కాలంతో

కాలంతో
అనుభవాలు జీవనపాఠాలవుతాయి
ఆ జీవనపాఠాలు స్మృతులయి
జీవితపు పుటలలో అరఠావులవుతాయి

మళ్ళీ ఒకరోజు
జ్ఞాపకాల దొంతరలలోనుండి క్రిందకు పడుతుంది ఈపేజీ
అప్పుడు కరిగిన మధురస్మృతులు
గతాన్ని చూస్తున్న కనులలో జారిపడతాయి

ఇవి చాలు

చిరుగాలిలో తెరచాప పడవ, వేగు చుక్క
ఇవి చాలు ప్రయాణానికి

అప్పుడే మొలకెత్తిన పచ్చగడ్డి, గుండెల వరకు బౌన్సయ్యే బాలు
ఇవి చాలు ఆటలకు

ఆటవెలది, తేటగీతి, రఘువంశ సుధ
ఇవి చాలు పాటలకు

ఒక వాడేసిన సబ్బుబిల్ల వ్రేపరు, విరిగిన పెన్సిల్ ముక్క
ఇవి చాలు కవితలకు

(నావి నాలుగు సరదాలు, Sailing, Tennis, Music, Poetry ఆ నాలుగిటిని కలిపి ఇలా)

బందీ

సూర్యుని విడిచే కాంతి కిరణాలు
నీ కన్నుల్లో బందీలు
నీ కన్నుల్లో నా రూపం బందీ
కలసిన మన కన్నుల్లో

మన ప్రతిబింబాలు బందీ
ఆ ప్రతిబింబాలలో
మన కలలు బందీ
మన ఆ కలలో ఈ కాలం బందీ

వీపు విమానం



కళ్ళేమో ద్రాక్షపళ్ళు
బుగ్గలు జాంపళ్ళు
చాచి కొడితే మాత్రం
చెయ్యి అట్లకాడే !

మేఘాలు




మేఘాలు కమ్మితే చంద్రుడు లేదనుకున్నావా ?
బండరాయివై నీ చుట్టుతిరుగుతున్నాడు.
మబ్బులు కమ్మితే వెన్నెలే లేదనుకున్నావా ? 
మేఘాల అంచుల్లో పసిడి రంగులు రాసి  
అవి కరగిపోతే ,సన్నజాజులై కురిసి
మనస్సులను, సరస్సులను, మైమరిపించదా ?

తరచి తరచి


తరచి తరచి విన్నాను
మళ్ళీ వినిపిస్తుందేమోనని
మంచుటెడారిలో
ఆమని గానం

ఆశాలోకం



నా మనసు అద్దంలోనికి
తొంగిచూస్తుంటాను
నిర్మల ప్రశాంత ఆశాలోకం
కనిపిస్తుందేమోనని

ఉగాది


మా ఇల్లు చెరకు తోట
మా ఊరు చంద్రలోకం
ఊరి మద్యలో మర్రిచెట్టు
ఊరి చివరనే వేపతోపు
వరండాలోనే మామిడి పూత
మరి రోజూ ఉగాదే !