పచ్చని చిలుకలు తోడుంటే ...

 పచ్చని చిలుకలు తోడుంటే ... 


నాంపల్లి లో దిగారు ఇద్దరూ. సాయంత్రం కావస్తుంది. త్యాగరాజు సార్ ఆటో కట్టించారు. ఆటోవాడితో హిందీ లోనే బేరం.

కిట్టూ కి ఆటో ఎక్కడం అదే మొదటిసారి. 


ఆటో వెళ్తుంది. బయట ఉదృతంగా హైదరాబాదు. రకరకాల గొడవ గా ఉంది రోడ్డు. అక్కడక్కడా ఆకుపచ్చ జెండాలు. కొన్ని చోట్ల విశాలమయిన రోడ్లు ఇలా. 


ఊరికి దూరంలా ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోకి వెళ్లింది ఆటో. ఇంకా లోపల ఉంది నవోదయ సంగారెడ్డి, గచ్చిబౌలి. 


ఇప్పటి దాకా చూసిన స్కూళ్లకి దీనికి పొంతన లేదు. పెద్ద క్రికెట్ మైదానంలో యూనిఫామ్ వేసుకుని క్రికెట్ సామాగ్రి తో ఆడుతున్నారు. నాలుగు అంతస్తుల బిల్డింగ్ లో స్కూలు హాస్టల్స్!! 


సారు బయట ఉంచి ఆఫీసులోకి వెళ్ళారు. అక్కడే తర్ఫీదు ఇస్తారంట కొత్త టీచర్లకి. 


కాసేపటికి పొడువుగా షార్ప్ గా ఉన్న కుర్రాడు వచ్చాడు. నేను కృష్ణా రెడ్డి, 12 క్లాసు. ఇంతలో సార్ వచ్చారు, అరిస్టాటిల్, నిన్ను కృష్ణ రేపటి వరకు చూసుకుంటాడు. ఇక్కడికే ఎస్కార్ట్ వస్తారు రేపు, నీకు తెలిసిన పద్మజా మేడం, పెద్దాపురం నుండి. 


వీలయిన రెస్ట్ తీసుకో. డబ్బులు కావాలా, అన్నారు జేబులో చెయ్యి పెడుతూ. సార్ వద్దు సార్. అప్పటికే ఆయనకు పదకొండు రూపాయలు బాకీ కిట్టు, 7లో హౌస్ మాస్టర్గా ఉన్నప్పుడు. 


కృష్ణా వీడు ట్రైన్ కి వెళ్ళేముందు తినేటట్టు చూడు. గాభరా ఎక్కువ. అదర్ వైస్ ఈసీ కిడ్. ఇంగ్లీషులో పాస్ డౌన్ చెయ్యటం ఒక చనువు కి చిహ్నం అని అర్థం ఔతుంది కిట్టూ కి. 


తంబీ రా. వాడే డబ్బా, బాగు రెండూ వేసుకుని, తనతో చక్కా తీసుకు పోయాడు. మూడో అంతస్తులో రూమ్. రూములు ఖాళీగా విశాలంగా ఉన్నాయి. ఫ్యాన్, టేబుల్ లాంప్ ఇలాంటి కూడా. 


రాత్రి గడిచిపోయింది. ఉదయం లేచాడు. 


ఇంకా తయారు కాక ముందే, త్యాగరాజు సార్ రూమ్ లోకి వచ్చారు. 


ఎదుట కూర్చున్నారు. 


నాన్నా కిట్టూ, నేను ఇంక వెళ్ళాలి. ఫలక్నుమా కి. నీ కోసమే ఇంత దూరం. నువ్వు జాగ్రత్త. నీకు అర్జెంట్ అయితే ఇంటి నంబర్ కి చెయ్యి. మీ ఫాదర్ కి నేను దారిలో చెప్పి వెళ్తాను. ఇంట్లో ఏమయినా చెప్పాలా ? 


లేదు అన్నాడు. 


సరే. 


కృష్ణా రెడ్డిని చూసి. కృష్ణా పద్మజ మేడం మధ్యాహ్నం వస్తారు. ఆవిడకి పాస్ చెయ్యాలి నువ్వు. బోర్డ్ కి బాగా రాయ్ నాన్నా. అని చక్కా వెళ్ళి పోయారు. 


తయార్ అయి వచ్చాడు కిట్టు. అప్పటికే ఏదో రాస్తున్నాడు రెడ్డి. 


మీ స్కూల్ బాగుంది అన్నాడు. 


నా ఎగ్జామ్స్ కదా.  టైమ్ పాస్ కి, నువ్వు క్రికెట్ ఆడుతావా. ఇంకా స్కూల్ సెలవలు , కానీ వాళ్ళు ఇక్కడి కొచ్చి ఆడుతారు. సరే వెళ్ళాడు. 


మైదానం పచ్చగా ఉంది. పొగ మంచు ఇంకా పోలేదు. సెలవుల్లో కూడా స్కూల్ కి వచ్చి ఆడుకునే వారు ఉంటారా అని వింతగా ఉంది కిట్టూ కి. 


తంబి విజయనగరం నుండి నేషనల్కి వెళ్తున్నాడు. మీరు ఆడించండి నేను చదువుకోవాలి. 


రా. నేను కిషన్ రెడ్డి, న్నయింతు క్లాస్. కిట్టు పేరు చెప్పాడు. 


ఏ క్లాస్. 

చెప్పాడు.


ఔనా. 8 లో నేషనల్ కి కూడా పిలుస్తారా. 


బౌలింగ్ వచ్చా. తల అడ్డంగా వూపాడు.


బ్యాట్ ఇచ్చాడు. 

బాలు వెయ్యమన్నాడు. 


కొట్టాడు కిట్టు. చాలా బలంగా ఉంది కార్క్ బాల్. 


సరే. బౌల్ చేస్తావా. 


తల ఊపాడు. 


స్పిన్ ఎలా తిరుగుతుందో చెప్తున్నాడు. దూరంగా పరిగెత్తి కొంత వేగం వచ్చాక, తల మీదుగా వదలాలి బాలు. విసిరితే ఫౌల్.


అర్థం అయింది. 


వేశాడు. స్లో అయినా బాగా పడింది. 


అంతా ఇప్పుడు ఒకే. 

నువ్వు అలాగే ఆరు సార్లు వెయ్యాలి. 


ఒకటి రెండు జీరో బాల్స్ వేశాడు. కమాన్ కమాన్ కిట్టు అని ఫీల్డింగ్ చేస్తున్న వాళ్ళు అరుస్తున్నారు. 


తన వంతు అయిపోయింది.

అంతా గుడ్.. గుడ్ షో అని ప్రోత్సాహంగా అన్నారు. 


వీళ్లు సిటీ పిల్లలు అయినా  కలుపుగోరు అని అర్థం ఔతుంది. నవోదయాల్లో ఉన్న పిల్లలు ఒకేలా ఉంటారు అనుకున్నాడు కిట్టు. 


కీపింగు చేస్తునాడు.


బాగుంది. ఎండ మెల్లగా వస్తుంది. 


టిఫిన్ సమయం అయ్యింది. 

రెండు గుడ్లు, ఒక బ్రెడ్డు , కొంత పచ్చడి. ఇలా కూడా టిఫిన్ పెడతారా అనుకుంటూనే కానిచ్చాడు. 


పది పన్నెండు తరగతులకు మాత్రమే ఉంది మెస్. మిగిలిన వాళ్ళు దగ్గర్లోని ఇళ్లకు వెళ్ళిపోతారు అంట.


లంచ్ సమయానికి 

కృష్ణా రెడ్డి వచ్చాడు. తంబీ పద లంచ్ నీకు మస్తుగా పెట్టాలే . వాడితో పాటు ప్రతాప్ హాష్ కొప్పల్ , ధార్వాడ్ నుండి వెనుకనే ఉన్నాడు. కిట్టూ తను పరిచయం చేసుకున్నారు. 


మెస్సులోకి వెళ్ళాడు. సర్వింగ్ చేస్తున్న కౌంటర్ వెనుకకి అక్కడ స్కూళ్లో రెడ్డికి మంచి పలుకుబడి లా ఉంది. లోపలకి రమ్మన్నాడు. రైస్, కుప్పలాగా బంగాళదుంప కూర , పప్పు , స్టార్ రూమ్ లోంచి వేయించిన వేరుశనగ వేశాడు. 


నిన్న సార్ చెప్పినట్టు చేస్తున్నాడు అని అర్థం అయ్యింది. చాలు అన్నా అంటున్నాడు. తంబీ డిల్లీ పోవాలి అంటే తింటే నే గా. 


ముగ్గురు పెద్ద వల్ల మధ్య తింటున్నాడు. కిట్టు గురించి అడుగుతున్నారు. కొందరు తెలిసిన టీచర్లు పేర్లు చెప్పుకున్నారు. శశికళ మీకు వేశారా, టూ మచ్ ఆవిడ అని అంటున్నారు. 


బయటకి వచ్చేశారు. కిట్టు ప్లేట్ గట్టిగా కడిగి , ప్లేట్లోనే నీళ్ళు వేసుకుని కొళాయి దగ్గర తాగాడు. 


మధ్యాహ్నం అయినా ఎండ సున్నితంగా ఉంది. ఉదయం పడిన పొగ మంచు ఇంకా తడిగా ఉంది గడ్డి మీద. 


తిరిగి వెళ్తున్న సమయంలో, 


ఎదురుగా జానీ... 


తెల్లటి చుడిదార్ 

ఉంగరాల జుత్తు 


మూడు పాయలుగా జుత్తు ఉంది, ఎడమ పాయ , కుడి పాయ ముఖాన్ని కప్పి దోబూచులాడుతున్నాయి. 


ప్రిన్సెస్ లాగ తల మీద కిరీటం లాంటి టియారా.. 


ఏటవాలుగా ఉన్న రోడ్డు మీద ఎత్తు నుండి దిగుతూ


కిట్టూని చూసింది.


కిట్టూ అని జానీ. జానీ అని కొట్టు ఒకే సారి అరిచారు. 


చిన్న గంతు ఒక అంజ వేసి ముందుకు వెళ్లారు. గాజుతో  చేసిన అదృశ్య  గోడ తగిలినట్టు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయారు. 


జానీ మెడలో ఒకే ఒక ముత్యం ఉన్న హారం. అమ్మాయి మొహం కడిగిన ముత్యంలా ఉంది. కళ్ళు వెలిగిపోతున్నాయి. 


చూపుడు వేలు మీద ప్లేటు తిప్పుతూ కిషన్ రెడ్డి కిట్టు వెంట వచ్చాడు. వెనుకనే ప్రతాప్. 


జానీ వెనుక ఇంకో 12వ తరగతి అమ్మాయి. జానకి ఆ అమ్మాయి గైడ్, కిట్టూ కి రెడ్డి లాగా. 


జానీ, జానీ వెనుక వచ్చిన వాళ్ళు మెస్సు లోకి వెళ్ళిపోయారు. 


తంబీ నీకు చాలా నక్రాలుండే అని చక్కిలిగింతలు పెట్టాడు రెడ్డి. 


నీకు ఆ పోరి ఎట్లు తెలుసు. కేరళా రీజినల్ గురించి చెప్పాడు కిట్టు. 8th లో ఎవరికీ రాదు తెలుసా 12th స్టూడెంట్ డ్రాప్ అయితే నీకు ఛాన్స్ వచ్చే. ఔను అన్నా అని ఫోను కాల్ మొత్తం చెప్పాడు కిట్టు. 


పరిచయాల ముచ్చట అయిపోయింది. 


ఇంక వెళ్ళే సమయం వచేసింది. 


స్కూల్ వాన్ లో నేషనల్ కి వెళ్ళే గ్రూప్ బయలుదేరారు. 


కిట్టు, ప్రతాప్ హాస్కోప్పల్, త్రిశూరు నుండి ఇద్దరు, జానీ, ఇంకో అమ్మాయి, పద్మజ మేడం ఇది మొత్తం. 


నాంపల్లి దగ్గర ఎక్కారు.


 పండుగ రోజుల వలన కిక్కిరిసి ఉంది బండి. పిల్లలకు ఆర్. ఏ . సీ లోనే టిక్కెట్లు దొరికాయి. అంటే అంతా ఒక దగ్గర కూర్చునే అవకాశం లేదు. 


గందరగోళంగా ఉంది వాతావరణం. తమ తమ ఎక్సిబిషన్ డబ్బాలు జాగ్రత్తగా ఉంచుకున్నారు పిల్లలు. ఒకే డబ్బాలో వేరు వేరు చోట్ల సీట్లు ఉన్నాయి. 


కిట్టూ జానీ ఒక చోట . మిగిలిన వాళ్ళు వేరే వేరే చోట్ల. మళ్లీ సైడ్ బెర్తు లో ఆర్ ఏ సీ.


ఇద్దరికి కలిపి ఒక బెర్తు . అలా అడ్జస్ట్ అయి వెళ్ళే వారికి ఇస్తారు అంట ఆర్.ఏ.సీ. 


పిచ్చిపిచ్చి వాసనలు, పెద్ద పెద్ద శబ్దాలతో నవ్వులు, గుడ్డి దీపాలు, మహా చిందర వందర గా ఉంది ట్రైను.


 తనను అస్సలు చూడటం లేదు జానీ. ఎర్రటి చుడీ దార్లోకి మారి వచ్చింది. జుట్టు పూర్తిగా విరపోసుకుని ఉంది. చిక్ షాంపూ వాసన గుప్పుమని వస్తుంది. కొంచెం అసహనంగా ఉన్నాడు కిట్టు. తనను చూడదేమిటి అని. 


ఇంతలో రైల్వే పోలీసులు కుక్క తో వస్తున్నారు. అందరూ తప్పుకుంటున్నారు. 


జానీ కిట్టు చెయ్యి పట్టుకుంది గట్టిగా వెనక్కి తూలి కూర్చున్నారు బెర్తు మీద. 


ఆనందం. చెయ్యి పట్టుకుంది కదా. ఇప్పుడు తన వేపు చూసింది. సున్నితంగా ఉంది చూపు ఏదో మార్పు. 


రైలు బయలు దేరింది. 


గాలి చల్లగా వేస్తుంది. ఆహ్లాదంగా ఉంది. ట్రైన్ కదిలితే జీవితం కదిలినట్టే. అందరూ ఉల్లాసంగా ఉన్నారు రద్దీ లో కూడా. 


మేడమ్ వచ్చారు. గుడ్. మీరిద్దరూ ఒక యూనిట్. మేడం, ఇంకో అమ్మాయి 48 దగ్గర. ప్రతాప్, త్రిశూరు పిల్లలు 39. నేను మధ్యలో వచ్చి చూస్తాను మీరిద్దరూ ఒక దగ్గర ఉండండి.


కిట్టు తో అన్నాది, నువ్వు హోమ్ సిక్ అయి రావు అను కున్నాను అని. నువ్వు వచ్చి నేను రాకపోతే అని వచ్చేశాను. 


ఓ హ్యాపీ న్యూ ఇయర్ 1997 అన్నాడు. తను కూడా చెప్పింది. మళ్ళీ ఎగ్జిబిట్ మెరుగు చేసావా అని అడిగాడు. జానీ ఏవేవో పెంచి చేసింది. కిట్టూ కి సిగ్గేసింది , తను కేవలం రంగులు వేసి తెచ్చాడు.


కొంచెం సేపట్లో మళ్ళీ ట్రైన్ ఆగింది సికింద్రాబాదు. అప్పుడు మొదలయింది అసలు ప్రయాణం.


కబుర్లు మీద కబుర్లు చెప్పుకుంటున్నారు. కిట్టు సింధూరం సినిమా కథ చెప్తున్నాడు. చేతులు తిప్పుతూ. 


నవోదయ లో సినిమా కథలు చెప్పటం ఒక కళ. అది ఇంచుమించు అందరు పిల్లలకు వస్తుంది. చూసిన సినిమా కళ్ళకు కట్టినట్లు చెప్పాలి. అప్పుడే ఆనందం.


రాత్రి త్వరగా పొద్దుపోయింది. బెడ్డు పక్కన దుప్పటి కట్టుకుంటున్నారు అందరూ. చలికి అలా అన్నారు. కిట్టు తెచ్చిన పల్చటి దుప్పటి ముడి వేసి కట్టాడు కర్టెన్ లాగా. బాగుంది ఏర్పాటు. వీళ్ల గుస గుసలు బయటకు రాకుండా ఉన్నట్టు. 


లైట్లు ఆపమని పై బెర్తు రిక్వెస్ట్. ఆపే సారు. 


నువ్వు డ్రెస్ ఎందుకు మార్చావు. కిట్టు అడిగాడు. 


అన్నీ చెప్తారా ? 


చెప్పు ఎందుకు మార్చావ్ ? 


తల స్నానం చేశావ్ కదా ? 


ఔను ? 


ఎందుకు చేశావ్ ? ఇంత సాయంత్రం ? 


కిట్టూ అలా అడగ కూడదు. 


ఎందుకు అడగ కూడదు ? 


అడగ కూడదు అంతే! 


జానీ నాకు చెప్పు ఎందుకు చేశావు? 


పుట్టినరోజు కదా ? 


కాదు . 


జానీ జుట్టు దగ్గరకి చేసి క్లిప్పు పెట్టుకుంది. 


కిట్టు క్లిప్పు పెట్టకు వదిలే, అని క్లిప్పు చనువుగా నొక్కి తీసేసాడు జుట్టు లోంచి. 


ఫట్. 


లెంప మీద దెబ్బ. 


కిట్టు చిన్నబోయాడు. 


దూరంగా బెర్తు మీద కాళ్ళు దొంతుగా పెట్టి కూర్చున్నాడు. ముఖం తిప్పుకున్నాడు. 


జానీ కి. అనుకోకుండా చెయ్యి లేచి వచ్చి కొట్టేసింది. 


పిచ్చి పిచ్చి ప్రశ్నలు పడలేక కడుపులో నొప్పి నొప్పిగా ఉంది జానీ కి. 


కిట్టూ నీ చూసి జాలి వేస్తుంది. 


కిట్టూ సారీ రా. 

చెయ్యి తీసి పక్కన పెట్టాడు. 


సారీ చెప్తూనే ఉంది. 


కాజీ పేట వచ్చింది.


 బండి ఆగింది. కిట్టు కడుపు నొప్పిరా అన్నది. 


కిట్టు అర్థం చేసుకున్నాడు. 


ఎక్కడ ? 

చూపించింది? 

ఎప్పుడు నుండి. 

చెప్పింది. 


కడుపు నొప్పిలో తను బాగా సీనియర్ అన్నాడు నవ్వుతూ. ఆగి ఆగి వస్తుంది అంటుంది జానీ. 


రైలు మళ్ళీ బయలుదేరింది. 


బ్యాగ్ లోంచి డైజెన్ చప్పరించే బిళ్ళ ఇచ్చాడు. 


కిట్టు ఇది కాదురా అంటుంది జానీ. అయినా ఒక సారి చూడు అని. తానొకటి తిని తనకొకటి ఇచ్చాడు. 


కిట్టు అన్నాడు. నువ్వు బాత్రూంకి వెళ్ళి చూస్తావా? ఒకే. మెల్లగా నడుస్తుంది. వెనుక కిట్టూ బాత్రూమ్ వరకూ వెళ్ళాడు. మేడమ్ చెప్పాడు కదా ఎక్కడికైనా ఇద్దరు ఇద్దరు వెళ్ళమని. 


నిమిషంలో వచ్చేసింది. 


మళ్ళీ నొప్పి. 


కిట్టు వాళ్ళ నాన్న కిట్టు కి రెండు మూడు రకాల నొప్పి మందులు ఇచ్చి పంపించాడు. అజీర్తి కాకుండా ఆగి ఆగి వచ్చే నొప్పి. 

ఈసారి బాగు లోంచి సైక్లోపామ్ తీసాడు. ఇది వేసుకో.


రాదుగ రాసిన నొప్పి డాక్టరు కథ చెప్తున్నాడు. నేను కూడా ఒక నొప్పి డాక్టర్ని అని. 


మంచిర్యాల. నొప్పి తగ్గింది. 


జానీ నవ్వుతుంది. మేఘం వీడిన పూర్ణ శశిలా ఉంది. మొఖంలో ప్రశాంతత. 


సారీ రా కిట్టు. కొట్టాను.


ఊ..

నొప్పిలో కదా కొట్టావు. ఒకే. 


క్లిప్పు తీయకూడదు కిట్టూ.


మళ్ళీ అడగ బోయాడు ఎందుకు అని. లెంపకాయ్ గుర్తుకు వచ్చింది ఆగాడు.


కుతూహలం మాత్రం ఆగలేదు. రెడ్ డ్రెస్ బాగుంది అన్నాడు. 


తను విషయం చెప్పింది చివరికి సిగ్గుగా.


తన ప్రశ్నలకి సమాధానం దొరికింది. తన ప్రశ్నలతో  జానీని ఎంత ఇబ్బంది పెట్టాడో అప్పుడే అర్థమైంది.


ఇంతలో


రేయ్ నీ ప్రశ్నలకి నిన్ను పీక పిసికి చంపనా ? మెడ చుట్టూ జానీ చల్లటి వేళ్ళు..


రైలు శబ్దం తాళం పడుతుంది. దానికి  రాగం కలిస్తే సంగీతం, అనురాగం కలిస్తే ఆనందం. నిన్న సార్ అన్న మాట అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అయింది. 


దూరం. కలయిక. కోపం. గొడవ. నొప్పి. ప్రమాదం. సమాధానం.  తాళం. రాగం. అనురాగం. పల్లవి. జీవితం. సుందరం.


సిర్పూర్ కాగజ్ నగర్. పేపర్ మిల్లు పక్కనుంచి ట్రైన్ వెళ్తుంది. ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఆఖరి స్టేషన్.


(సశేషం)

అలై పాయుతే ...

 అలై పాయుతే ... 


