పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ...

 పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ...


రూములో సామాన్లు వెతుక్కుంటున్నాడు కిట్టు. అన్ని ఒక్కొకటి దొరికాయి. అన్ని ఉన్నా సంచుల్లో సామాను పైకి కిందకి మారాయి ప్రయాణంలో. 

బెడ్డు పరిచే ఉంది. పక్కన కొత్త తువ్వాలు, బ్రష్, టూత్ పేస్ట్, సబ్బు. రూమ్ 8th క్లాస్ పిల్లలది. వీళ్లకి వేరే చోటు కాకుండా ఉన్న పిల్లల మధ్యే బెడ్డు ఇచ్చారు.

గోడల నిండా క్రికెట్ పోస్టర్లు. అన్నీ పసుపు రంగు టీంవే, అంటే ఆస్ట్రేలియా. స్టీవ్ వాహ్, షేన్ వార్న్ అలా. ఇదేదో చాలా బాగుందే అనుకున్నాడు. పక్క రూంలో అంతా వెస్ట్ ఇండీస్ అలా ఉంది.


రూంలోకి జుట్టు విరబోసుకుని చిన్న తెల్ల నిక్కర్ వేసుకుని ఆరడుగుల అబ్బాయి తన దగ్గరకు వచ్చాడు.

మే రా నామ్ సుర్జీత్ సింగ్ సాంఘా. అన్నాడు. 


స్కూల్ ప్రిఫెక్ట్ అంట.

చోటా మద్రాసీ. అచ్ఛా లగ్ రహా హై.


ఏమి కావాలన్నా తనని అడగమన్నాడు. ఈ అతిథి కార్యక్రమం వాడిది అంటున్నాడు.

జుట్టు పట్టుకుని కిట్టు అడిగాడు. దీనిని ఏం చేస్తావ్ అని.


అడక్కూడనిది అడిగేసానా అని గాభరా.

మద్రాసీ మస్త్ బందా అన్నాడు.


స్నానం చేసి రమ్మన్నాడు. కిందకు చూపించాడు. ఆ చిన్న పిల్లాడి పేరు గురుముఖ్ అంట. వెనకాలే వచ్చాడు. 


కట్టెల పొయ్య మీద ఇత్తడి పీపాలో నీళ్లు వేడి చేసుకోవాలి. అప్పటికే నీళ్ళు అయిపోయాయి. ఇద్దరూ పక్కన ఉన్న వ్యవసాయ పంప్ దగ్గరకి వెళ్లి నీళ్లు తెచ్చారు.


రెండు మూడు చెంబులు వేసి పొయ్య ఎగదోశారు. వాడు నేను వెళ్ళిపోవాలి అని వెళ్ళిపోయాడు.


కిట్టు నీళ్లు తెరుపుకుని, స్నానానికి వెళ్ళాడు. ఇప్పుడు ఏకాంతం. ఎక్కడా ఉండదు నవోదయలో ఏకాంతం, ఇలా ఎప్పుడో.


స్నానం చేసి బయటకి వచ్చాడు, ఖాళీ చాటి మీద ఎర్రటి ఎండ. మధ్యాహ్నం ఒంటిగంట కావస్తుంది. ఇప్పటికి వేడి వచ్చింది సూర్యుడికి.


కళ్ళు మూసుకున్నాడు కాసేపు.

రెప్పల వెనుక ఎర్రటి తెర.


సంక్రాంతి. సింధూరం సినిమా. విశాఖ ఎక్స్‌ప్రెస్. గోదావరి వంతెన. దద్దోజనం ముద్ద. కిషన్ రెడ్డి. కిరీటం పెట్టుకుని జానీ. గుర్తుకు వచ్చారు.


జానీ. తలచుకుంటేనే మెదడులో ఎడమ నుండి కుడికి కుడి నుండి ఎడమకి విద్యుత్ తిరుగుతుంది. వింత ఊహలు. తన ఉంగరాల జుట్టు. సొరంగంలో చీకటి. వాక్‌మాన్‌లో పాటలు. ఇది నిజమేనా అనుకున్నాడు. తను తప్పు చేస్తున్నాడా అనే భావం.


పవిత్రంగా బ్రిలియంట్ ట్యుటోరియల్ గుర్తుకువచ్చింది. సరస్వతి మంత్రం చెప్పాడు.

వచ్చిన మంత్రాలు అన్నీ చదివేశాడు.


ఎండను చూస్తూ,

భర్గో దేవస్య ధీమహి

ధియో యో నః ప్రచోదయాత్॥


తనకు తప్పో ఒప్పో నీవే చూపించాలి అనుకున్నాడు ఎండను చూస్తూ.

ఇంకా ఆకలి గుర్తుకు వచ్చింది. బెడ్డు వరకూ చేరాడు.


కిందనుండి కేకలు ఇంగ్లీష్‌లో హోసూరు పిల్లలు, తెలుగులో రారా నాయనా అని జానీ.

ప్లేట్లు వేళ్ళమీద తిప్పుకుంటూ అంతా మెస్ చేరారు.


జానీ అంటుంది ఒరేయ్ కిట్టు ఇక్కడ ఎవ్వరికీ తెలుగు రాదు. మనం ఏమన్నా వీళ్ళకి తెలీదు అని.

వింతగా ఉంది చండీగఢ్ భోజనం. సలాడ్ అని ముల్లంగి, కాబేజీ పెడుతున్నారు. మసి పట్టిన రొట్టెలను లైన్ కట్టి మరీ వేసుకుంటున్నారు పిల్లలు. ఉడికీ ఉడకని అన్నం, వాము వేసి చావల్ అని పెడుతున్నారు. ఆకలికి మీద పెట్టింది తిని రూమ్‌కి వచ్చేశాడు.

సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలు అంట. ఆంధ్రప్రదేశ్ నుండి వచ్చిన ఒక్క అబ్బాయ్ వీడు కాబట్టి, వీడు సాంప్రదాయక బట్టలు కట్టి నడవాలి అందరి ముందు. చిరాకు వచ్చింది. జానీ వచ్చింది, నేను చీర కట్టుకుంటాను సాయంత్రం ఫంక్షన్‌కి అని. తను ఇక్కడ ఒకే ఒక్క తెలుగు అమ్మాయి.


కొంచెమైనా రెస్ట్ కావాలి అని రూమ్‌కి వచ్చాడు.

ఇప్పుడు సాంఘా , ప్రిఫెక్ట్ వచ్చాడు. స్నానం చేసినట్టు జుట్టు తడిగా ఉండి, తడి తువ్వాలు తలకు చుట్టుకుని. 


తనను ఇంకో వాడిని గుమ్మంలోకి తీసుకువెళ్ళాడు.

తెల్ల చీర లాంటి బట్ట తెచ్చాడు. ఖాదీ బట్ట.


కిందకు తగలకుండా ఒక చివర కిట్టూ చేతిలో పెట్టాడు. నేలకి తగలకూడదు. ఇంకో చివర వేరే కుర్రాడికి ఇచ్చాడు.

దువ్వెన తీసి తల దువ్వాడు. కొప్పు లా చేస్తూ, ఆ తెల్ల బట్టని తలకి కడుతున్నాడు. గట్టిగా లాగి కడుతున్నాడు. తను ఇంకా బలంగా లాగమని కిట్టూకి చెప్పాడు.


ఎంత గట్టిగా లాగితే అంత మంచి పగిడి వస్తుంది అంట.


దువ్వెన పాగా లో పెట్టాడు. ప్యాంటు కి ఒక వెండి రంగు తొడుగులో ఉన్న చిన్న కత్తి పెట్టుకున్నాడు. చేతికి ఉన్న కడియం పేరు కడా అని, దువ్వెన కంగా అని, చాకు క్రిపాణ్ అని, తెల్లటి నిక్కరు కచ్ఛేరా అని. 

కేశ్, కంఘా, కడా, కచ్ఛేరా, క్రిపాణ్. ఇవే సిక్కు లకు పవిత్రం అన్నాడు. కిట్టు అనాయాసంగా అక్కడ ఉన్న పటానికి దండం పెట్టాడు. 




మద్రాసి ప్యారా హై అని. సాయంత్రం కలుద్దామన్నాడు. 


సాయంత్రం అయ్యింది. తెల్ల పంచి ఎలాగోలా కట్టాడు, కిందన నిక్కరు వేశాడు ఎందుకయినా మంచిది అని. తెల్ల చొక్కా వేసుకున్నాడు.


రాష్ట్రాల పేర్లు పిలుస్తుంటే వెళ్ళాలి. స్టేజి మీద మొదటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్. వెళ్ళాడు. పక్కన జానీ. పసుపు చీర, ఎర్రటి బొట్టు. సంక్రాంతికి అలంకరించిన గుమ్మం లా కనిపించింది కిట్టూకి.


చప్పట్లు కొట్టారు. స్టేజి వెనక వెళ్ళి వేచి ఉండమన్నారు. మళ్ళీ చివరలో రావాలి అంట.


స్టేజి దిగగానే, సాంఘా వచ్చాడు. చోటా మద్రాసీ ఛలో అని.


రూముకి వెళ్ళి బట్టలు మార్చుకుని రమ్మన్నాడు.


