పూల సరసాలు

చాలానాళ్ళకు మళ్ళీ సమయం చిక్కింది. ఎన్నాళ్ళనుండో చదవాలని తీసి ఉంచిన తాపీ ధర్మారావు సాహిత్య మొర్మొరాల పై మనసు మళ్ళింది. సాహిత్య మొర్మొరాలు విశాఖ తీరంలో అప్పుడే వేసిన పకోడీలా కరకరలాడుతాయి.

ఇక విషయానికి వస్తే,

పూలు అమ్మే అమ్మాయిలకు తెలుగులో ఒక ముద్దు పేరుంది, పుష్పలావికలని. పుష్పలావికలతో సరస వర్ణన తప్పని సరి అని తెలుగు ప్రభంధ కవులకు నియమం ఒకటుంది. మహా ప్రభంధాలలో ఉండవలసిన పద్దెనిమిది వర్ణాలలో ఇది ఒకటి. పురవర్ణన, సూర్యోదయ వర్ణన, రతి వర్ణనలా అన్నమాట. కవి ఎంత మడికట్టుకున్నా ఇది మాత్రం తప్పదు. మన తెలుగు కూడా ఇందుకు తగినట్టే ఉంది.

పుష్పలావికలు అమ్మే పూలు, సంపెంగలు, మల్లెలు, తామరలు, కలువలూ లేదా ఈ పూలతోనే చేసిన దండలు, చెండ్లూనూ. తెలుగులోని ఉపమానాలూ ఇక్కడ పూర్తిగా కవులకు సహకరిస్తాయి. ప్రియురాలి కళ్ళు కలువలనీ, తామరలనీ, దంతాలు మల్లెమొగ్గలనీ, కైదండలు (చేయి, భుజము వగయిరా) పూలదండలని మన కవులు ఎప్పుడో నిర్ధారించారు.

మన తెలుగు వాడికి లోటేమిటి, “నీ దండ ఎంతకిస్తావు?” అన్న ప్రశ్న అమాయకం కావచ్చు, కానీ పుష్పలావిక “నా దండ నువ్వు కొనలేవు” అంటే, మరివేరే అర్థం స్ఫురించక మానదు. ఇది రాసినది ఎవరో కాదు, శ్రీ కృష్ణదేవరాయలు!

వెలదీ యీని దండ వెలయెంత?
నాదండకు వెలబెట్టన్ ఎవ్వరితరంబు

ఇలా అతిసున్నితమయిన సరసాన్ని పండించారు మనకవులు!

తడిగుడ్డతో మూసిన చెండ్లకు “ఏదీ, ఆ చెండ్లు చూడనీ” అంటే, కపటం లేని ఆసక్తే కావచ్చు. కానీ “బేరం కుదరనీ, చూపిస్తాను” అని ఆమె అనగానే చిన్న నవ్వు నవ్వక తప్పదు.

ప్రభంధ కవులు ఇంకొంచం ముందుకు పోయి రాస్తారు. వసు చరిత్ర లోని రెండు వాఖ్యాలు చూడండి.

------- తమ్ములనేల మోసివే సతీ!
మూయదగదే మానస భూనిధానములవి!

తమ్ములంటే తామరలు. ఎండకు వాడిపోకుండా తామరలను మూసి ఉంచుతుంది పుష్పలావిక. “ఏమి మొగ్గలను మూసి ఉంచావు?” అని అడుగుతాడు యువకుడు. ఇవి ‘మానసభూనిధానములు’ మూయకుండా ఉంచుతానా? అంటుంది పుష్పలావిక! మానససరోవరంలో దొరికిన పూవులంట అంచేత వాటిని కాపాడనా అని బదులు చెప్పంది.

ఇక నర్మగర్భంగా కవి ఏమన్నాడో మీరే గ్రహించాలి!