ఇల్లు చేరాడు శీతాకాలం సెలవులకి. కిట్టూ ఇల్లు కొత్తవలస - కిరండోలు రైలు పట్టాల పక్కనే ఉండేది. రైలు వస్తే వచ్చే కుదుపు, శబ్దానికి కొత్తవాళ్ళు రాత్రి నిద్ర పోయే వారు కాదు. అలవాటుగా అక్కడ ఉండేవాళ్ళు మాత్రం చక్కగా పడుకునే వాళ్ళు. 


సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ట్రైనులను చూడటం, అక్కడ బట్టలు ఆర పెట్టే తీగ ను పట్టుకొని కరెంట్ ట్రైన్లా ఆడుకునేవాడు చిన్నప్పుడు. 


ఇప్పుడు కొన్నాళ్ళో అల్లాంటి ట్రైన్లో వెళ్తాడు. జానీ తో అదీ. ఈసారి సరదాగా వెళ్ళాలి అని అనుకున్నాడు.


అమ్మ హైదరాబాదులో ఉన్న చుట్టాలతో మాట్లాడింది. వాళ్లకి తెలిసిన దూరపు గొప్ప బంధువులు ఒక్కరే. వాళ్ళు చెప్పారంట చలి ఎక్కువగా ఉంటుంది అని.చుట్టాల ఆవిడ బాలింత గా ఉండేప్పుడు వాడిన పెద్ద లేడీస్ స్వెట్టర్ ని అమ్మ తెచ్చింది. కిట్టు వేసుకుంటే ముడుకుల వరకూ వచ్చింది ఆ ఆడవాళ్ళ స్వెట్టర్. ఒక గుండీ కూడా ఉండేది కాదు. అయినా ఒకే అన్నాడు కిట్టు. పుట్టాక స్వెట్టర్ వేసుకుని ఎరుగడు.


 అమ్మ బిస్కట్లు చేసింది. పంచదార పాకంలో. ఒకట్రెండు బిస్కెటు పాకెట్లు. ఒక సిలిండర్ లాంటి సంచి. 150 రూపాయలు పాకెట్ మనీ.


 సంక్రాంతి సాయంత్రాని కే బండి వచ్చేసింది. నవోదయ వాన్ ఇంటి ముందు చూసి చాలా మంది ఆశ్చర్య పోయారు. కిట్టు తన సామాన్లతో ఎక్కాడు. 


బండిలో అన్నయ్య చెప్పాడు. ఈ రోజు రాత్రికి నువ్వు ఒకరి ఇంట్లో పడుకోవాలి అని. 


తీసుకెళ్ళి వైజాగ్ మధ్యలో ఒక బస్తీలో ఒక చిన్న ఇంట్లో దించాడు. రాత్రికి అన్నం ఇక్కడే తిను, వృధా చెయ్యకే అని అన్నయ్య అంటుంటే, కిట్టుకి అర్థం ఔతుంది వారి ఆర్థిక పరిస్థితి. 


అన్నయ్య వెళ్ళక వాళ్ళు అన్నారు. నువ్వు ఇక్కడ ఉండకుండా సెకండ్ షో సినిమాకి వెలిపో , రాత్రి అందరూ పడుకున్నాక ఇక్కడ చాప వేసి పడుకో మని చెప్పారు కటువుగా. 


కిట్టు నొచ్చుకున్నా, తప్పక వెళ్ళిపోయాడు బయటకు. 


ఎదురుగా సినిమా హాల్. సంక్రాంతికి రద్దీగా ఉంది.


 సింధూరం. ఈ రాయి అయితే ఏమిటి పల్లూడ కొట్టుకోటానికి అని వెళ్ళాడు. సినిమా అద్భుతంగా ఉంది. కథలో ఉన్న ప్రతి ఒక్కరూ స్కూళ్లో తెలిసిన పిల్లల్లా ఉన్నారు. హీరో వాడి క్లాసు బంగారయ్య లా కనిపించాడు. 


రాత్రి బాగా పొద్దుపోయాక బస్తీ చేరాడు. చిన్న ఇంట్లో చాలా మంది పడుకున్నారు. ఆ రోజు భోజనం లేదు. అక్కడే చాప మీద ముడుకులు పొట్టలో పట్టుకుని ఆద మరచి పడుకున్నాడు. 


తెల్లారింది. డ్రైవర్ అన్నయ్య వచ్చాడు. గాభరాగా కిట్టుని రైల్వే స్టేట్ కి తీసుకు వెళ్ళాడు. 


అక్కడ ఎదురుగా త్యాగరాజు సార్. మంచి హుషారుగా ఉన్నారు. ఈ ప్రపంచం నిన్న రాత్రి చూసిన ప్రపంచం ఒకే ఊర్లో ఉన్నాయా అనిపించింది కిట్టుకి.


టింగ్ టాంగ్ టింగ్.. 


విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళు.. 7616 విశాఖ.. ఎక్స్ప్రెస్. .. ఒకటవ నంబరు ప్లాట్ఫారం పై బయలు దేరుటకు సిద్ధంగా ఉన్నది. 


సైడ్ బెర్తు మళ్ళీ. 


త్యాగరాజు మాస్టారు ఒక సంచి కూడా మోయనివ్వలేదు కిట్టుని. 


వాటర్ బ్యాటిల్, ఇండియా టుడే. 


అరిస్టాటిల్ .. నువ్వు ఇష్టానుసారంగా చదువుకో అని మ్యాగజైన్ , హిందూ న్యూస్పేపర్ పడే సారు కిట్టు ముందు .


 అనకాపల్లి. తుని. అన్నవరం. సామర్ల కోట. రాజమండ్రి. 


బండి గోదావరి వంతెన మీద నెమ్మ నెమ్మదిగా వెళ్తుంది. అకస్మాత్తుగా ఆగింది కీచు మణి శబ్దం చేస్తూ. పాత వంతెన, బ్రిటిష్ కాలం నాటి రాళ్ళ కట్టడం. ఎండ లో గోదావరి బంగారంలా మెరుస్తుంది. వంతెన కిందన చెక్కతో చేసిన  నీలం ఎరుపు రంగు పడవ.


పడవ వాడి ముఖం స్పష్టం గా కనిపిస్తుంది. వంటిమీద మాసిన తెల్లటి ఖద్దరు చొక్కా, మైకా సంచి మూటలు, ఒక మేక ఉన్నాయి పడవలో. ఆ గోదారి లంకల్లో ఇలా ఉంటారు జనాలు అనుకున్నాడు మనసులో కిట్టూ. దూరంగా  పుష్కర  తీరం. నీటిలోకి  మెట్లు కట్టి ఉన్నాయి. మెట్ల పక్కన  రెండు మూడు గుళ్ళు ఉన్నాయి. పెద్దగా జనం లేరు.


పది ఇరవై పైసల నాణేలు వేస్తున్నారు గోదారిలో. వాటిని ఏరుకునే ఈత కొట్టే పిల్లల మూక వంతెన స్తంభం పక్కనే ఉన్నారు మాట్లాడుకుంటూ. వంతెన మీద ఎవరు ఎలా రాశారో గానీ "నానీ"  అని పెద్ద అక్షరాలతో రాసింది. చిత్రమయిన దృశ్యంలో కిట్టు లీనం అయిపోయాడు. 


ఇంతలో విజిల్ మళ్ళీ ట్రైన్ మొదలయ్యింది. మొదలైన రెండు మూడు నిమిషాలకే మళ్ళీ ఆగింది, వంతెన దాటాక. 


గోదావరి అని  చిన్న స్టేషన్. పక్కనే హై స్కూలు, పిల్లలు బద్దకంగా నడుస్తున్నారు. నవోదయ గుర్తుకు వచ్చింది, మెల్లగా తాపీగా నడిచే అవకాశం ఉండదు కదా మన స్కూళ్లో అనుకున్నాడు.


 కాసేపటికి పెద్ద స్టేషన్ లో ఆగింది బండి. త్యాగరాజు సార్ చలాకి గా కిందకి దిగారు. రెండు చేతుల్లో ఆకుమీద వేసి రెండు రెండు పూరీలు, కూర. వాసన అద్భతం. 


నిన్న సాయంత్రం తిన్నాడు కిట్టు. ఒక్క సారి ఆకలి మెదడు లోకి నమోదు అయ్యింది. థాంక్యూ చెపుతూనే ఆవురావురు మని తిన్నాడు.



ఇక్కడ కొంత జనం చేరారు . చిత్రంగా బండి వెనక్కి వెళ్ళడం మొదలయ్యింది. ఏమిటి సార్ అంటే, ఇప్పుడు మనం హైదరాబాద్ మార్గానికి వెళ్తున్నాం అని, ఇలా చేతుల్తో చూపించి చెప్పారు, ట్రైన్ పెద్ద పెద్ద మలుపులు తిరగాలి అంటే ఇంజను వెనక్కి తిప్పి లాగుతారు అని. 


కిట్టు అడిగాడు సార్ డౌట్ అని.


' మీరు రాగం తాళం కలిస్తే సంగీతం అన్నారు కదా, అవి ఎపుడు కలిశాయి ?'


' అవి కలిసే పుట్టాయి '


ఓహో కలిసి ఎలా పుట్టాయి ?


ట్రైన్ శబ్దం విను. 


విన్నాడు.


మనం మాట్లాడుతున్నాం కదా ? అగి ఆగి? అదే తాళంలో మాట్లాడటం. 


అలగే పాడితే అది తాళంతో పాడటం. 


నచ్చింది జవాబు. 


పక్కన రూము లాంటి చోట్లో, ఒక ముసలావిడ, ఒక ముసలాయన కూర్చున్నారు. 


ఇంకా సార్ గురించి అడగటం మొదలు పెట్టాడు. మీరు ఎందుకు సంగీతం నేర్చుకున్నారు అని. ఆయన ద్వారం వెంకట స్వామి నాయుడు అనే గొప్ప విద్వాంసుని మనవడు అంట . యూజీసీ నుండి పీ ఎచ్ డీ చేస్తూ ఈ ఉద్యోగం చేస్తున్నారు అంట. అలా చెప్పుకుంటూ పోతున్నారు. 


ఆ ముసలావిడ కిట్టు నీ చూసి సార్ ను అడిగారు. నీ అబ్బాయా అని. కాదు మేడం నా స్టూడెంట్, హైదరాబాద్ వరకు నేను తీసుకుని వెళ్తున్నాను అని.


చేగోడీ ఒకటి కిట్టు కి ఇవ్వ బోయారు. సారు మధ్యలోనే తీసుకున్నారు. 


వీడు చాలా సెన్సిటివ్ అంటూ. 


ఆవిడ ఏవిష ? అని అడిగింది. 


చెప్పారు. 


ఒక్క క్షణం ఆగి, కిట్టు ని చూసి. 


బ్రహ్మలా ? అని అడిగింది. 


ఇద్దరికీ మతిపోయింది ఆ ప్రశ్నకు. ఆవిడ పాత రకం కాబోలు అనుకున్నాడు కిట్టు. 


మా స్కూళ్లో అవి పట్టించుకోమని, సార్ జవాబు ఇచ్చారు. 


ముసలాయన అన్నారు. 


మీరు ఏమి అనుకోకండి. 

ఈ వయసు ఉండాల్సింది మా మనవడు అని. శూన్యంలోకి చూస్తూ. 


కిట్టు గుండెలో కలుక్కుమంది. 


ఆవిడ బాబు ఇటు రామ్మా అన్నారు. సార్ అనుమతిగా చూసారు. 


వెళ్ళాడు. ఆవిడ పొదివి కట్టుకుంది. తల మీద చెయ్యి వేసింది. 


ఆవిడ పక్కన అమ్మ వయసు మహిళ. కొంగుతో కళ్ళు తుడుచు కుంటుంది. కిట్టూ కి అర్థం అయ్యింది. 


అరటి ఆకు మీద దద్దోజనం పెట్టారు. బాబు ఒక ముద్ద తిను అని. సార్ వైపు చూసాడు. సరే అన్నట్టు అనుమతి. 


ఒక్క ముద్ద తిన్నాడు. ఎడ బాటు తెలిసిన వారు ఆ నలుగురు. 


రైలులో దేశం ఇలా ఉంటుందా అని కిట్టు ఆశ్చర్యంలో ఉన్నాడు. 


మళ్ళీ సీట్లోకి వెళిపోయాడు. బయట మారిపోతుంది చెట్టు చేమలు. సారా నిషేధం అని అక్కడక్కడా రాసి ఉంది. కొన్ని చోట్ల ఎర్ర జెండాలు కొడవలి గుర్తులు ఉన్న స్తూపాలు చూస్తున్నాడు.


 బయట చిక్కటి సాయంత్రం. కొండలు గుట్టలు పెద్ద పెద్ద బండరాళ్లు ఉన్న ప్రాంతాల్లో వెళ్తుంది బండి. 


సాయంత్రం అద్భుతంగా ఉంది.   సార్ ఈ సమయానికి ఒక మంచి పాట పాడండి అన్నాడు ధైర్యం తెచ్చుకుని. 


పాట గురించి చెప్పి పాడండి సార్. అన్నాడు మళ్ళీ. 


ఏదో చెరువు కట్టమీద వెళ్తుంది ట్రైన్.

ఇది చాలా పాత కృతి నాన్నా. వెంకట సుబ్బయ్యర్ రాసిన కృతి ఇది. 


అలైపాయుతే,

అలై పాయుదే కణ్ణా .. 


కదిత మనత్తిల్ ఉరుత్తి పదత్తై ఎనక్కు అలిత్తు తనిత్త వనత్తిల్ 

కడలికి అలలకు కథాకళి కళలిడు - శశికిరణము వలె చలించవా

చిగురు సొగసులను తలిరుటాకులకు - రవికిరణాలె రచించవా


ట్రైన్ శబ్దానికి సరి పడిన భాగాన్ని చిద్విలాసంగా పాడారు. 

అలా నాంపల్లి చేరాడు కిట్టు, కాలం కడలిలో అలా అలలా


(సశేషం)

వీర్ తుమ్...

 వీర్ తుమ్... 


మరుసటి రోజంతా కాలు కాలిన పిల్లిలా తిరిగాడు ఆఫీసు రూముల చుట్టూ. పోస్టు వస్తుందేమో అని, టెలిగ్రామ్ వస్తుందేమో అని, ఫోను వస్తుందేమో అని. 

మధ్యాహ్నం రెండున్నర కి పోస్టు వచ్చింది. కిట్టూ బెల్లు కొట్టే చోటు మీద ఉన్న వంతెన పై నుండి చూశాడు. పరుగెత్తుకెళ్లాడు. నేషనల్ కి తను సెలెక్ట్ అవ్వలేదు. రెండో స్థానం వరకే. ఈ విషయం జానీ కి చెప్పాలి లేకుంటే తను పాపం వెళ్ళిపోతుంది. డీలాగా భుజాలు దించుకుని వెళ్ళిపోయాడు. 


స్నాక్స్ బెల్లు కొట్టింది రోజక్క. ఎప్పటిలా వేగంగా కాకుండా కాళ్లు ఈడ్చుకుంటూ బయలుదేరాడు. ఆఫీసు గుమ్మం దిగి వెళ్ళే టైముకి ఫోను. స్టాఫ్ ఎవరో మాట్లాడుతున్నారు. స్టెనో అని ఒకరు ఉండేవారు.  తెల్లటి  చొక్కాలు ఇన్సర్ట్ చేసుకుని ఆయనకు యూనిఫాం లా వేసుకునే వారు. 


రేయ్ కిట్టు. నిన్ను నేషనల్ కి రమ్మని ఫోను. మన రీజియన్ లో ఎవరో రావటం లేదు అంట. మంచి ఛాన్సు కొట్టావ్. జనవరి 16-18 తేదీల్లో చండీ గడ్ లో. 


అయోమయం కొంప దీసి జానీ డ్రాప్ అయితే తనకు వచ్చిందా. జైలు లాంటి నవోదయ మీద విపరీతమైన కోపం. ఫోన్ ఎలా. పారిపోయి చేస్తే ? 


పెద్ద గొడవే అవుతుంది. ఎవరికి చెప్పేది. తాతయ్య సార్, అవులిస్తే పేగులు లెక్క పెట్టేస్తారు. కాదు నర్సు మేడమ్. వెళ్ళాడు. మేడమ్ ఇంకో నవోదయ కి ఫోను ఎలా చేస్తారు అని. నాకంత సీను లేదు. వెళ్ళి వైస్ ప్రిన్సిపాల్ నో ప్రిన్సిపాల్నో అడుగు. 


భావ నారాయణ ప్రిన్సిపాల్ . నారాయణ బావ అని కూడా అంటారు కొమ్మాదిలో. ముందటి లాగ వాగ్ధాటి, పిల్లల్తో మమేకం అయ్యే రకం కాదు. ఒక్క రోజు ఎవరితో మాట్లాడుతూ కనిపించలేదు. 


మిగిలింది శ్యామ్ ప్రసాద్ సార్. కొత్త. ఆయన దగ్గర కారు ఉంది. 

కొత్త క్వార్టర్ల బయట తచ్చాడాడు. ఆయన వస్తే చూద్దామని. 


సాయంత్రం ఆరు. పోపు వేసి వంటలు చేస్తున్నారు క్వార్టర్లలో ఉన్న వారు. సువాసనకు అమ్మ గుర్తుకొస్తుంది. కిట్టు కి ఎక్కడలేని దిగులు సాయంత్రం కమ్ముకున్న వర్షపు మేఘంలా కొట్టుకొచ్చేస్తుంది. 


వెనుక

పొంపాయ్. 

పొంపాయ్. 

అంటు హారను. 


ఫియట్ పద్మిని కారులో జల్సాగా శ్యామ్ ప్రసాద్ సార్. 

తప్పుకున్నాడు. చేతులు కట్టుకుని పక్కన నిల బడ్డాడు. 

హుషారుగా ఆయన. 

ఏం కావాలి? 


కిట్టు పేరు తెలీదు. 

కిట్టు ముఖంలో కలత చూసాడు ఆయన. 


ఏం కావాలి బాబు అన్నాడు కారులోనే కిటికీ ఇంకా దించి. 

అది సార్. అర్జెంట్ గా ఫోన్ చేయాలి. 


ఓ వంట్లో బాలేదా బుగ్గ మీద చెయ్యి వెనుక భాగం పెట్టి అడిగాడు ఆయన. 

పరవాలేదు. ఒక్క సారి ఫోను. 


ఓ ఎస్. 

కారు పార్క్ చేశాడు. కం. ఆయన ఇంట్లో కి తీసుకు వెళ్ళాడు. ఈల వేస్తున్నాడు హుషారుగా. 


ఎర్ర రంగు ఫోను. చక్రం తిప్పితే నంబరు కలిసే రకం. 

తన కారు, తన ఫోను ఆయనకు సరదా అని అర్థం అయ్యింది కిట్టుకి. 


కూర్చో. 

నంబర్ చెప్పు. 


నంబర్ తెలీదు సార్.

పెద్దాపురం  నవోదయకు చెయ్యాలి. ఓహ్ ఎస్.


ఇక్కడికి వచ్చాక లాంగ్ డిస్టెన్స్ ఫోన్ చెయ్యనే లేదు. ఏదో వెతుకుతున్నాడు. 

దుక్క లాంటి బుక్కు బయటకి లాగాడు. దీన్ని ఫోను బుక్కు అంటారు. అంటే ఇందులో అందరి నంబర్లను రాసి పెడతారు. తెలియని వారికైనా ఇలా ఫోన్ చేసి మాట్లాడొచ్చు. 


కిట్టు చేతిలో పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆయన. 

కిట్టు వెతికాడు గబ గబా. సాయంత్రం 7 అవుతుంది. అంటే సెల్ఫ్ స్టడీ సమయం. 


దొరికింది. చేతిమీద పెన్నుతో రాసాడు. 

సార్. ఇదిగో. 


ఆయన నంబర్ కొడుతున్నారు.   పెద్దాపురం JNV? 

ఒకే కిట్టు, కుట్టు వైపు చూసి ఎవరికి పిలవాలి అని. 


జానీ పేరు చెప్పటానికి జంకు. పద్మజ మేడమ్, బయాలజీ. అని చెప్పాడు.

మళ్ళీ చెయ్యమని పెట్టేసారు. 


యే క్లాస్. చెప్పాడు. 

మొన్న కేరళ వెళ్ళావు నువ్వేనా. 


ఔను అన్నాడు.

బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడే ఫస్ట్ అపాయింట్మెంట్. ఏదో తోటివాడితో మాట్లాడుతున్నట్టు చెప్పుకుంటూ పోతున్నారు. 


ఫోను.

ట్రింగ్...ట్రింగ్...


ఆయన ఎత్తలేదు. 

ఎత్తు. 


కిట్టు ఎత్తాడు. 

ఫోను అవసరానికి చెయ్యడం అదే మొదలు. 


వైస్ ప్రిన్సిపల్ హౌస్ JNV కిక్తంపాలెం అన్నాడు. ఎత్తి.

పద్మజ మేడం. కిట్టూ నువ్వేనా ? ఔను మేడమ్ . 


ఆవిడ వెంటనే. ఇదిగో జానకీ, కిట్టూ.. అని వెళ్ళిపోయింది. 

జానీ. జానీ ముందు నాకు నేషనల్ రాలేదు. మళ్ళీ ఫోన్ చేసి రమ్మని చెప్పారు. 


ఔనా. అయితే నేను కూడా వస్తాను. 

వర్షం కురిశాక మల్లె పందిరి కింద గాలి వీచి నీటి చుక్కలు జల్లినట్టు నవ్వుతుంది. జానీ.. 


బరువు దించినట్టు అయ్యింది. 

నువ్వు నో చెప్పలేదా? 


ఒకే, అంటే ఎవరో రావటం లేదు అన్నమాట. 

ఒకే. నేనుకూడా వస్తాను అయితే. 


వేరే ఒక్క మాట చెప్పే ధైర్యం లేదు. 

గుడ్ న్యూసే. 


కిట్టు మొహంలో ఆనందం. 

శ్యామ్ ప్రసాద్ రిలీవ్ అయ్యారు. 


ఆల్ సెట్ ? అన్నారు. 

కిట్టు ఎస్ సార్. 


గుడ్ చాప్. 