గేటు దగ్గరకు నలుగురు పిల్లలు, కిట్టు, సాంఘా.


రిజిస్టర్‌లో ఏదో రాశాడు.


సాంఘా ఉంటే ఎవరూ అడ్డు చెప్పటం లేదని అర్థం అయ్యింది. నడుస్తున్నారు. నీలం తెలుపు రంగుల్లో అక్కడి ఆర్టీసీ బస్సులు. చిల్లర ఉంటే చాలు. ఎక్కడికైనా సునాయసంగా వెళ్ళి రావచ్చు అంట. నవోదయ దగ్గర అయితే డబ్బులు లేకపోయినా పరవాలేదు అంటున్నాడు గురు ముఖ్. 


దిగిన బస్టాండ్, ఎదురుగా గుడి లాంటి కట్టడం. మసీదు గుడి కలిపి కడితే ఎలా ఉంటుందో అలా ఉంది.


బయట చెప్పులు వదిలిన చోట టోకెన్, ఇంకా ఒక పెద్ద రుమాలు ఇచ్చారు.


సాంఘా కిట్టు గాడి బుర్రకి కట్టాడు. ఇది తియ్యకూడదు అని. లోపలికి వెళ్ళేవాళ్ళు ఆడవాళ్లు బుర్ర మీద చున్నీ, మగ వాళ్ళు రుమాలు లేక పాగా వేసుకుని వెళ్తున్నారు.


పాలరాతి కట్టడం. కాళ్ళు చేతులు ముడుకులు మోచేతుల దాకా కడుక్కోవాలి.


లోపలికి వెళ్ళారు. ఎదురుగా గురు నానక్ ఫోటో. గురు నానక్ జయంతి సెలవులు ఇస్తారు అని తెలుసు ఇక్కడ ఏకంగా ఆయనకి గుడి ఉంది. లోపల చాలా గురువుల ఫోటోలు ఉన్నాయి.


ఒక చిన్న బెడ్డు లాంటి చోట దుప్పటి కప్పి ఉంచారు. చాలా భక్తితో పడుతున్నారు. వాహే గురు.. వాహే గురు.. అని.


కిట్టు క్షణంలో లీనం అయిపోయాడు. దేవుడికి దండాలు పెడుతున్నాడు. తన లిస్టులో ఉన్న కోరికలు.


కళ్ళు మూసుకుని ఉన్న వీడిని లాక్కుంటూ పోయారు.


పూజా కర్నే లాగా మద్రాసీ అని. నవ్వుతున్నారు.


కిందకి వెళ్ళారు అంతా.


అక్కడ ఒకామె ఉంది. ఇంచుమించు ఆరు అడుగులు, అన్ని అవయవాలు అధిక మోతాదులో ఉన్న ఆవిడను వింతగా చూసే లోపే, ఆమె కాళ్ళకి దండాలు పెట్టేస్తున్నారు. వీడి బుర్రను నొక్కి, వీడి చేత కూడా కాలు మొక్కించారు.


ఆవిడ దీవిస్తుంది..


కిందకు వెళ్ళమని ఆదేశం.

సెల్లార్ లాంటి చోటకి వెళ్ళారు.

శుభ్రంగా ఉంది. కాళ్ళు చేతులు మళ్ళీ కడిగారు సబ్బుతో, కిట్టు తలకి నెట్టు పెట్టారు.


చేతిలోకి పప్పు ఉన్న బకెట్ ఇచ్చారు. మిగతా నలుగురికి వేరే వేరే. అందరికన్నా చిన్నవాడికి నీటి మగ్గు. కొంచెం గర్వంగా ఉంది కిట్టూకి, తనకి పప్పు బకెట్ ఇచ్చినందుకు.


లోపల వెళ్లగానే నేలమీద పంక్తులుగా కూర్చుని జనాలు ఉన్నారు. కిట్టు పప్పు వేసుకుంటూ వెళ్ళమని ఆదేశం. వీడు వేస్తూ పోయాడు. తగ్గించి వెయ్యమని, మళ్ళీ అడిగితే వెయ్యాలి అని మరో ఆదేశం. ఒక రౌండ్ వేసే లోపు మళ్ళీ రెండో విడత పప్పు వెయ్యటం. అలా ఎంత సేపు చేసారో తెలీదు.


వీళ్ళని వెళ్ళి బకెట్లు వెనక పెట్టి కూర్చోమన్నారు. ఐదుగురూ ఆవురావురు మంటూ కడుపు నిండా తిన్నారు.

బయటికి వచ్చేసరికి ఎనిమిది దాటింది.


దీనిని లంగర్ అంటారు అంట, ఇక్కడ సేవ చేస్తే అనుకున్నది సాధించే ఏకాగ్రత వస్తుంది అంట.

అలసి మెట్ల మీద కూర్చున్నారు.


లోపల నుండి సాయంత్రం భజన మొదలయ్యింది


ఇక్ ఓంకార్

సత్ నామ్

కర్తా పురఖ్

నిర్భౌ

నిర్వైర్

అకాల్ మూరత్

అజూనీ

సైభంగ్

గుర్ ప్రసాద్


ఒకే ఓంకారం

అదీ సత్యం

అదే కర్త

నిర్భయ

నిర్ వైరీ

కాలం లేని

మొదలు లేని

స్వయంభూ

ఇది గురు ప్రసాదం.


కాసేపు లాగి మద్రాసీ అన్నాడు సాంఘా.


కిట్టుకి తన లోపలి భావం చెప్పే  హిందీ రాదు.


పంజాబ్ సింధు గుజరాత్ మరాఠా ద్రావిడ ఉత్కళ వంగా అన్నాడు జవాబుగా.



బోలో తారా రా రా..

 బోలో తారా రా రా..


ఉలిక్కిపడి లేచాడు కిట్టు. కల లోంచి తిన్నగా. అమ్మ భుజం మీద తల పెట్టుకుని పడుకున్నట్టు కల. అమ్మ పక్కన పడుకొని, చేతితో అమ్మను నిమురుతూ పడుకోవడం వాడికి అలవాటు. బస్సు సీటు తడిమేస్తున్నాడు కలలో. తల దగ్గర వెచ్చగా ఉన్నట్టుంది, సన్న జాజుల వాసన. ఎక్కడున్నాడు అని తెలియటం లేదు గాఢ నిద్రలోంచి తిన్నగా లేచినట్టు ఉంది.


నిద్ర రాదు అన్నావ్. చొంగ కార్చుకుంటూ పడుకున్నావ్.


వెక్కిరిస్తుంది జానీ.


ఈ పిల్ల ఎవరు. ఒక్క క్షణం తడబడ్డాడు.


వాన్ వెనుక సీట్లో, తను చండీగఢ్ వెళ్ళటం, నవోదయ గ్రూప్ లో ప్రయాణం ఒక్కసారి కళ్ళ ముందు ఫ్లాష్ అయ్యాయి.


చెరకు గెడలు తిన్నాక వాన్ వెనుక సీట్లో కూర్చున్నాడు కిట్టూ. వాన్ అంతా సామానులు చెల్లాచెదురుగా ఉంచారు. కిటికీ నుండి రోడ్డు చూడటం సరదా. అంతా నిద్రలో తూలుతున్నారు. పద్మజ మేడం తల మీద చున్నీ వేసుకుని పడుకున్నారు. మిగిలిన వాళ్ళు అంతే.


జానీ వెనక్కి వచ్చి కూర్చుంది. నీకు నిద్ర రావడం లేదా. ఊహు అన్నాడు. నాకు నిద్ర రాదు. ఎన్ని రోజులైనా ఉండిపోతాను అనడం గుర్తుంది.


మళ్ళీ ఇప్పుడు లేచాడు.


చండీగఢ్ లోపలకి వచ్చేశారు.


రోడ్లు వింతగా కనిపించాయి. పెద్ద వాహనాలు ఒకటి రాను, పోను రోడ్డులు. పక్కన చిన్న చిన్న ఆటోలు, రిక్షాలు లాంటివారికి వేరొక రెండు రోడ్లు. నడిచే వారికి, సైకిళ్లకు వేరే.


మన ఊర్లో ఒక్క రోడ్డు గొప్ప ఇక్కడ ఏకంగా నాలుగు రోడ్డులు, నడిచే వసతి ఉన్నాయి అనుకున్నాడు. ఇండియాలా లేదు. రోడ్లమీద ట్రాఫిక్ లైట్లు లేకుండా గుండ్రంగా వెళ్ళే దారులు ఉన్నాయి. వాటి మధ్యలో ఒక చోట రెండు యుద్ధ విమానాల నమూనాలు పెట్టారు.


ఇంకో చోట, మధ్యలో పార్కు. ఇంకో చోట నీరు పడుతున్న చిన్న ఫౌంటెన్ పక్కన గౌతమ బుద్ధుడు.


ఢిల్లీకి తలదన్నేలా ఉంది అనుకున్నాడు. పిల్లలు పెద్దగా అరుస్తున్నారు, అదిగో మొహాలీ స్టేడియం అని. అక్కడే పెద్ద పెద్ద క్రికెట్ మ్యాచులు అవుతాయి అంట.


