సానియా జావేద్
అది తొమ్మిదో తరగతి విషయం. సెలవుల్లో అమ్మా నాన్నా డబ్బులు లేకున్నా జనతా టికెట్టికి తిరపతి తీసుకెళ్లి గుండు కొట్టించేశారు కిట్టూకి. ఎండాకాలంలో గుండు తో బాగా ఇబ్బంది పడ్డాడు కిట్టు. ఈ రెండు నెలల్లో ఎత్తు కూడా బాగా పెరిగాడు.
స్కూల్ మొదలయిన మొదటి రోజు, కొత్త క్లాస్ రూంలో టీచర్ బెంచీ మీద వంగి హోంవర్క్ చేస్తుండగా రుక్మిణి వచ్చి అన్నాది, అబ్బాయ్ "చాలా పెరిగిపోయావ్" అని. చాలా వత్తుగా అంటూ. వెనకాలే భామ, "మొహం చూడకుండానే" అని వెటకారం. అన్న మాట మామూలే అయినా మాటలో ఏదో చిలిపితనం ఒక అల్లరి. ఆయిద్దరి పక్కకి వచ్చి తన ఎత్తు చూపించాడు. నీ కొత్త చెప్పులు వలన లే నువ్వింకా అంతే అంటూ ఆట పట్టించింది రుక్మిణి. వాళ్ళని దాటి ఎదిగిన కిట్టు కొంచెం గర్వంగా ఫీల్ అయ్యాడు.
కొన్ని రోజుల్లో, సాయంత్రం ఆటల్లో ఆడుతూ దాహానికి పెద్ద స్కూల్ బిల్డింగ్ వద్దకు వస్తున్నాడు కిట్టు. అమ్మాయిలను రన్నింగ్ చేయిస్తున్నారు. కొత్తగా అమ్మాయిలు కనిపిస్తున్నారు — హర్యానా వాళ్ళు రావడం వారితో రన్నింగ్ చేయించటం అప్పటికే మొదలయ్యాయి అని అర్థం ఔతుంది.
ఒక కొత్త పిల్ల మాట మాటికి ఆగిపోతుంది. మేడం వచ్చి తెలుగు లో గసిరి , "జాయిన్ ద క్లాస్" అని గర్జించి వెళ్ళింది. అలా రెండు సార్లు అప్పటికే అయ్యింది. ఆగిన ప్రతిసారి తను స్కర్ట్ పైకి లాగి మళ్ళీ వెళ్తుంది. లూజ్ గా ఉన్నట్టు, స్కూల్ పంచిన బట్టలు సైజ్ తప్పు అన్నట్టు ఉంది. తను కూడా వాటర్ కోసం వస్తుంది స్కూల్ వైపు.
కిట్టు నీటి గొట్టం (గొట్టం అంటారు కానీ అది ఒక డ్రం అన్న మాట) దగ్గర మంచి నీళ్లు తాగుతున్నాడు. క్షారం గా ఉండేవి కిల్తంపాలెం నీరు. తను తాగి తనకి అవకాశం ఇస్తున్నాడు. ఆ పిల్ల వెళ్ళాక మొహం కడుక్కుందాం అని ఆగాడు. కొంత కుతూహలం కూడాను ఎలాంటి అమ్మాయి అని.
అమ్మాయి వచ్చింది. కళ్ళు ఎర్రగా ఉన్నాయి, ఏడుస్తుంది గాబోలు కాటిక చెదిరి ఎర్రటి బుగ్గలకు అంటుకుంది. ఈ మేఘం లేని సాయంత్రం, ఒక్క నల్లటి మేఘం పడమటిన కనిపించినట్టు, చెదిరి బుగ్గలకు అంటుకున్న కాటుక ఆ అమ్మాయి బుగ్గల రంగును ఇంకా పెంచేస్తుంది.
