హౌరా మెయిలా ...
(పార్ట్ 2, సైన్స్ ఎగ్జిబిషన్)
తెల్లారే విశాఖపట్నం రైల్వే స్టేషన్ చేరారు. ఇంకా చూస్తే పట్టుమని ఆరుగురు.ఒక అమ్మాయి, కిట్టుతో కలిపి ముగ్గురు అబ్బాయిలు, ఒక మేడం, ఒక సారు. టీచర్లు పెద్దాపురం నవోదయ నుండి. ఆ పిల్లది కూడా పెద్దాపురమే.
సెకండ్ క్లాస్ స్లీపర్లో ఒక పూర్తి వాటా వీరికి దొరికింది. వీళ్ళతో వాక్మన్ పెట్టుకుని మంచి హుందాగా ఒక యంగ్మాన్. ఇంకా ఒక పెద్దాయన ఉన్నారు. అబ్బాయంట ముసలాయనకి. ఎనిమిది సీట్లు అలా.
ఎందుకు ఎక్కడ ఎవరు అని ప్రశ్నలు మొదలయ్యాయి. ఇవి రైలెక్కిన వారికి తప్పని ఇంటర్వ్యూ. గొప్పగా చెప్పుకున్నారు టీచర్లు. ఒక్కడిని ఒక్కడిని చేసి ప్రాజెక్ట్ ఏమిటో అడుగుతున్నారు.
కిట్టు చెప్పాడు చివరికి. ఆ అందరిలో అల్ప ప్రాణి వీడే. క్లాసు ఎనిమిది గానీ వయసు ఇంకా పన్నెండే.
అయితే మీరు పెద్దయ్యాక ఏమి అవ్వదామను కుంటున్నారు అని ప్రశ్నలు.
అమ్మాయి చెప్పింది. ఆ చదువేమిటో వీడికి అర్థం కాలేదు. ఇంకా చెప్తున్నారు అందరూ.
కిట్టు తరపు వచ్చింది.
గంభీరంగా గొప్పగా ఛాతీ పై కి లాగి అన్నాడు.
నేను కలెక్టర్ ఔతాను అని.
అందరూ ఒక్కసారి నవ్వారు.
తన కల వీరికి నవ్వు తెప్పించిందా అని. ముఖం ప్రశ్న అయ్యింది.
ఇంత సైన్స్ చదివి , చెప్పి కలెక్టర్ అయిపోతావా భడవా అని పెద్దాయన.
అంటే, కలెక్టర్ అంటే ఇంకొకరికి సేవా చేస్తారు, అజమాయిషీ చేస్తారు. అవ్వడం తప్పు కాదు, కానీ బయటి ప్రపంచం చూడు, అక్క ఇంటర్నెట్ చేస్తుంది. మన దేశం ఎస్సెల్వీ , గబుక్కున అన్నాడు శాటిలైట్ లాంచ్ వెహికల్ అని, పంపిస్తుంది అలా.
ఔనా అని విస్తు పోయాడు.
రైలు మొదలయ్యింది.
ఎటు చూసినా కరెంటు స్తంభాలు, ఇనుప పట్టాల మీద పరుగు, పట్టాలు కలుస్తూ వీడుతూ పోతుంటే గమ్మత్తుగా ఉంది. అక్కడక్కడా కరెంట్ స్టేషన్లు ఉన్నాయి. వాటిని వివరంగా చూస్తున్నాడు ఎందుకంటే వాడి ఎగ్జిబిషన్ నమూనా లో కూడా ఒక సబ్స్టేషన్ పెట్టాడు. అది కిట్టు ఐడియానే.
తాతయ్య మాస్టరు గుర్తుకు వచ్చాడు. ఇంకా కోపం. ఈ పట్టాల పక్కన వెనక్కి వెళ్ళే వయిపు కొత్తవలస జం. అని రాసి ఉంది. అంటే వాడి ఊరి.
కిట్టు కళ్ళలోకి మళ్ళీ నీళ్ళు. తనకు ఇష్టం లేకుండా తనను ఎలా పంపించారు అని విపరీతమయిన కోపం.
వెనక్కి వెళ్ళాక స్కూలు కి రాజీనామా ఇస్తునా అని పగటి కల. అప్పుడు వెళ్ళే ముందు తాతయ్య సార్ ని రఫ్ ఆడిస్తాను అని అనుకున్నాడు. మొఖంలో కోపం.
జానీ వచ్చి కూర్చుంది పక్క సీటు మీద. రైల్లో ఒక్కరే ఉండే పక్క సీటు వీడి కి బాగా నచ్చింది.
కళ్లద్దాలు పప్పి కట్ వింతగా ఉంది పిల్ల. నీకు ఇష్టం లేదా వెళ్ళడం అని అడిగింది. లేదు అన్నాడు. మరి ఎందుకు వచ్చావు అన్నది. చెప్పాడు.
చాలా తప్పు అని. సానుభూతి చెప్పి. తన చెవిలోని వాక్మన్ వాడికి పెట్టింది. "టెలిఫోన్ ద్వనిలా నవ్వేదానా" పాట చాలా బాగా వస్తుంది. విన్నాడు . కొంచెం నవ్వాడు. తనకి ఒక చెవికి ఇచ్చి తను ఒకటి పెట్టుకుంది. ఇద్దరూ కొంచెం సేపు విన్నారు.
అనకాపల్లి, తుని, సామర్ల కోట , అన్నవరం. గుడి ముందు ఆగింది ట్రైన్. సంబరంగా ఉంది.
కాసేపటికి గోదావరి.
పచ్చని పొలాలు. సుభిక్షంగా ఉన్న దేశం. దూరాన ఎక్కడ చూసినా పంటలు. దేశం పేపర్లలో చదివి బాగా చెడిపోయి , బందులు, రాస్తారోకోలు, సారా ఉద్యమాలు ఉన్నాయనుకున్నాడు.
లేదే. ఎక్కడ చూసిన బట్టలు లేకున్నా నవ్వుతూ మొహాలు. ఈ బంగారు దేశాని గురించి పేదరికం అని మాత్రమే రాసేవాడికి వీరి నవ్వులు ఇకఇకలు, పక పక లూ కనిపించవు కాబోలు.
హనుమలు యిచ్చిన నోట్లు విప్పి చూసాడు. ఒక అయిదు, ఒక పది, ఒక ఇరవై, ఇక యాభై. ఉన్న వన్నీ వీడి జేబులో పెట్టేసినట్టు అర్థం అయ్యింది. తన వలన సస్పెండ్ అయికూడా తన మీద ఏమిటి ప్రేమ. అర్థం కాలేదు. అద్దం దగ్గరికి వెళ్ళాడు, అద్దం లో చూసు కున్నాడు. తనకు అదృష్టం అంటే ఉండే ఉండాలి. తనను అభిమానించే వారు తనలో ఏమిటి చూస్తారో తనకి తెలీదు.
పిల్లలని అసలు అజమాయిషీ చెయ్యటం లేదు. మేడం సార్ వేరేగా కూర్చున్నారు. వారి మాటల్లో వారు. సాయంత్రం తిరుపతి దాటింది.
కాసేపటికి మద్రాసు.
ట్రైను తిన్నగా ఒక బిల్డింగ్ లోపలికి వెళ్ళి ఆగింది. విచిత్రం గా ఉంది. అందరికీ రైల్వే భోజనం. కాసేపటికి మళ్ళీ ఐస్క్రీం ఇది ప్రభుత్వం తరుపున కాదు అని అర్థం అయ్యింది.
నిద్ర పట్టేసింది. అలసిన మనసుకి రైలు ప్రయాణం మందు అని అనుకున్నాడు లేచాక.
ట్రైన్ బ్రిడ్జి మీద వెళుతూ ఉంటే కిందన స్టేషన్ ఉంది. భలే విచిత్రం ..
కోయంబత్తూరు.
ఇంకా ప్రయాణం ఉంది అంట.
పశ్చిమ కనుమలు దాటుతుంది ట్రైన్. అందాన్ని చూసే మనసు మాత్రమే తక్కువ కానీ కళ్ళు నిండా అందం. టీ కాఫీ గార్డెన్లో పనిచేసే మనుషులు. వస్తువులు మోస్తూ ఏనుగులు మరింత విచిత్రంగా ఉంది ప్రయాణం.
కేరళ రాష్ట్రంలోకి వచ్చినట్టే. పలక్కడ్ లో దిగారు. అక్కడ టీ తో పాటూ కొబ్బరి నూనెలో వేయించిన అరటి చిప్స్ ఇస్తున్నారు.
అక్కడినుండి మలపూజా వరకు బస్సు వచ్చింది. స్కూల్ విచిత్రంగా ఉంది.
వీళ్లు వెళ్ళే సమయానికి అమ్మాయిలు తెల్ల చీర భుజాల కిందకి కట్టుకుని మల్లె పూలతో స్వాగతం పలుకుతున్నారు. అక్క వెళ్ళి వారితో డాన్స్ చేసింది. ఇంత ప్రయాణం తరువాత కూడా జానీలో ఉన్న ఉత్సాహం నచ్చింది.
మేడం కూడా. ఆమెకు మలయాళం వచ్చు. మంచి పేరు ఉన్న నవోదయ అంట. వీరికి మంచి రూములో బస. ఇక్కడ అబ్బాయిలు అమ్మాయిలు వేరే.
సాయంత్రం భోజనానికి వెళ్ళాడు. కేరళ బియ్యం తినగానే కడుపులో నొప్పి, దాని మీద చేప ఫ్రై.
బయటికి వచ్చి నొప్పితో విల విల లాడిపోయాడు. పిల్లలు వచ్చి చూసారు. మళ్ళీ లోపలికి తీసుకువెళ్ళి సూప్ లా తాగాడు.
మరి రెండు రోజులు ఎక్సిబిషన్. విపరీతంగా జనాలు వచ్చారు. ఇక్కడ మంచి నమూనాలు వచ్చినట్టు ఉన్నాయి. తనదే చిన్న ఎగ్జిబిట్. జానీని చాలా మంది మెచ్చుకున్నారు.
మలప్పుజ దగ్గర ఒక డామ్ ఉంది. అక్కడికి పిల్లలని తీసుకుని వెళ్ళారు మేడం , సార్. అదే మొదటి సారి డామ్ చూడడం. మేడం సార్ రోప్వే కూడా ఎక్కించారు. ముందు బుట్టలో వాళ్ళు ఎక్కే సారు. వెనుక పిల్లలు. చాలా ఎంజాయ్ చేసారు. జానీ కిట్టుతో అంది ఏమిటి ఆలోచిస్తున్నావ్ అని. ఇంటికి ఎప్పుడు వెళ్ళొచ్చా అన్నాడు.
స్కూల్ మళ్ళీ చేరారు. సాయంత్రం చిత్ర విచిత్రం గా కేరళా సంప్రదాయక వివాహం చేసి చూపిస్తున్నారు. అక్కడి స్కూల్లోని ఒక అమ్మాయికి ఒక అబ్బాయి కి పెళ్ళి !
సరదాగా జరుగుతుంది. ఇక్కడ అమ్మాయిలకు అబ్బాయిలకు అంత దూరం పెట్టరు అని అర్థం అయ్యింది.
కిట్టు చీకట్లో వెనుక కూర్చున్నాడు. పక్కనే జానీ. కాళ్ళు దొంతరగా పెట్టుకుని. కిట్టు పెళ్లి చేసుకుంటావా నువ్వు అని అడిగింది. చేసుకుంటాను. ఎవర్ని. ఇంకా తెలీదు ఏదో ఒక అమ్మాయిని అన్నాడు. పగల బడి నవ్వింది. నీకు బుర్ర తక్కువా అని అడిగింది. నాక్కాదు నీకే టీనేజీ తిక్క ఎక్కుతుంది అన్నాడు.
జానీ నీకు టీనేజి ఆల్రెడీ వచ్చింది కదా అన్నాది. తనకి చెప్పాడు మొటిమ బాధ. తను వేడిగా టీ కప్పు పెడితే పోతుంది అని చెప్పింది. ఐడియా నచ్చింది కిట్టు గాడికి. తనకి ఎంటీవీ ఇష్టమని, తను హాస్టల్లో కాకుండా అమ్మ నాన్నతో ఉంటాను అని.
బహుమతుల కార్యక్రమం మొదలయ్యింది. జానీకి ఫస్ట్, దార్వాడ్ అబ్బాయికి సెకండ్, కిట్టుకి మూడో ప్రైజ్. అది కూడా ఆశ్చర్యమే కిట్టు కి.
ఇంక చివరికి ఇంటికి బయలు దేరారు ఆ రాత్రికి. మళ్ళీ హౌరా మెయిల్లో. ముందట కోయంబత్తూరు, తరువాత త్రిశూర్ , త్రిశూ ర్ లో ఒక నవోదయ బ్యాచ్ దిగిపోయింది.
ఎవరో చిన్న వెదురు బొమ్మలు అమ్ముతున్నారు. కిట్టు ఉన్న కొంచెం సొమ్ముతో ఒక తంబురా బొమ్మ కొన్నాడు అమ్మకి ఇద్దామని.
ఇంకా చెన్నై. పుత్తూరు.
ఆంధ్రా వచ్చేస్తుంది. తిరుపతి వచ్చింది.. ఇంక ఆనందం మొదలయ్యింది.
పెద్ద అబ్బాయిలు ఇద్దరూ దూరంగా బెర్తు ఎంచుకున్నారు. మేడం సార్ వేరే. ఇంకా ఆటలో అరటి పండు లాగ మిగిలింది జానీ, వీడు.
మనసు కుదుట పడుతుంది. ఇంటికి వెళ్తున్నాం అంటే ముందు స్కూల్ తరువాత ఎలాగోలా ఇంటికి చేరుతాను అనుకున్నాడు కిట్టు.
చక్కటి వెన్నెల రాత్రి. సైడ్ అప్పర్ జానీ, కింద వీడికి. మిగిలిన వారు కొంచెం ముందర.
అలిసి పడుకున్నారు అంతా.
హుషారు లో కిట్టుకి నిద్ర రావటం లేదు.
వెంకటగిరి, నాయుడుపేట.
ప్రతి 5 నిమిషాలకు ఒక చిన్న బ్రిడ్జి. జానీ కిందకి దిగింది . నిద్ర రావటం లేదు రా. కొంచెం జరుగు. కిట్టుకి నిద్ర అసలు రాదు. పడుకుంటే సమయం వృధా అనే అనుకునే వాడు.
జానీ మళ్ళీ వాళ్ళక్క వాక్మాన్ తీసింది. కిట్టు చాలా గాలిలో జుట్టు వదిలేస్తూ బాగా ఆనందంగా ఉన్నాడు.
నన్ను గుర్తు పెట్టుకుంటావా అనింది. కొంచెం అనిపించింది జానీ తో పరిచయం వదిలి వెళ్ళడం.
కిట్టు వీలైనంత గుర్తు ఉంటుంది కదా అన్నాడు. నీకో?
నన్ను మర్చిపోకే కిట్టు అన్నాది. సరే ట్రై చేస్తాను అన్నాడు.
తను వెన్నెల నీడలో ఉన్నాడు. వెన్నెల్లో తాను. నీడ సగం బెర్తు మీద పడుతుంది.
వెనక్కి ఉండి ట్రైన్ ఫస్ట్ గా వెళ్ళటం, అల్లా వెళ్ళినప్పుడు పట్టాలు మారినప్పుడు వచ్చే శబ్దం కిట్టుకి బాగా నచ్చుతున్నాయి.
గూడూరు దాటి రైలు పరిగెడుతుంటే, ఇంచుమించు నిండు చంద్రుడు వెనకాలే వస్తున్నాడు.
చాలా బాగుంది కదా.
తను చప్పున కిట్టుకి బుగ్గ మీద ముద్దు పెట్టింది. ఇది కొత్త కాదు. ఇలాంటివి జరిగినపుడు కదల కూడదు అని కిట్టు అనుభవం.
కిట్టు కదల లేదు.
జానీ ఈసారి దగ్గరగా వచ్చింది నీడలోకి.
జుట్టు వెనక రెండు చేతులు పెట్టి, పెదాల మీద ముద్దు.....
తడిగా, వెచ్చగా. మెత్తటి పెదవి అదే మొదటి ముద్దు కిట్టుకి. జానీకి కూడా తెలుస్తూనే ఉంది.
ఊపిరి గట్టిగా తీస్తుంది. తన శ్వాస గులాబీలా ఉంది. దగ్గరిగా చూస్తే వెన్నెల నీడలో తన చెంప వెండి రంగులో మెరుస్తుంది.
నిశ్చేష్టుడు అయ్యాడు. శరీరం నుంచి బలం పోయినట్టు అయ్యింది. వంటికి రూపం ఇచ్చే పదార్థం ఏదో వదిలి పోయినట్టు, అన్ని కండరాలు వదిలి, చల్లగాలిలో , తేలుతూ పట్టాల శబ్దం లో కలిసిపోయింది.
అలా ఎంత సేపు ధ్యానం జరిగిందో.
తనను చూశాడు. జుట్టు ఎగురుతూ ఉంది, వెన్నెల్లో లీలగా తన మొహం.
ఇప్పుడు నువ్వు నన్ను, నన్ను నువ్వు మర్చిపోయే అవకాశమే లేదు.
ఆ రాత్రి నిద్ర లేదు. పడుకుంటే ఏదో మిస్ అవుతాను అన్న కిట్టు ఆలోచన ఇంకా దృడ పడింది.
అలా హౌరా మెయిల్ లో, గూడూరు దాటాక, ఎస్. 63 లో టీనేజర్ అయ్యాడు కిట్టు.
అధికారి కావాలి అనుకునే ఒక బాలుడు అలా వెనక్కి మళ్ళీ రాలేదు. సైన్స్ లోకి మనసు మారి టీనేజర్ గా వెనక్కి వచ్చాడు.



No comments:
Post a Comment