)

పొగతాగనివాడు

పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్

కన్యాశుల్కం నాటకంలో నవ్వుల పంట పండించే పాత్ర గరీశానిది. ఇతర పాత్రల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని గిరీశం వదిలే ఢాంభికాలు మనల్ని మాత్రం కడుపుబ్బా నవ్విస్తాయి.

చుట్టపై గరీశం ఏమంటాడంటే,

“చుట్టకాల్చడం యొక్క మజా నీకింకా బోధపడకపోవడం చాలా ఆశ్చర్యంగా వుంది. చుట్ట కాల్చబట్టే కదా దొర్లంత గొప్పవాళ్ళయినారు. చుట్టకాల్చని ఇంగ్లీషువాణ్ణి చూశావూ? చుట్టపంపిణీ మీదనే స్టీముయంత్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబణ్ణా? శస్త్రకారుడు యేవన్నాడో చప్పానే. సూత ఉవాచ-


ఖగపతి యమ్రుతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
పొగచెట్టై జన్మించెను!
పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్


(ఇంద్రుడు స్వర్గానికి అమృతం తీసుకొనివస్తుండగా పొగలు కక్కుతున్న అమృత కలశం నుండి ఒక చుక్క క్రింద పడింది. ఆ అమృతబిందువు నుండి పొగచెట్టు, అనగా పొగాకు పుట్టింది. అట్టి పొగ త్రాగని వారు మరుజన్మలో దున్నపోతై జన్మిస్తారని తమ శిష్యునతో సెలవిస్తున్నారు గరీశం గారు. )

రుక్కులు

తెలుగు కవితను మరోప్రపంచానికి తీసుకువెళ్లిన మహాకవి శ్రీ శ్రీ . పరిచయాలు ప్రస్తావనలు అవసరం లేని శ్రీ శ్రీ కవిత్వం ఇలా సాగుతుంది…

కుక్క పిల్లా, అగ్గి పుల్లా, సబ్బు బిళ్ళా-
హీనంగా చూడకు దేన్నీ!
కవితామయమేనోయ్ అన్నీ!

రొట్టెముక్కా, అరటితొక్కా, బల్లచెక్కా-
నీ వేపే చూస్తూ ఉంటాయ్!
తమ లోతు కనుక్కోమంటాయ్!

ఇలా శ్రీ శ్రీ , తెలుగు కవితా వస్తువులలో కుక్క పిల్లను, అగ్గి పుల్లను, విశ్వవృష్టిని అన్నింటిని కలిపేసారు, తెలుగు సాహత్యం లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

(ఈ పద్యం శ్రీ శ్రీ మహాప్రస్థానం లోనిది.)

విశ్వంభర

సి. నారాయణ రెడ్డి రచించిన మహాకావ్యం విశ్వంభర. సి నా రె అన్నట్లు ఈ కావ్యాని కి నాయకుడు మానవుడు. రంగ స్థలం విశాల విశ్వం.

నేను పుట్టకముందే
నెత్తిమీద నీలితెర.
కాళ్ళ కింద ధూళి పొర.

అని ప్రారంభం అయ్యే విశ్వంభర మనిషి చేసిన ప్రతి మహాప్రస్థానాన్ని సుమధురంగా ఆవిష్కరిస్తుంది.

ఒక్క మాట

ఒక్క మాట


తెలుగు వెలుగులు అందరితో పంచుకుందామని ఇది ఓ ప్రయత్నం. కన్యాశుల్కం నుండి కాంతం కథల వరకు అమృతం లాంటి తెలుగు కావ్యాలను ఇక్కడ పున:స్మరణ చేయటానికి ఇదొక ఆకాంక్ష.