బయటికి వచ్చిన కాసేపటికి. కిట్టు గుండె గట్టిగా కొట్టుకుంది. 


తను చేసిన పని తనకే నమ్మశక్యంగా లేదు. ఇంత పెద్ద వాళ్లింటికి వెళ్లి,  ఫోన్ చేసి, ఇంకో నవోదయతో మాట్లాడాడు.

అలా మళ్ళీ ప్రయాణం పడింది. 


ఇంటికి ఉత్తరం రాసేవాడు కాదు కిట్టు. ఇప్పుడు పసుపు రంగులో పావలా కార్డు మీద రాస్తున్నాడు. 

పూజనీయులైన అమ్మకు నాన్నకు, నన్ను జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ కి పిలిచారు. అసలు ఎంపిక కాలేదు అనుకున్నాను, కానీ నన్ను కూడా రమ్మని ఫోను ద్వారా చెప్పారు. సంక్రాంతి తర్వాత చండీగఢ్ వెళ్ళాలి. నాతో కేరళ 

వచ్చిన వారు కూడా వస్తున్నారు. అవసరమయిన బట్టలు, కొంచెం తినే వస్తువులు తయారుగా ఉంచండి.


మళ్ళీ ఎగ్జిబిట్ కి రంగులు వేసుకుని, కిరోసిన్ స్టవ్ వత్తులు, దానికి అవసరమయిన సరంజామ డబ్బాల్లో పెట్టుకుని తయారు అయ్యాడు. 

చివరి రోజు నాన్నని, తనను స్టాఫ్ రూమ్ లోనికి పిలిచారు అన్నమయ్య సారు. రూములో డ్రైవర్ అన్నయ్య కూడా. 


చండీగఢ్ వెళ్ళే ప్రయాణానికి పథకం అన్నమాట. 

కిట్టు శీతాకాలం సెలవులకి ఎగ్జిబిషన్ డబ్బా పట్టుకుని ఇంటికి వెళ్ళాలి. అలా వెళ్ళాకా,  పెద్ద పండుగ మరుసటి రోజు డ్రైవర్ అన్నయ్య స్కూల్ వాన్ లో కిట్టు ను ఇంటి దగ్గర నుండి సార్ ఇంటికి వరకు తీసుకు వెళ్తాడు. సార్ నంబర్ 543465. సున్నా 891 కొట్టాలి లాంగ్ డిస్టెన్స్ అయితే. 


అక్కడ వైజాగులో మ్యూజిక్ సార్ తనను ట్రైన్లో గచ్చి బౌలి నవోదయకు చేరుస్తారు. 

అక్కడ నుండి గ్రూపులో చండీ గడ్ ప్రయాణం. 


అందరికీ అర్థం అయ్యాక. అందరూ ఒప్పుకున్నాక కిట్టు 1996 సెలవులకి తన బట్టలతో పాటు, ఒక కిరోసిన్ పొయ్యి, రెండు గ్లాసు పిప్పెట్లు, రెండు గ్యాసు పొయ్యి రబ్బర్ గొట్టాలు,  ఒక కాగితపు గుజ్జు తో చేసిన కొండ, ఎల్. ఈ.డీ బల్బులు, రెండు నిప్పో బ్యాటరీలు, ఒక బాటిల్ కిరసనాయిలు తో ఇంటికి చేరాడు.


1996 డిసెంబరు 15. 

కథ ఇంక భారతీయ రైలుకు...

*జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా ...*

 *జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా ...*


ఎనిమిదో తరగతి అక్టోబర్. పాల్ఘాట్ నుండి వచ్చాక ఇంటికి వెళ్లి వచ్చిన కిట్టూకి ఎన్నో ఏనుగుల శక్తి వచ్చేసింది. 

మిగతా స్కూళ్లను, మిగతా దేశాన్ని, చూసాక పరకాయ ప్రవేశం చేసినట్టు. తనను, తన స్కూల్ని, దూరంగా చూసాక ఒక కొత్త దృక్పథం. కోస్తా వడ్డున వెళ్ళిన రైలు, దానిని అక్కడక్కడా దాటుతూ వాగులు వంకలు. దేశాన్ని చూసాక తన చుట్టూ ఉన్న చిన్ని లోకం అర్థం అయినట్టుంది.


జానీ ఇచ్చిన ధైర్యం, ఆ కోమలమైన భావాలు జీవితాన్ని కసితోనే కాదు ఆనందిస్తూ దాటొచ్చనే గురి. 


తెలుగు శంకరరావు. హిందీ శశికళ. బయాలజీ తాతయ్య సార్. ఫిజిక్స్ వేరే కొత్త మాస్టారు. లెక్కలు అమ్మాణి . కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిచి న బృందం లాంటి టీచర్లు.


ఉదయానే సూర్యోదయం చూస్తూ ఒక పావు గంట చదవటానికి వెళ్లేవాడు స్కూలుకు. ఎర్రటి సూర్యుడు పైకి ఎక్కుతుంటే, కళ్ళు మూసుకుని ఏదో ఒక విషయం మననం చేసే వాడు.

ఒక చిన్న పుస్తకం పెట్టుకున్నాడు. అందులో రోజూ చదువుకున్న సమయం రాసుకునే వాడు. 5-6 గంటలు చేరడం టార్గెట్. ఇంకా ఏవో నచ్చినవి రాసేవాడు.

'నల్దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న' అని పద్యం తెలుగులో చెప్పారు. అది గుర్తు చేసుకుంటూనే, ఆ రోజు ఉదయం సూర్యోదయం చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చాడు. అందరూ బతికి ఉండగానే అనాథలమా అనే భావంతో కన్నీరు మున్నీరయ్యాడు. అదే మాట పాకెట్ డైరీ లో రాసుకున్నాడు. ఆ పద్యం తన మీదే రాశాడా గుర్రం జాషువా అని.


వెనుకనుండి, కిట్టూ చూపించు అని ఒక అక్క గొంతు. తనను చూసేసింది. అడుగుతుంది బుక్కులో ఏముంది అని చనువుగా అడుగుతుంది వెనక దగ్గరగా వచ్చి. 


ఇవ్వను. కఠినంగా అన్నాడు. 

వెనకనుండి గట్టిగా పట్టుకుని,ఏమిటి అనే లోపు, సీక్రెట్ బుక్కు లాక్కునే ప్రయత్నం.


గింజుకున్నాడు.

స్పర్శ.


ఆమె కుతూహలం.

తనకు భయం. 


ఆమెకు కోపం. 

తనకు సిగ్గు. 


అడిగినవన్నీ అమాయకంగా చెప్పే కిట్టు దాయటం అక్కకు నచ్చలేదు. 

కిట్టు తన రహస్యాలు దాచుకునే తపన.

ఆమెకు చూడాలి.


జానీ లా కాక అమ్మాయి స్పర్శ కిట్టుని సతమతం చేస్తుంది. 

బలం తప్పింది.

ఇచ్చేశాడు. 


ఆమె చూసింది పుస్తకం. 

టైమ్ టేబుల్లు. ఏవో రాతలు. 


ఒక చోట జానీ పేరు తన పేరు కలిపి సంతకం చేశాడు. 

తన పేరు. 

సంతకంలో కొబ్బరి చెట్లు. 

వంకలో ఉదయిస్తున్న సూర్యుడు.


అక్షరాలు కలుస్తూ ఆమె పేరుగా మారడం. 

ఇది ఆర్టిస్టు పెట్టే శైలి లోని సంతకం. 

పేజీ నిండా. 


తనను మళ్ళీ చూసింది ఆమె. 

బుక్కు జాగ్రత్త గా కిట్టు జేబులో పెట్టి వెళ్ళిపోయింది.


సూర్యుడు మర్డర్ చేసినట్టు మేఘాలను ఎర్రగా చేసి ఆకాశంలోకి ఎక్కుతున్నాడు.

.... 


ఆ రోజుల్లోనే, వీడి చుట్టూ ఒక బృందం చేరడం మొదలయ్యింది. ఏడో తరగతిలో పాఠం చెప్తూ ఎవరో టీచర్ అన్నారంట, కిట్టూ దగ్గర నేర్చుకోండి చదువుకునే విధానం అని.

కిట్టు లాగే ఒక పుస్తకం జేబులో పెట్టుకుని, వాడి లాగే తొందర తొందరగా పనులు చేసుకుని , వాడిలాగే పరిగెత్తుకుంటూ మెస్సుకు వెళ్లే అనుకరణ బృందం.


వీడి దగ్గర జీవన సిద్ధాంతాలను అడిగి నేర్చుకునే తల మాసిన వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు చేరేవారు. వాళ్ళ చేత నీళ్ళు తెప్పించుకోవడం, మెస్ లైన్లో స్థలం ఉంచడం, బట్టలు ఉతికించడం ఇలా నానా పనులు చేయించుకునే వాడు..

అందరూ ఆ బుక్కులో ఏముంది అని అడిగే వారే. 

..

హాఫ్ ఇయర్లీ సర్క్యులర్ వచ్చింది. 

కొత్తవలస నుండి కిరండోల్ వెళ్ళే ఇనుప ఖనిజం తీసుకువెళ్ళే ఎలెక్ట్రిక్ ట్రైన్లా తయారు అవ్వటం మొదలు పెట్టాడు. అరులో 564/600 తో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు, కేవలం రెండు మూడు మార్కులతో ఫస్ట్ తెచ్చుకున్నాడు. 7 లో 576/600 అయినా మహా అయితే అయిదారు మార్కుల తేడా. ప్రతి ఏడాది ఈ ఉత్కంఠ భరించలేకుండా ఉండేది.  ఇంక ఈ సంవత్సరం ఎలా అయినా మార్జిన్ పెంచాలి అని పట్టుదల. 

'అద్భుతాల ఋతువు' అని రాసుకున్నాడు డైరీ లో. 

99/100/98/99/99 హిందీ తప్ప అన్ని మార్కులు ఇచ్చేశారు. 99% తో ఇన్నాళ్ళ కష్టానికీ రానన్ని మార్కులు  వచ్చాయి. అంటే తన కొత్త పద్ధతి పనిచేసినట్టే ! 


ఇంకా రావాల్సింది హిందీ ఒక్కటే. ఇంచుమించు 10 మార్కుల మార్జిన్ ఉంది. అయినా కొంత భయం. 

శశికళ మేడం రూమ్ కి రమ్మని పిలుపు. వెళ్ళాడు. సాయంత్రం ఆరు. ఆ సమయంలో పిలవటం వింతే. కొంత భయం మొదలయ్యింది. 


కిట్టు, నీ పేపర్ కరెక్ట్ చేసాను అని. పేరు మార్చుకోమన్నాను కదా అయినా నా పేరు రాసావ్ . 

అది నా పేరు కూడా. 


ఔనా, 10 మార్క్స్ కట్. 

అలా అని తల ఎత్తి హాయిగా నవ్వుతున్నారు ఆమె. పాలు కారినట్టు ఆమె కంఠం. 


కిట్టు కళ్ళంట నీళ్ళు. 

ఇంతలో నర్స్ మేడమ్ వచ్చారు. 


ఏమే శాడిస్టు, మళ్ళీ చిన్న పిల్లలని ఏడిపిస్తున్నావా ? 

వీడు ఎక్కడ చిన్న పిల్లాడు.


కిలకిలా నవ్వులు మళ్ళీ. 

రారా చూడు. 99. నేనేమీ శాడిస్ట్ కాదులే. 


పో. 

కిట్టు గాల్లో తేలినట్టుంది. హిందీ లో 99 రావడం ఇదే తొలిసారి . 594/600. కిట్టు అనుకోని టార్గెట్ అది. 

మంచి హుషారుగా ఉంది సాయంత్రం. ఇంక చలికాలం సెలవులు వచ్చేస్తున్నాయ్. ఇంటికి వెళ్ళడమే తరువాయి. 


స్కూల్ బిల్డింగ్ రెండు భాగాలుగా ఉండేది. ఆ రెండిటిని కలుపుతూ చిన్న వంతెన. వంతెన కిందన స్కూల్ బెల్లు కొట్టేది రోజక్క. మొదటి అంతస్తులో వంతెన మీద కిట్టు బాల్యంలో ప్రతి రోజు గడిపేవాడు. 


సాయంత్రం అక్కడ చేరాడు. నిండు వెన్నల రోజు. 

తాచు పాములా కొత్త రోడ్లు. ఎదురుగా చక్కటి సాయంత్రం. 


సెల్ఫ్ స్టడీ అయిపోయే సమయం. 

రోజక్క పిలుస్తుంది కిట్టూ. ఉన్నావా ? 


ఆ.. 

నీకు పెద్దాపురం నుండి ఫోను. 


నాకా? 

నీకే? 


వెళ్ళాడు ఉరుక్కుంటూ

స్టాఫ్ రూంలో ఫోను 


ఎత్తాడు

పద్మజ మేడం


వీడికి పాల్ఘాట్ తీసుకు వెళ్ళిన టీచర్. 

గుడ్ ఈవెనింగ్ చెప్పాడు. 


ఆవిడ, ఇదుగో అని ఫోన్ ఎవరికో ఇచ్చారు.. 

కిట్టూ నేను. 


జానీ! 

నీకు ఫోన్ ఎలా అని అడిగాడు. 


కిట్టూ , నన్ను నేషనల్ కి పిలిచారు. చండీగడ్. నీక్కూడా వచ్చిందా అని. 

నాకు రాలేదే ? 


అడుగు. ఇది ఆప్షనల్ అంట. నువ్వు వస్తే నేను వస్తాను. 

నాకు తెలీదు. 


కనుక్కో. మాకు టెన్త్ సిలబస్ మొదలు పెట్టేస్తారు అంట జనవరిలో. నీకు రాకపోతే నేను వెళ్ళను. అందుకే చేసాను. 

(సశేషం)

మాట రాని..

 మాట రాని..

స్కూలు వియ్యంపేట నుండి కిల్తంపాలెం వచ్చిన కొత్త రోజులు. ఇంకా పట్టుమని రెండు వారాలు గడవలేదు. పిల్లలు మెల్లగా కొత్త ఆవరణకు అలవాటు పడుతున్నారు.

కిట్టూకి గమ్మత్తయిన విషయం ఏమిటి అంటే వియ్యంపేటలో ఆరు బయట స్నానాలకు అలవాటు పడిన పిల్లలకు పక్కా బిల్డింగ్లో స్నానం నచ్చేది కాదు. కొంతమంది సీనియర్లు చక్కగా బాత్రూంలో కొలాయిలో బకెట్ నింపుకుని బయట స్నానం చెయ్యడం చూసి విరగ పడి నవ్వాడు. ఇంకా కొంత మందికి బయటికి మగ్గు తీసుకుని వెళ్ళడం కూడా చూసాడు.

హనుమానులు గారు ఇంకా ఏవో పెయింటింగులు చేస్తూనే ఉన్నారు. క్లాసులో బల్ల మీద 521 అని రాసింది కూడా సారే.


అన్ని రూములు వెళ్ళి చూసాడు. నాలుగు లేబులు కూడా ఏదో ఒక సందు తీసుకుని వెళ్ళి చూసే వచ్చాడు. లెక్కకు అందని రూము ఒక్కటి ఉంది. అది ఏమిటో తెలియాలి. సారు బల్ల వేసుకుని రూముకు బయటికి ఆఫీసుల్లో ఉండేట్టు ఒక చెక్కమీద రాయటానికి గీతలు గీస్తున్నారు.

వరండా లో గుమ్మం పక్కన కిట్టు. ఎదురుగా బుక్కు పట్టుకుని కూర్చున్నాడు. సార్ ఈరూమేంటీ అన్నాడు. సారు క్లాసులోకి పోరా బయట ఏంటి అని ఒక గద్దించారు.

ఆయన పిల్లలని కొట్టే మనిషి కాదు. కొంచెం చనువు కిట్టూ కి. ఎక్కడయినా చదువు ఒకటే కదా నేనిక్కడ చదువుకుంటాను అన్నాడు. నోర్మూసుని చదూకో అన్నారు సారు.


మొదటి అక్షరం రాయడం కోసం పెన్సిల్ తో గీశారు. గ అని. వెంటనే కిట్టు అరిచాడు సార్ గ్రంథాలయమా అని. ఔను నన్ను డిస్ట్రబ్ చెయ్యక అని సారు.

పుస్తకాలు లేకుండా గ్రంథాలయం ఎలా అన్నాడు ఎగతాళిగా. వస్తాయిరా చూస్తుండు అన్నారు.

ఆ రోజు వాడికి మొదటిసారి కొత్త మాస్టారు కనిపించారు. ఆయన ఏమిటి చెప్తారో తెలీదు. ఉదయం ప్రేయర్లో అనౌన్స్ చేస్తారు అనుకున్నాడు కానీ చెయ్యలేదు.


కిట్టు కుతూహలం అడ్డు లేదు. ఎవరూ పీ.జీ.టీ అనుకున్నాడు. గానీ కుతూహలం ఆగలేదు. స్టాఫ్ రూమ్ పక్కనే టచ్చాడాడు. చివరకి ఆయన బయటకి వచ్చారు.


సార్ మీరు ఏమిటి చెప్తారు. ఫిజిక్స్ ? అన్నాడు.


లేదు. నేను లైబ్రేరియన్ అన్నారు.


కిట్టు ఆనందం హద్దులు లేవు. మీరు లైబ్రరీ పెడుతున్నారా అన్నాడు. ఓ ఎస్ పెద్ద లైబ్రరీ.


పారిపోయినప్పుడు, ప్రిన్సిపాల్ సార్ అడిగినప్పుడు చెప్పిన ఇబ్బందుల్లో లైబ్రెరీ లేక పోవటం ఒకటి. ఏకంగా లైబ్రేరియన్ సార్ వచ్చారు అంటే ఇంక పెడుతున్నట్టే అని..


సార్ మీకు ఏం కావాలన్నా నన్ను పిలవండి. అన్నాడు. ఆయన ఒక నవ్వు నవ్వి వదిలేశారు.


గ్రంథాలయ శాస్త్రం చదువుకుని, పోర్టు బ్లెయిర్ లో పనిచేసి ఆయన వచ్చారు అంట. రావడం తోనే బాగా హడావిడిగా ఉంది ఆ గది.


అద్దాల బీరువాలు. వాటికి గ్యాస్ పెయింటింగ్ చేసి పెట్టారు. పెద్ద చెక్క బల్లలు మధ్యలో.


గురజాడ అప్పారావు గ్రంథాలయం వెళ్ళేవాడు కిట్టు ఆరు ఏడు సంవత్సరాల వయసులో వాడి తాత గారితో. అక్కడ పెన్సిల్ తో సంతకం పెట్టడం. గోడకి కట్టిన బల్లమీద పేపర్ చదవటం బాగా నచ్చేవి.


రోజూ లైబ్రరీ గదికి వెళ్ళడం. సార్ ని ఎప్పుడు లైబ్రరీ మొదలు పెడతారు అని అడగటం..


ఒక రోజు చివాకరికి పెద్ద డబ్బాల్లో పుస్తకాలు వచ్చాయి. ఎండాకాలం సెలవుల్లో సాయంత్రం వర్షం పడితే వచ్చిన వాసనలా స్వేచ్ఛకు ఊరట కలిపిన భావం. కొత్త పుస్తకాల అచ్చు వాసన లో ఉన్న మజా వాడికి ఇష్టం.


మళ్ళీ వెళ్ళాడు సార్ బుక్ అని. ఇంకా అప్పుడే. పుస్తకాలకు స్టాంపులు వెయ్యాలి. వాటిని పరీక్షించాలి. ఇంకా కాటలాగు రాయాలి. ప్రతి పుస్తకానికి ఒక నంబర్ వెయ్యాలి. బుక్కు మొదట్లో ఒక స్లిప్ పెట్టాలి.


గ్రంథాలయానికి కావలసిన పనులు ఆయన చెప్పారు.


బుక్స్ ఎన్ని ఉంటాయి అన్నాడు. 500 దాటే. ఈయన స్టాంపులు వేసే సరికి నెలన్నా పడుతుంది. సార్ మేము స్టాంపులు వేసేస్తాను అన్నాడు.


సరే...


చెవులు నమ్మలేక పోయాడు.


క్లాసుకు పరుగు. కిరణ్. శేషు ఇద్దరూ వెంట వచ్చారు.


లైబ్రరీ బయటకి చేరే సరికి అక్కడ ఇంకో మూడు ఖాకీ డబ్బాల్లో పుస్తకాలు ఉన్నాయి. డ్రైవర్ అన్నయ్య ఇంకా ఎవరో ఆకాశ పెట్టి వెళ్తున్నారు.


సార్ అంటున్నారు మీ క్లాస్ కొత్త బుక్స్ కూడా వచ్చాయి అని. డబ్బా తెరిచారు ముగ్గురూ గుప్పుమని కొత్త టెక్స్టు పుస్తకాల వాసన.


బాగా పండిన మామిడి పండ్ల వాసన తరువాత కొట్టుకి నచ్చిన వాసన ఇదే. ముగ్గురు పీండ్రించుకుంటూ డబ్బాలను లాక్కుంటూ వెళ్ళారు లైబ్రరీ లోపలికి. ఇది అర్జెంట్ పని కదా అన్నట్టు చూస్తున్నారు అందరూ. కొత్త తెలుగు, సైన్స్, సోషల్, మాథ్స్ పుస్తకాలు ఉన్నాయి. మొత్తం 300 మీదే.


సారు ఏకంగా నాలుగు స్టాంపు డబ్బులు, నాలుగు స్టాంపులు బయటికి తీశారు. వీరికి హుషారు కట్టలు తెంపుకుంటూ వస్తుంది.


సారు ఒక పుస్తకం తీసుకుని, జాగ్రత్తగా, ముందు అట్ట మీద ఒకటి, వెనుక ఒకటి, ముందు అట్ట తీసి ఒకటి, వెనుక అట్ట తీసి ఒకటి, వేశారు.


