గుర్తున్నాయా మిత్రమా?


గుర్తున్నాయా మిత్రమా?
నోటు బుక్కులో మనం రాసిన తీపి కబుర్లు
గోడలపై ఇద్దరి పేర్లు

నా జ్వరంలో జలజల రాలిన నీ కన్నీళ్ళు
జీడిచెట్లకింద నువ్వు దాచి ఇచ్చిన మామిడి పళ్ళు
ఆగి ఆగి పాఠం మద్యలో పంచుకున్న మూగ సైగలు
గుర్తున్నాయా మిత్రమా?

చెట్టుచాటు నీడల్లో

మధురమయిన మౌనంలో
రేపటి గానం కోసం చూస్తుంటే

వెన్నెల రాత్రుల్లో, చెట్టు చాటు నీడల్లో,
ఎగసి పడే సెలయేరు శబ్దంలో వినిపిస్తావు
కనిపిస్తావు, మరిపిస్తావు

సెర్చ్

పోయిన హృదయాన్ని
వెన్నెల్లో వెతికాను, కాని
చీకట్లోనే దొరికింది

వెన్నెలంతా


వెన్నెలంతా సన్నజాజులై వాకిట్లో కురుస్తుంది
నీ కురులతో ఆడుకున్న పిల్ల గాలి అప్పుడప్పడు సన్నజాజులను ఎగరవేస్తుంది

ఒక్కతే ఆకాశంలో ఉన్న మేఘం కూడా ఇటువైపే చూస్తుంది
దూరాన నీలినీడగా నిలుచున్న కొండలు వెన్నెలమ్మ ఇక్కడకు కూడా వస్తుంది కదా అని ఎదురుచూస్తున్నాయి

సన్నజాజుల వాన నీటినంతా పన్నీరుగా మారుస్తుంది

ఈ ఆకాశం, నీలి కొండలు, సన్నజాజులు, నువ్వు-నేను!