కన్యక

దుఃఖం వస్తే
కోపం వస్తే
మనస్తాపమై నిద్రిస్తే
కాదు సొమ్మ సిల్లితే
కలవచ్చింది కలలో
కన్యక వచ్చింది
నవ శతాబ్ది
కన్యక వచ్చింది
వాకబు చేసింది

ఐంకానమ్మా పాలబుగ్గలపై
మసిబొగ్గుల వైనం
అరబ్బులో వికృత సైన్యం
అమెరికాలొ పిచ్చి తుగ్లక్
లండన్లో చవటల రాజ్యం
డకోటాలో రక్కసి పైపు
దేశంలో చెల్లని రూపీ

అంబానీ అద్దాల కోటలో
జుక్కర్బర్గ్ జూలు కుక్కలో
దుబాయిలో దగాపడి
కొరియాలో ధూళి పట్టాయ్
మానవ సమానవ
బుజబాహుమేధోశక్తులు

లేవగానే ఆవులించి
ఖాళీ కడుపులో
ముడుకులు తన్నుకుని
సొమ్మసిల్లింది
శతాబ్దపు కన్యక

ఆమెను అరుణోదయపు
అంబరాలలో చుట్టి
తెలతెల మెరిసే చమ్కీలు పెట్టే
మహాత్ముడే పుడతాడామ్మా
ఆమెను లేపే వైతాళికమై
కవితా పుడతావామ్మా

వస్తాయా ఆ కన్యకు రెక్కలు
భూగోళం వదిలి అంగారకం దాటి
అంతరాళం అధిగమించే
మంచి రెక్కలు
వస్తాయా ఆ కన్యకు రెక్కలు

కవితా ఇస్తావమ్మా ఆ
కన్యకు రెక్కలు
కవితా ఇస్తావమ్మా ఆ
కన్యకు గళం
లేచే ఈ శతాబ్దపు
కన్యకకు శుభోదయం
కవితా ఇస్తావమ్మా !

(అంకితం: విశ్వంభరుడు శ్రీ సీనారె కు)