చతురస్రానికి త్రికోణం తగిలించినట్టు బోర్డు పెట్టి సెక్టార్ పేర్లు రాసి ఉన్నాయి. తప్పిపోవడం ఇక్కడ కష్టమే అనుకున్నాడు కిట్టు.


ఊరికి అటు చివరన ఉంది సెక్టార్ 25. ఒక వైపు పంజాబ్ యూనివర్సిటీ ఒక వైపు నవోదయ నగర్.


అట్టహాసంగా ఉంది ఎంట్రన్స్.


సామానులు దించి వాన్ ఎటో వెళ్ళిపోయింది. సంచి, ఖాకీ డబ్బా ఎత్తుకునే లోపు.


టింగు టింగు టింగు టింగు అని పెద్ద పంజాబీ పాటల శబ్దాలు.


హాయో రబ్బా, హాయో రబ్బా

బోలో తారా రా రా


పెద్ద పెద్ద డోలు, డప్పులు, వేసుకుని పంజాబీ బట్టల్లో కుర్రాళ్ళు, అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు.


వీళ్లు వాన్ దిగిన క్షణం డప్పులు కొట్టడం మొదలు పెట్టారు.


చేతులు పైకెత్తి డ్రిల్లు చేస్తున్నట్టు డాన్సులు.


అనుకున్నట్టే తనతో వచ్చినవారంతా గెంతులు మొదలెట్టారు.


సామాన్లు పోతాయి అని బెంగ వీడికి. వీడి తువ్వాలు, సబ్బు, సబ్బు డొక్కు, బొమ్మలు, పెన్నులు, రబ్బర్లు, బట్టల సబ్బు, బ్రష్, టూత్ పేస్ట్, డ్రాయర్లు, చివరికి మంచి నీళ్ళు కొట్టేశారు వియ్యంపేటలో. అక్కడి నుండి అదో భయం పట్టింది.


కానీ తనతో వచ్చిన వాళ్ళకి వంటిమీద తెలివి లేదు. తాను కాపలా ఉంటాను అని గట్టిగా నిర్ణయం చేసుకున్నాడు.


ఇంతలో తల మీద చిన్న తెల్ల ముడి వేసుకుని, తన లాంటి ఒకడు తన ముందుకు వచ్చేసాడు.


కళ్ళలోకి చూస్తూ, బుర్ర ఊపుతూ,


బోలో తారారారా

బోలో తారారారా


అంటున్నాడు.


తప్పక వీడు కూడా అన్నాడు

బోలో తారారారా


బోలో తారారారా అన్నాడు ఆ గుంటడు మళ్ళీ


బోలో తారారారా

అన్నాడు.


ఇప్పుడు ఎడమ చెయ్యి ఎత్తి

బోలో తారారారా అన్నాడు ఆ గుంటడు.


వీడూ ఎత్తాడు,

ఎప్పుడు డాన్స్ మొదలయ్యింది తెలీదు


వాళ్ళల్లో కలిసి పిచ్చి పిచ్చిగా గెంతుతున్నాడు.


చమట పడి ఆరిపోతుంటే సుఖంగా ఉంది.


సామాన్లు పోతాయి అని ఆ గుంటడికి చెప్పాడు.


వాడు పక్కన ఉన్న వాళ్ళకు ఏదో అన్నాడు.


కాసేపటికి సామానులు కనిపించటం లేదు.


ఇంతలో ఇంకో బస్సు వచ్చింది.


అందులోంచి జపాన్ దేశీయులు దిగారు.


మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద డప్పులు కొడుతూ జనం వాళ్ళని చుట్టుముట్టేసింది.


దగ్గరకి వెళ్ళి చూస్తే వాళ్ళూ నవోదయ పిల్లలే. మణిపూర్, త్రిపుర, అరుణాచల్ నుండి వచ్చిన వాళ్ళు వారు.


తనమీద తనకే చాలా సిగ్గు కోపం వచ్చింది. వాళ్లను జపాన్ దేశీయులనుకోవడం. వాళ్ళకి అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళతో కలిసి కిట్టూ కూడా వెల్కమ్ చెప్పడం మొదలు పెట్టాడు,  పేర్లు అడిగి తెలుసుకున్నాడు.


ఎవరు ఇక్కడి వాళ్ళో ఎవరు పర్యాటకులో తెలీడం లేదు.


ఒక పిల్ల ఎర్ర నీళ్లు పళ్ళెంలో పెట్టుకుని, సింధూరం పెడుతుంది వచ్చిన వాళ్ళకి. అలా పెడుతుంటే మన నెత్తి మీద మనమే చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకుని పెట్టించుకోవాలి.


అదీ చేసేసాడు. బాగా అలిసిపోయాక, ఇందాకటి వాడు డార్మిటరీకి తీసుకువెళ్లాడు.


నా సామాన్లు పోయాయి మొర్రో అని ఎంత చెప్తున్నా వాడు లాక్కు పోతున్నాడు.


నాలుగు అంతస్తులుంది మెయిన్ బిల్డింగ్. ముఖమల్ కర్టెన్లు, వాటర్ కూలర్‌తో ప్రిన్సిపాల్ ఆఫీస్. మూడు అంతస్తులుంది హాస్టల్.


హాస్టల్లో వెళ్లగానే వీడిని మద్రాసీ అని పలకరిస్తున్నారు. నాది ఆంధ్రా అంటే, అదీ మద్రాస్ కదా అని.


రూముకు లాక్కుని తీసుకు వెళ్ళాడు. వీడు రూములోకి వెళ్తుండగా ఇద్దరు పిల్లలు హడావిడిగా బయటి పోతున్నారు. 


అక్కడ తన సామానులు పడేసి ఉన్నాయి. ఆరో క్లాసు రాజీవ్ హౌస్ మొదటి వారం లోనే అనుకున్నాడు  నవోదయ విద్యాలయాలో తాను రిపీట్ చెయ్యకూడని ఒకే ఒక తప్పు, సామాన్లు వదిలి ఆటకి వెళ్ళి పోవడం. 


గాభరా గాభరాగా ఒకొక్కటి లెక్క చూసుకుంటున్నాడు. 


(సశేషం)

ఏ దిల్లీ హై మేరీ జాన్

 ఏ దిల్లీ హై మేరీ జాన్


దక్షిణ ఎక్స్ప్రెస్ ఇప్పుడు భోపాల్ దాటి చాలా సేపు నడిచింది. దేశం చేతులు పైకి ఎత్తి కళ్ళ ముందు వళ్ళు విరుచుకున్నట్టు ఉంది. ఒక్కో ప్రాంతం చూస్తే ఇంకా బ్రిటీష్ రాజ్యంలా కనిపించింది కిట్టు గాడికి. 


రాళ్ళతో చేసిన రైల్వే స్టేషన్, పక్కన వాటర్ ట్యాంక్, ఆనుకుని ఒక చిన్న స్కూలు. ఎక్కడో తప్ప స్లాబు వేసిన ఇళ్ళు లేవు. 


ఇళ్ళకు బయట గోడలు ఇటుక బెడ్డలతో వదిలేసే ఉన్నాయి. అక్కడక్కడా  ట్రైన్ పట్టాల దగ్గర రోడ్డు ట్రాఫిక్ నిలిపి ఉండటం చూసాడు. తన సొంతూరు ఇలా పుట్టిందే ఒక రైలు గేటు పక్కన. 


అక్కడ గేటు పడితేనే వ్యాపారం. అలా గేటుని నమ్ముకుని బతికేవాళ్ళు అక్కడి మంగలి వాడు, అరటి పళ్ళు, తాండ్ర అమ్ముకునే వాళ్ళు. 


ఒక చోట ట్రైన్ పక్కన ఒకామె స్నానం చేస్తుంది చిన్న కొలనులో. జానీ కి చూపించాడు విచిత్రంగా ఆవిడ చీర తెర గా కట్టుకుని, లంగాలో స్నానం చేస్తుంది.  జానీ చెప్పింది,

కిట్టూ ఆవిడకు ఒకటే చీర ఉంది అని. ఆశ్చర్య పోయాడు,  ఆడవాళ్ళ దృక్కోణం అంత వేరేగా ఉంటుందా అని. 


తన మీద తనకు సిగ్గేసింది.


దక్షిణ ఎక్స్ప్రెస్ గ్వాలియర్ దాటింది చంబల్ లోయలోకి ప్రవేశించింది. 


చిన్న సందుల్లాంటి లోయల్లో వేశారు ట్రైన్ పట్టాలు. చుట్టూ బంజరు భూములు. గుర్రాలతో సవారీ చేసే వాళ్ళు ఇంకా కనిపిస్తూనే ఉన్నారు. 


ఇది హైదరాబాద్ చుట్టూ ఉన్న బండ రాళ్ళ భూముల్లా కాదు, గడ్డి భూములు. ఒక మనిషి నిలుచున్నా కనిపించని అంత ఎత్తు గడ్డి. 