ఇలా అన్నిటికీ వెయ్యాలి. అంతే రంగంలోకి దూకారు ముగ్గురూ. ఒకటి ఒకటి స్టాంపులు ధనా ధన్ వేస్తున్నారు. చక చకా ఒక పది పుస్తకాలు కొట్టారు. ముందున్న ఊపు తగ్గింది. ఇలా వేస్తూ ఉంటే చాలా కాలం పట్టేస్తుంది.


అందరూ ఒకరి మొఖాలు ఒకరు చూస్తున్నారు ఏమి చేతుమా అని.


కిరణ్ గాడికి ఒక ఐడియా వచ్చింది. అన్ని పుస్తకాలను ఒక వరుస లో పెట్టి రైలు బండి పెట్టెల్లాగా స్టాంపులు వేసే సిస్టమ్ పెట్టాడు. ఇదేదో బాగుంది ఒకడు తోస్తుంటే ఒకడు టక టక కొట్టడం.


ఇప్పుడు పని ఫాస్టుగా ఔతుంది. మాస్టారు పట్టిక రాయడం మొదలు పెట్టారు. అలా స్టాంపులు కొడుతూ ఒకరి చేతులమీద ఒకరు స్టాంపులు కొట్టడం కూడా అల్లరి చేస్తూ ఉంటే బెల్లు పడిపోయింది. సగం పుస్తకాలు ఇంకా ఉండిపోయాయి.



మళ్ళీ సెల్ఫ్ స్టడీ కి వచ్చారు. అలా రాత్రి డిన్నర్ సమయానికి మొత్తం మూడు వందల ఇరవై పుస్తకాలకి స్టాంపులు కొట్టి పడేసారు.


మరుసటి రోజు వెళ్ళి పెత్తందార్లగా ఏడో తరగతి అందరికీ పుస్తకాలు ఇవ్వడం జరిగిపోయింది.


అప్పుడు కిట్టు మళ్ళీ వెనుక పడ్డాడు. సార్ లైబ్రరీ బుక్స్ ఇవ్వండి అని. దానికి ఇంకా చాలా పని ఉంది, కాటలాగ్ అనేది ముందు ఉండాలి అని.


ఆ కాటలాగు ఎప్పుడు వస్తుంది అన్నాడు. రాదు మనం చెయ్యాలని చెప్పారు సారు. రోజు ఏదో ఒక సమయానికి రావడం, సారు చేస్తున్న పనికి ఏదో సాయం చెయ్యడం. ఆయన పట్టికలు వేస్తూ ఉంటే వీడు పుస్తకాలకు స్టాంపులు కొట్టాడు. పుస్తకాలు అన్నీ ఒక డజను అద్దాల అలమిరాల్లో పెట్టారు.


పుస్తకాలన్నిటికీ తెలుగింటి ఆడపిల్లకి బొట్టు పెట్టినట్టు స్టాంపులు కొట్టి, జాగ్రత్తగా బీరువాల్లో చేర్చారు.


అలా ఒక వారానికి రెడీ అయ్యింది నవోదయలో మొట్ట మొదటి గ్రంథాలయం.


మొదటి రోజు కిట్టు తీసుకున్న పుస్తకం S అక్షరంతో మొదలైన ఎన్సైక్లోపీడియా. అట్ట మీద నీల్ ఆర్మ్ స్ట్రాంగ్ చంద్రుడి మీద నడుస్తున్న ఫోటో. ప్రతిబింబంలో ఆల్డ్రిన్. అత్యద్భుతంగా ఉంది.


కలర్ టీవీ కూడా ఎరగని కిట్టు గాడికి ఫోటో కాగితం మీద అచ్చు పడిన పుస్తకం చదువుతుంటే చంద్ర లోకం కళ్ళ ముందుకు వచ్చేసింది.


రాత్రి పడుకునే ముందు అదే చదివేవాడు. క్లాసులో తీరిక దొరికినప్పుడు అదే. చంద్రుడి మీద మనిషి వెళ్ళడం నమ్మలేకుండా ఉంది. అతి వివరంగా ఫోటోలతో ఎదురుగా సాక్ష్యం.


హార్డీ బాయ్స్, యుక్రెయిన్ జానపద గేయ గాథలు, మహీధర నళినీ మోహన్ రాసిన టెలిగ్రాఫ్ కథ, కరెంటు కథ, బెంజమిన్ ఫ్రాంక్లిన్ కథ, టామ్ సాయర్, హకిల్ బెర్రీ ఫిన్, ప్రిన్స్ అండ్ పాపర్, మహా ప్రస్థానం ఇలా ఒక పుస్తకం బ్లాక్ హోల్స్ గురించి చెప్తే, ఇంకొకటి రూట్స్ అనే పుస్తకంలో కిజ్జి కుంటేకి జరిగిన అన్యాయానికి కళ్ళ నీళ్లు తెప్పించేవి.


అన్నయ్యతో ఏడు ఏళ్ళ వయసులో కిట్టు సాయంత్రం చక్కగా స్నానం చేసి మొదటి సారి లైబ్రరీ కి వెళ్ళాడు. తను గజపతినగరం ప్రజా గ్రంథాలయంలో చదివిన మొదటి పుస్తకం చీమ కథ, నీలం కాగితం మీద సిరా తో గీసిన చిత్ర కథ.


టామ్ సాయర్ చదువుతూ తను టామ్ గానూ, శేషు గాడు బెర్రీ ఫిన్ గానూ, భామ బెకీ గాను ఊహించు కొనే వాడు. కుంటా కుంటే పారిపోతే బంధించిన ఘట్టం తనకి తన కథలాగే అనిపించేది. కుంటా ఎలా బాధ పడి ఉండే వాడో వాడికి స్పష్టంగా స్వీయ అనుభవంగా అనిపించేది. పన్నెండేళ్ళ వయసులో తల్లికి దూరమైన లింకన్ కథలో తననే చూసుకునే వాడు.


కుంటా కథను చదువుతూ చాలా సార్లు కళ్ళ నీరు తిరిగేవి. హార్డీ బాయ్స్ చదువుతూ అమెరికాలో జీప్ మీద బండి తోలుతున్న సరదా.


గ్రంథాలయ వారోత్సవం పెట్టారు సత్యనారాయణ మాస్టారు. నెల్సన్ మండేలా మీద పుస్తక విమర్శ.


ఊసుపోక టెక్స్ట్ పుస్తకాలకు కూడా ముందు మాట చదివే వాడు కిట్టు. నెల్సన్ మండేలా జీవిత చరిత్ర మీద పుస్తక సమీక్ష.


'ఎర్రటి ఫ్లెమింగో పక్షులు ఎగిరిన సరస్సు' అనే పద ప్రయోగంతో వ్యాసం రాశాడు. స్వేచ్ఛను అనుభవించడం కాదు, దానికి గౌరవం తీసుకు వచ్చేలా బతకాలి అని ఆయన అన్న మాటలు గుండెల్లో పాతు కుపోయాయి.


చివరి రోజు, లైబ్రరీ కి ఉన్న ఆవశ్యకత ఏమిటి అనే అంశం మీద వక్తృత్వ పోటీలు.


కిట్టు రాసుకోలేదు స్పీచ్. మనస్సులో అనుకుందామనుకుంటే ఏదో భావోద్వేగం.


వెళ్ళాడు తిన్నగా. మైక్ చేతిలోకి తీసుకున్నాడు.


"గ్రంధాలయం సముద్రం లాంటిది. చాలామందికి సముద్రం ఒక తీరం మాత్రమే, నాకు సముద్రం ఇల్లు. సముద్రాన్ని ఇల్లు చేసుకున్న నావికుడికి ప్రపంచం ఒక పుస్తకాలయం ఎలాగో. నాకు పుస్తకాలయమే ప్రపంచం." 


ఇంకా ఏదో చెప్పాలని అనుకున్నాడు.


 

ఎదురుగా పిల్లలు.

లైబ్రరీ మాస్టారు, తెలుపు సఫారీ సూట్ లో ప్రిన్సిపల్.


కిట్టు కళ్ళ ముందు హాలు లేదు.


కుంటా ఉన్నాడు.

పారిపోయి దొరికినపుడు బొటన వేలు కోసిన ఘట్టం కళ్ళముందు.

తన లాగే పన్నెండేళ్ళ లింకన్.


తాతయ్యతో విజయనగరం గురజాడ లైబ్రరీ.

గజపతినగరం లైబ్రరీ లో చదివిన చీమ కథ.


చంద్రుడి మీద నడిచిన ఆర్మ్ స్ట్రాంగ్ ఉన్నాడు.

చెప్పాలనుకున్నది చెప్పలేదు.


భావానికి కట్టలు తెగి మాటలు కుదరటం లేదు.

మాటలు అవసరం లేని భావం.


అరనిమిషం మౌనం.

ఆ రోజు మాటలకన్నా మౌనమే గట్టిగా ప్రతిధ్వనించింది.

వెయిట్ లిస్టు

 వెయిట్ లిస్టు 


ఇంకా వియ్యం పేట రోజులు. ఆరో క్లాసు లో అక్టోబర్ నెలలో మిగిలిన ఖాళీలను భర్తీ చేస్తూ ఒక అయిదుగురు పిల్లలు జాయిన్ అయ్యారు. బమ్మర్ సింగ్, మొయిద రవి, తాతా రావు, ఇంకో ముగ్గురు. పేరుకి వెయిట్ లిస్ట్ గానీ వీరికి వచ్చిన మార్కులు ఒకటి రెండు మించి తగ్గవు మిగిలిన వారితో. 


విచిత్రంగా ఆ నలుగురి చుట్టూ చేరారు పిల్లలు. పేర్లు కనుక్కుంటున్నారు. మొయిద రవికి అప్పటికే ముగ్గురు నలుగురు బాడీ ఊరి పిల్లలు కలిసిపోయారు. వింత గా ఉన్నది బమ్మర్ సింగ్ మాత్రమే. 


కిట్టు వెళ్ళి అడిగాడు నువ్వు రాజస్థాన్ కదా అని. వాడికి అప్పటికీ మూడో తరగతి నుండి హోండా, రాహుల్ అనే మర్వాడీ అబ్బాయిలతో స్నేహం. వారి ఇళ్లకు వెళ్ళడం, వారి జైపూర్ టీ స్టాల్ లో కూర్చుని తాజా జిలేబీ కౌంటర్ దగ్గర నచ్చినవి తినడం ఇలా. జిందాల్ ఫ్యాక్టరీ  ఉండే వాడు రాహుల్ వాడితో వాన్ లో చాలా సార్లు తిరిగాడు.


ఔను అన్నాడు. తెలుగు హోండా లా కాకుండా సునాయసంగా మాట్లాడుతున్నాడు, కిట్టు కి అర్థం అయ్యింది వీడి స్పీడు. ఎందుకంటే తెలుగులో పరీక్షరాసి వచ్చాడంటే కొంత కన్నేసి ఉంచాలి. 


నీ పేరేంటి అలా అన్నాడు. నా అసలు పేరు భన్వర్ సింగ్. స్కూళ్లో తప్ప రాసి అలా చేశారు అని. ఓహో ఇక్కడ మార్చుకో హనుమాన్లు సార్ రిజిస్టర్ రాస్తారు అని యథాలాపంగా వెళ్ళి పోయాడు. 


అసలు చెప్పుకోవాల్సిన వాడు. సరయినోడు మొయిద రవి. కిట్టు వెళ్ళే మార్గానికి రివర్స్ డైరెక్షన్ లో కనిపించేశాడు మూడు నాలుగు సార్లు మొదటి వారం లోనే.  తను అన్నం తిని క్లాసుల వైపు వెళ్తుంటే ఇంకా క్లాసులోంచి బయలు దేరుతూ వీడు కనిపించేవాడు. ఏరా అంటే ఏం లేదు. ఒక సమాధానం లేని ప్రశ్న లా చూసేవాడు కిట్టు నీ.


ఉదయం ప్రేయర్ మొదలయ్యే సమయానికి ఒక గుక్క నీరు తాగటానికి, రోడ్డు దాటి బోరింగ్ కి వెళ్ళాడు కిట్టు. యూనిఫాం లో, పూర్తిగా రెడీ అయి. అక్కడ బ్రష్ చేస్తూ రవి ! 


అలాగే సాయంత్రం సెల్ఫ్ స్టడీ కి స్నానం చేసి చక్కా తయారు అయి, క్లాసులో కి వెళ్ళే టైంలో అక్కడ పేటి డ్రెస్సులో మల్లి రవీ. 


వీడికి త్వరలోనే పెళ్ళి బ్యాండు పడుతుంది అనుకున్నాడు. 


వాళ్ళు జాయిన్ అయి వారం ఔతుంది. 


పిల్లలు మెస్ కి వెళ్ళి పోయారు. కాళ్ళు ఈడుస్తూ హవాయి చెప్పుల్లో , నిదానంగా, నత్త నడక నడుస్తూ రవి.


పీ. ఈ. టీ. ముగించుకుని దూసుకుని వస్తున్నారు కొత్త పీ. ఈ. టీ మేడమ్. పోనిటైల్, రన్నింగ్ ట్రాక్ ప్యాంట్, శివ ఖేరా బూట్లు. చలాకీగా జాగింగ్ చేస్తూ వస్తున్న ఆవిడ వీడిని చూసి చూడకుండా దాటిపోయారు. 


ఒక్క క్షణానికి ఆవిడ గుర్తించారు, ఇక్కడ స్టూడెంట్ ఏమిటి చేస్తున్నాడు అని. 


వెనక్కి పరుగెత్తుకుని వెళ్ళారు. ఎరా వాట్ ఆర్ యూ డూ యింగ్ హియెర్? అని. 


ఐ డూ యింగ్ ,  బాకీ గోయింగ్ అన్నాడు. 


ఆవిడకి మతి పోయింది. 


ఇక్కడ ఇంత మెల్లగా ఎందుకు పోతుండె ? అన్నారు. 


లగెత్తు. అని అరిచి ఆవిడ మళ్ళీ జాగింగ్ మొదలు పెట్టారు స్కూల్ వైపు. 


వాడు చిన్న పాటి జాగింగ్ మొదలు పెట్టి కొంచెం దూరం వెళ్ళి మళ్ళీ కాళ్ళీడ్చుకుంటూ నడవటం మొదలెట్టాడు. 


ఆరు దాటింది కదా, కొంచెం దూరం పోయి ఆవిడ ఆగి చూసారు. 


వీడు మళ్ళీ కాళ్ళీడ్చుకుంటూ నడవటం. 


వెనక్కి వచ్చారు. 


ఎరా అర్థం కాదే నీకు. కొట్టనా అన్న టైముకి తన  రూములో కి వెళ్తూ నర్స్ మేడమ్. ఈవిడ ఆవిడకి చాలా జూనియర్. పిల్లలని కొట్టకుండా డీల్ చెయ్యాలి అని రూల్.. 


చెయ్యి గాల్లోనే ఆగింది. 

ఏమిటి ప్రాబ్లం అన్నారు. కిందకు చూస్తే షూస్ లేవు. 


షూస్ వేసుకోలేదేమిటి అన్నారు. 


ఇవ్వలేదు. 


ఎందుకు. 


వెయిట్ లిస్ట్ బ్యాచ్. 


వచ్చి వారం పోయిందిగా. 


ఇవ్వాళే. 


పోనీ వేగంగా నడువు. 


నడుస్తున్నాడు. 


వాడు వేసుకుంది బాటా చెప్పులు. బాగా అరిగి పోయి నీలం రంగులో కళ్ళను పట్టుకుని ఉండే లింకులు అరిగి, అవి మాటిమాటికి బయటకు వస్తున్నాయి. 


అలా వాడికి నడక అలవాటు అయ్యింది వాటి వలనే. 


అదా, రేపు ఇప్పిస్తా. కనిపియ్యి . 


మరుసటి రోజు ఆవిడ స్టాఫ్ కు చెప్పి చెప్పులు, బూట్లు అర్జెంటుగా ఇప్పించారు వెయిట్ లిస్ట్ వారికి. 


బమ్మర్ సింగు ఏకంగా 9త క్లాస్ సైజ్ చెప్పులు తెచ్చుకున్నాడు. చూసి జనాలు నవ్వులు. 


ఇంతటీలో హనుమాన్లు మాస్టారు వచ్చారు. వెయిట్  లిస్ట్ పిల్లలూ ఆర్ట్ రూములో కి మీ బకెట్లు, బూట్లు, ప్లేట్లు, ఇంకా ఏమయినా యూనిఫాం పట్టుకుని వస్తే మీ అడ్మిషన్ నంబర్ రాస్తాను అని. బూట్లు నెంబర్ రాసే వరకు వాడకండి అంటూ.


బమ్మర్ సింగ్ , ఓ నువ్విక్కడ రంగులు గట్రా రాసే వాడివా అని అడిగాడు. 


సార్ కి మండింది, నేను ఆర్ట్ టీచర్. ఆర్ట్ అంటే తెలీదా నీకు అడ్డ గాడిదా అన్నాడు. 


ఔనా షాపులకు గట్రా పేర్లు రాయటం నేర్పిస్తారా ఇక్కడ.


ఆయనకి ఇంకా మండింది. నీకు చెప్తారా. 


అందరూ తమ తమ సామాగ్రి పట్టుకుని వెళ్ళారు. 


గోడమీద ఒక పచ్చని గడ్డి తో నిండిన అడవి. అడవిలో గడ్డి లోపల దాగున్న పులి. కింద  అరవింద్ ఆన్ అర్థం కానీ స్టయిల్లో సంతకం. 


పిల్లలు గుస గుస లాడుతున్నారు. ఇది యేసింది ఎవరు అని. 


సార్ అని ఒకడు.


అంత సీన్ లేదు అని బమ్మర్ సింగ్. 


అడిగాడు ఎవరు వేసారు అని. 


అరవింద్ పెద్ద ఆర్టిస్ట్. నా దగ్గర నేర్చుకున్నాడు. వాళ్ళు దగ్గరెట్టి ఉంటే నీకు మప్పుతాను. 


ఆకుపచ్చ వార్నీషు తో ప్లేట్లమీదా, ఫాబ్రిక్ కలర్ తో బట్టల మీద , బూట్ల మీద నంబర్ రాస్తున్నారు. 


ఇంకోడు యూనిఫాం ఇచ్చాడు. సార్ కాలర్ మీద రాశారు. 


ఇంకా సార్ ప్లీజ్ అని బనీనులు. పోతున్నాయి సార్ అన్నాడు. అదీ రాసారు. 


ఇంకో నాలుగు తెల్ల చడ్డీలు ఈసారి..


ఇవి కూడా....


చంపేస్తాను .  లేటుగా వచ్చినా బాగా బలిసింది రాయ్ అని అరుపులు కేకలు.  


సాయంత్రం అయ్యింది. 


మళ్ళీ పీ. ఈ.. టి మేడమ్ రౌండ్లు పూర్తి చేసుకుని ఆరున్నర కి జీడిచెట్ల తోటలో ఉన్న మైదానం నుంచి స్కూల్ కి వస్తున్నారు, లైట్ గా జాగింగ్ చేస్తూ. 


అక్కడ మళ్ళీ మొయిద రవి. 


కాళ్ళీడ్చుకుంటూ. 


బాంచన్ , ఎందిరా మళ్ళీ ఇట్లా. 


బూట్లు ఉన్నాయి. 


విజిల్ కి కట్టిన రోప్ తో ఒక్కటి వేశారు. 


వాడు గంట స్తంభం దగ్గర కంచర గాడిదలాగా ఒక అరుపు అరిచి పరుగు పెట్టాడు.


మళ్ళీ ముందు కి పోయి అవిడ వెనక్కి చూసారు. 


వీడు ఒక ఆరు అడుగులు పరుగెత్తి ఆగిపోయాడు. 


మళ్లీ కాళ్ళీడ్చుకుంటూ నడక.. 


ఆవిడకి చిర్రెత్తుకొచ్చింది.


ఫాస్టుగా వచ్చారు , ఎందిరా నీకు అర్థం కావట్లా అని ? 


బూటు మేడమ్ పెద్దది. 


పరిగెడుతే బయటికి వచ్చేస్తుంది మడమ . 


చూపియ్యి. 


చిన్న పరుగు.


మడమ బయటకి వస్తుంది. 


ఎందిరా పెద్ద షూ ఇచ్చారా అని.


ఇదే అన్నిటికంటే చిన్నది మేడమ్ అన్నాడు. 


జుట్టు పీక్కుని అరుస్తూ కేకలు హాహా కారాలు వేస్తూ పోయారు ఆవిడ. 

....

గమ్మత్తు ఏందంటే

గమ్మత్తు ఏందంటే

ఆ రోజు కిట్టు నాన్న స్కూల్ కీ ఎప్పట్లాగే పేరెంట్స్ డే కి వచ్చారు. కిట్టు కి ఇష్టమైన పుస్తకాలు, మటన్ తీసుకుని వచ్చారు. తన ముందే కిట్టు కడుపు నిండా తినడం చూడటమే ఆనందం. 


కిట్టు బెడ్డు దగ్గర వెళ్ళిన ఆయన గుండె జారింది.

కిట్టు అక్కడ ఉన్నట్టు ఏమి దాఖలాలు లేవు. బకెట్ లేదు. మంచం మీద ఎవరివో సామాన్లు పడి ఉన్నాయి. 


కిట్టు ఎక్కడ అని జీర పోతున్న గొంతుకతో అడిగారు. అక్కడ వెళుతూ ఎవరో అన్నారు. కిట్టూ రీజినల్కి వెళ్ళాడు అంట అని. 

ఆయనకి గాభరా పెరిగింది. అంత దూరం వాడిని చూడాలి అనే తపన తో ఆయన రావటం. కిట్టు దగ్గర నుండి ఉత్తరం కూడా లేకపోవడం బాగా గాభరా కనిపించాయి. 


ఒక్కరిని పట్టుకుని ఆపి అడిగారు. కిట్టు గురించి ఎవర్ని అడిగేది అని. పిన్సిపాల్ ఆ రోజుల్లో లేరు స్కూల్ కి. శ్రీధర్ అన్నయ్య ఘట్టం ఎవ్వరూ ఇంకా మరువలేదు. జరిగి మూడు నెలలు కాలేదు పట్టుమని. 

కనిపించని కొడుకు ఎవర్ని అడగాలో తెలియని గాభరా. ఎవరో చెప్పారు, కిట్టు ఏడ్చుకుంటూ కొమ్మాది వచ్చాడు అని , తాతయ్య సార్ పంపించాడు అని. 


కిట్టు నాన్న తాతయ్య సార్ ఇంటి కి చేరారు. 

ఇద్దరూ వెనక్కి తగ్గే మనుషులు కాదు.


తన ఆలోచన ఆదర్శం మాస్టారిది. తన చేతిలోని సగం చెక్కిన శిల్పం కిట్టు. 

తండ్రి ఆలోచన ఆయనది. తన చేతిలోని పసి కందు కిట్టు. 


ఆ రోజు వారు ఏమిటి ఎలా మాట్లాడారో తెలీలేదు ఎప్పటికీ కిట్టుకి. 

కిట్టు స్కూల్ చేరాడు. వేన్ వచ్చింది కొమ్మది దాకా. ఒక్కడినే పట్టుకు వచ్చారు.


కిట్టు రాంగానే ఎదురు వచ్చింది రోజక్క. కిట్టూ వచ్చావా , ఎలా అయింది. కిట్టు ట్రోఫీ చూపించాడు. రోజక్క అన్నాది నువ్వు వెళ్ళక పోవడమే గాని వెళ్తే వాళ్ళని కొట్టయినా తెస్తావు అని. ఎవ్వరినీ ఒరే ఓలే అనే మాట అనేది కాదు రోజక్క.

ఇంటికి వచ్చినట్టు ఉంది. అది తలుచుకుని ఇంకా బాధగా ఉంది. తన సొంత ఇంటిని ఇంకా గుర్తు చేసుకుంటున్నాడు.


బెడ్డు సర్దాడు . బకెట్ వెతికి కడిగాడు. బట్టలు ఉతకడం మొదలు పెట్టాడు రోజు మధ్యలోనే. ఎందుకంటే అన్ని మాసి ఉన్నాయి. 

పిల్లలు ఒక్కరు ఒక్కరు వస్తున్నారు . రే కిట్టు వచ్చావా . గెల్చావా. చెప్పాడు. నీ యబ్బ ఒక్క సారి ఓడిపోతే నీ యబ్బ సొమ్ము పోతుందారా . అని వేళాకోళం చేస్తున్నారు. 




కిట్టు బట్టలు ఆరేసి. చివరికి మంచం మీద చేరపడ్డాడు. మళ్ళీ లేచిచూస్తే ఏడున్నర రాత్రి. 

గబ గబా మెస్ కు వెళ్ళి. ఎల్లా రావు వంట తింటే జిమ్మ లేచి వచ్చింది. 


రాత్రి జానీ చేసిన పని. పదే పది గుర్తుకు వస్తుంది. 

తనలో ఒక కొత్త చైతన్యం. కోరిక. తను నన్ను మర్చి పోకూడదు అని అంత పని చేసింది. అల్లాంటి అమ్మాయి కాదు కదా అబ్బాయి కూడా ఎప్పుడూ చూళ్ళేదు.


 జానీ అడిగిందే పెళ్లి ఎవరిని చేసుకుంటావ్ అని. అలాంటి అమ్మాయే. నవ్వుకున్నాడు మనస్సులో. 

తన పెదాల స్పర్శ, వాసన ఇంకా మనసులోనే ఉంది. 

తన చదువు గుర్తుకు వచ్చింది. పూర్వం చదువు అంటే చిన్న భయం ఉండేది ఎంత ఆసక్తి ఉన్నా. ఇప్పుడు ధైర్యంగా బుక్కు తీశాడు. ఒక నమ్మకం. 


ఇంత దూరం, ఇంత దేశం చూసాకా, ఇప్పుడు పుస్తకం అమ్మ వేసిన పరుపులా అనిపిస్తుంది. 


చాలా చాప్టర్లు అయిపోయి ఉంటాయి. కొంచెం ముందుకు చదివేవాడు సిలబస్. అందుకు కొంత నయం. 

మర్నాడు, పీటీ, టిఫిన్, ప్రేయర్ లో తనను పిలిచి మళ్ళీ షీల్డ్ ఇచ్చారు. 


షీల్డ్ ఇస్తున్నప్పుడు పక్కన కులాసాగా నవ్వుతూ తాతయ్య మాస్టర్. శ్రీకాకుళం పిల్లలకు తన మీద చెప్పిన కథలు గుర్తుకు వచ్చేశాయ్. మాస్టర్ని కుళ్ళ పొడుస్తాను అనుకున్న కిట్టు కి ఇప్పుడు ధైర్యం రాలేదు. 

ఎందిరా ఉత్తనే సరదాకి తొలితే నువ్వు గెలుస్తూ బొయ్యవే


 మరుసటి రోజు శనివారం. తెల్ల బట్టలు. ప్రేయర్ పక్కన మళ్ళీ కిట్టు తో ప్రదర్శన పెట్టారు. ఎస్ కోట నుండి విలేఖరి వచ్చాడు. కెమెరా తో. 

విలేఖరి అడిగాడు కిట్టుని. 


నీకు స్కూళ్లో ప్రోత్సాహం ఇస్తున్నారా అని ?

అసలు లేదు. ఇక్కడ జైలు మాదిరి గా ఉంటుంది. 

నంబూరి తాతయ్య అనే మాస్టర్ నా అనుమతి లేకుండా నన్ను కొమ్మాది తీసుకుపోయి, అక్కడ కూడా నన్ను అడగకుండా కేరళా పంపించేశారు.


ఇక్కడ టీచర్లు బాగా ఘోరం అన్నాడు. కేరళలో ఏమయింది అని అడిగాడు, చెప్పాడు.

మరుసటి రోజు జిల్లా ఎడిషన్ లో చివరి పేజీ లో న్యూస్. 


దక్షిణ భారత దేశ స్థాయిలో నవోదయ ప్రతిభ. 

చిన్న ఇన్సట్ లో ప్రత్యేకంగా విద్యార్ధి ఫలానా కిట్టు తన ఉపాధ్యాయుడు నంబూరి తాతయ్యను విస్తృతంగా కొనియాడాడు. ఆయన పట్టుదల వల్లే ఇంత ప్రగతి అని రాశారు. 


కిట్టు కి వళ్ళు మంట తో పాటు దురదలు కూడా  వచ్చాయి దెబ్బకి. విలేఖరి బుర్ర లేదు. నేను చెప్పిందానికి రివర్స్ రాశాడు అని అక్కడ ఉన్న వాళ్ళందరికీ అన్నాడు. 


కిట్టు కి వేరేగా పరీక్షలు పెట్టడం మొదలయ్యింది. అన్ని బానే రాశాడు. 

తాతయ్య చివరి పరీక్ష. 


నీకు నేను పెడతా అని.  ఎదురుగానే రాస్తున్నారు పరీక్షా పత్రం. 

కిట్టూ నీ స్టాఫ్ రూమ్ లో గేటు పక్కన కింద కూర్చో పెట్టాడు. 


పేపర్ చూస్తే మతి పోయింది. ఆరు, ఏడు, ఎనిమిది తరగతుల సిలబస్ కలిపి. నచ్చిన పద్ధతి లో ప్రశ్నలు. మొదటి ప్రశ్న పునాది వేసే విధానం, అది ఆరో తరగతి నుండి. కుందేలు పునరుత్పత్తి అవయవాల బొమ్మలు, కాంతి పరావర్తనం అలా ఇచ్చాడు పేపర్. 

సార్ ఇది అన్యాయం అన్నాడు. నోర్మూసుకొని ఇచ్చినవి రాయాలే. నీకు పేపర్ ఎలా ఇవ్వాలో నాకు ఎరుక అన్నాడు ఆయన. 




కిట్టు రాశాడు గుర్తు ఉన్నవన్నీ. 

గుండె గాభరాగా ఉంది. 


అసలే వెంట్రుకలు వెతికి మార్కులు కొట్టే మనిషి ఆయన. 


అర మార్కు పోయినా తాపులే. 


రాసి చేతిలో పెట్టాడు పేపర్. వెళిపోయేలోపు,


"ఆగు ఇప్పుడే చూస్తాను." 


ఒక్కక్క ప్రశ్నే చూస్తున్నారు.


బిట్స్ పేపర్ కూడా ఇచ్చాడు. రెండు మూడు క్లాసుల సిలబస్ కలిపి. 


49/50.


అట్లగుండాలే. సామి.


ఎప్పుడు నేర్చిన రాసినట్టుండాలే. 


కిట్టు కొంత భయంగా చూస్తున్నాడు. ఆ పోయిన ఒక్క మార్కు కి కొడతాడా అని. సార్ మార్కు ఎక్కడ, బొమ్మలో ఏదో పట్టుకున్నాడు. కిట్టు బేరం పెట్ట బోయాడు. మంచిదే రా . ఇంకా మార్కులు ఏం చేసుకుంటావ్. 

మళ్ళీ సంచి సర్ది రమ్మన్నాడు. 


సార్ నేను ఇంకా ఎక్కడికి పోను. గట్టిగా అరిచాడు కిట్టు. 

మీ నాయన నిన్ను ఇంటికి తోలకపోతే నన్ను కొట్టే ట్టు ఉన్నాడు. మా ఇంటికి వచ్చి గొడవ మా చేసినాడు. వెళ్ళి సంచి సర్దుకు రా. 


కిట్టూ ఉన్న ఫలానా, బాగ్ వేసుకుని హాస్టలోకి వెళ్లి సంచి వేసుకుని డబ్బులు పట్టుకుని సివిల్ డ్రెస్ లో ఆరా గంటలో వచ్చేశాడు.

వీడి ని చూసి రోజక్క అరుస్తుంది కిట్టూ పారిపోతున్నావా . కిట్టు లేదు అక్కా అని రయ్యిన స్కూల్ బిల్డింగ్ కి చేరాడు. 

లాబ్ లో దొరికారు మాస్టారు. సంచి తో కిట్టు. లెటర్ రాయ్. రాసాడు. సంతకం పెట్టు. పెట్టాడు. ఓన్ రిస్క్ అని రాయ్. అదీ రాశాడు. 


కిందకి వచ్చి డ్రైవర్ తో అన్నది వీడిని ఎస్కోట బస్ ఎక్కించి రా అని. 

అప్పారావు "వీడు చాలా సార్లు పారిపోయాడు సార్. ఒక్కడే ఎలా పంపిస్తారు?"


తాతయ్య నవ్వాడు.

"అదే గమ్మత్తంటే."

హౌరా మెయిలా ...

 హౌరా మెయిలా ... 
(పార్ట్ 2, సైన్స్ ఎగ్జిబిషన్)


తెల్లారే విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరారు. ఇంకా చూస్తే పట్టుమని ఆరుగురు.ఒక అమ్మాయి, కిట్టుతో కలిపి ముగ్గురు అబ్బాయిలు, ఒక మేడం, ఒక సారు. టీచర్లు పెద్దాపురం నవోదయ నుండి. ఆ పిల్లది కూడా పెద్దాపురమే.

 

సెకండ్ క్లాస్ స్లీపర్లో ఒక పూర్తి వాటా వీరికి దొరికింది. వీళ్ళతో వాక్మన్ పెట్టుకుని మంచి హుందాగా ఒక యంగ్మాన్. ఇంకా ఒక పెద్దాయన ఉన్నారు. అబ్బాయంట ముసలాయనకి. ఎనిమిది సీట్లు అలా. 


ఎందుకు ఎక్కడ ఎవరు అని ప్రశ్నలు మొదలయ్యాయి. ఇవి రైలెక్కిన వారికి తప్పని ఇంటర్వ్యూ. గొప్పగా చెప్పుకున్నారు టీచర్లు. ఒక్కడిని ఒక్కడిని చేసి ప్రాజెక్ట్ ఏమిటో అడుగుతున్నారు. 

కిట్టు చెప్పాడు చివరికి. ఆ అందరిలో అల్ప ప్రాణి వీడే. క్లాసు ఎనిమిది గానీ వయసు ఇంకా పన్నెండే. 


అయితే మీరు పెద్దయ్యాక ఏమి అవ్వదామను కుంటున్నారు అని ప్రశ్నలు. 

అమ్మాయి చెప్పింది. ఆ చదువేమిటో వీడికి అర్థం కాలేదు. ఇంకా చెప్తున్నారు అందరూ. 


కిట్టు తరపు వచ్చింది. 

గంభీరంగా గొప్పగా ఛాతీ పై కి లాగి అన్నాడు. 


నేను కలెక్టర్ ఔతాను అని. 

అందరూ ఒక్కసారి నవ్వారు. 


తన కల వీరికి నవ్వు తెప్పించిందా అని. ముఖం ప్రశ్న అయ్యింది. 

ఇంత సైన్స్ చదివి , చెప్పి కలెక్టర్ అయిపోతావా భడవా అని పెద్దాయన. 


అంటే, కలెక్టర్ అంటే ఇంకొకరికి సేవా చేస్తారు, అజమాయిషీ చేస్తారు. అవ్వడం తప్పు కాదు, కానీ బయటి ప్రపంచం చూడు, అక్క ఇంటర్నెట్ చేస్తుంది. మన దేశం ఎస్సెల్వీ , గబుక్కున అన్నాడు శాటిలైట్ లాంచ్ వెహికల్ అని, పంపిస్తుంది అలా. 


ఔనా అని విస్తు పోయాడు. 

రైలు మొదలయ్యింది. 

ఎటు చూసినా కరెంటు స్తంభాలు, ఇనుప పట్టాల మీద పరుగు, పట్టాలు కలుస్తూ వీడుతూ పోతుంటే గమ్మత్తుగా ఉంది. అక్కడక్కడా కరెంట్ స్టేషన్లు ఉన్నాయి. వాటిని వివరంగా చూస్తున్నాడు ఎందుకంటే వాడి ఎగ్జిబిషన్ నమూనా లో కూడా ఒక సబ్స్టేషన్ పెట్టాడు. అది కిట్టు ఐడియానే. 


తాతయ్య మాస్టరు గుర్తుకు వచ్చాడు. ఇంకా కోపం. ఈ పట్టాల పక్కన వెనక్కి వెళ్ళే వయిపు కొత్తవలస జం. అని రాసి ఉంది. అంటే వాడి ఊరి. 

కిట్టు కళ్ళలోకి మళ్ళీ నీళ్ళు. తనకు ఇష్టం లేకుండా తనను ఎలా పంపించారు అని విపరీతమయిన కోపం. 


వెనక్కి వెళ్ళాక స్కూలు కి రాజీనామా ఇస్తునా అని పగటి కల. అప్పుడు వెళ్ళే ముందు తాతయ్య సార్ ని రఫ్ ఆడిస్తాను అని అనుకున్నాడు. మొఖంలో కోపం. 

జానీ వచ్చి కూర్చుంది పక్క సీటు మీద. రైల్లో ఒక్కరే ఉండే పక్క సీటు వీడి కి బాగా నచ్చింది. 


కళ్లద్దాలు పప్పి కట్ వింతగా ఉంది పిల్ల. నీకు ఇష్టం లేదా వెళ్ళడం అని అడిగింది. లేదు అన్నాడు. మరి ఎందుకు వచ్చావు అన్నది. చెప్పాడు. 

చాలా తప్పు అని. సానుభూతి చెప్పి. తన చెవిలోని వాక్మన్ వాడికి పెట్టింది.  "టెలిఫోన్ ద్వనిలా నవ్వేదానా" పాట చాలా బాగా వస్తుంది. విన్నాడు . కొంచెం నవ్వాడు. తనకి ఒక చెవికి ఇచ్చి తను ఒకటి పెట్టుకుంది. ఇద్దరూ కొంచెం సేపు విన్నారు.


అనకాపల్లి, తుని, సామర్ల కోట , అన్నవరం. గుడి ముందు ఆగింది ట్రైన్. సంబరంగా ఉంది. 

కాసేపటికి గోదావరి. 


పచ్చని పొలాలు. సుభిక్షంగా ఉన్న దేశం. దూరాన ఎక్కడ చూసినా పంటలు. దేశం పేపర్లలో చదివి బాగా చెడిపోయి , బందులు, రాస్తారోకోలు, సారా ఉద్యమాలు ఉన్నాయనుకున్నాడు. 


లేదే. ఎక్కడ చూసిన బట్టలు లేకున్నా నవ్వుతూ మొహాలు. ఈ బంగారు దేశాని గురించి పేదరికం అని మాత్రమే  రాసేవాడికి వీరి నవ్వులు ఇకఇకలు, పక పక లూ కనిపించవు కాబోలు. 


హనుమలు యిచ్చిన నోట్లు విప్పి చూసాడు. ఒక అయిదు, ఒక పది, ఒక ఇరవై, ఇక యాభై. ఉన్న వన్నీ వీడి జేబులో పెట్టేసినట్టు అర్థం అయ్యింది. తన వలన సస్పెండ్ అయికూడా తన మీద ఏమిటి ప్రేమ. అర్థం కాలేదు. అద్దం దగ్గరికి వెళ్ళాడు, అద్దం లో చూసు కున్నాడు. తనకు అదృష్టం అంటే ఉండే ఉండాలి. తనను అభిమానించే వారు తనలో ఏమిటి చూస్తారో తనకి తెలీదు. 


పిల్లలని అసలు అజమాయిషీ చెయ్యటం లేదు. మేడం సార్ వేరేగా కూర్చున్నారు. వారి మాటల్లో వారు. సాయంత్రం తిరుపతి దాటింది. 


కాసేపటికి మద్రాసు. 

ట్రైను తిన్నగా ఒక బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఆగింది. విచిత్రం గా ఉంది. అందరికీ రైల్వే భోజనం. కాసేపటికి మళ్ళీ ఐస్క్రీం ఇది ప్రభుత్వం తరుపున కాదు అని అర్థం అయ్యింది. 


నిద్ర పట్టేసింది. అలసిన మనసుకి రైలు ప్రయాణం మందు అని అనుకున్నాడు లేచాక. 

ట్రైన్ బ్రిడ్జి మీద వెళుతూ ఉంటే కిందన స్టేషన్ ఉంది. భలే విచిత్రం .. 


కోయంబత్తూరు. 

ఇంకా ప్రయాణం ఉంది అంట. 


పశ్చిమ కనుమలు దాటుతుంది ట్రైన్. అందాన్ని చూసే మనసు మాత్రమే తక్కువ కానీ కళ్ళు నిండా అందం. టీ కాఫీ గార్డెన్లో పనిచేసే మనుషులు. వస్తువులు మోస్తూ ఏనుగులు మరింత విచిత్రంగా ఉంది ప్రయాణం. 



కేరళ రాష్ట్రంలోకి వచ్చినట్టే. పలక్కడ్ లో దిగారు. అక్కడ టీ తో పాటూ  కొబ్బరి నూనెలో వేయించిన అరటి చిప్స్ ఇస్తున్నారు. 




అక్కడినుండి మలపూజా వరకు బస్సు వచ్చింది. స్కూల్ విచిత్రంగా ఉంది. 

వీళ్లు వెళ్ళే సమయానికి అమ్మాయిలు తెల్ల చీర భుజాల కిందకి కట్టుకుని మల్లె పూలతో స్వాగతం పలుకుతున్నారు. అక్క వెళ్ళి వారితో డాన్స్ చేసింది. ఇంత ప్రయాణం తరువాత కూడా జానీలో ఉన్న ఉత్సాహం నచ్చింది. 


మేడం కూడా. ఆమెకు మలయాళం వచ్చు. మంచి పేరు ఉన్న నవోదయ అంట. వీరికి మంచి రూములో బస. ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు వేరే. 

సాయంత్రం భోజనానికి వెళ్ళాడు. కేరళ బియ్యం తినగానే కడుపులో నొప్పి, దాని మీద చేప ఫ్రై. 


బయటికి వచ్చి నొప్పితో విల విల లాడిపోయాడు. పిల్లలు వచ్చి చూసారు. మళ్ళీ లోపలికి తీసుకువెళ్ళి సూప్ లా తాగాడు. 

మరి రెండు రోజులు ఎక్సిబిషన్. విపరీతంగా జనాలు వచ్చారు.  ఇక్కడ మంచి నమూనాలు  వచ్చినట్టు ఉన్నాయి. తనదే చిన్న ఎగ్జిబిట్. జానీని చాలా మంది మెచ్చుకున్నారు.


మలప్పుజ దగ్గర ఒక డామ్ ఉంది. అక్కడికి పిల్లలని తీసుకుని వెళ్ళారు మేడం , సార్. అదే మొదటి సారి డామ్ చూడడం. మేడం సార్ రోప్వే కూడా ఎక్కించారు. ముందు బుట్టలో వాళ్ళు ఎక్కే సారు. వెనుక పిల్లలు. చాలా ఎంజాయ్ చేసారు. జానీ కిట్టుతో అంది ఏమిటి ఆలోచిస్తున్నావ్ అని. ఇంటికి ఎప్పుడు వెళ్ళొచ్చా అన్నాడు. 

స్కూల్ మళ్ళీ చేరారు. సాయంత్రం చిత్ర విచిత్రం గా కేరళా సంప్రదాయక వివాహం చేసి చూపిస్తున్నారు. అక్కడి స్కూల్లోని ఒక అమ్మాయికి ఒక అబ్బాయి కి పెళ్ళి !


సరదాగా జరుగుతుంది. ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు అంత దూరం పెట్టరు అని అర్థం అయ్యింది.

కిట్టు చీకట్లో వెనుక కూర్చున్నాడు. పక్కనే జానీ. కాళ్ళు దొంతరగా పెట్టుకుని. కిట్టు  పెళ్లి చేసుకుంటావా నువ్వు అని అడిగింది. చేసుకుంటాను. ఎవర్ని. ఇంకా తెలీదు ఏదో ఒక అమ్మాయిని అన్నాడు. పగల బడి నవ్వింది. నీకు బుర్ర తక్కువా అని అడిగింది. నాక్కాదు నీకే టీనేజీ  తిక్క ఎక్కుతుంది అన్నాడు.


