లజ్జ

నల్దిక్కుల లోకంలో
దిక్కులేని
పుట్టినరోజు
పుట్టినిల్లు
తెలియని
బాటసారి

ఆవు దూడయిన
పెంకుటింట నిదరిస్తే
తలపై నీలితెరతోనే
సేద తీరును
బాటసారి

ఇనుప గజ్జెల తల్లి
దీవిస్తే కటిక
పేదరికమున
ఇనుప సామాను
వేరెను బాటసారి

రంగుల అద్దాల
రహదారిలో
తన రూపమే చూసెను
ఏకాంతపు బాటసారి

పొగ మంచు
ఊరిని కమ్మితే
మంచు తెరనే
దుప్పటిగా కప్పెను
బాటసారి

జన్మదినం తెలియని
ఇతనికి జండా పండుగే
రంగుల రోజు
జన్మ నక్షత్రం తెలియని
ఇతనికి ధ్రువ నక్షత్రం
జన్మ నక్షత్రం

ఇతను అంతర్దాన
మహిమా పాత్రుడు
ఇతని గురించే
రోజు వాదించే
నాయకుడికి
బీచ్ రోడ్డులో
ఇతను మాత్రం
కనపడడు

ఇతను దేశం కోసం
చేసే పస్తులు వ్రతాల
ఫలితమేమో మనం
చంద్రుణ్ణి చేరిందే

ఇతని ఇల్లు
నీలితెర
ఇతని బంధువు
ఊరి కుక్క

ఇతను గాంధేయవాధి
ఇతని గుమ్మం
కాకులు వాలే
గాంధీ బొమ్మ

బొమ్మకిందే
గాంధీ వాక్కుల
సాక్షిగా
ఇతని ఆకలి
మనకు సిగ్గు

గీతాంజలి

ఆజాదీ
ఆజాదీ

ఉక్కు నరాలకు
ఆజాదీ

ఎండే పొలాలకు
ఆజాదీ

ఘర్మ జలానికి
ఆజాదీ

తోసే రిక్షాకు
ఆజాదీ

వేలాడే బాలలకు
ఆజాదీ

పొగగొట్టాల్లో కాలే గాలికి
ఆజాదీ

తరిగే గుండెలకు
ఆజాదీ

కోచింగ్ క్లాసులో
నలిగే పసితనానికి
ఆజాదీ

సిగ్గుల గువ్వలకు
నవ్వే
ఆజాదీ

నల్లని భుర్ఖా
తీసి పారేసే
ఆజాదీ

నల్లని భుర్ఖా
నచ్చితే కట్టే
ఆజాదీ

గగన భవంతుల కింద
రోడ్ల పక్కన
పస్తుల నుంచీ
ఆజాదీ

నోటులు మార్చే
నీతులు చెప్పే
దొంగల నుండీ
ఆజాదీ

ఆచారాలు అపచారాలు
శృంఖలాలలో
హృదయాల నుండీ
ఆజాదీ

సంకెళ్లు వీడే
మనసుని ముందుకు
లాగే స్వేచ్ఛ కోసం
ఆజాదీ

- విశ్వకవి జ్ఞాపకాలు 2020 లో కూడా అవసరం కదా ?

పునరపి జననం

పారిజాత
పుష్పాలో
నల్లని
శీతాకాల
రాత్రులో
నీ ఈ
కురుల
నీడల్లో
సాగిపోతే
ప్రతీ
రాత్రి

వసంత
రాత్రుల
మామిడి
చిగురుల
జవ్వన
ఆధరపు
పుల్లని
పెదవులో

కావేరి
ఒడ్డున
ఋతుపవన
గాలుల్లో
చెమ్మని
తొలకరిలో

బ్రహ్మ
గీసిన నీ
కొంటె
కోనల్లో
కలిసి
వేసే
తొలి
నాట్లు

శంఖు
పుష్ప
నారీకేళ
మృదుల
ఎదలలో
కర్కశంగా
కలిసి

కోరుకున్న
ఘాతాల
సాక్షిగా
వదలిపోకు
మిత్రమా

చీమవై
భ్రమరమై
పాల
పిట్టవై
ఎగిరే
హంసవై

నీవు
జన్మనెత్తితే
నీవెనుకే
పీపీలక
కీటక
కౄంచ
పక్కిలా
పుట్టనా
నిను
కుట్టనా

పునరపి
జనణం
నీకై
శయణం

ఒప్పులకుప్పా

పావురాలు
పెంచెనే
శకుంతలను.
దొంగ
రాయలేదా
రసరమ్య
రామాయణము.
లక్షమణుండు
కోసెనే
అబలను.
రాధకు
రావణ
సోదరికి
కుంతికి
గిరిజకు
గంగకు
అంబకు***
యజ్ఞసేనికి
కలిగిందీ
మనసు కాదే ?
మాలి
వాసన
చూస్తేనే
ఆముక్తమాల్యద**
రాముని
భద్రునికే*
అంతుచిక్కని
సత్యం

విరించి
గాధలలో
విధాత
తలపులలో

తప్పుఒప్పులెంచ
సాధ్యమా
ఒప్పులకుప్పా ?

* ఇక్కడ రాముని భద్రుడు ,  రాముడికి సీతపై    తప్పుగా చెప్పిన చాకలి.
** గోదాదేవి పూల వాసన చూసి పెడితేనే దేవుడు గ్రహించే వాడంట !
*** అంబ,   భీష్ముడి చే అపహరింపబడి మోసపడిన అంబ పరసురాముడి శరణం కోరుతుంది.

