బుడుగు రాతలు

(బుడుగు ఒక గడుగ్గాయి. ప్రపంచంలో ఈ సైజు పిల్లలకు ప్రతినిధి. పిల్లల్లో పెద్దగా, పెద్దల్లో పిల్లగా వుంటాడు. జట్కా తోలాలని, వింజను నడపాలని కుతూహలం. బుడుగుకి చిన్ని ప్రేమించే హృదయం వుంది. పలక మీద బుడుగు రాసిన ప్రేమలేఖ ఇది.)

సీ గాన పెసూనాంబలు గారికు,
ఇది లౌ లెటరు రాస్తున్నానన్నమాట. బాబాయి ఇచ్చిరా అంటే రెండు జెళ్ళ సీతకి ఇచ్చానే అలాంటిదన్నమాట. బాబాయికి కూడా కుంచెం రాయటం వచ్చనుకో. నేను వచ్చినంత కాదనుకో, అయినా నేనేం చిన్న వాడినా! లేకపోతే చితకవాడినా!

నీ కసలేం రాదు కదా! నీకు బాహా రావటం కోసం కుంచెం కుంచెం రాస్తాను. లేపోతే బోలెడు ఇంకా చాలా రాసేయగలను. లౌ లెటరు అంటే ప్రేమించుకోవడంట. బాబాయి చెప్పాడు. నాకు తెలియదు అనుకో. బామ్మ రామకోటి రాస్తుంది ఏమీ తోచక, బాబాయి లౌ లెటరులు రాస్తాడు. బాబాయికి పని దొరకలేదుట కదా. ఇలా అని నాన్న అన్నాడు. అయినా పని దొరుకుతుందేమిటి? గోళీలు అయితే దొరుకుతాయి గాని.

అంమ ఏమీ రాయదు. అంమకి పాపం గుడింతాలు కూడా రావు. అందుకని నాన్న తలకి బొబ్బర్నూనె రాస్తుంది. నేను వద్దన్నా “ఊహు” వినదు. ప్రవేటు చెప్పి అయినా రాస్తుంది. పాపం చదువు రాదుకాదా అందుకని నేను వూరుకుంటాను. ప్రేమ గుడ్డిదని బాబాయి చెప్పాడు. బామ్మ కళ్ళజోడు నేను పెట్టుకునేప్పుడు తీసికెళ్ళి పోతానే అప్పుడు బామ్మ గుడ్డిది అయిపోతుంది కదా అట్టాంటిదన్నమాట. బాబాయి కాయితాల మీద రాస్తాడనుకో! నేను పలకమీద గుండ్రంగా రాయాలిట. ప్రేమించుకునే వుత్తరాలు తీసుకోరుట. ప్రేమంటే అచ్చంగా యిచ్చెయడంట ఒఠొఠిగా కాదు. నిఝెంగానన్నమాట…

ఇహ ప్రెవేటు మాష్టరు వచ్చినా పలక ఉండదన్న మాట. నువ్వు అవకతవకగా రాసి నా పలక ఇచ్చేకూడదు, సిన్మాలోలాగా త్యాగం యిచ్చేయడం అన్నమాట.

(పలక రెండువైపులా నిండిపోయిందోచ్!)

పొగతాగనివాడు

పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్

కన్యాశుల్కం నాటకంలో నవ్వుల పంట పండించే పాత్ర గరీశానిది. ఇతర పాత్రల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకుని గిరీశం వదిలే ఢాంభికాలు మనల్ని మాత్రం కడుపుబ్బా నవ్విస్తాయి.

చుట్టపై గరీశం ఏమంటాడంటే,

“చుట్టకాల్చడం యొక్క మజా నీకింకా బోధపడకపోవడం చాలా ఆశ్చర్యంగా వుంది. చుట్ట కాల్చబట్టే కదా దొర్లంత గొప్పవాళ్ళయినారు. చుట్టకాల్చని ఇంగ్లీషువాణ్ణి చూశావూ? చుట్టపంపిణీ మీదనే స్టీముయంత్రం వగయిరా తెల్లవాడు కనిపెట్టాడు. లేకపోతే వాడికి పట్టుబణ్ణా? శస్త్రకారుడు యేవన్నాడో చప్పానే. సూత ఉవాచ-


ఖగపతి యమ్రుతము తేగా
భుగభుగమని పొంగి చుక్క భూమిని వ్రాలెన్
పొగచెట్టై జన్మించెను!
పొగతాగనివాడు దున్నపోతై పుట్టున్


(ఇంద్రుడు స్వర్గానికి అమృతం తీసుకొనివస్తుండగా పొగలు కక్కుతున్న అమృత కలశం నుండి ఒక చుక్క క్రింద పడింది. ఆ అమృతబిందువు నుండి పొగచెట్టు, అనగా పొగాకు పుట్టింది. అట్టి పొగ త్రాగని వారు మరుజన్మలో దున్నపోతై జన్మిస్తారని తమ శిష్యునతో సెలవిస్తున్నారు గరీశం గారు. )

రుక్కులు

తెలుగు కవితను మరోప్రపంచానికి తీసుకువెళ్లిన మహాకవి శ్రీ శ్రీ . పరిచయాలు ప్రస్తావనలు అవసరం లేని శ్రీ శ్రీ కవిత్వం ఇలా సాగుతుంది…

కుక్క పిల్లా, అగ్గి పుల్లా, సబ్బు బిళ్ళా-
హీనంగా చూడకు దేన్నీ!
కవితామయమేనోయ్ అన్నీ!

రొట్టెముక్కా, అరటితొక్కా, బల్లచెక్కా-
నీ వేపే చూస్తూ ఉంటాయ్!
తమ లోతు కనుక్కోమంటాయ్!

ఇలా శ్రీ శ్రీ , తెలుగు కవితా వస్తువులలో కుక్క పిల్లను, అగ్గి పుల్లను, విశ్వవృష్టిని అన్నింటిని కలిపేసారు, తెలుగు సాహత్యం లో చిరస్థాయిగా నిలిచిపోయారు.

(ఈ పద్యం శ్రీ శ్రీ మహాప్రస్థానం లోనిది.)

విశ్వంభర

సి. నారాయణ రెడ్డి రచించిన మహాకావ్యం విశ్వంభర. సి నా రె అన్నట్లు ఈ కావ్యాని కి నాయకుడు మానవుడు. రంగ స్థలం విశాల విశ్వం.

నేను పుట్టకముందే
నెత్తిమీద నీలితెర.
కాళ్ళ కింద ధూళి పొర.

అని ప్రారంభం అయ్యే విశ్వంభర మనిషి చేసిన ప్రతి మహాప్రస్థానాన్ని సుమధురంగా ఆవిష్కరిస్తుంది.

ఒక్క మాట

ఒక్క మాట


తెలుగు వెలుగులు అందరితో పంచుకుందామని ఇది ఓ ప్రయత్నం. కన్యాశుల్కం నుండి కాంతం కథల వరకు అమృతం లాంటి తెలుగు కావ్యాలను ఇక్కడ పున:స్మరణ చేయటానికి ఇదొక ఆకాంక్ష.