 జానీ నీకు టీనేజి ఆల్రెడీ వచ్చింది కదా అన్నాది. తనకి చెప్పాడు మొటిమ బాధ. తను వేడిగా టీ కప్పు పెడితే పోతుంది అని చెప్పింది. ఐడియా నచ్చింది కిట్టు గాడికి.  తనకి ఎంటీవీ ఇష్టమని, తను హాస్టల్లో కాకుండా అమ్మ నాన్నతో ఉంటాను అని.  


బహుమతుల కార్యక్రమం మొదలయ్యింది. జానీకి ఫస్ట్, దార్వాడ్ అబ్బాయికి సెకండ్, కిట్టుకి మూడో ప్రైజ్. అది కూడా ఆశ్చర్యమే కిట్టు కి. 

ఇంక చివరికి ఇంటికి బయలు దేరారు ఆ రాత్రికి. మళ్ళీ హౌరా మెయిల్లో. ముందట కోయంబత్తూరు, తరువాత త్రిశూర్ , త్రిశూ ర్ లో ఒక నవోదయ బ్యాచ్ దిగిపోయింది.

ఎవరో చిన్న వెదురు బొమ్మలు అమ్ముతున్నారు. కిట్టు ఉన్న కొంచెం సొమ్ముతో ఒక తంబురా బొమ్మ కొన్నాడు అమ్మకి ఇద్దామని. 


ఇంకా చెన్నై. పుత్తూరు. 

ఆంధ్రా వచ్చేస్తుంది. తిరుపతి వచ్చింది.. ఇంక ఆనందం మొదలయ్యింది. 


పెద్ద అబ్బాయిలు ఇద్దరూ దూరంగా బెర్తు ఎంచుకున్నారు. మేడం సార్ వేరే. ఇంకా ఆటలో అరటి పండు లాగ మిగిలింది జానీ, వీడు.  

మనసు కుదుట పడుతుంది. ఇంటికి వెళ్తున్నాం అంటే ముందు స్కూల్ తరువాత ఎలాగోలా ఇంటికి చేరుతాను అనుకున్నాడు కిట్టు.


చక్కటి వెన్నెల రాత్రి. సైడ్ అప్పర్ జానీ, కింద వీడికి.  మిగిలిన వారు కొంచెం ముందర.

అలిసి పడుకున్నారు అంతా. 


హుషారు లో కిట్టుకి నిద్ర రావటం లేదు. 

వెంకటగిరి, నాయుడుపేట. 



ప్రతి 5 నిమిషాలకు ఒక చిన్న బ్రిడ్జి. జానీ కిందకి దిగింది . నిద్ర రావటం లేదు రా. కొంచెం జరుగు. కిట్టుకి నిద్ర అసలు రాదు. పడుకుంటే సమయం వృధా అనే అనుకునే వాడు. 

జానీ మళ్ళీ వాళ్ళక్క వాక్మాన్ తీసింది. కిట్టు చాలా గాలిలో జుట్టు వదిలేస్తూ బాగా ఆనందంగా ఉన్నాడు. 


నన్ను గుర్తు పెట్టుకుంటావా అనింది. కొంచెం అనిపించింది జానీ తో పరిచయం వదిలి వెళ్ళడం. 

 కిట్టు వీలైనంత గుర్తు ఉంటుంది కదా అన్నాడు. నీకో?


నన్ను మర్చిపోకే కిట్టు అన్నాది. సరే ట్రై చేస్తాను అన్నాడు. 


తను వెన్నెల నీడలో ఉన్నాడు. వెన్నెల్లో తాను. నీడ సగం బెర్తు మీద పడుతుంది. 

వెనక్కి ఉండి ట్రైన్ ఫస్ట్ గా వెళ్ళటం, అల్లా వెళ్ళినప్పుడు పట్టాలు మారినప్పుడు వచ్చే శబ్దం కిట్టుకి బాగా నచ్చుతున్నాయి. 


గూడూరు దాటి రైలు పరిగెడుతుంటే, ఇంచుమించు నిండు చంద్రుడు వెనకాలే వస్తున్నాడు. 

చాలా బాగుంది కదా. 


తను చప్పున కిట్టుకి బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఇది కొత్త కాదు.  ఇలాంటివి జరిగినపుడు కదల కూడదు అని కిట్టు అనుభవం. 

కిట్టు కదల లేదు. 


జానీ ఈసారి దగ్గరగా వచ్చింది నీడలోకి. 

జుట్టు వెనక రెండు చేతులు పెట్టి, పెదాల మీద ముద్దు.....

తడిగా, వెచ్చగా. మెత్తటి పెదవి అదే మొదటి ముద్దు కిట్టుకి. జానీకి కూడా తెలుస్తూనే ఉంది. 


ఊపిరి గట్టిగా తీస్తుంది. తన శ్వాస గులాబీలా ఉంది. దగ్గరిగా చూస్తే వెన్నెల నీడలో తన చెంప వెండి రంగులో మెరుస్తుంది.  

నిశ్చేష్టుడు అయ్యాడు. శరీరం నుంచి బలం పోయినట్టు అయ్యింది. వంటికి రూపం ఇచ్చే పదార్థం ఏదో వదిలి పోయినట్టు,  అన్ని కండరాలు వదిలి, చల్లగాలిలో , తేలుతూ పట్టాల శబ్దం లో కలిసిపోయింది. 


అలా ఎంత సేపు ధ్యానం జరిగిందో.    

తనను చూశాడు. జుట్టు ఎగురుతూ ఉంది, వెన్నెల్లో లీలగా తన మొహం. 


ఇప్పుడు నువ్వు నన్ను, నన్ను నువ్వు మర్చిపోయే అవకాశమే లేదు. 

ఆ రాత్రి నిద్ర లేదు. పడుకుంటే ఏదో మిస్ అవుతాను అన్న కిట్టు ఆలోచన ఇంకా దృడ పడింది. 


అలా హౌరా మెయిల్ లో, గూడూరు దాటాక, ఎస్. 63 లో టీనేజర్ అయ్యాడు కిట్టు.

అధికారి కావాలి అనుకునే ఒక బాలుడు అలా వెనక్కి మళ్ళీ రాలేదు. సైన్స్ లోకి మనసు మారి టీనేజర్ గా వెనక్కి వచ్చాడు.

అగ్నిపర్వతం

 అగ్నిపర్వతం

(పార్ట్ 1, సైన్స్ ఎగ్జిబిషన్)

వియ్యం పేటలో, ప్రిన్సిపాల్ ఛాంబర్ పక్కన సందు లో, గోడ పక్క ఒక కాగితపు పేపర్ మాకే అగ్నిపర్వతం ఉండేది. అది కిట్టు చూసి ఇష్టపడ్డాడు . స్కూల్ మారినప్పుడు అది చెత్తలో పోవాల్సింది. కానీ పోలేదు. జాగ్రత్త గా కాగితం ముద్దతో చేసిన కొండను కూడా కిల్తం పాలెం తెచ్చి పెట్టారు. దానితో కిట్టు జీవితం మారిపోయింది. ఆ కథ ఈ రోజు కథ ! 

 

విచిత్రం ఏమిటి అంటే స్కూల్ వియ్యం పేట నుండి కొత్త క్యాంపస్ కి వచ్చినా, అదే కొండను జాగ్రత్త గా ఎవరో తెచ్చి పెట్టారు ! ఒక గొప్ప సంస్థ ఎలా నడుస్తుందో అనడానికి ఇంత కంటే ఏం కావాలి. 


అది ఎనిమిదో తరగతి. స్కూల్ చరిత్రలో చెరగలేని రోజులవి. శ్రీధర్ అన్నయ్య చనిపోయాక మెల్లగా ఒక్కో రోజు గడిచాయి. ముందు ఒక వారం. తరువాత ఒక నెల. అలా రోజులు వారాలుగా వారాలు నెలలుగా . నెలలు ఋతువులుగా మారుతున్నాయి. 

ఉప్పెన వచ్చి వెళ్లిన ఊర్లో మళ్ళీ పంటలు పండినా ఉప్పెన పెట్టిన మరకలు గోడలపై ఉన్నట్టే. ఆ రోజుల గుర్తులు పిల్లల లో ఉండి పోయాయి. 


అలాంటి రోజుల్లోనే జరిగిన విషయం ఇది.

టీచర్ల అందరిలోనూ పిల్లల్ని ఒక తాడి పై నడిపించేది తాతయ్య సార్. ఆయనని భయంతో సగం , భక్తి తో సగం వినే వారు పిల్లలు. 


ఒకరోజు తాతయ్య కిట్టు దగ్గరికి వచ్చారు. నీ తో పని పడింది, బండగాడిని పట్టుకురా అని. 

బండ మూర్తి, కిట్టు క్లాసులో ఉన్నా వీటికంటే 6 ఏళ్ళు పెద్ద. ఒక గులాబీ వనంలో తుమ్మ చెట్టులా ఉండే వాడు. వాడు పసి పిల్లల మీద ఆధిపత్యం చూపించి బతికేసేవాడు. 


కిట్టుకి వాడికి చాలా గొడవలు పడ్డాయి. కిట్టు ఎక్కువగా చదివేస్తున్నాడు అని మేడమ్ గారికి  ఒక రోజు ఫిర్యాదు చేశాడు. 

ఆ ఫలానా బుర్ర లేని మేడమ్ కిట్టు రోజూ ఫలానా టైముకి పడుకోవాలి అని ఆజ్ఞ వేసింది. కిట్టు గాడిని ఎక్కడో మండింది. అసలు పోటీ కోసం కాకుండా జిజ్ఞాస కోసం చదివే వాడికి ఇది ఒక పెద్ద విచిత్రం. 

ప్రపంచం లోని విషయాలు అన్ని గొప్ప అతిశయాలు అని. రోజూ ఒక కొత్త విషయం నేర్చుకుంటే వచ్చే మజా, ఆ కిక్కు కిట్టుకి ఇష్టం. 


కిట్టు 3 లో ఉన్నప్పుడు బాబ్రీ మసీదు కూల్చివేత జరిగింది. అప్పుడు కిట్టూ కి ఎనిమిదేళ్లు, ఆ మసీదు వివాదం మొత్తం దిన పత్రికలో చదివి , బాబాయి స్నేహితులకు వివరంగా చెప్పే  వాడు. ఒక రోజు నాన్నమ్మ వాళ్ళ ఇంటికి దిగబెట్టి నాన్న ఊరిలోకి వెళ్ళారు. సాయంత్రం 7-8 వెనక్కి వచ్చి అడిగారు  ఆ 5 గంటలు కిట్టు కిడికీ లో కర్టెన్ వెనుక కూర్చొని యోజన పుస్తకాలు చదివాడు కిట్టు గాడు.

అలా కేవలం జిజ్ఞాస కోసం చదివే కిట్టుకి , ఇలా కౌరవ నీతిలో ఇచ్చిన తీర్పు నచ్చలేదు. నన్ను ఆపితే ఉప్పెనే అన్నట్టు విరుచుకుపడేవాడు బండ గాడి మీద. 


సార్ బండ గాడి నీ , కిట్టునీ కలిసే రమ్మన్నారు. వెళ్ళాడు. ఇంటికి రమ్మన్నాడు సారు. ఇద్దరూ వెళ్ళారు. 

అతి సామాన్యం గా ఉంది తాతయ్య సార్ ఇల్లు. ఇద్దరు ఆడ పిల్లలు మిల్కీ, స్వీటీ. మేడమ్ చాలా ఆప్యాయంగా లోపలికి రమ్మన్నారు. ఒక్కో ఇంట్లో కి అడుగు పెట్టగానే తెలిసిపోతుంది, అది ప్రేమాలయమా కాదా అని. ఇది 

ఖచ్చితంగా ప్రేమ మందిరం. 


మిల్కీ ఆడుతుంది చెక్క సైకిల్ తో. 

కిట్టు, మూర్తీ మంచి ఐడియా చెప్పాలి సైన్స్ ఎగ్జిబిషన్ కి. బండగాడు ఏదో చెప్పాడు. తాతయ్య సార్ చా అనేశారు. 


కిట్టు నువ్వు చెప్పు అన్నారు. కిట్టు ముందు బ్యాటరీలతో తను చేసిన మోటార్ గురించి చెప్పాడు. కిట్టు ఏడో తరగతి లో ఒక బ్యాటరీ మీద కిరోసిన్ స్టవ్ పుల్లల తో, అయస్కాంతం వాడి ఒక మోటార్ చేశాడు. అదే చేద్దాం అన్నాడు. 


సార్ చేశావ్ కదా , కొత్తది చెప్పా లే అన్నారు. 

అప్పుడు గుర్తుకు వచ్చింది అగ్నిపర్వతం. 


సార్ మనం జియో థర్మల్ పవర్ ప్లాంట్ చేద్దాం. 

గమ్మత్తుగా ఉంది , చెప్పు అన్నారు తాతయ్య సార్. 


కిట్టు చెప్పాడు. ఒక పేపర్ గుజ్జుతో కొండ చేద్దాం. దానిలో ఒక పిప్పెట్టు పెట్టి వేడి ఆవిరి పంపిద్దాం. బయట టర్బైన్ పెట్టి ఒక చిన్న జెనరేటర్ పెడితే మనకి పని చేసే నమూనా వచ్చేస్తుంది అన్నాడు. 


శభాష్ ఇది భలే. 


ఇద్దరూ పొండి రేపు ఇక్కడికి రావాలే. అని తట్టి పంపించారు తాతయ్య సార్.

 వీళ్లిద్దరూ సార్ ఇంటికి చేరారు సాయత్రం కాగానే. 


సాయంత్రం చక్కగా స్నానం చేసి ఆహ్లాదంగా తయారు అయ్యి ఉన్నారు సార్. రండి రండి అని పిలిచారు.


అక్కడ కనిపించింది మళ్ళీ ! 

అదే అగ్నిపర్వతం. 

ఆ పాత స్కూల్ నుండి ఇక్కడికి ఎలా వచ్చిందో విచిత్రమే.. 


కొండ లోపలికి ఒక పైప్ తోసారు. సార్ ఇంట్లోంచి ఒక స్టవ్, లాబ్ లోంచి ఒక రాగి పాత్ర తెచ్చారు. ఆ పాత్ర కి ఒక గ్యాస్ పైప్ తొడిగి స్టవ్ మొదలు పెట్టేశారు. 


కాసేపటికి ఆవిరి వస్తుంది. ఎందిరా కిట్టు నిన్న చిలక మల్లె వాగావ్ . చెయ్యి అని అంటున్నాడు సార్. 

కిట్టు , బండగాడు కలిసి గొట్టం కొండ లోకి తోసారు. పెద్దగా ఆవిరి రావటం లేదు. 


కిట్టు సారు పిపెట్ ఉండాలి అన్నాడు. సార్ తాళాలు ఇచ్చి లాబ్ కి పోయి పైపెట్ తెమ్మన్నారు. ఇద్దరూ పరిగెత్తారు. పైపేట్ ఇప్పుడు కొండలోకి తోసి. దానికి గాస్ పైప్ పెట్టారు. 

అంతే చక్కగా ఆవిరి వస్తుంది . చాలా ఉదృతంగా . 


ఒక చిన్న రేకుతో టర్బైన్ చేశాడు మూర్తి. 

టర్బైన్ భలే తిరిగింది. 


అలా సైన్స్ ఎగ్జిబిషన్ కి నమూనా తయారు అయ్యింది. 

మన హనుమాన్లు సార్ ఉన్నారు కదా. స్కూల్ కి ఆర్ట్ టీచర్ కం పెయింటర్ కం కార్పెంటర్ ఆయనే. ఆయనకు పని చెప్పారు తాతయ్య సార్. ఆయన ఇట్టే రంగులు వేసి అద్భుతంగా చేశారు. అన్నిటినీ ఒక ఖాకీ డబ్బాలో పాక్ చేసి పెట్టారు. 


కిట్టు క్వార్టర్లీ కోసం చదువుతుండగా , ఒక మధ్యాహ్నం తాతయ్య సార్ కిట్టు నీ స్కూల్ నుండి హాస్టల్ కి  తోలుకు పోయారు. 


నాన్న వచ్చి ఉంటారు అనుకుంటున్నాడు కిట్టు. స్పూర్తి హాస్టల్లో మొదటి బెడ్డు వాడిది. సార్ తన వెనుకే తీసుకుని వెళ్తున్నారు బెడ్డు దాకా. కిట్టు కి అర్థం కావటం లేదు ఏం జరుగుతుందో. 


బట్టలు సర్దుకో అంటున్నారు. కొట్టు సర్దాడు. బ్యాగులో పెట్టు అంటున్నారు. పెట్టాడు. అన్నీ పట్టుకో అంటున్నారు. పెట్టాడు. 


క్లస్టర్ కి పంపిస్తున్నా . కిట్టు బిగ్గరగా ఏడుస్తున్నాడు. పేరెంట్స్ వస్తారు అని ఎదురు చూస్తున్న కిట్టుకి ఇది ఉపద్రవం. 


కళ్ళు జలజలా కారిపోతున్నాయి. ముక్కు నిండి ఊపిరి అందటం లేదు. వద్దు సార్ అన్నాడు. ఒక్కటి కొడతా అన్నాడు సారు. 


ప్లీజ్ అన్నాడు. 


నీవే చెప్పాలి సైన్స్ ఎగ్జిబిషన్ కి. స్కూల్ కోసం చెయ్యా లి.

తన ఆటలు ఈయన దగ్గర అడవు.


కిట్టు పారిపోవటం , వాడి లక్షణాలు అన్ని తెలిసిన అయిన పెద్ద రిస్క్ తీసుకుంటున్నాడు. 

వీడు అటునుండి అటు పారిపోతే ఆ రిస్క్ అంతా ఆయన మీదే. 


ఒక్క సారి మళ్ళీ బతిమిలాడాడు. 

తంతా నా కొడకా .... 


అర్థం అయ్యింది.

ఏడుస్తూ వాన్ ఎక్కాడు. 

 వాన్ లో క్లస్టర్ కి వెళ్తున్న బ్యాచ్ మొత్తం ఉంది. 


బారు బారు గా ఏడుస్తూ , ఒక భుజాన గుడ్డ సంచి . రెండు చేతుల్లో ఖాకీ అట్ట లో సైన్స్  నమూన. బయలు దేరిన వాన్ ఆపి, మెస్ దగ్గర ఒక బాటిల్లో కిరసనాయిలు, అగ్గి పెట్టీ ఇచ్చారు సార్. 


వాన్ చివర ఇద్దరు సీనియర్ల మధ్య కిట్టు. 

అలా వెళ్ళిన కిట్టు. ఒక వారంలో ఆ బ్యాచ్ తో వెనక్కి రాలేదు. 


అసలు ఆ రోజు అలా ఉన్న ఫలాన వెళ్ళిన కిట్టు అలాగే మళ్ళీ  వెనక్కి రానేలేదు.


సశేషం ...

నిండా పన్నెండు...

నిండా పన్నెండు...


ఆ రోజు నుంచి కిట్టూ తాతయ్య మాస్టారి కళ్ళల్లో పడ్డాడు. తాతయ్య సార్ అంటే కొంటె పిల్లలకు సింహ స్వప్నం.  ఆయన పుస్తకంలో మంచి పిల్లలకు ఆయన గురువు. 


కిట్టు గాడి మీద ఆయన కన్ను పడింది ఆ రోజు ప్రిన్సిపల్ ఛాంబర్ లో, కిట్టు పారిపోయి వెనక్కి వచ్చిన రోజు. మళ్ళీ యూనిట్ టెస్ట్ జరిగింది. 


ఆ రోజు పాఠం చెప్పడానికి చెట్టుకింద పెట్టారు, నీరెండలో.

పేపర్లు ఇస్తున్నారు, అర మార్కు తగ్గినా దెబ్బ పడాల్సిందే. కిట్టు కి 24/25. మొదటి పేపర్ వాడిదే వెనక్కి ఇచ్చారు. మెచ్చుకున్నారు, Joule ప్రమాణం నుండి Erg ప్రమాణం లోకి , మళ్ళీ వెనక్కి మార్చి ప్రశ్నలు. Joule నుండి erg మార్చే తప్పుడు చాలా సున్నాలు వస్తాయి చివర. కిట్టు గాడు అన్ని సున్నాలు బదులు 10^3 అని రాసాడు. దానికి ప్రత్యేకంగా పొగిడారు.  

అరే ఎవరయినా వెళ్ళి మంచి కర్ర పట్టుకురా. ఈ సారి బాగా తప్పులు రాసారు, ఇంకా తక్కువ మార్కులు తెచ్చుకున్నారు పడతాయి అని. టీచర్ చెప్పిందే కిట్టుకి ఆదేశం. కిట్టు ఉత్సాహంగా లేచి వెతికి వెతికి మంచి బలంగా ఉన్న కర్ర పట్టుకుని వచ్చాడు. 


కిట్టుని ముందుకు రమ్మన్నారు. రెండు కొట్టారు కొంచెం చిన్న దెబ్బలు. అర మార్కు ఒక దెబ్బ అన్న మాట. 


అరే వెనక్కి రా అన్నారు, ఈసారి చాలా గట్టిగా కొట్టారు. ఇంకా రెండు మూడు చాలా బలంగా తగిలాయి. 


ఎవ్వరికి అర్థం కాలేదు. వాడికే ఇలా కొడితే వాళ్ళకి ఎలా కొడతారు అని భయం. 


ఎందుకు కొట్టానో తెలుసా అన్నారు, కోపంగా. 


పక్కనే ఉన్న క్లాసుల్లోంచి పిల్లలు చూస్తున్నారు. 


కళ్ళల్లో నీళ్ళు ధారాళంగా జారుతున్నాయి. తెలీదు అన్నాడు. 


నీకు మిగతా వారు ఏమయి పోతారు అన్న సెన్స్ లేదు అని. నీకు మంచి మార్కులు తెచ్చుకున్నావు, కానీ వాళ్ళని కొట్టడానికి కర్ర కోసం సంతోషంగా వెళ్ళావు. ఇలా అయితే జీవితంలో బాగా దెబ్బ తింటావు . నిన్ను అణగ దొక్కేస్తారు అని. 