వలస పక్కి

బైకాల్ సరస్సు
లోతులెరిగి
పులీకాట్
రుచిచూసి

అంటార్కిటికా
అంచుల్లో సేదతీరి
ఎగిరిపోవాలి
టర్న్ పక్షిలా

ఎగిరే  ఆ  వలస
పక్షిని అడుగు
భూమి వ్యాసమెంతో
ఆకలి తీరేటంత

ఆకలి పోటే మిటో
అడుగు టర్న్ పక్షిని
వేల యోజనాలు
సాగేటంత

యోజనాల పొడుగేమిటో
అడుగు వలస పక్షిని
నిద్రలో సయితం
ఎగిరేటంత

నిద్ర మత్తేమిటో
అడుగు వలస పక్షిని
అంతరాళ సువాసన
గుండెల్లో నిండేటంత

మరి బుల్లి గుండెకంత
యాతనెందుకో

కన్న భూమిరా ఇది
వలస పక్షికయిన
భరత భూమిరా
పులికాట్ సరస్సయినా

మీ అనుంగుడు

ఎవరయితే
ఇంటి ముందు
గులాబీ తోట
పెంచగలడో

ఎవరయితే
ద్రాక్ష తీవి
ఒక ఎండు కొమ్మునుంచి
పెంచగలడో

ఎవరయితే
హుమ్మింగ్ పక్షికై
ప్రత్యేకంగా
పుష్పాదులను
పూయించగలడో

ఎవరయితే
సరదాగా మృదంగం
హార్మోనికా
వాయించగలడో

ఎవరయితే
ఇరుగుపొరుగుతో
బాణాలు ఆడించి
శబ్ద భేది చెయ్యగలడో

ఎవరయితే
చెల్లికాయతో
వంట గులాబిజాం
నేర్చుకోగలడో

ఎవరయితే
సన్ గొడుగులో
పార్టీ చేయగలడో

ఎవరయితే
సొంత స్టార్టప్పులో
అర్ధాంగిని
కలుపుకోగలడో

ఎవరయితే అయిదేళ్ళు
ప్రాపకం చేసి నూనుగు
నవబాలుడితో
అణు శాస్త్రం
వల్లింప గలడో

ఎవరిచేత మొక్కగాని
పూవుగాని పిల్లలు గాని
వర్ధిల్లెనో

ఎవరికి శత్రువులు
పుట్టరో పుడితే
క్రమేణా వీర
గంధములు పెట్టెరో

ఎవరి కథలను
భారతీయ వ్యాపార
పాఠసాల (ఐ.ఎస్.బి)
లో కథలుగా చెప్పెరో

ఎవరయితే యువతీ యాతా
నవమృదు కేశావృద్ధి
కళ సృష్టించెనో

ఎవరయితే ఆశువుగా
పెళ్ళాంపై కవితరాసి
ముక్కు చివాట్లు
తినగలడో

అయినా

అతనే శివశక్తి
సమాయోగుడు
అనుంగుడు
మీ కవికటకవి

శకుంతల

వసంతపు మందారాలు
శిశిరపు శశీ
పులకిత తామరలు
ఎండల్లో చెట్టుకే
పండే జీడీ పళ్ళు
రోహిణీ కార్తెలో
భళ్ళున లేచే
సూర్యభగవానుడు
ఆగ్నేయపు ఋతుపవనాలు
మళ్ళీ వచ్చే దీపావళీ

మళ్ళీ మళ్ళీ
వలస వచ్చే
శ్వేత హంసలా
ఈ ఋతువుల సాక్షిగా

కదిలే నీ కళ్ళలోని
రెండు పుష్కరాల
అలల కలల
ఊసులు

శిశిరపు నిశా
రాత్రిని కాటుక
చేసిపెడితే
పొరపాటున
వర్షించిన మేఘంలా
ఒక్క ఒక్క
బొట్టు రాలితే
నీ కాటుక కళ్ళలో
కాశ్మీరపు బోటు
షికారులా
అప్పుడే కొండమల్లె చెండుపై
వర్షించిన తొలకరినై పోదునా

తడిగుడ్డతో
మూసిన మొగ్గలనో
పొగమంచు కప్పుకున్న
కొండల్లా ప్రకృతీ
కన్యపు ఎదనో

నీ విశాల సాగర
నిర్మల ప్రశాంత
మనసుకు
పులీకట్ సరస్సులా
దప్పికిచ్చిన
సుమధుర
ఎదలో
వలస పక్షినై
పుట్టలేనే

కైలాసాన్ని
తప్పించుకున్న
గంగ ఉరకలెత్తినట్టున్న
నీ నల్లటి కురుల
సువాసనలో
డిసెంబర్ వెన్నెల్లో
వీచే ఎడతెరిపి గాలుల్లో
వాగే గుండెలు
నీ కురుల
వాగుల్లో ఆగిపోలేవా

పుట్టతేనె తెచ్చి
కోనసీమ కొబ్బరి లోపోసి
వర్షాల్లో కొండల్లో
కొనల్లో పుట్టే
జలపాతపు
నీటిలో కలిపిన
మాధుర్యాన్ని
నిను చేరే
మేఘంలా
ఎలా చేరాలి

నా కళ్ళలోని
అలల కలల
ఊసులు