ఎంకి పెళ్ళి...

 ఎంకి పెళ్ళి... 

నిరుపేద దేశం ఆరోజుల్లో భారత దేశం. ప్రతి ఊరులోనూ ఉన్నత ప్రమాణాలతో స్కూళ్లు కట్టలేక, తనకున్న స్తోమతకు ఉన్న కొద్ది డబ్బునీ క్రీమ్ డే లా క్రీమ్ (creme de la creme) మీద పెట్టిన కాయ్ రాజా కాయ్, నవోదయ.  మానవ వనరుల శాఖను స్థాపించిన పీ.వీ. అనే బహుభాషజ్ఞుడు బహుముఖ ప్రజ్ఞాశాలి కన్న కల నవోదయ. దేశంలో మారుమూల ఉన్న ప్రతిభకు వేసిన ఒక పందెం.


నవోదయలో ఉన్న ఈ 500 మంది బాధ్యత ఒక్కరి చేతి మీద ఉంటుంది, అది అధిపతి, ప్రిన్సిపాల్ చేతిలో. అధికారమైనా, అభిమానమయినా, అభియోగమయినా.

అందుకే రెండువైపులా పదునున్న కత్తుల్లాంటి నాయకత్వపు లక్షణాలున్న విద్యావేత్తలను అధిపతులుగా, ఉపాధ్యాయులుగా ఎంచి వేసేవారు. లండన్లో తర్ఫీదు పొంది, పాఠ్య పుస్తకాలు రాయడం, పాటలు సాహిత్యం రాయడం వచ్చిన ప్రిన్సిపాల్  సార్ ఒకరోజు అంబేద్కర్ మీద, ఒక పాట రాసారు. అక్కడితో ఆగక ఘటం మీద సంగీతం చేర్చారు, స్వయనా ద్వారం వెంకటస్వామి నాయుడు వారి మనుమడైన, కొత్తగా వచ్చిన మెరుపులాంటి కుర్రాడు మ్యూజిక్ మాస్టర్ గారితో. అద్భుతమైన పాట. 


కన్నీటీ సిరాతో నువు రాసిన కావ్యం ...

బడుగు బతుకుల్లో సిరివెన్నెల చూడమన్నదీ ... 


పాటలో అంబేద్కర్ పుట్టడం, ప్రజలకోసం ఆయన రాజ్యాంగం రాయడం, ఆయన ఆలోచనలతో వలన ఇలా నవోదయ పెట్టడం అలా. 

పాట బాగుంది రోయ్ అనుకున్నాడు కిట్టు. ఒక రెండు వారాలుగా ఎప్పుడూ చూసినా సంగీత లక్ష్మీ, ఇంకా పెద్ద పెద్ద స్కూలు సింగర్లు మ్యూజిక్ సార్ తో కలిసి పాడి పడేస్తున్నారు. 


ఒక రోజు అదే మార్గాన వెళ్తున్నాడు కిట్టు. అబ్బాయిలు అమ్మాయిల డార్మిటరీ వెనుకాల నుండి, ప్రిన్సిపాల్ గృహం ఎదురుగా మగ పిల్లలు వేరేగా వెళ్ళాల్సిన మార్గం అన్నమాట.  

షాడో ప్లే అంటే, వెనుక లైట్ వేసి దుప్పటి మీద నీడలో ఆడే నాటకం. ఆ పాట పాడుతుంది షాడో ప్లే కోసం అన్నమాట. 

అప్పటికి కిట్టూకి ఎదుగుదల ఇంకా లేదు. ఒక 4 అడుగుల 5 అంగుళాల ఉంటాడు, మొత్తం స్కూళ్లో పొట్టివాడు (చక్రి, రవి, కిరణ్ తప్పించి). 


అలా సాయంత్రం సరదాగా చెట్టా పట్టాలు వేసుకు వెళ్తున్న వీరికి ఎదురుగా ప్రిన్సిపాల్. 

ఒకరు కావాలి అని అడిగితే, అప్పుడు తప్పించు కోవడానికి అవకాశం లేకుండా కిట్టు గాడిని ముందుకు తోశారు అతని మిత్రులు. 

క్వార్టర్ వెనకాల సుజాత అక్క, సాయంత్రం చక్కగా తయారు అయి కడిగిన ముత్యం లాగ ఉంది. 

"వీడు సరిపోతాడే?"  అని అడిగారు ప్రిన్సిపాల్. 

అక్క చూసింది, "ఔను సార్ కరెక్ట్"  అంటున్నది. 

అంతా పొట్ట మీద చెయ్యి వేసుకుని పడి పడి నవ్వుతున్నారు. 


"కిట్టు గా వెళ్ళి అక్క వళ్ళో పడుకో !!"  

కిట్టు గాడికి అర్థం అవ్వటం లేదు. అక్క కిట్టూని పసి వాడిలాగా ఒగ్గు పెట్టుకుంది. వళ్ళో, చంటాడిలా కిట్టుని పెట్టుకుంది, పాలు పట్టినట్టు. అక్క ఒళ్ళోంచి వదిలించుకునే అవకాశం లేదు, పసి పిల్లాడి చెయ్యి వెనక్కి వేసినట్టు లాఘవంగా పట్టుకుంది. బిత్తర పోయి చూస్తున్నాడు, వెనుక లైటు ఎదుట పెద్ద తెల్ల గుడ్డ మీద నీడ లో వీడు + అక్క. 



వెనుక హార్మనియం, డప్పులు మొదలయ్యాయి.... 

ఫలానా ఫలానా పసి బిడ్డ ను పెంచింది,

ఫలానా ఫలానా గొప్ప మాత ...... టాన్ టాన్ టాన్

ఇందాకల సాహిత్యం. ఇప్పుడు కఠోరంగా ఉంది. 

కిట్టు చంటి అంబేద్కర్ అన్నమాట.. 

పాలు తాగే పిల్లాడు... 


నీడలో ప్లే. హార్మోనియం మీద సంగీతం ద్వారం మాస్టారు దుల్లగొట్టేస్తున్నారు.

అలా స్కూల్ మొదలయిన మొదటి మాసానికే అడ్డంగా బలైపోయాడు కిట్టు గాడు....

No comments: