నాన్నా

ఆ ఉదయం
పొగమంచు వేసి
నిన్ను మాయం చేసింది
బ్రహ్మనింపిన ఆదినాదం
భానుడి వెలుగుకిరణం
ఆ ఉదయం
పొగమంచు వేసి
దోచివేసింది

తెలవారింది
నిన్నటి వెలుగుపులుగు
ఈనాడు బల్లెంలా
గుండెల్లో దిగింది
వెలుగులో నిశీధి
వెచ్చదనంలో అతిశీతల
స్నిగ్ధత

నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో
మారుమోగిన శృతిలయలు
ఆగితే నిశ్శబ్దపు
మౌనం చెవులకు
చిల్లులు పెడుతుంది

ఆ ఉదయం
పొగమంచు వేసి
నిన్ను మాయం చేసింది
ఆ మంచుపొర కరిగి
ఇప్పుడిలా కారుతుంది
కన్నీరుగా

No comments: