నువ్వు వస్తే

నువ్వు ఎర్రటి మందారం గానో, తెల్లటి పావురం గానో, నల్లటి మేఘం గానో వస్తే
తుమ్మెదనై, చిరు గాలినై, పిల్ల కాలువనై నీకోసం ఉంటాను

నువ్వు కరువులో చినుకులా, అమావాశ్యలో వెన్నెలలా, ఎడారిలో వర్షంలా రాకపోతే మాత్రం
కన్నీటినై , చీకటినై, వేడి నిట్టూర్పునై, వెనక్కిరాని దిక్కులలో దాగి పోతాను

యుద్ధం


అప్పుడెప్పుడో పడిన పిడుగు ఇంకా గుండెల్లో ప్రతిద్వనిస్తుంది
విషాదం రెక్కలు విప్పుకొని ఉషోదయాన్ని అల్లంత దూరంలో నిలబెట్టింది
నిశ్శబ్దంతో, నా గుండె చప్పుడు, మొన్నటి నీ నవ్వు, కాసేపు క్రితం గర్జంచిన మేఘం మాత్రం యుద్ధం చేస్తున్నాయి!

పాదాలు

అందాల నయగారాలు విషాదాల జలపాతాలు
కదిలే మేఘాల అంచుల్లో నీ కనురెప్పల కాంతులు
రాలిపడే చినుకుల్లో నీ కంటి కిరణాలు

ఎగసిపడే కెరటాల్లో నిన్నుతాకి నేలకొరిగిన గులాబీలు
పాదాలకు కూడా దేముడు కళ్ళిచ్చాడేమో
మెత్తగా వర్షిస్తున్నాయి కన్నీళ్ళని

కాలం చెప్తుంది

నిజానికి చెప్పాల్సింది ఎంతో ఉంటుంది.
మాటలు సరే,
కన్నీళ్ళూ చెప్పవు.
కాలం చెప్తుంది కానీ
అప్పటికి అమృతం విషమవుతుంది.

(ఎన్. గోపి గారి వంతెన నుంచి)