కిట్టు గ్లాస్ చూపించాడు, తను తాగుతుంది. ఉంగరాల జుట్టు చెదిరి కళ్ళలోకి పడుతుంది. గుటక వేస్తే గొంతులో అలల లాగా కనిపిస్తుంది. రవి వర్మ వేసిన తెల్లటి చీరలో దేవతలా ఉంది ఆమె కంఠం. అందాల రాశి, అలివేణి, కోమలి అని అర్థం ఔతుంది.
నీళ్ళు ఎత్తిపోసి తాగుతూనే, తనకి కళ్ళల్లో కన్నీళ్ళు ఉబికి ఉబికి వస్తూనే ఉన్నాయి. పాపం అని, జాలితో కూడిన
అనుభూతి వేసింది కిట్టూ కి.
తను కిందటేడాది డిల్లీ వెళ్లిన అనుభవం గుర్తుకు వచ్చింది. ఈ ఊరికి ఆవూరు ఎంత కష్టమో, ఆ ఊరికి ఈవూరు అంత కష్టమని అనుకున్నాడు.
స్కర్ట్ నిజంగానే లూస్గా ఉంది. మాట మాటికి లాక్కుని ఉంటుంది తాను.
మొహం మీద ఏదో ఉంది అని హిందీలో చెప్పాడు. తను మొహం కడుక్కుంది, కాటుక ఇంకా స్ప్రెడ్ అయ్యింది. తనే చేత్తో చూపించాడు, మళ్ళీ కడిగింది పోలే, కిట్టు అనుకోకుండానే చేత్తో తుడిచాడు. చేతికి కాటిక అంటింది. గోడకు రాసాడు.
ఆ పిల్ల పక్కుమని నవ్వింది.
ఇద్దరూ నవ్వారు . తను నవ్వింది చివరికి, కిట్టుకి ఆనందం.
ఈసారి కిట్టు చనువుగా తుడిచేసాడు తన కళ్ల పక్కన ఉన్న కాటుకను. కళ్ళు కళ్ళు కలిశాయి. ఒక్క క్షణం అలాగే ఉండిపోయాయి. కళ్ళల్లో అమాయకత్వం స్నేహం మాత్రం చూసారు.
స్కర్ట్ లూజు ఉందా అని అడిగాడు. హిందీ లో. హా.. అన్నది తను. కిట్టు తన బెల్ట్ చూపించాడు. పెట్టుకుంటావా అని, సరే అని తల ఊపింది. కిట్టు వెంటనే తీసి ఇచ్చాడు తనకు.
విజయనగరం గంటస్తంభం దగ్గర తోపుడు బండి మీద కొన్న బెల్టు. దానికి మామూలు కొక్కెం కాదు ఒక వింత ప్రెస్ ఉండేది. కిట్టు కొన్నదే అందుకు. అమ్మాయికి పెట్టుకోవడం రాలేదు.
బిత్తర పోయి చూస్తుంది. వదిలి వెళ్తే మళ్ళీ తిట్లు, మేడం కొట్టినా కొట్టొచ్చు.
కిట్టు బెల్ట్ మీద చెయ్యి వేశాడు — సిగ్గు పడుతుంది పిల్ల — వీడికి అంత సందర్భావగాహన లేదు — దగ్గరికి చేసి నొక్కి చూపించాడు.
చక్కగా సరిపోయింది స్కర్ట్ మీద బెల్టు, స్కర్ట్ ఫిట్ అయింది.
ఒక్క సాయంత్రపు చిరుగాలి కొండ మీద నుండి వాచిలో టైమ్ చూసుకుని, తలుపు తట్టి వచ్చినట్టు, కిందకు వీచింది. ఆమె మొహం మీద చిరు నవ్వు.
మేరా నామ్ కిట్టు...
తుమ్హారా నామ్ ? అన్నాడు...
సానియా
సానియా జావేద్
అలా అలలా మొదలయ్యింది, తొమ్మిదో తరగతి.
1997 జూన్, నవోదయ నగర్, కిల్తంపాలెం.

.jpg)
No comments:
Post a Comment