కిట్టు కి ఆ క్షణం లో అర్థం కాలేదు. జన్మలో ఎవరికీ కర్రతేకూడదు అని తెలిసింది. 


తాతయ్య చదువు చెప్పే పద్దతి అది. పాఠం ముప్పై ఏళ్ళు గుర్తు ఉండే విధానం. 

మిడిల్ స్కూల్ సైన్సు మరియు బయాలజీ, ప్రయోగ శాలలు  అతనికి కొట్టిన పిండి. కొండ కోనల్లో పుట్టి, ఆదివారాలు చర్చిలో టీచరుగా చేసి, నవోదయకు ఎంపిక అయిన మొదటి తరం ఉపాధ్యాయుల్లో ఆయన ఒకరు. స్కూల్లో అక్కడ పాము కనిపించినా పట్టి దానిని పిల్లల ముందే ఫార్మల్డేహైడ్ లో పెట్టి చూపించే వారు. అతని ముఖస్తుతి లేని ముక్కుసూటి మనిషి. 


కిట్టు మీద ఆయన నాగు పాము లా పగ పట్టారని కొందరూ, కిట్టు ఆయనకు బాగా నచ్చాడు అని ఇంకొందరూ కిట్టూ కి చెప్పేవారు. ఆయన క్లాసులో మెచ్చుకుంటారో, మరుక్షణం చెంప చెల్లు మంటాదో ఎవరికీ అంతుపట్టని మిస్టరీ. 


వాడు సైన్సులో చేసిన తప్పయినా ఒప్పయినా అది ఆయనకు ఖచ్చితంగా తెలిసేది. 


శనివారం శనివారం ఆయన క్లాసు చెప్పేవారు కాదు. నూటికి సర్దార్, మోసెస్ ఇలా ఎన్నో కథలు పిల్లలు పూర్తిగా లీనం అయ్యేట్టు చెప్పేవారు. జోకులు వేస్తూ ఆయన కథలు చెప్తుంటే పిల్లలు ఈగల్లా చుట్టూ చేరే వారు. ఆయన కథ చెప్పిన తరువాత సోమవారం పాఠం చెప్పినా అదే శ్రద్ధతో వినేవాళ్ళు. 


ఆయన చెప్పే పద్దతి వేరు. ఆయన నోట్లోంచి వచ్చిన ప్రతి విషయం సిలబస్ లో ఉన్నట్టే. ఆయన క్లాసులో చెప్పని టాపిక్ పరీక్షలో రావు. కానీ తిప్పి తిప్పి ప్రశ్నలు పడేవి. చంటి పిల్లల పాలు జీర్ణం అయ్యే ఎంజైమ్ అడిగారు ఒకసారి. అది పుస్తకం లో లేదు ఆయన "గమ్మత్తు గా" అని చెప్పిన విషయం అది. ఆయన "గమ్మత్తు గా" అన్నాడు అంటే అది పరీక్షలో వచ్చేదే. ఇంకా ఎక్కడెక్కడి విషయాలు క్లాసులో చెప్పడం అది పరీక్షల్లో ఇవ్వడం జరిగేది.


టెస్ట్ బుక్ చివర్లో లేని ప్రశ్నలు, టెస్ట్ బుక్లో లేని విషయాలు కలిపి ఇవ్వడం తో పిల్లలు గొడవ పెట్టారు ఒకరోజు. ఆ రోజు ఆయన చెప్పాడు, "రన్నింగ్ నోట్స్ రాసుకోవాలె, నేను బొట్టు పెట్టి గా చెప్పన్. నేను చెప్పిన ఒక్క పదం కూడా మిస్ అవ్వబాక లా" . అలాగే రాసే వాళ్ళు పిల్లలు. గమ్మత్తుగా అని కూడా బుక్కుల్లో రాసుకున్న వాళ్ళు ఉన్నారు. 


ఒక రోజు మానవ స్కెలిటన్ గురించి పాఠం మొదలు పెట్టారు. ఇది వియ్యంపేట రోజులు. విశాలమయిన మైదానం, మైదానం అంచులో తాటి కొమ్మలతో వేసిన గోడలు లేని పాకలు. ఆరవ తరగతి నే మీదే. 


రొమ్ములో ఎన్ని ribs ఉంటాయి అని ప్రశ్న. ఒకరు 10 అన్నారు, ఒకరు 14 అన్నారు , ఇలా నచ్చిన వాళ్ళు నచ్చిన జవాబు. 


అరేయ్ కిట్టు, నువ్వు ఫాస్టుగా ఒక రౌండ్ కొట్టి రారా స్కూల్ గ్రౌండ్ కి. 


కిట్టు ఒక రౌండ్ కొట్టాడు. క్లాసులో రాగానే రొప్పుతున్నాడు. చొక్కా తీసే మన్నారు సార్. కిట్టు తీసేడు. అంతా నవ్వులు , బక్కగా ఉన్న కిట్టు ribs అందరూ కలిసి లెక్క పెట్టారు. ముందర 10, కనిపించనివి 2. మొత్తం 12.

గంగోత్రి

గంగోత్రి


(1994, పాత క్యాంపస్ లో జాయిన్ అయిన రెండో నెలలో కిట్టూ పారిపోయాడు ఇంటికి.)


తిరిగి నవోదయలోకి బిక్కు బిక్కు మంటూ వచ్చారు కిట్టు + వాళ్ళ అమ్మ. అభిమానవంతుడు తండ్రి రాలేదు. కిట్టు దసరా రోజు పారిపోయినప్పుడు బట్టల్లో ఒక యూనిఫాం కూడా పెట్టుకున్నాడు ఉతికించడానికి. 

అదే వేసుకుని వచ్చాడు. బయట రోజక్క కనిపించింది. పారిపోయి ఇంటి తిరిగొచ్చిన కొడుకుని ఎలా చూడాలో అలా చూస్తుంది. అక్క మొహంలో కోపం ఉందేమో అని బాగా ఆవలోకించి చూసాడు. ఒక్క పాలు కూడా లేదు. 


బయట నిలబడ్డారు. కిట్టు మనసులో తుఫాను. ఒక వైపు ఇంటికి వెనక్కి వెళ్ళిపోదామనే కోరిక. ఇంకో వైపు అమ్మ నాన్న తన చదువుకోసం పడే తాపత్రయం. ఇక్కడ మానేస్తే వెళ్ళాల్సింది ఎదురుగా ఉన్న జెడ్పీ హై స్కూల్. అది పాతాళం ఇది బ్రహ్మ లోకం..

ప్రభుత్వ ఆఫీసులో ఉండేట్టు సగం తలుపులు ఉన్నాయి. కిందనుండి చూడొచ్చు. 


కిట్టు పొట్టి కదా కొంచెం వంగితే కనిపించింది. ఛాంబర్లో ఉన్నారు అధిపతి. 

బయట పాలిష్ చేసిన చెక్క మీద ఇంగ్లీష్, తెలుగుల్లో ఒద్దిక గా రాసిన పేరు "ముళ్ళపూడి కోటేశ్వరరావు" ముళ్ళపూడి పేరు ఎక్కడో చూశాడు, ఆదివారం బుడుగు రాసేది ఇంకో రమణ కూడా ముళ్ళపూడే అనుకున్నాడు. ఇతను మాత్రం కాదు, ఏ దూరపు చుట్టమో అయ్యి ఉంటారు అని. 


డిగ్రీలు దండిగా ఉన్నాయి ఏం. ఏ, ఎం. ఏడీ, బ్రాకెట్లోలో ఏదో లండన్ అని. అంత చదువా అనుకున్నాడు. డాక్టర్ తెన్నేటి సుబ్బారావు దగ్గర చూసాడు ఎం. బి. బి. ఎస్ అని అంత కన్నా ఇదే ఎక్కువగా ఉంది. అంత చదువు చదివి ఇలా సంతకాలు పెట్టే ఉద్యోగం ఏమిటి అని సందేహం. 


బెల్లు వినిపించింది. గుండెల్లో రాయి పడినట్టుంది అమ్మకి. అమ్మని ఎప్పుడూ అలా చూడలేదు. ఈ రోజు పాత చీర కట్టుకుని వచ్చింది అమ్మ. తను చేసినది తప్పు అని ఎవ్వరూ అనలేదు , అమ్మ మొఖంలో మాత్రం తెలుస్తుంది. 

ఆఫీసుల్లో బాసులు కొట్టే బెల్లు అది. అక్క లోపలికి వెళ్ళింది. మళ్ళీ బెల్లు. 

పక్క తలుపు నుండి మనీలాల్, క్లాస్ టీచర్, హనుమాన్లు. అందరూ అర్థం అయ్యారు హనుమాన్లు తప్ప. ఆయన గుర్రుగా చూసి వెళ్ళాడు లోపలకి. హౌస్ మాస్టర్ మనీలాల్ ముఖములో ఏమాత్రం కోపం లేదు. హర్యానా నుండి ఇంత దూరం వచ్చారు ఆయన. మళ్ళీ రాజీవ్ హౌస్ లోకి వెళ్తే నాకు దెబ్బలు తప్పవేమో అని భయం. 


ఇప్పుడు లోపలికి రమ్మన్నారు. అమ్మ బిక్కు బిక్కుమనడం మొదటి సారి. ఇంట్లో తనను కొట్టలేదు విచిత్రంగా ఎవ్వరూ.

లోపలికి వెళ్లేటప్పుడు, బ్రూస్లీ , ఎంటర్ థీ డ్రాగన్ సినిమా గుర్తు కొచ్చింది. 


లోపలి అడుగు వేశాడు. ఏవేవో ఉన్నాయి రూములో. ట్రోఫీలు, కప్పులు, పుస్తకాలు. ఒక కరుడు కట్టిన మహా సంస్థ లా ఉంది ఛాంబర్. 

అనాలోచితంగా బూట్లు స్టాంప్ కొట్టి, రైట్ చేత్తో సెల్యూట్ కొట్టాడు.


ఎదురుగా నలుగురు ఉన్నారు. తిట్లు చివాట్లు తినడానికి సిద్ధం అయ్యాడు అమ్మ మొఖం చూసి. అమ్మ అంటుంది , చిన్నవాడి తప్పు మన్నించి ఈ సారికి మళ్ళీ పెట్టుకోమని. అమ్మ మీద కోపం , జాలి కలిసి వస్తున్నాయి. 

అందరి ముఖాల్లో గాంభీర్యం కనిపించింది కానీ కోపం కనిపించలేదు. వారికి కిట్టు ఒక సమస్య. వారి కళ్ళల్లో పిల్లలు శిల్పికి దొరికిన పాల రాళ్ళు.  ఎదుట బాల్యం కనిపించింది కాని నేరం కనిపించలేదు. 


కిట్టు దృష్టిలో వాడికి వారి ఉలి మాత్రం కనిపిస్తుంది. అందరూ కలిసి తనలోని స్వేచ్ఛను పీల్చి పారేస్తారేమో అని భయం. 

పిన్సిపల్ ఆవధానిలా రోజుకొక డజను సమస్యలు పూరణ చేసేవారు. కిట్టు కంటే ముందు ఆ రోజు ఆయన పూరించిన సమస్య అక్కడ ఉన్నవారెవరికీ తెలియదు, అలా సమస్య తెలిసే ముందే పూరించడమే ఆయన పని. 


ఫైల్లోంచి పైకి చూశారు. కిట్టు కొట్టిన నమస్కార బాణాలు , అర్జునుడు తన గురువులకు వేసిన శరాల్లా పనిచేశాయి. కోపం రాకుండా ఎంత లాఘవంగా వాడు కొట్టిన నమస్కారం, వాడి వాలకం చూసి ముచ్చట రాకుండా ఉండలేదు. 


కిట్టు.. 

ఎందుకు పారిపోయావ్ ? 

అని కోటేశ్వరరావు ప్రశ్న వేశారు. 


కిట్టు అవాక్కయ్యాడు. ఆలోచనలో పడ్డాడు. తను నిజంగా ఎందుకు పారిపోయాడో ఆలోచనలో పడ్డాడు. తనని ఆ ప్రశ్న అడిగిన మొదటి వ్యక్తి. 


(అసలు కారణం కిట్టుకి కూడా ఇంకా ముప్పై ఏళ్లు గడిచిన తర్వాతే తెలియబోతోంది. అతనికి ఉన్న మెకెల్ సిండ్రోమ్ అనే జన్మ లోపం వల్ల నొప్పి మొదలైనప్పుడు, తెలియకుండానే ఇంటికి పరుగెత్తేవాడు. ఆ రోజు ఆ గదిలో ఉన్న ఎవరికీ, సృష్టికర్త కి తప్ప,  ఆ సత్యం తెలియదు.)


ఆలోచిస్తున్నాడు కిట్టు.

నాకు బాగా బోరు కొట్టింది సార్. అన్నాడు.


ఏం అన్ని చదివేశావా? మార్కులు ఎలా వస్తున్నాయి. క్లాస్ టీచర్ వైపు చూస్తూ అడిగారు. 

క్లాస్ టీచర్ 149.5/150 అన్నారు. ఫస్ట్ ర్యాంక్ సిక్స్త్ లో. అది ఆ స్కూళ్లో అరుదుగా వచ్చే మార్కులు. అందరూ 

ఎంపిక చేసిన మెరిట్ స్టూడెంట్స్ అయినవలన పేపర్లు గట్టిగానే ఇచ్చేవారు. 


అర మార్కు ఎక్కడ పోయింది. కాస్త గద్దించి అడిగారు మొదటి సారిగా ! నవోదయలో ఉన్న తేడా అదే.  ఎక్స్ లెన్స్ ఒక అలవాటు గా మారే వరకూ ఆగరు. శ్రేష్టత అలవాటు అయ్యాక మరో దిక్కులో పిల్లలను ఇంకా ముందు తోస్తారు. 

సైన్స్ లో తాతయ్య సార్ ఉత్తుత్తినే  తీసేసారు అన్నాడు. 


ఐ సీ. 

బోర్ కొడితే తాతయ్య సార్ దగ్గర లైబ్రరీ బుక్స్ తీసుకోవచ్చు కదా ? తాతయ్య సార్ స్కూల్ గ్రంథాలయాధికారి పాత్ర కూడా చేస్తున్నారు. 


లైబ్రరీ లేదు కదా, టప్ మని సమాధానం. ఫకాల్ మని నవ్వారు హనుమాన్లు. సహీ అని అనుకోకుండా మనీలాల్ నోట్లోనుంచి మాట వచ్చేసింది. 


వియ్యంపేట లో ఉన్న రద్దీ, లైబ్రరీ, లాబులు లేని లోటు వారికి తెలుసు. పిల్లల స్వభావంమీద తర్ఫీదు పొందిన వారే అక్కడ ఉన్న టీచర్లు అంతా.


తాతయ్యను రమ్మని చెప్పు. నంబూరి తాతయ్య. ఆదివారం ఆదివారం  కాథలిక్ చర్చి లో పని చేసి, M.Sc  చేసి, నవోదయకు వచ్చిన  ఉపాధ్యాయుడు. స్కూళ్లో అధిపతికి ఎదురు సమాధానం చెప్ప గలిగిన యంగ్ గన్. పరిపాలనకు విమర్శ ఉండాలి, ఆ విధి చేసేది తాతయ్య సార్.


ఆయన వచ్చారు. ఇలా ఒకరు పారి పోయారు అని తెలుసు. క్లాస్ మధ్యలో తనను తీసుకురావటం కొంత చిరాకు. 


ఏమిటి? 

చెప్పారు. 


మీరు బుక్స్ ఇవ్వలేదా.. 

ఇచ్చాను. లైబ్రరీ లేకుండా ఏంది చేసేది. 

ఇచ్చింది వీడు చదివేసే ఉంటాడు ఒకరోజులో. ఖరాఖండిగా జవాబు.

ఏలాంటి స్టూడెంట్ ? 

చాలా షార్ప్ ఉండేది. తెలంగాణా యాసలో.

అడగని చాలా ఈక్వేషన్స్ రాసాడు మొన్న పరీక్షలో. 


గాంధీ జయంతికి మీరే అంటుంటి వీడు మన విద్యాలయకు వరం అని. 

కిట్టు గాంధీ జయంతి కి ఇచ్చిన ప్రసంగం టూకీగా ఇది. గాంధీ ప్రేమించమని చెప్పారు, ప్రేమ అంటే కరుణ, కరుణతో కలిగేది అహింస. ఈ మూడు ముక్కలు చెప్పి దిగిపోయాడు ఆరోజు. చప్పట్లు చాలా సేపు పడ్డాయి. 


ముళ్ళపూడి కోటేశ్వరరావు కి ఎదురుగా పారిపోయిన నేరం కాదు, సరిదిద్దే ఒక మంచి ఉదాహరణ కనిపిస్తుంది. 

నీకు కావలసిన పుస్తకాలు ఇస్తే ఉంటావా? 

కిట్టు సమాధానం ఇవ్వలేదు. 


చెప్పు కిట్టు, రోజక్క ప్రోత్సహిస్తు అంది.

సార్, లైట్లు లేవు బెడ్డు దగ్గర. టిఫిన్ చాలట్లేదు. లైన్లు చాలా వెయిటింగ్ ఉన్నాయ్. 

కిట్టూ బాగా ఆలోచించి చెప్పు. 


*"నీకు నేను మూడు వరాలు ఇస్తాను ! "*


అక్కడ ఉన్న స్టాఫ్, ఇప్పుడు చారిత్రాత్మక ఘట్టం చూసే అవస్థలోకి వచ్చేశారు. ఒక ఆరో తరగతి అబ్బాయ్ పారిపోవడం ఏమిటి, వారితో ముళ్ళపూడి కోటేశ్వరరావు వరాలిచ్చి బేరం పెట్టడం ఏమిటి. ఇది ఎక్కడా జరగని వింత. అచంచల హిమవత్పర్వతాన్ని హిమనదము గుద్దుకున్నట్టు ఉంది, వీరి సంభాషణ. 


"అవి తీరిస్తే నువ్వు నవోదయలో ఉండడమే కాదు. విద్యాలయకి గౌరవం తెచ్చేటట్టు ఉండాలి. కావాలా వరాలు అన్నారు !!! " 


పసిపిల్లల మనస్సును అర్థం చేసుకుని. ఉన్న ఫలాన ఆన్ ది స్పాట్ సమస్య పూరణ జరుగుతుంది.

సరే. 


బాగా ఆలోచిస్తున్నాడు. 

ఒకటి, బెడ్డు గాలి వేసే, వెలుతురు ఉన్న ప్రదేశానికి మార్చాలి. 

సరే. మనీలాల్ అడగక ముందే ఓ కే. అనేశారు. 


ఎన్ని పుస్తకాలు అయినా లైబ్రరీ లోంచి ఇవ్వాలి. తాతయ్య వైపు చూసారు అధిపతి. 


ఒక్కో సారి 5 ఇద్దాం, అయిపోయాక వచ్చి పట్టుకుని పో అన్నారు తాతయ్య సార్. నీకు కావాలంటే ఇదిగో కీస్. లయిబ్రరీ తాళాలను బయటికి తీసి చూపిస్తూ. తాతయ్యను ఉత్సాహంగా చూసారు ప్రిన్సిపాల్. 


మూడు, నా రోల్ నెంబర్ 31 నుండి 14 కి మార్చాలి. వింతగా చూసారు అందరూ. అదేంటి అని. అబ్బాయిల్లో మొదటి నంబర్. లైన్లో చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. కడుపు తిప్పేస్తుంది అన్నాడు. ఒక్కో సారి టిఫిన్ కూడా చాలదు. 


క్లాస్ టీచర్ వైపు చూసారు. అయోమయంగా ఆవిడ ఏదో అనబోయే లోపు.


ఎవరు 14 ఇప్పుడు? 

లోతేటి లోకేష్. 

ఒకే వాడిని 31 కి, పెట్టి వీడిని 14 చెయ్యి. ఐ విల్ స్పీక్ టు హిం, అన్నారు పెద్దాయన. 

సమస్య పూరణ అయినట్టే. 


అంతా ఒక నవ్వు నవ్వపోయారు. 

సార్ టిఫిన్ అన్నాడు. 


ఏమిటి ? 

2 ఇడ్లీ చాలా తక్కువ సార్ అని. ఇడ్లీ పాత్రల మీద ఇంతకు ముందే చాలా ఇబ్బంది పడ్డారు స్కూళ్లో. ఇది కష్టమే. 


సరే నీకు ఇడ్లీ రోజు ఒకటి ఎక్కువే వెయ్యమంటాను అన్నారు ప్రిన్సిపాల్. ఇక్కడ ఇచ్చిన వరాల్లో జరగని వరం ఇది ఒక్కటే. 

అందరూ ఒక నవ్వు నవ్వారు. గట్టోడివేరా అని హనుమాన్లు. కిట్టూ పారిపోయినందుకు ఆయనకి, మనీలాల్ కీ పడిన షోకాజ్ నోటీస్ గురించి మర్చిపోయి.

లాఘవంగా సమస్యని సమస్యగా గుర్తించి పూరించారు ఆ నాలుగు టీచర్లు ఆరోజు. క్రమశిక్షణ ఉండీ పారిపోయిన వాడికి శిక్ష అవసరం లేదు కదా.

అలా కిట్టు, నవోదయలో చేరిన రెండో నెలకే పారిపోయి కూడా, ఇంట్లోనూ స్కూల్లోనూ తన్నులు తినకుండా బతికి పోయాడు !!

