లజ్జ

నల్దిక్కుల లోకంలో
దిక్కులేని
పుట్టినరోజు
పుట్టినిల్లు
తెలియని
బాటసారి

ఆవు దూడయిన
పెంకుటింట నిదరిస్తే
తలపై నీలితెరతోనే
సేద తీరును
బాటసారి

ఇనుప గజ్జెల తల్లి
దీవిస్తే కటిక
పేదరికమున
ఇనుప సామాను
వేరెను బాటసారి

రంగుల అద్దాల
రహదారిలో
తన రూపమే చూసెను
ఏకాంతపు బాటసారి

పొగ మంచు
ఊరిని కమ్మితే
మంచు తెరనే
దుప్పటిగా కప్పెను
బాటసారి

జన్మదినం తెలియని
ఇతనికి జండా పండుగే
రంగుల రోజు
జన్మ నక్షత్రం తెలియని
ఇతనికి ధ్రువ నక్షత్రం
జన్మ నక్షత్రం

ఇతను అంతర్దాన
మహిమా పాత్రుడు
ఇతని గురించే
రోజు వాదించే
నాయకుడికి
బీచ్ రోడ్డులో
ఇతను మాత్రం
కనపడడు

ఇతను దేశం కోసం
చేసే పస్తులు వ్రతాల
ఫలితమేమో మనం
చంద్రుణ్ణి చేరిందే

ఇతని ఇల్లు
నీలితెర
ఇతని బంధువు
ఊరి కుక్క

ఇతను గాంధేయవాధి
ఇతని గుమ్మం
కాకులు వాలే
గాంధీ బొమ్మ

బొమ్మకిందే
గాంధీ వాక్కుల
సాక్షిగా
ఇతని ఆకలి
మనకు సిగ్గు

No comments: