1995
నవోదయ వైకుంఠపురం, పాత ప్రదేశం నుండి నవోదయ నగర్ కు మారిన మొదటి రోజు.
మహా మత్స్యావతారం ఎత్తిన విష్ణు మూర్తి, కుండలోనించి కొలనులోకి చేరిన విధంగా ఉంది నవోదయ కొత్త పరిసరాల్లోకి మారడం. ఒకొక్క బ్యాచ్ పాత క్యాంపస్ లో చేరడంతో 7 బాచులతో కిక్కిరిసి పోయింది పాత స్కూల్.
శృంగవరపు కోట లో బస్సు మలుపు తిరిగి బొడ్డవర వెళ్ళే మార్గం అందుకునే సరికి, సమస్త ఆలోచనలు మారి పోతాయి ఎవరికయినా.
ఆహ్లాదమయిన గాలి, ఏడాదికి మూడు పంటలు పండే పచ్చని పంట పొలాలు, కళ్లాలు, చెట్టు చేమ, పశు పక్షాదులతో అద్భుతంగా దృశ్యం.
ఎంత ఇంటి మీది బెంగతో వచ్చిన పిల్లాడికయినా కొంత ఊరట వస్తుంది ఆ దారిలో.
బొడ్డవర దగ్గర మలుపు తిరిగాక ఇంకో దృశ్యం. రెండువైపులా ఎర్రటి తురాయి చెట్లు, కడుపుకు తెల్లటి గవర్నమెంట్ పట్టీ తో కనిపిస్తాయి.
నవోదయకు ఎదురుగా ఒక కొండ. ఆ కొండకున్న భావాలు ఎన్నో, వర్షాకాలం లో పచ్చటి తివాచీ కప్పినట్టు దట్టంగా చెట్లు. వసంత కాలం అడవి మల్లెల వాసన ఎలా ఉండేది అంటే, ఏ పుణ్య క్షేత్రం బయట పూల బజారులో ఉన్నట్టు వాసన. రాత్రుల్లో వెన్నెల కాస్తున్నప్పుడు అడవి మల్లెల వాసనకి కళ్ళంటా నిద్రపట్టేసేది.
వేసవి వస్తే ముందు జీడి మామిడి పండేది ఆ వాసనకి పిల్లలు ఏమాత్రం తట్టుకోలేక పోయేవారు. గ్రీకువీరుడు రూపధరుడి లా ఆ సుగంధాన్ని తట్టుకునే శక్తి గల గట్టివాడు ఆ స్కూళ్లో పుట్టలేదు.
గోడ దూకి జీడి పళ్ళు తెచ్చుకుని తినే వారు. బకెట్ నిండా జీడి పళ్ళు తిని గొంతు పాడైనా వాటిని తిండం మానే ప్రసక్తి లేదు అన్నమాట.
గంగాధర్ హాస్టల్లో పాకలో ఉండే కుర్రాళ్ళకి, ఇంద్ర భవనం లా అనిపించేవి కొత్త భవనాలు. రూర్కీ విశ్వవిద్యాలయం సివిల్ ఇంజనీరింగ్ కాలేజీలో వేసిన డిజైన్. అన్నీ ఆలోచించి వేసిన మాస్టర్ ప్లాన్. 6 అబ్బాయిల డార్మిటరీలు, 2 అమ్మాయిల డార్మిటరీలు, 20 స్టాఫ్ క్వార్టర్లు.
తాచుపాములాంటి కొత్త రోడ్లు. నియాన్ దీపాలు. ఎంటర్ అయిన కుడి వైపు అమ్మాయిల హాస్టల్. అనుకునే ప్రిన్సిపాల్ ఇల్లు. హాస్టల్లో ఒక్కో అంతస్తులో, ఒక్కో వైపు ఏడు కిటికీలు. పద్నాలుగు నాలుగుల 56 పిల్లలకి ఒక అంతస్తు. ఒక్కో అబ్బాయిల క్లాస్ ఒక అంతస్తుకు సరిపోయేది. 11-12 లో సైన్స్ మాత్రం ఉండడం వలన పిల్లలు తక్కువ కాబట్టి 6 డార్మిటరీల్లో సరిపోయారు పిల్లలు. అలా స్కూల్లో ప్రతి విద్యార్థికి ఒక స్థానం దొరికింది అన్నమాట.
విశాలమయిన రూములు, ప్రతి డార్మిటరీకి ఒక హౌస్ మాస్టారి గది. ఆ గదిలో యంగ్ ఫెలోస్ అయిన కుర్ర మాస్టర్లు ఉండే వారు, పిల్లల తోనే.
కిట్టు కొత్త స్కూల్లో జాయిన్ అయ్యే సరికి, ఇంకా మంచాలు రెడీ కాలేదు. కిందనే పడక కోసం పరుపులు వేశారు. ఇద్దరిద్దరికీ ఒక గది లాంటి వసతి, గదులకు తలుపులు లేకుండా కేవల పిట్ట గోడలతో వేరు చేసి ఉండేవి.
పిల్లలకి విశాలమైన రూములు కొత్తగా అనిపించాయి. పాత క్యాంపస్ లో ఎక్కడైతే 20 మంది ఉండేవారో అక్కడ ఇప్పుడు మహా అయితే నలుగురు ఉన్నారు.
కిటికీ తీస్తే ఒక వైపు తూర్పు కనుమల అంచున పీఠభూమి క్రింద సేంద్రీయమనైన లోయ. ఇంకో వైపు తూర్పు కనుమల అంచున ఉన్న కొండ ఉండేవి.
దూరాన చిన్న నీలి పొరలా బంగళాఖాతం. వర్షం వచ్చే సమయానికి దూరంగా ఉన్న మేఘాలు, నీటి దుప్పటి కప్పినట్టు నల్లటి నీలమేఘ అశ్వాల్లా వచ్చిపడేవి.
వైకుంఠపురంలో బాగా దగ్గర దగ్గరగా ఉండే లివింగ్ క్వార్టర్లు ఇప్పుడు దూరం అయ్యి కొంత ఆహ్లాదంగా ఉండేది పిల్లలకు. సమయానికి నీళ్లు కొలాయిలో రావటం పెద్ద వింతే.
చీకట్లో బకెట్ పట్టుకుని పాత స్కూల్ వెనుకాల, సూయేజ్ కాలువ దాటి, ఆరుబయట ప్రకృతి పిలుపు తీర్చుకునే పిల్లలకి ఈ బాత్రూములు ఒక పెద్ద విషయం.
పాత క్యాంపస్ లో
క్లాస్ రూములు ఆశ్రమాలుగా కనిపిస్తే కొత్త చోట ఇంజనీరింగ్ కాలేజీయా అనే అనిపించేవి.
క్లాసులతో పాటూ, నాలుగు ప్రయోగశాలలు. చిన్న క్లాసులకు ఒకటి, భౌతిక శాస్త్రం, కెమిస్ట్రీ, బయాలజీ కి వేరే వేరే గా లేబులు.
(కెమిస్ట్రీ ల్యాబ్ కు తాళం ఒకరోజు కిట్టు గాడికి ఇంకా దోస్తుకు ఇచ్చి సర్దమని చెప్పి వెళ్ళిపోయారు తాతయ్య మాస్టారు, అన్నిటికీ లేబుళ్లు వ్రాసే పని అప్ప చెప్పి. ఇది వీరే రోజు చెప్పే కథ).
కొత్త క్యాంపస్ లో ఇంకా కొంత కన్స్ట్రక్షన్ పని ఉంది పోయింది. క్యాంటాక్టర్ చిన్న పూరి గుడిసె లాంటి విసరబాటు గా ఉన్న చోట నిలబడి పని చేయించే వాడు. అలా పెద్దయ్యాక పని చేయించాలి అని, ఓపెన్ టాప్ జీపులో తిరగాలి అని, ఎంతోమంది పిల్లల ఆరాటం.
కిట్టు తెల్లారగానే పీ. టీ తరువాత అడ్డ తోవన, అమ్మాయిల డార్మిటరీ ముందుగా నడుచుకుంటూ వెళ్తాడు కొన్నాళ్ళు. అప్పుడు మొదటిసారి తెలిసింది కిట్టుకి సౌకర్యాలు పెరిగినకొద్దీ, దూరాలు ఎలా పెరుగుతాయి అని. పాత క్యాంపస్ లో అమ్మాయిలు అబ్బాయిలు ఇంచు మించి కలిసే ఉండే వారు. 6వ తరగతి వాళ్ళు ఒకే బిల్డింగ్లో, ఒక తలుపు మాత్రం ఉండేది. ఇక్కడ కొత్త రూల్ పెట్టారు, అబ్బాయిలు అమ్మాయిల డార్మిటరీ ముందు గుండా కాకుండా వెనక నుండి వెళ్ళమని. మగ పిల్లలు వీస్తూ పోయారు, ఇన్నాళ్ళు కలిసి ఉండే రోజుల్లో వాళ్ళకి రాని తప్పుడు ఆలోచనలు ఇప్పుడు అకస్మాత్తు గా ఎలా వస్తాయో ఎవ్వరికి అర్థం కాలేదు. ఇదో పెద్ద విశేషం ఆ రోజుల్లో.
అబ్బాయిలకు వేరే మార్గం, అమ్మాయిలకు వేరే మార్గం, అందాక కలిసి తినొచ్చు అంట. కొన్నాళ్ళకి వారికి వేరే మెస్ కూడా అంట. ఇంకా చూస్తుంటే గోడలు కూడా కడతారేమో అని నవ్వుకున్నారు.
మెస్సు కూడా దూరం అయ్యింది, ఎల్లారావు వంటల వాసన స్కూల్ అంతా పాకేది పాత స్కూల్ లో. దారిన పోయే వారిని కొత్త చోట వంట ఏమిటి అని అడగటం కొత్త విషయం.
కొత్తగా స్టాఫ్ కూడా చాలా మంది వచ్చారు. మ్యాథ్స్ కోసం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుండి చాకుల్లాంటి ఇద్దరు టీచర్లు. ఒకరు అమ్మాయి, కిట్టు కంటే 10-12 ఏళ్లు ఎక్కువ ఉంటాయి, టాపర్ అంట. ఇంకొకడు అబ్బాయి శివాజీ రావ్, పొడవుగా సన్నంగా చలాకీగా ఉండేవారు. ఇంకా ఇంగ్లీష్ కి ఒక టీచర్, మ్యూజిక్ కి ప్రత్యేకంగా ఒక గొప్ప శాస్త్రీయ సంగీత కుటుంబం లోంచి వచ్చిన మాస్టారు.
తెలుగువారి పెళ్లిలో విందుకు వేసిన నిండు విస్తరిలా, పనగకు వచ్చిన కోనసీమ కొబ్బరి తోటలా, అన్ని హంగులతో వెలిగిపోతుంది నవోదయ నగర్...
మొదటి రోజు, ఇంకా పిల్లలు వస్తుండగానే, ప్రిన్సిపాల్ సార్ హనుమాన్లు ఆర్ట్ మాస్టారు కలిసి రెండు పొడవాటి కర్రల ఆసరాతో, పెద్ద బోర్డ్ పెట్టారు...
అందరికీ కనిపించేలా గుమ్మం మీదే రాసి పెట్టారు. ఆకుపచ్చ బోర్డ్ మీద గుమ్మడి కాయలంత, తెల్లటి అక్షరాలతో, "ఎంటర్ టు లెర్న్, లీవ్ టు సర్వ్" , అభ్యాసానికి లోపలికి రావాలి, సేవ చేయడానికి బయటికి వెళ్ళాలి.
ఏడేళ్లు ఈ కొత్త క్యాంపస్ కోసం ఎదురు చూసిన ఆ మొదటి 1988 బ్యాచ్ విద్యార్థుల పేర్లతో పుస్తకాలు, వారి ట్రోఫీలు ఆప్యాయంగా ఛాంబర్ బయటే పెట్టారు. చెక్క బోర్డు మీద పెద్ద అక్షరాలతో 12 వ తరగతి ర్యాంకుల్లో జాగరాపు జవహర్ అని రాయిస్తున్నారు. ఇంకా తెలుపు రంగు ఆరలేదు.
హనుమాన్లు స్కూల్ లో గోడలమీద రాసారు ఇంగ్లీషులో, "జీవితంలో మొదటి సారి చూసినట్టు లేక చివరిసారి చూస్తున్నట్టు చూడాలి అన్నిటిని" అని.
రాబోయే దశాబ్దాలలో నవోదయ నగర్ లో ఎందరో కిట్టు గాళ్ళు, రుక్మినులు, అనితలు, వనితలు, భామలు, కిరణ్లు, శేషులు, చక్రిలు వస్తారు.
వందల్లో రాములు, శ్రీనులు, జ్యోతులు, అవినాష్లు, అరవిందలు, జగదీశ్ లు, ఆశలు, ఆశాజ్యోతులు, మాధవీలు, రహీంలు, సాయిలు వస్తారు. అందరూ పెద్దయి వెళ్ళిపోతారు ఒక్క మోట బావిలో మరణించిన అన్నయ్య తప్ప. ఆ రోజు అందరిలాగే వచ్చాడు శ్రీధర్, కొన్నాళ్ళకి అక్కడే కాలం వేసే గేలం తెలియక. తన కాబోయే శ్రీవారికి అన్నం వడ్డించే 11 ఏళ్ల అమ్మాయి కి ఇంకా తెలీదు తన గుండె లో ఒక భాగం ఎదుటే ఉంది అని. దేశం కోసం కంచుకోటలా ధైర్యం తనకుందని తెలీదు ఇంకొకరికి. ఎందుకంటే ఇది బాల్యానికి ఒక పేద దేశం ఆశలతో కట్టిన గుడి.
వారికి ఆనందం, సుఖం, దుఃఖం, ఆకలి, తృప్తి, స్నేహితులతో ప్రేమలు, గిల్లికజ్జాలు, వియోగాలు, వీడ్కోలులు, జరిగేవి ఇక్కడే. దీపావళి నుండి, వాలెంటైన్స్ డే వరకు, కొంతమందికి యానివర్సరీలతో పాటు జరిగేది ఇక్కడ. స్నేహితులని కలిసిన వాళ్లు కొంతమంది, కుటుంబ సభ్యులని కలిసిన వారు కొంతమంది.
ఇక్కడే పుడతాయి తీపి గుర్తులు, చేదు పాఠాలు, చెంప దెబ్బలు. చెమ్మగిల్లిన కళ్ళు, కేరింతల నవ్వులు. లెక్కలేని ఉదయాలు, లెక్క కట్టలేని అనుభవాలు.
ఇది భావి వ్యక్తల, బోధకుల, కళాకారుల, సిపాయిల, సేవకుల, వైద్యుల, ఆసాముల కర్మ భూమి.
వారందరికీ పుణ్య భూమి, జన్మ భూమి.
నవోదయ వైకుంఠపురం ఇప్పుడు పాలెం మారినా, ఆ విలువలు, ఆ అనురాగాలు అలానే వచ్చేశాయి పిల్లల ట్రంకు పెట్లలో.....
మధ్యాహ్నం గంట మోగింది కిట్టు 521 ప్లేట్ పట్టుకొని మెస్ కు చేరాడు.
"అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ।
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధమ్"
అగ్నిలా అన్ని దేహాల్లో ఉండి, జీర్ణం చేస్తున్నాను అంటున్నారు పిల్లలు, ఆ విష్ణు మూర్తి అంశలు.
ఆ రోజు ఆ మహా నవోదయ చరిత్ర లో ఒక పేజీ తిరిగింది. అక్కడ ఒక నెమలి ఈక పెడదాము అందాక. మధ్య మధ్యలో కథలు అక్కడికి పోక మానవు.
ఇంక కాలంలా కథ ముందుకు సాగాలి.
వెల్కమ్ టు నవోదయనగర్.
1995 జూన్.


.jpg)
.jpg)
No comments:
Post a Comment