పోరా

 పోరా


ఆగకు

పరిగెత్తు

అవకపోతే 

నడువు


అదే కాకపోతే

ఒంటికాలితో 

గెంతు 


అదీ కాకపోతే

ఆగకు

నేలమీద

పాకు


ఏదో ఒకటి 

చెయ్యి 

పాకలేకపోతే

అహం మరిచి

ఎవరినో

అర్ధించి

ఎత్తుకెళ్ళ మని

ఒప్పించి

ముందుకు 

పో

ఆగకు 


చెమట 

వాసన కాదు

అది కష్టానికి పన్నీరు


కన్నీరు

ఉప్పుకాదు

కళ్ళను కడిగే అమృతం


ఓటమి 

అవమానం కాదు 

అది సృష్టి చెప్పిన పాఠం 


కన్నీరే 

అమృతమైతే 

చెమటే పెట్రోలైతే 

నీ నరాల విద్యుత్ కు

పెట్టాలి కదా 

కాషన్ బోర్డు 


ఆగకు

భయం వేస్తే

ఆగకు

అదే

సాహసం 


ఆగకు

బెంకు 

అనిపిస్తే

ఆగకు

అదే 

దూకుడు 


ఆగకు

కదిలే

సైకిల్ 

జీవితం

ఆగకు 

పడతావ్ 

ఆగితే

అందుకే 

ఆగకు


ముందుండి

నడిపించు

ముందుకు

లేదంటే

వెనకనుండి

తోసెయ్

ఆగకు 


నూనె

ధారగా

కారినట్టు

ఉండాలి

నీగురి


కనిపించే

గురిని

ఛేధిస్తే 

నైపుణ్యం


ఎవరికీ

కనిపించని

గురిని 

కొడితే 

ప్రజ్ఞ


ట్రై చెయ్యి

మేధస్సుతో

చెయ్యి

అవక పోతే

కాయ కష్టంతో

చెయ్యి

అదీ 

అవకపోతే 

వచ్చిన

ఇంకొకరితో జత కట్టు

ఎలా అయినా 

చేసేయ్ 


ఎదగాలి

నిశ్శబ్దంగా 

ఎదగాలి

మ్యూట్ బటన్

నొక్కిన నయాగరాలా


ఎదగాలి

ఆలోచనలో ఉదృతి

మనసులో శాంతి


ఎదగాలి

కళ్ళలో కసి

మనసులో దయ


ఎదగాలి

చేతిలో బలం 

భావంలో సున్నితం


ఎదగాలి

కాళ్ళలో పరుగు

గుండెలో నెమ్మది


గమ్యం కోసం

కాదు

గెలుపు కోసం

కాదు

సుఖం కోసం

కాదు

పేరు కోసం 

కాదు 

నీ కోసం 

కాదు 

అందరి కోసం


ఆగక పెరుగు

ఆపకు పరుగు

నిలవక ఎదుగు

ఓడినా గెలువు

ఏది ఏమైనా

ఆగకు

పోరా

తమసోమా... (Part 2)

 

తమసోమా...
(Part 2)


మరుసటి రోజు 

తెల్లారింది. తూర్పున లోయ వెనుక బంగాళా ఖాతం నుండి సూర్యుడు పొడిచాడు. 


రోజూ వేసే పీ.ఈ.టీ ఈల ఆ రోజు వినపడలేదు. హాస్టళ్లలో ఒక నిశ్శబ్దం. రోజూ పక్షుల గోలలా కావ్ కావు అనే పిల్లల అరుపులు లేవు. 

ఎల్లారావు ఎప్పటిలాగే ఉదయాన పాలు, గుడ్లు ఉడకబెట్టి ఉదయానే ఇచ్చే స్నాక్ తయారు చేశాడు. మెస్ బయట పెట్టి ఎదురు చూస్తున్నారూ ఎల్లా రావు ఇంకో స్టాఫ్. 


ఒక్క కుర్రాడు గానీ ఒక్క అమ్మాయి  కూడా రాలేదు  పాలకి, గుడ్లకి !  అన్ని గుడ్లు పాడవకూడదు , పిల్లలు తినాలి ఎల్లారావు తపన.  హాస్టల్ కిందకి వచ్చి అరుస్తున్నాడు. తమ్ముడూ వచ్చి తీసుకోమని. ఒకరిద్దరు వెళ్లారు.

వచ్చి రూంలోకయినా పట్టుక వెళ్ళండి అని అంటున్నాడు ఎల్లారావు. అయిష్టంగా ఇద్దరు బకెట్లు పట్టుకుని వెళ్ళారు.  ఆ ఉదయం ఎవ్వరో తప్ప తిండి ముట్టలేదు. 


కిట్టు లేచాడు, తన బెడ్డు ఎదురుగా లోయ. లీలగా, తుప్ప మొక్కల సందు లోంచి నూతి కనిపిస్తుంది. ఇది పీడ కలా నిజామా చెప్పలేని పరిస్థితి. పుస్తకం తీశాడు, అది వాడికి ఒక ఎస్కేప్, చుట్టూ ప్రపంచం నచ్చనప్పుడు తనకు పలాయన మార్గం పుస్తకాలు . 

అటు వెళ్తూ బమ్మర్ సింగ్ చూసాడు, చీ...నీ.... అని వెళ్ళిపోయాడు. కిట్టుకి కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. పుస్తకం మూసాడు. 


ట్రంకు పెట్టి చిన్న సిమెంటు బల్లమీద ఉండేది, కిటికీ పక్కనే. పక్కకు జరిపి తూర్పుకు చూస్తున్నాడు, కాళ్ళు కడుపులో పెట్టి ఒత్తిగిలి కూర్చున్నాడు. 

బమ్మర్ సింగ్ మళ్ళీ వచ్చాడు. దగ్గరకి. బెంగగా ఉందా అన్నాడు? కిట్టు మొహం తిప్పాడు. వాడు సారీ చెప్పాడు. ఇప్పుడు ఏమై ఉండి ఉంటాది అని ఊహాలోచనలు చేస్తున్నాడు. అసలు సినిమాకి పారిపోయి ఇప్పుడు వెనక్కి వస్తే అన్నయ్య పరిస్తితి ఉంటాది అని జోక్ వేశాడు. బాగా నవ్వు తెప్పించడానికి. ఆ జోకు ఇంకా చెప్తా అని వెళ్ళిపోయాడు. 


నమ్మ శక్యం లేని విషయం. ఎక్కడైనా తప్పు జరిగే ఉంటుంది అని దేవుళ్ళకి దండం పెట్టుకుంటూ ఉన్నాడు. 

కిరణ్ వచ్చాడు, కాసేపటికి చక్రి, శేషు, అందరూ చేరారు. కిరణ్ కి కొంచెం ఎక్కువ తెలిసినట్టు ఉంది. ముగ్గురన్నయలు నీటి కోసం వెళ్ళారని. ఒకరు మాత్రమే బయటికి కచ్చితంగా రాలేదు అని. 

మొగ్గ తొడిగిన ఆశ మీద అరికాలు పెట్టి తొక్కినట్టు అయ్యింది. 


దూరంగా కలవలం, ఒక మంచాన్ని ఎవరో ముందటి  చిన్న మైదానం లో పెడుతున్నారు. దీపం ఒకటి పెట్టారు. ఒకరు కొబ్బరి ఆకు వేస్తున్నారు మంచం మీద. 

ఎవరో ఒక ఫోటో తెచ్చారు. ఎదురుగా పెట్టారు. 


అన్నీ అక్కడ ఉన్న నాలుగు అమ్మాయిల హాస్టళ్లకు, 2 అబ్బాయిల హాస్టళ్లకు కనిపిస్తున్నాయి. 

తాతయ్య మాస్టార్, ఇంగ్లీష్ మాస్టర్, ఇంకొక స్టాఫ్ ఒక తివ్వాచితో కిందకి వెళ్తున్నారు. పిల్లల గుండెలు చెరకు రసం మరలోకి వెళ్తున్న చెరకు గడల్లా నలిగి పోతున్నాయి. 


ఉత్కంఠ లో ఆ అరగంట.

క్షణమొక యుగమయ్యింది ఆ గంటలో. 


ముగ్గురూ తివాచీ పట్టుకుని వస్తున్నారు. ఇందాక బమ్మర్ సింగ్ చెప్పినట్టు అవ్వలేదు అన్నమాట. 

బాల్యంలో ఒక అమాయకత్వం ఉండేది కిట్టు లో. అకాల మృత్యువు 

ని చూడని బాలుడిలో ఉండే ఒక సురక్షిత భావం అది. ఆ రోజు ఒక పసివాడి అమాయకత్వం పోయింది.


ఎప్పుడూ మాట్లాడటానికి పది మంది ఉండే నవోదయలో, 

ఎదుటివారిని ఇంటి గుమ్మంలోని మల్లె తీగ లాగ చూసేవాడు. దండిగా ఉండి, వద్దంటే పువ్వులిచ్చేది సంఘం అని. ఆ రోజు అనిపించింది ఎవ్వరూ శాశ్వతం కారు అని. 


ఎదుటి కిరణ్, శేషు, ఇంకెవరో అందరినీ పదే చూసాడు. అందరూ పోయే వారే ఏదో ఒక రోజు. 

మృత్యువు అంచులు అప్పటికి రెండు మూడు సార్లు చూశాడు కిట్టు. పొట్టలోని జన్మతః ఉన్న అవశేషం పేగులను తుఫానులా నుమ్మలు చుట్టినప్పుడల్లా కిట్టు ఇంచు మించు జీవన ముక్తి వరకూ వెళ్లేవాడు. భూ జల అగ్ని వాయు వ్యోమ భూతాలు వదిలే సమయాన కలిగే పరవశం చూసాడు తనలో. తన మృత్యువు అమృతంగా అనిపించినా ఎదుటి వారి చావు ఇంతగా బాధిస్తున్న మానవత్వం అనుబంధం  తనలో ఎలా వచ్చిందా అనే విషయం అర్థం కాలేదు. క్రితం అనుకున్నాడు మళ్ళీ కడుపు నొప్పి వస్తే ఈ మారు వెనక్కి రాకూడదు అని. మనసు మారింది తనకు సులభం తన వారికి అది కష్టం అని.. 


ఆలోచనల వర్షంలో ఉన్న కిట్టూ ఎదురుగా ఉన్న విపరీతం గ్రహించలేదు. కిటికీ నుండి స్పష్టంగా కనిపిస్తున్నాడు శ్రీధర్ అన్నయ్య, రెండు చేతులారా ఒడిసి పట్టి అక్కడ పెడుతున్నారు ఒక మాస్టారు. మాస్టారు కళ్ళు ప్రవహిస్తున్నాయి. 

ఆజానుబాహుడు, గరళం మింగిన శివునిలా ఉన్నాడు. అతని చుట్టూ ఒక వలయంలో పిల్లలు వరుసలో వచ్చి చూసి వెళ్తున్నారు. ఎవరో ముక్కులో దూది పెట్టారు వింతగా. పటం పక్కన దీపం లో నూనె వేస్తూనే ఉన్నారు. 


గంటలో ఒక కారు వచ్చింది. చీర నోటికి అడ్డం పెట్టుకొని ఒక అమ్మగారు. విగ్రహం లా చలనం లేని ఒక నాన్న. కారు చుట్టూ మనుషులు, వెనుక స్కూల్ వేన్ లో అన్నయ్య పార్దివదేహం. 

అప్పటివరకూ గడ్డ కట్టిన కాలం దూకింది ముందుకు. పసుపు పంచారు ఎవరో, హాస్టల్లో దండిగా నీరు పడుతుంది. సింటాక్స్ ట్యాంక్ నిండింది. పసుపుతో తల స్నానం చెయ్యాలని పుకారు, అందరూ చేశారు. 


ఎల్లారావు మళ్ళీ బిగ్గరగా పిలుస్తున్నాడు.


ఇప్పుడు కోపంగా చిరాకుగా ఉన్నాడు.

ఎవరో ఒకరు ముందు అడుగు వెయ్యాలి. 

ఎవ్వరికి చలనం రాలేదు మెస్ కి వెళ్లేందుకు.


హౌస్ మాస్టర్లు ఒక్కో రూముకి వచ్చి పిల్లల్ని ఒక్కరొక్కరుగా పేరుపేరునా పట్టుకుని మెస్సుకి తీసుకువెళ్తున్నారు. 

కిట్టు కూడా చేరాడు. తల స్నానం చేసి వచ్చిన అమ్మాయిల జుట్టు విరబోసుకుని ఉన్నారు. తుఫాను వెలిసిన తీరంలా వారి ముఖాలు..


అన్నం ముట్టుకునే ధైర్యం ఎవరికి లేదు.  

కిట్టు అన్నం తిని పూర్తిగా 24 గంటలు అయ్యింది. వార్త వచ్చిన సాయంత్రం ముందు మధ్యానం తిన్నాడు చివరిగా. 


ఎవరో మొదలు పెట్టారు ...


అహం వైశ్వానరో భూత్వా

ప్రాణినాం దేహమాశ్రితః ।

ప్రాణాపాన సమాయుక్తః

పచామ్యన్నం చతుర్విధమ్ ॥


అన్నిటిని జ్వలించే శక్తి ఒకటుందని రుజువు చూసారు అందరూ.

ఓం శాంతిః శాంతిః శాంతిః అన్నారు అందరూ. 


అనాదిగా పుట్టిన ఓంకారం,  వెనుక అనే శాంతి మంత్రం తమ మాయాజాలం చేశాయి. 


..........


మూడేళ్లు గడిచాయి. 

 

ఆ రోజు 1999 ఆగస్టు మాసం.


పది, పన్నెండు తరగతుల్లో ఉన్నత మార్కులు వచ్చిన వారిని పిలిచారు నవోదయకు.


కిట్టు వచ్చాడు స్నాతకోత్సవానికి. కిట్టు మెడలో బంగారు పతకం.


పతకం మీద శ్రీధర్ స్మారక పతకం అని రాసి ఉంది. 


అన్నయ్య జ్ఞాపకార్థం వారి కుటుంబం ఏర్పాటు చేసిన బహుమతి అది.


దశాబ్దాలు గడిచినా అందరికీ పదిహేనేళ్ల అన్నయ్యే శ్రీధర్

తమసోమా... (Part 1)

 తమసోమా...
(Part 1)


కిట్టూ కి ఆ రోజు అన్నిరోజుల లాగే సామాన్యంగానే తెల్లవారింది. హర్యానా వెళ్లిన పిల్లలు వెనక్కి వచ్చేశారు. ప్రతి ఏడాది 30 మంది పిల్లలను హర్యానా పంపించేవారు. అక్కడే తొమ్మిది పది చదువు. 

తొమ్మిదో తరగతి నుండి పదికి వచ్చిన క్లాసు పిల్లల అల్లరి తారా స్థాయికి చేరింది. కిట్టు బెడ్డు నుండి వారి అరుపులు వినిపించేవి రాత్రి వరకూ.  

ఆ ఏడాది మొదటి సారి, కేవలం ఒక్క సంవత్సరానికి కుదించారు మైగ్రేషన్. చాలా సంతోషంగా ఉంది వాతావరణం. వచ్చిన పిల్లల కథలు వారు చూసిన విశేషాలు వింటూ బాగా నవ్వుతూ గడుపుతున్నారు.  

ఆ నవోదయ నగర్ లో అన్నీ చక్కగా ఉండినా, వేసవిలో ఒక పెద్ద ఉపద్రవం వచ్చి పడేది. కరెంటు లేక స్కూళ్లో నీటి ఎద్దడి విపరీతంగా ఉండేది. బయటి నుండి నీరు తెచ్చుకునే అవకాశం లేదు వియ్యంపేట లా. బోరింగులకు ఆ రోజుల్లో అంత లోతు వేసే అవకాశం లేదు. 

కిట్టు నవోదయ వచ్చి మొదటి సారి ఆకలి అంటే ఏమిటో తెలుసుకున్నాడు. ఒక్క రాత్రి భోజనం మర్చిపోతే మరుసటి రోజు 9 వరకూ ఘన పదార్థం దొరికేది కాదు. బాగా పలచని పాలు తాగడం చాలా కష్టం అనిపించేది. 


కానీ ఆకలిని మించిన గండం నీటి ఎద్దడి. 


నాలిక పిడచ కట్టుకు పోయేది అర్ధ రాత్రుల్లో.... మెస్ వరకూ వెళ్ళాలి అంటే చీకటి భయం. ఇంకా పామూ పుట్రా తిరుగాడే రోజులవి. ఉదయం లేస్తే ముందుగా అవసరం నీరు, అప్పట్లో బయటకు వెళ్ళిపోయేవారు. ఇప్పుడా అవకాశం లేదు, చుట్టూ తుప్పలతో కారడవి. ముక్కు మూసుకుని ఎక్కడో ఒకటో రెండో మగ్గుల నీటిని సంపాదించి పని ముగించే వారు. 

దయనీయమయిన రోజులవి. స్నానాదుల కోసం నీరు కావాలి అంటే పల్లం లో ఒక వంద అడుగుల కిందకు ఒక వ్యవసాయ బావి ఉండేది. అక్కడ పెద్ద కుర్రాళ్ళు తోడు తుంటే బకెట్లలో ఒక పావు మాత్రం నింపి మానవ హారం వేసి నీటిని పయి వరకూ తెచ్చు కానీ వారు. 

వియ్యంపేట లో బోరింగు దగ్గర పడిన కష్టానికి ఇది వంద రెట్లు అన్నమాట. 


ఇక్కడితో అయితే కిట్టు బాగానే అందరితో పాటు చలామణి అయ్యేవాడేమో...

అసలు పెద్ద ఆపద , కిట్టూ కి వేరే ఉంది. కిట్టు పెద్దగా వాచిన టాన్సిల తో ఇబ్బంది పడేవాడు. పిల్లలో టాన్సిల్ ఉంటే రాత్రి నిద్రలో ఒంటేలు అయిపోతుంది. కిట్టూ కి వారానికి రెండు మూడు సార్లు జరిగేది.

అమ్మ రబ్బరు షీట్ పెట్టేది. అదీ షీట్ బెడ్డు కింద గోప్యంగా పెట్టుకునే వాడు కిట్టు. చూసి నవ్వే వారు నవ్వే వారు. స్కూళ్లో మంచిగా నీరు ఉన్నపుడు అది చాలా ఇబ్బంది అనిపించినా, మధ్యలో లేచి మొత్తం బెడ్డు మార్చి దుప్పటి తడిపి. కొత్తది ఉంటే వేసి పడుకునేవాడు. మల్లా ఆరు కల్లా మార్నింగ్ రన్నింగ్ ఉండేది. 

మరి ఈ కరువులో ఉపద్రవం అంటారే అది కిట్టు పరిస్థితి. వియ్యంపేటలో ఉన్న బోరింగ్ వలన చాలా గుట్టుగా నడిపే ఈ రాత్రి పనికి ఇప్పుడు అసలు అవకాశం లేదు. వీటి మీద అప్పుడప్పుడు వచ్చే పెయిన్ ఎటాక్. 

అలాంటి నీటి ఎద్దడి రోజుల్లో ప్రాణం బిక్కు బిక్కు మనేది. తను  దొరుకుతుందిలే అని అనుకునే తిండి, నీరు, గాలి ఇలాంటివి కూడా ఎద్దడి వస్తుంది అని తెలిసొచ్చింది.

 

ఆ బావి ఉండేది లోయలో, లోయను అనుకుని ఉన్న పీఠభూమి మీద ఉండేది మెస్సు. మెస్సు పక్కనే ఒక్కటే హాస్టల్ ఉండేది ఆరోజుల్లో. ఆ హాస్టల్లో లోయ కనిపించేలా కిట్టు బెడ్. అద్భుతమయిన లోయ అందాలు, రాత్రి వేసే గాలుల ఆహ్లాదం దొరికేవి వాడికి.  


వేసవి కొంత ఉపశమించింది. కరెంట్ పూర్తిగా రావడం మొదలయ్యింది. కష్టాలు తీరాయి రాయ్ అని కొంత హుషారు పిల్లల్లో.. 

 అలాంటి ఒక సాయంత్రం వచ్చిన వార్త. 


 మోట బావిలో..  అన్నయ్య.. 

శ్రీధర్ అన్నయ్య మునిగి పోయాడు.


కిట్టూ కి గుండె జారింది. పడుతూ లేస్తూ పరిగెత్తాడు. ఎదురుగా తన సొంతూరి శ్రీధర్.  కొంత ఉపశమనం. మరి ఆ శ్రీధర్ ఎవరు ? ఇద్దరు శ్రీధర్లు ఉన్నారు టెన్త్ లో. 


ఒక్క క్షణం వచ్చిన ఉపశమనం వెంఠనే మాయం అయ్యింది.

హర్యానా వెళ్లి వచ్చిన శ్రీధర్.

శ్రీధర్ ఆ వేసవి కే హర్యానా నుండి వెనక్కి వచ్చాడు. అజాను బాహుడు. భగీరథ ప్రయత్నం కథలో శివుడి బొమ్మలాంటి మొహం, శివుని లాంటి పొడవాటి గళం.

 ఎదురుగా తనను ఆదరించే సీనియర్లు, కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. 


ఇంకా దొరకవచ్చు అని కొందరు. అగ్నిమాపక దళం రావడం , గజ ఈత గాళ్ళు, చిన్న నిక్కర్లు వేసుకుని వెళ్లడం చూస్తున్నారు కిటికీ లోంచి. అంతా రెండో వింగ్ లో చేరారు. అందరికీ కర్ఫ్యూ. ఒకరిద్దరు పెద్ద కుర్రాళ్ళు అంటే పన్నెండు లో ఉన్నవారు మాత్రం అజమాయిషీ చేస్తున్నారు.

ఈత గాళ్ళు వెతుకుతూనే ఉన్నారు. కాలం తన పని చేసుకు పోతుంది. ఆగని ఆఘమేఘాలమీద సూర్యుడు కొండ వెనక్కు పోతున్నాడు. 


కాసేపటికి పెద్ద పెద్ద పెట్రో మాక్స్ దీపాలు తీసుకు పోతున్నారు. 

మొదట కంగారు.

తరువాత ఆతృత.

ఆత్రుత నెమ్మదిగా

ఆందోళనగా మారింది.

ఆందోళన

ఉత్కంఠ అయింది.

ఉత్కంఠ చివరికి

విషాదంగా కూర్చుంది

ఆ సాయంత్రం మీద. 


ఒక ఉజ్వల కాంతి ఆరిపోయింది. 


ఆ రాత్రి కారిన కన్నీటిలో అమాయకమైన బాల్యం తడిసి ముద్దయ్యింది