మొరీనా అన్న ఊరు వచ్చింది. పోలీసు ఒకడు పెట్టెలో నిల్చున్నాడు. రైలు పెట్టెల తలుపులు మూయించి ఉంచారు. ఇంకా బందిపోటు భయం ఉన్నట్టే. రైలు ఆగినప్పుడు చిన్న చిన్న స్టేషన్లలో పాత కాలం తుపాకీ లు పట్టుకుని, ఖాకీ నిక్కర్లు వేసుకున్న రైల్వే పోలీసులు.


భూమి లోపలకి తవ్వి, వేసినట్టు ఉన్నాయి ట్రైను పట్టాలు. పక్కన ఎత్తు మీద గుర్రం తోలే వాళ్ళు అక్కడక్కడా కనిపించారు. 


చంబల్ దాటింది సాయంత్రానికి. 


ఆగ్రా కంటోన్మెంటు. 

ఇక్కడ దక్షిణ ఎక్స్ప్రెస్ ఒక సామాన్య  రైలు మాత్రమే. ఎక్కడెక్కడి నుంచో రైళ్లు ఇక్కడ కలుస్తాయి. తొమ్మిదో నంబర్ ప్లాట్ఫారం. 


చలి ఎముకలను కొరికేలా ఉంది. కిటికీలు తలుపులు అన్ని మూసే ఉంచారు. జానీ చాలా సేపు కిందనే ఉంది, రాజాయి షేర్ చేస్తూ. 


కిట్టూ అమ్మ ఇచ్చిన స్వెట్టర్ వేశాడు. జానీ పగలబడి పగలబడి నవ్వింది. ఇది లేడీస్ స్వెట్టర్ రా అని.


కిట్టు చెప్పాడు, స్వెట్టర్ ఎలా అప్పుగా వచ్చిందో. 


రాత్రి చాలా పొద్దుపోయాక తను పైకి వెళ్ళిపోయింది.


హస్తిన


నిజాముద్దీన్ స్టేషన్. 

తెల్లవారు జాము మూడు గంటలు. 


సామానులు పట్టుకుని అప్పటికే అందరూ దిగి పోయారు.


చలి ప్రాణం తీసేలా ఉంది. అన్ని చోట్ల ఒకేసారి కత్తులతో పొడిచిన్నట్టు ఉంది. చెవులు తిమ్మిర్లు కట్టేశాయి. చేతి వేళ్ళు నొప్పి పెడుతున్నాయి. 


సామానులు ఎత్తే కూలీలు చాలా డబ్బులు అడిగారు. ఇది డిల్లీ ఇక్కడ అన్నీ ఖరీదే.


పిల్లలు తమ తమ సామాన్లు పట్టుకుని ఓవర్ బ్రిడ్జి ఎక్కడానికి ప్రయత్నించారు. అవ్వలే. 


రెండు మూడు అంతస్తుల ఎత్తులో ఉంది ఓవర్ బ్రిడ్జి. ఇద్దరు కిందన ఉంటే మిగిలిన వాళ్ళు వస్తువులు ఎత్తుకుని పైకి మోసుకు వెళ్ళారు. 


అలా నాలుగు ఐదు పర్యాయాలు వెళ్లాక సామాను పైకి చేరింది. 


అక్కడ నుండి ఏ గేటుకు వెళ్ళడం కనుక్కోవడానికి మేడమ్ వెళ్ళారు. ఇక్కడ ఆవిడ కూడా కొత్తే. 


చాలాసేపటికి మార్గం తెల్సింది. ఇంకా తెల్లవారు కాలేదు. బ్రిడ్జి దిగారు. అక్కడ నుండి నలుపు పసుపు రంగు అంబాసిడర్ కారులో ఇంకో రైల్వే స్టేషన్ కి వెళ్తున్నారు. 


న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. అక్కడ ఎంట్రన్స్ ఎలా ఉంది అంటే సినిమా వదిలాక జనం ఎలా ఉంటారో అలా. 


మూడు చక్రాల బళ్ళు, రిక్షాలు, ఆటోలు, ఎడ్ల బళ్ళు, చేత్తో లాగే రిక్షాలు చెల్లా చెదురుగా ఉన్నాయి. 


లారీ లాంటి బస్సులు తిన్నగా స్టేషన్ ముందుకు వచ్చి నిలబడ్డాయి. 


ఆకలితో నవోదయ పిల్లలు గొడవ పెడుతున్నారు. మేడంకి మతి పోతుంది. కోపం చిరాకు వచ్చేస్తుంది ఆవిడకి. 



ఆవిడ గొడవా గాభరా చూసి ఒక హోసూరు అబ్బాయ్  గట్టిగా చప్పట్లు కొట్టాడు. అందర్నీ ఆగమన్నాడు. ఒక చోట చేర్చాడు. సామాన్లు మధ్యలో పెట్టి లెక్క పెట్టాడు మొత్తం 13 ఉండాలి. సరిపోయింది. 


నేను బయటి వెళ్లి చూసి వస్తాను. ఇంగ్లీషు లో పొడి పొడి గా. 


మేడమ్ తో ఇక్కడ ఉండాలి. నో  లాయిటరింగ్.


వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేశాడు. గోడ అనుకునే ఒక చోటు తెరిచారు అంట. 


అక్కడికక్కడే రైల్వే కొళాయి దగ్గర బ్రెష్ చేశారు. వీళ్లను వింతగా చూస్తున్నారు చుట్టు పక్కల. మొహం కడిగారు. ఇంత గొడవలో కూడా జానీ చక్కగా తయారు అయిపోయింది. కిట్టు వెనక్కి వెళ్ళి మళ్ళీ సబ్బుతో మొహం కడిగి, అంతటి చలిలో జుట్టు కడిగి దువ్వాడు. 


అందరూ అటు వెళ్ళారు పోలో మంటూ సామాను చేతుల్లో ఎత్తుకుని. 


స్టేషన్ గోడకు ఆనుకుని కళాయి. ఒక సర్దార్జీ దుకాణం. 

అయిదు రూపాయలకు రెండు పెద్ద పెద్ద బటూరా. బటూరా  పూరీలు ఏకంగా పళ్ళెం సైజులో ఉన్నాయి. కావలసిన కూర మనమే వేసుకోవాలి. సర్దార్. నవ్వుతూ వేస్తున్నాడు. 


వాహే గురూజీ కా ఖాల్సా, అంటే 

వాహే గురూజీ ఫతే అని జవాబు ఇచ్చుకుంటున్నారు వచ్చి పోయే వాళ్ళు. 


ప్రాణం లేచి వచ్చింది అందరికీ. మేడం మెచ్చుకుంది హోసూరు అబ్బాయిని. ఇంకా ఈ గ్రూప్ కి గ్యాంగ్  లీడర్ నువ్వే అని నవ్వుతూ.


తరువాత ప్రయాణం అంబాల కంటోన్మెంట్.


మొదటి ట్రైన్లో టిక్కెట్లు దొరకలేదు. రెండోది, 

అమృతసర్ శతాబ్ది ఎక్స్ప్రెస్. అందులో టిక్కెట్లు దొరికాయి అందరికీ. 


అంబాలా లో దిగాక అక్కడకి నవోదయ బస్సు వస్తుంది అంట. ఫోను చేసి చెప్పారు. 


ఎండ కాస్తుంది కానీ వేడి లేదు. పొగ పోగా ఉంది. పొయ్యి పొగ లో కి తడి మంచు కలిసిన వాసన. ఇది విచిత్రంగా ఉంది. స్టేషన్ మీద కూలీలు మంట పెట్టారు. అక్కడకి ఒక్కొక్కరూ చేరుకున్నారు. 


అమృతసర్ ట్రైన్ వచ్చేసింది. చాలా మిలిటరీ వాళ్ళు , సర్దార్జీలు ఉన్నారు. 


అందరూ ఒకటే చోట చేరారు. గందర గోళంగా ఉంది. రకరకాల భాషలు. రంగుల రంగుల బట్టలు, తల పాగాలు. 


బండి కదిలింది. 


డిల్లీ దాటుతుంది ట్రైన్. హృదయ వికృతంగా ఉన్నాయి ట్రైన్ చుట్టూ ఉండే బస్తీలు. కల్లమ్మట నీళ్ళు వచ్చేశాయి అక్కడి దృశ్యం చూసి. 


ఆకుపచ్చ డేరాల్లో ఇల్లు. ఇళ్లకు పిచ్చి పిచ్చి తీగలతో కరెంట్ వైర్లు. 


కొన్నిళ్ళకి బయట యాంటెనాలు ఉన్నాయి. అక్కడే స్నానాలు, పానాలు, గుంపులు గుంపులుగా పసి పిల్లలు ఏడుస్తూ, మట్టిలో దొర్లుతూ ఉన్నారు. 


ట్రైన్ పట్టాలు ఒకటి రెండు కాదు, లెక్క పెడితే పద్దెనిమిది దాటి ఉన్నాయి.  కిట్టూ కి వాంతి, ఏడుపు వస్తుంది ఎదుటి దృశ్యం చూసి. ఇక్కడ తను పొరపాటున దిగిపోయి తప్పి పోతే తను కూడా అలాగే ఉండాలా అని. కష్టాలున్నా నవోదయ ఒక స్వర్గం అనుకున్నాడు కిట్టు. 


నవోదయ పిల్లలందరూ అవాక్కయి ఉన్నారు. డిల్లీ అంటే ఇలా అని. చుట్టు పక్కన జనాలు మామూలుగానే చూస్తున్నారు. 


అంబాలా కంటోన్మెంట్ చేరారు.


వేగం వేగంగా దిగారు. దిగిన మరు క్షణంలో ట్రైన్ కదిలింది. 


బయట ఒక పావుగంట లోనే, గ్రే కలర్ వాన్ మీద నీలం రంగు పట్టి, పట్టీ మీద జవహర్ నవోదయ విద్యాలయ, సెక్టార్ 25 , చండీఘడ్.


ఎక్కేసారు. పంజాబ్ మిలిగిన దేశంలా లేదు. సుభిక్షంగా ఉంది. కను చూపు మేర పంట పొలాలు. ట్రాక్టర్లలో రైతులు. పంపు నీరు పక్కన ఆడుకునే పిల్లలు. 


 ఒక చోట ఆగిన చెఱకు లారీల లైన్ కనిపించింది. 


జానీ పేచీ పెడుతుంది పద్మజా మేడం తో. మేడం తిడుతున్నారు. ఆగమని. జానీ గొడవ తట్టుకోలేక. వాన్ ఆగించారు. అందరూ దిగారు. 


జానీ వెళ్ళింది, ఆగిన లారీ పక్కకి వెళ్ళి. 


వాహే గురూజీ కా ఖాల్సా అన్నది. 

వెంటనే వాహే గురూజీ కా ఫతే. జవాబు. 


చెఱకు ఇస్తారా అని అడిగింది.


లారీ వాడు సంతోషంగా కొన్ని చెఱకు గెడలు లాగి ఇస్తున్నాడు. 


కత్తి తో నిలువుగా కొట్టి ముక్కలు చేస్తున్నాడు. జానీ చనువు చూసి నవ్వుతున్నారు అంతా. వాడితో వెళ్ళిపోవే అని మేడమ్ జోక్ చేశారు. 


పంజాబీ లారీ లోంచి, పాటలు వస్తున్నాయి. 


తుమ్ తో టెహరే  పరదేశీ

తుమ్ తో టెహరే పరదేశీ

సాథ్ క్యా నిభావోగే

తుమ్ తో టెహరే పరదేశీ

సాథ్ క్యా నిభావోగే


చెరకు గడలు తింటూ వాన్ వెనుకకి వెళ్ళాడు. వెనుక పెద్ద నవోదయ లోగో వేసి ఉంది.


ఎప్పుడూ ఇంత దగ్గరగా పెద్దదిగా చూళ్ళేదు. 


లోగో బొమ్మలో,

ముగ్గురు పిల్లలు, వెనుక ఇద్దరు పెద్దలు, ఒక కంప్యూటర్, పుస్తకాలు. గడ్డి మొక్కలు. 


లోగో కిందన చిన్న అక్షరాలతో రాసి ఉంది... 


ప్రజ్ఞానం బ్రహ్మ....

ధృవ తార

 ధృవ తార 


పోరా డోంగ్రీ లో పొట్ట చెక్కలయ్యే వరకూ నవ్వుకున్నాక, లంచ్ తెప్పించారు టీచర్. నవోదయ పిల్లల్ని అందర్నీ కాసేపు ఒక చోట చేర్చి అందరి ఎగ్జిబిషన్ సామాన్లు ఉన్నాయా లేదా చూసుకున్నారు. 


త్రిశూరు నుండి వచ్చిన ఇద్దరు పిల్లలు భలే నవ్వించే వాళ్ళు. వచ్చీ రాని హిందీ వాళ్ళది. 


ట్రైన్ స్టేషన్ లో దిగి, 


వి వాంట్ చికెన్ అన్నారు. 

షాపు వాడు తెల్ల ముఖం. 


ఎగ్గు. 

షాపు వాడు తెల్ల ముఖం.


అండా 

వాడు గుడ్డు తీశాడు. ఆమ్లెట్ వెయ్యటానికి.


గుడ్డు పట్టుకొని.

మదర్ ఆఫ్ అండా.

మళ్ళీ తెల్ల ముఖం.


అండా కీ మా, అడిగాడు.


భళ్ళుమని నవ్వులు.


ఇంతలో కొంత మంది అబ్బాయిలు లాంటి వారు అమ్మాయిల బట్టల్లో ట్రైన్లోకి ఎక్కారు. 


మేడమ్ డబ్బులు తీసి ఇచ్చారు. 


వీళ్లిద్దరూ పల్లకుండా. వారిని అడిగారు. బాయ్ ఆర్ గర్ల్ అని అడిగేసాడు.

వాళ్ళు చాలా సేపు ఆట పట్టించారు ఇద్దర్నీ. చూస్తున్న వాళ్లు చాలా నవ్వారు. 


కాసేపటికి. 


నవోదయ తరువాత ఏమి చేస్తారు అనే టాపిక్ వచ్చింది. 


జానీ ఏదో చదువు పేరు చెప్పింది. కిట్టు కి అర్థం కాలేదు. 


మళ్ళీ చెప్ప మన్నాడు. కంప్యూటర్ శాస్త్రం, పేరు ఎప్పుడూ వినలేదు. ధార్వాడ్ అబ్బాయ్, ప్రతాప్ అన్నాడు. అది ఐ ఐ టీ లో ఉంటుంది అని. 


 ఐ ఐ టీ అంటే ఏమిటి అడిగాడు కిట్టు. 


గొంతులో ఒక గౌరవం తో, ప్రతాప్ అన్నాడు, ఇండియన్ ఇన్స్ట్రిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ. కేవలం ఐదు ఉన్నాయి అంట.


మిగిలిన వారు చెప్తుంటే, పద్మజా మేడమ్ కూడా చెప్పారు. ఆవిడ ఇమ్మునోలాజీ లో పీ. ఎచ్. డీ. చేస్తున్నారు అంట.


అదేమిటి అడిగాడు. ఆవిడ చెప్పింది. 


వీళ్ళు ఎవరూ తనకు తెలిసిన చదువులు చదవటం లేదు అనుకున్నాడు కిట్టు. 


కాసేపాగి, ప్రతాప్ పక్కన చేరాడు. తన ఎగ్జిబిట్ చిన్నది అని, తన వాలకం చూసి ఇచ్చారు ప్రైజ్ అని వచ్చే ముందే ఎవరితో అంటుంటే విన్నాడు ప్రతాప్. అందుకు కొంచెం బెంకు. అయినా అడిగేశాడు. 


అన్నా. ఐ ఐ టీ ఎక్కడున్నాయి. చెప్పాడు. ఎందుకు ఇవి గొప్ప. 


దేశంలో మొత్తం వెయ్యి సీట్లు తంబీ. అంటే నవోదయ కంటే చాలా కష్టం అన్నమాట. మన దేశంలోని అన్ని ప్రాజెక్టులు వాళ్లే చేస్తారు. ప్రతాప్ అన్న మాటల కంటే అనే విధానంలో అర్థం ఔతుంది కిట్టూ కి.


ఎలా చదవాలి. 


బ్రిలియంట్ అనేది ఉంది. అక్కడ నుండి బుక్స్ తెప్పించి కోవాలి. తరువాత 11 , 12 లో బాగా కష్టపడాలి. నవోదయలో కాదు బయటికి వెళ్ళి చదవాలి. 


కిట్టు అడిగాడు. బుక్స్ కోసం ఎలా. అడ్రస్ చెప్పాడు. 


కిట్టు పాకెట్ బుక్ గాభరాగా తీసి, అందులో రాసుకున్నాడు. బ్రిలియంట్ ట్యుటోరియల్స్, టీ నగర్, మద్రాసు.


జానీ వచ్చింది. తన పాకెట్ బుక్కు మీద ఎందుకు అందరి కన్ను పడుతుందో అనుకున్నాడు కిట్టు. 


పక్క బెర్త్ లో కూర్చొని, పొడవాటి గోళ్ళతో రక్కుతుంది , రమ్మని. కిట్టూ కి మరదలు గుర్తుకు వచ్చింది. ఇంటికి తన మరదలు గానీ, చెల్లి గానీ వస్తే రాంగానే వారికి ప్రేమగా కూర్చో పెట్టి ముందు గోళ్ళు తీసేసి వాడు. జానీ తో ఆ పని చెయ్యక పోయాడు. 


వెళ్ళాడు. బుక్కు చూపించమని పేచీ. సరే. నేను చూపిస్తే, నీ డైరీ చూపించాలి. 


నేను డైరీ రాయను. 

అయితే నీ మనసులో ఉన్నవి చెప్పాలి. లేకపోతే ఇది ఫెయిర్ కాదు. ఇద్దరూ ఒక ఒప్పందానికి వచ్చేశారు. 


పక్క బోగీ లోకి వెళ్ళారు. 

ఖాళీ చూసుకుని కూర్చున్నారు. 


జానీ డైరీ చూస్తుంది. 

చిరు నవ్వు. 


ఇంకా పేజీలు తిప్పింది. 

నీకు ఇంత కసా కిట్టు? 


జవాబు లేదు. 

జానీ కిట్టు కలిపి రాసిన సంతకాలు చూసింది. 


మూడు నాలుగు పేజీల నిండా అవే. 


వింధ్య కొండల్లోంచి పరుగులు పెడుతుంది దక్షిణ ఎక్స్ప్రెస్. 


గాలిలో చెట్ల వాసన.

కిట్టు తన రహస్యాలు అన్నీ ఒకే సారి బయటకు వచ్చేశాయి అని భయం భయంగా చూస్తున్నాడు. 


కళ్ళల్లోకి చూస్తుంది జానీ. కోపమా అని వెతుకుతున్నాడు తన కళ్ళల్లో. 


ముందు ఎడమ కంటిలోకి చూశాడు. మళ్ళీ కుడి కంటిలోకి. మళ్లీ ఎడమ, మళ్ళీ కుడి. జానీ అదే చేస్తుంది. కళ్ళల్లో ఏదో వెతికి పట్టుకునే ప్రయాస. 


అనాలోచితంగా ముక్కు మీద కు మళ్ళింది దృష్టి. ముక్కు మీద కోపం లేదు.  


కళ్ళు కిందికి జారాయి. పెదాల మీద నవ్వు లేదు. ఏదో ట్రైన్ కుదుపు కి కంపిస్తున్నట్టు ఉన్నాయి. అర్థం కాని , పరిచయం లేనిది ఇది కిట్టూ కి. 


జానీ కళ్ళల్లోకి చూసాడు ఈసారి. 


చటుక్కున తను తల దించుకుంది. 


తల మీద పెట్టిన హెయిర్ బ్యాండు మెరుస్తుంది కిరీటంలా.  బయట ట్రైన్ పట్టాలు మారిపోతున్నాయి. 


ఇంతలో దూసుకువెళ్తుంది పక్క ట్రాక్ మీద ఇంకో ట్రైన్. 


గాలి బాంబు పడినట్టు ఒక్క సారిగా కొట్టింది , ట్రైన్ పక్క ట్రాక్ లో వచ్చినప్పుడు. 


తనుదించిన తల ఎత్తలేదు. వంగి చూస్తున్నాడు. 


తల ఇంకా కిందకి దించుకుంటుంది. 


ఇంకా వంగాడు. 

ఇంకా  క్రిందికి దించుకుంది. 


గెడ్డం మీద చాలా సున్నితంగా చెయ్యి పెట్టి ఎత్త బోయాడు. 


లెంపకాయ గుర్తున్నా. కుతూహలం ఆగలేదు. 


తను రెండు చేతులూ ముఖం మీద అడ్డం పెట్టుకుంది. 


తల ఇప్పుడు ఎత్తాడు, జానీ చేతులు అడ్డు తీయటం లేదు. 


ఎందుకు జానీ అంటున్నాడు. 


నీకు సిగ్గు రాదా కిట్టూ ? 


ఓ సిగ్గా 

అర్థం అయింది. 


పో కిట్టూ 

ఒక్కదాన్నే వదిలేయనా


పొమ్మన్నానా

లేచాడు, వెళ్ళడానికి 


చెయ్యి పట్టుకుంది 

కూర్చున్నాడు


నీ డైరీ చూపించినందుకు చాలా చాలా థాంక్స్. జానీ చెప్పింది. 


చటుక్కున డైరీ జేబులో పెట్టుకున్నాడు. 


అలా సైలెంట్గా చాలా సేపు ఉండడం కిట్టూ కి అర్థం కాలేదు.


ఏమన్నా అంటావా జానీ. మొహం అడ్డంగా ఊపింది.


 తర్వాత చెప్తావా ? పైకి కిందకీ ఊపింది.... సరే. వెళ్దామా. 


తమ సీట్లోకి చేరారు.


జానీ కి చివరికి బెర్త్ దొరికింది. కిట్టూ మీద బెర్తు. 


అందరికీ దొరికినట్టే. కానీ ఒక్క చోట కాదు. మేడమ్ సాయంత్రం మళ్ళీ అడుగుతాను అంటున్నారు. పిల్లలు మీరు రెస్ట్ తీసుకోండి. మేము అడ్జెస్ట్ అవుతామన్నారు. 


భోపాల్ దాటింది. 

స్కూళ్లో పటంలో చూసాడు ఆ ఊరు. 


చాలా సందడి గా ఉంది. అర గంట హాల్ట్ . 


హిగిన్స్  బోతాం. పుస్తకాల షాపు చూసి చాలా సందడి అయ్యాడు. 


ఇండియా టుడే కొన్నాడు. జానీ పాటల క్యాసెట్, నిప్పో బ్యాటరీలు తెచ్చింది. 


వాక్మన్ ఇప్పుడు వాడుకో వచ్చు. 


భోపాల్ అంటే అక్కడ జరిగిన ఘోరం గుర్తుకు తెచ్చుకున్నాడు కిట్టు. ఈ ఊరు ఇలా మామూలుగా ఉంటుంది అని అనుకొనే లేదు. 


భోపాల్ దాటే సరికి మధ్యాహ్నం దాటింది. మళ్ళీ ఎవరెవరో వచ్చి కూర్చున్నారు. సియాచిన్ వెళ్ళే ఆయన పై బెర్తు పడుకుని లో ఇప్పటికి లేచాడు.


మంద్రంగా చలి గాలి. 


వాక్మన్ తీసుకుని బెర్తు మీద జానీ కూర్చుంది. రాజాయి లో కాళ్ళు పెట్టుకుని. 


ఒక స్పీకర్ తన చెవిలో పెట్టింది. 


ఓ చెలియా నా ప్రియ సఖి వా..." 

వీచేటి చలిగాలులకు తెరచాపై నిలిచేనే

నా ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే

నీ అందెలలో చికుకుంది అని నీ పదములు చెరితినే


ఈ పూట చెలి నా మాట ఇక కరువైపోయెనులే, జానీ కిట్టుని కళ్ళల్లోకి చూస్తుంది. 


కిట్టు పాట విని పాకెట్ బుక్కు తీసి రాశాడు ఇదే వాక్యాన్ని. 


ముందటి పేజీలో, చూసాడు


బ్రిలియంట్ ట్యుటోరియల్స్

టీ నగర్ 

మద్రాసు 

కోర్సు: టార్గెట్ ఐఐటీ.

పోరా డోంగ్రీ...

 పోరా డోంగ్రీ... 


సొరంగంలో అగిన బండి లో కీచురాళ్ళ శబ్దం కమ్ముకుంది. చీకట్లో జానీ కిట్టు. దూరం వచ్చేశారు సాహసం చేసి గుండె శబ్దం  మాత్రం వినిపిస్తుంది. చెయ్యి గట్టిగా పట్టుకుంది జానీ, చెమ్మగా ఉంది. 


ఏవో హిందీ లో అరుపులు. పూలమ్మే వాళ్ళు దిగి పోతున్నట్టు లీలగా అర్థం ఔతుంది. 


ఎంత శబ్దం చేసి ట్రైన్ ఆగిందో అంతే శబ్దంతో బయలు దేరింది. 


పూలు అమ్ము కున్న వాళ్ళు, పెళ్లి కొడుకు, కూతురు, ఆ పెట్టే వాళ్ళు దిగి పోయి నడుస్తున్నారు. 


పూలమ్మే వాళ్ళు, పెళ్లి వాళ్ళు, పేకాట వాళ్ళు అంతా దిగిపోయాక బోగీ ఒక్కసారిగా ఖాళీ అయింది. కానీ సంపంగి వాసన మాత్రం అక్కడే మిగిలిపోయింది.


ఇద్దరూ ఇందాక పెళ్లి బృందం ఖాళీ చేసిన బెర్తు లో కూర్చున్నారు. 


జానీ కళ్ళల్లో బయటి దృశ్యం ప్రతిబింబిస్తుంది. ఉంగరాల జుట్టు ఒక  పాయ  గాలికి ఎగిరి కిటికీ లోంచి బయటకి లోపలికి వస్తూ పోతుంది. జానీ కురుల వాసన సతమతం చేస్తుంది కిట్టూని.


చిక్ షాంపూ మొత్తం ఒకే సారి రుద్దేశావా జానీ?


నీలా క్కాదు. నీట్ గా ఉంటాను. కిట్టు ఉంగరాల జుట్టు ముందుకు లాగి అన్నాది. 


ఔను అందరూ అదే అంటారు కదా .


మరి. జానీ ఇస్ ద బెస్ట్. 


నీకు పొగరు కూడా ఎక్కువే ! 


అంటే తెలివి కూడా ఎక్కువ అని ఒప్పుకుంటున్నావా ?


కాదు బలుపు ఎక్కువ అని. కిట్టు గడుసుగా సమాధానం వేశాడు. 


జానీ కి కోపం వచ్చింది. 


కొట్ట బోయింది. 


అడ్డుకున్నాడు.


కొంచెం గట్టిగానే అడ్డుకున్నాడు. 


తను మళ్ళీ కొట్టింది. 


తిరిగి అడ్డుకున్నాడు. దీన్నే బలుపు అంటారు. 


శెట్టి, జానీ అంది 


బుబక, కిట్టు 


గొడవ నవోదయ భాషలో తారా స్థాయి చేరినట్టే . 


కిట్టు చేతిమీద కొట్టాడు. 


ఆడ పిల్లని కొట్టడం హీరో కాదు. 


నువ్వు ఆడపిల్ల అని ఎవరన్నారు. 


కిట్టూ ... గట్టిగా అరిచింది. 


మళ్ళీ లెంపకాయ్ గుర్తుకు వచ్చి  ఆగిపోయాడు. 


సారీ. చెప్పాడు కిట్టు.


పోరా


సారీ 


పోరా - జానీ


కిట్టూ ఏమీ అనలేదు. 


జానీ యే సారి చెప్పింది ఈ సారి. 


ఒకే సరే ఇద్దరూ నవ్వేశారు.


నీకు అసలు భయం ఉండదా , కిట్టు అడిగాడు. 


భయం వేస్తుంది అయినా చేసెయ్యాలి. 


కిట్టు అర్థం అయినట్టు బుర్ర ఊపాడు. 


అందర్నీ ప్రశ్నలతో చంపుతావెందుకు ? జానీ అడిగింది. 


అది అంటే, అంతే, కుతూహలం. క్యూరియాసిటి యూ నో ?


నాకు ఇష్టం. నా గురించి నువ్వు అడిగినన్ని ప్రశ్నలు ఎవ్వరూ అడగరు. 


నువ్వు అసలు అర్థం కావు. అన్నాడు  కిట్టూ..


ఇప్పుడు ఎలా ఉంది కడుపులో. 


ఆల్ గుడ్. ఆకలి వేస్తుంది రా. 


బండి అంతా ఖాళీ ఉంది ఇప్పుడు. 


తమ బోగీ చేరేటప్పటి పద్మజా మేడమ్ ఎదురు చూస్తున్నారు. 


కిట్టు ఎక్కడకు పోయారు అని. జానీ చెప్పింది  తానే తీసుకు వెళ్ళాను అని. 


మేడమ్ లంచ్ అన్నాడు. ఆర్డర్ ఇచ్చేశాను వస్తుంది అన్నారు మేడమ్.


బండి ఒక  స్టేషన్ దగ్గర ఆగింది. 


ఎర్ర జెండాతో రైల్వే స్టేషన్ మాస్టారు. 


స్పష్టంగా కనిపిస్తున్న అతని చెక్క బల్ల. బల్ల మీద నాలుగు శ్యాంప్రసాద్ సార్ ఇంటిలో చూసిన రకం ఫోన్లు. 


ఒక చేతి భుజం మీద రింగులాంటి వస్తువు ఉంది. చిన్న పిల్లల ఏడుపులు, తప్ప శబ్దం లేదు. 


పెద్ద పెద్ద రాళ్లతో కట్టిన స్టేషన్ అది. రాళ్లకు పసుపు రంగు సున్నం దండిగా వేశారు. స్టేషన్ మాస్టర్ రూమ్ లో పెద్ద క్యారేజ్ నాలుగు డబ్బాలు, వాటిని పట్టుకుని ఉంచే స్టాండులో చెంచా. చూస్తేనే ఆకలి వేసేలా ఉంది ఆయన క్యారేజ్. 


నెమ్మదిగా లోపలికి వెళ్ళాడు. ఆయన తీరు చూస్తే ఇక్కడ ట్రైన్ ఆగడమే కాదు. రోజూ ఆగేట్టు అనిపిస్తుంది కిట్టూ కి. 


రెండో వైపు వెళ్లి చూసాడు. రెండు మూడు పట్టాలు ఉన్నాయి. నీలం సున్నం వేసిన స్కూలు బిల్డింగ్ పక్కనే చాలా ఎత్తున్న మామిడి చెట్టు. వరండాలో పిల్లలు రాళ్ళతో ఆడుకుంటున్నారు. కిట్టూ శేషు చక్రి భామా రుక్మిణి ఆడుకున్న రాళ్ల ఆట గుర్తుకువచ్చింది కిట్టూ కి. 


జానీ , కిట్టూ కిట్టూ స్టేషన్ పేరు చూడు. 


వెళ్ళి చూసాడు. 


గోరా డోంగ్రీ. అని పెద్ద అక్షరాలతో రాసి ఉంది.


పోరా డోంగ్రీ అంటే నవోదయలో పెద్ద తిట్టు. 


కడుపు చెక్కలయ్యే వరకు నవ్వుకున్నారు.

*సింగ పూరు సెంటు చీర స్టీలు ప్లాంటు గాజువాక ...*

 *సింగ పూరు సెంటు చీర స్టీలు ప్లాంటు గాజువాక ...* 


దక్షిణ్ ఎక్స్ప్రెసెస్ ముందుకు పరుగులు పెడుతుంది. 


దేశం వెనక్కు వెళుతుంది. చెట్లు గుట్టలు గుళ్ళు కోనేర్లు గాభరా గాభరాగా ముందుకు వచ్చి, తల దించుకుని వెనక్కి పోతున్నాయి. 


తెల్లారే ముందే లేచాడు కిట్టు.


చలి చంపుతుంది. భూమ్మీద ఇలాంటి చలి కూడా ఉంటుంది అని తెలియదు కిట్టూకి. నిద్ర అనేది ఆటకి అడ్డంకి అనే వాడి దృడ నమ్మకం. 


రాజాయిలో ఎపుడు దూరాడో తెలీదు. నడుము వరకు వెచ్చగా ఉన్నాది , పయిన నవోదయ ఇచ్చిన తెల్లటి కాటన్  బెడ్షీట్ , అస్సలు కాయటం లేదు. 


బండి ఆగింది.


సేవాగ్రాం. వార్ధా వెళ్ళడానికి దిగాలి అని బిగ్గరగా చెప్తున్నారు. ఇంకా తెల్లవార లేదు. చలి చంపేస్తుంది. పల్లు కటకటా కొట్టుకుంటున్నాయి. కర్టెన్ లా కట్టిన బెడ్ షీట్ లాగి పైన వేసుకున్నాడు. మళ్ళీ కలలోకి జారిపోయాడు. 


కలలో అమ్మా నాన్నతో ప్రయాణం. అదీ ట్రైన్లోనే, గుడికి వెళ్తున్నారు రాయగడ. అక్కడ కూడా చలి. లీలగా బొమ్మలు కొనమని పేచీ పడుతున్నాడు.


ముడుకులతో ఎవరో తన్నినట్టయి లేచాడు. జానీ నిద్రలోనే కాళ్ళూ చేతులు కదుపుతూ పలవరిస్తుంది. 


లేచేసరికి నాగపూర్ స్టేషన్ వచ్చింది. స్టేషన్ అంతా నారింజలు. నారింజల వాసన. కోసి అమ్ముతున్నారు, బ్యాగుల్లో  వేసి అమ్ముతున్నారు. జ్యూస్ చేసి, ఎండ బెట్టి అలా అన్ని అవతారాల్లో నారింజ. 


ఎదురుగా కూర్చుని పద్మజ మేడమ్, జానీ, టీ తాగుతున్నారు. ఇంక లేస్తారా లేక పడుకుంటారా మహారాజు గారు అని నవ్వుతున్నారు.


కిట్టూ కి సిగ్గేసింది తన అవతారం ఊహించుకుని. చక చకా లేచాడు, బ్రష్ చేసుకుని , జుట్టు తడిపి చేతుల్తో దువ్వి వచ్చాడు. 


వచ్చేసరికి తన వయస్సులో ఉన్న కుర్రాడు. ఛాయా... ఛాయా .. అని వెళుతుంటే మేడమ్ ఆపి, ఏక్ దేనా చోటూ అన్నారు.  


కుట్టు చేతికి కాగితం కప్పు ఇచ్చాడు. పట్టుకునే లోపు పీపా ఎత్తి టాప్ తిప్పాడు. తీరా చూస్తే తెల్లటి నీరు. ఒక పొట్లం వేశాడు. టెట్లే అని రాసి ఉంది. ఇళ్లా మనమే ముంచుకుంటే టీ అవుతుందట. 


పద్మజా మేడం రేపటి ప్లాన్ గురించి జానీ చెప్తున్నారు. కిట్టు ని తనకు అప్ప చెప్పినట్టు.  తనను ఆటలో అరటి పండులా చూస్తున్నారా అనిపించింది. 


బయట చలి ముసుగులో భారత దేశం. 


అమ్మ ఫోటో చూట్టానికి, అమ్మను ఎదురుగా చూట్టానికి ఎంత భేదం ఉందో అలా ఉంది భారత దేశాన్ని దగ్గరా చూడటం. 


మాపులో ఉన్న నదులు, కొండలు, ఊర్లు ఇప్పుడు నిజంగా ప్రత్యక్షమౌతున్నాయి. 


పటంలో ఒక చుక్క లాంటి ఊర్లు , ఇక్కడ ముగ్గులు వేసిన వాకిళ్ళతో, జోడెడ్డు బండ్లతో, కోనేరు, కోవెలలతో ఉన్నాయి. మూడో తరగతి లో చదివాడు మరాఠీ సంస్కృతి గురించి. ఇక్కడ అదే చిలకట్టు కట్టిన మహిళలు, పిరమిడ్ రూపంలోని గుడి గోపురాలు. అక్కడక్కడా జట్కా బళ్ళు ఉన్నాయి. ఉమా మేడం మూడో తరగతిలో నీలం రంగు చీరలో  చెప్పిన క్లాసు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు ఉంది. 


నాగపూరు దాటాక నారింజ తోటలు. ఒక్కో చెట్టుకి పువ్వులు పోసినట్టు ఎర్రటి పసుపు ఆకుపచ్చ రంగులలో నారింజలు. 


అక్కడి మనుషుల వేషభాషలు చూస్తే ఇంకా గాంధీ, తిలక్ ఊళ్ళల్లో తిరుగుతున్నారు అనిపించింది కిట్టూ కి. 


దేశాన్ని అడ్డంగా విభజిస్తూ ఉన్నవి వింధ్య పర్వతాలు అని విన్నాడు. ఇప్పుడు కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. పర్వతాలు తన చుట్టూ చెట్ల చీర కట్టుకున్నట్టు ఉన్నాయి.  


చుట్టూ అరణ్యం. 


ఒక్కో చోట ట్రైను మలుపు తిరుగుతుంటే ఇంజన్ , గార్డ్ పెట్టీ ఒకే సారి కనిపిస్తున్నాయి. 


ట్రైను వేగం చాలా తగ్గింది. ప్రతి పావుగంటలో ఆగినట్టు ఉంటుంది. ముఖాల్లో కలవలికలు చాలా మారి పోయాయి. గంపల్లో కూరగాయలు వేసుకుని తన వయసు లోఉన్న పదమూడు పద్నాలుగేళ్ల అమ్మాయిలు అబ్బాయిలు సంతకు పోతున్నారు. 


 రిజర్వేషన్ అనే మాటే తెలియదు వచ్చి జానీ కిట్టు మధ్యలో కూర్చున్నారు గంపల్తో . కిట్టు వారి పేరు అడిగాడు, అక్క సయాలి, తమ్ముడు సాయ్.


 క్లాస్ అడిగాడు. పగలబడి నవ్వుతున్నారు. 


ఇస్కూల్ నహి జారీ.


మెడలో పెద్ద రింగు లాంటి సిల్వరు రంగు చక్రం వేసుకుంది సయాలీ. జానీ పట్టుకుని చూస్తుంది. దాని పేరు చెప్పింది అమ్మాయి. అబ్బాయ్ చేతికి దారాలు కట్టి ఉన్నాయి.


హామీ గోండు. అంటే జానీ చెప్పింది ఇక్కడి గిరిజనులు గోండు అంటారు అని.


ఎక్కడకి. అడిగింది జానీ. 


సంతకంట. 


గంపలో ఏముంది. 


గంప మీద గుడ్డ తీసింది. 


చింత పండు తొక్కతో ఉన్నాయి. ఈత పళ్ళూ. 


ఒకటి జానీకి, వీడికి ఇచ్చింది. 


చాలా బాగుంది అన్నాడు. తన

జేబులోని అమ్మ చేసిన బిస్కట్లు ఇచ్చాడు. ఇష్టంగా తిన్నారు. 


ట్రైన్ స్లో అయ్యింది, ఆగ కుండానే ఒక్కొక్కరూ దిగిపోయారు.


ఆ ఇద్దరూ దిగి చేతులు ఊపుతున్నారు నవ్వుతున్నారు కులాసాగా. 


కొంచెం సేపటి ఆమ్లా స్టేషన్. అక్కడ జుట్టు డిప్ప కటింగ్ తో, ఆకుపచ్చ ట్రంకు పెట్టె తో ఒక కుర్రాడు వచ్చాడు. వాడికి వీడుకోలు చెప్పటానికి పెద్ద మందే వచ్చింది. చంటి పిల్ల అబ్బాయి కి పాప కాబోసు. ఏడుస్తూ ఒక మహిళ భార్య అయి ఉంటుంది. స్టేషన్ చివర వరకూ ట్రైన్ తో పరుగెడుతూ టాటా చెప్పింది ఆవిడ. 


వీడ్కోలు లో ఉండే భావాలు ఎన్నో ఎన్నో సార్లు అనుభవించిన కిట్టూ కళ్ళు ఆ మహిళతో ఒక్క క్షణం కలిసాయి, మాట్లాడాయి. 


ట్రైన్ బయలు దేరింది. వాడు వీరికి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు. 


జానీ అడిగింది ఆప్ కహా జా రహే. 


తను సియాచిన్ వెళ్తున్నాడు అంట. 


ఎలా వెళ్తారు? కిట్టూ వెంటనే అడిగాడు. ఇది తెలుసుకోవాలి ఎలాగయినా. 


ఢిల్లీ వెళ్లి. 


అక్కడి నుండి ?


బస్సులో జమ్మూ. జమ్మూ నుండి కార్గిల్ ఇంకో ఊరు. అక్కడ నుండి సియాచిన్. మూడు వారాలు పడుతుంది అంట. 


ఒక ఫోటో తీసి చూపిస్తున్నాడు. తెల్లటి బట్టలతో కూర్చుని స్టౌవ్ మీద నీళ్ళు మరిగిస్తున్నారు. చేతుల్లో తుపాకులు. చుట్టూ మంచు.  


తను గర్వంగా చెప్తున్నాడు. అక్కడ తను చేసే పని. కిట్టూ కి గర్వంగా ఉంది, తనూ మిలట్రీ లో చేరతాను అని అనుకున్నాడు. వాడి మాట తీరు, నిటారుగా కూర్చోవడం, బలంగా సామాను ఎత్తడం చూసి. 


ట్రైన్ పెద్ద హారన్ మోగిస్తూ , సొరంగం లోకి వెళ్ళింది. అకస్మాత్తుగా చిమ్మ చీకటి. గమ్మత్తుగా ఉంది.


సొరంగం అయిపోయింది. ట్రైన్ కుడి వైపుకు తిరుగుతుంది. 


కిట్టు రా. కొంచెం తటపటాయించాడు. ఇలాంటి చోట ఎక్కడకి వెళ్ళడం అని.


రా .. రా... ఇప్పుడు గట్టిగా పిలుస్తుంది. 


కొండ చరియల పక్కన జారిపడేట్టు ఉన్న పట్టాలమీద మలుపు తిరుగుతుంది ట్రైన్. 


దడ్ దడ్ మంటూ శబ్దం రెండు బోగీలు కలిసే చోట. క్రింద ఉరుకులు పరుగులు తీస్తున్న పట్టాల మీద రాళ్ళు. రాళ్ళు కాకుండా వాటి ఛాయలు సినిమా రీళ్ల లాగ పరుగెడుతున్నాయి. 


అక్కడ వరకూ వచ్చి తడబడ్డాడు కిట్టు. జానీ వెనక్కి వచ్చింది చేతులు పట్టుకుంటూ దాటారు. 


దాటాక గుండెలో రాయి పడ్డట్టు ఉంది కిట్టూ కి. అంత ధైర్యం ఎలా వచ్చిందో అని. 


పక్క బోగీలో పెళ్లి బృందం. మెడలో డబ్బుల నోట్లు దండ గా కట్టి అమ్మాయి, అబ్బాయి. వారి చుట్టూ రక రకాల రంగుల బట్టల్లో జనాలు. 


పేక ముక్కలు ఆడుతూ కొందరు. తలకి చీర కప్పుకుని కూర్చున్న ఆడవారు. తల పాగాలు కట్టుకున్న మగ వారు ఒక పెట్టెలో. 


ఇంకో పెట్టెలో తలుపు దగ్గర గంప లతో పువ్వులు. సంపంగి లాంటి పువ్వేదో అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నారు దారి కడ్డంగా పెట్టి. 


ఒకో పెట్టెలో కిట్టు ఊహించని దృశ్యాలు. లైబ్రరీ పుస్తకాల్లో లేని వింతలు ఒక్కో బోగీలో. 


రెండు, మూడు, నాలుగు పెట్టెలు దాటాక, వంటలు చేసే భోగీ. గ్యాసు పొయ్యల్లో పెద్ద పెద్ద పాత్రల్లో ఏవో వంటలు. 


అక్కడ ఇందాకల టీ ఇచ్చిన అబ్బాయ్, ఇప్పుడు అన్నం తింటున్నాడు. హలో చెప్పాడు , చేయి పైకెత్తి. 


వంటల బోగీ అటువైపు ఫస్ట్ క్లాస్. 


కుంచెం దూరం ఉన్నాయి బోగీలు. రెంటిని కలిపే ఇనుప రేకులు ఇప్పుడు కాస్త ఎడంగా ఉన్నాయ్. జానీ టక్కున గెంతి దాటేసింది.


గెంతుతూ కళ్ళు మూసేసాడు.


ఒక వైపు పెట్టె లాంటి గదులు.  పక్కన నడిచే దారి. ప్రతి గదికి ఒక ఎర్రటి కర్టెన్. దారిలో ఎవ్వరూ లేరు. 


ఫస్ట్ క్లాస్ బోగీలో నడిచే గాలరీ దారిలో ఉండగానే 


పాయ్..... 

పాయ్... అంటూ పెద్దగా ట్రైన్ హారను మోగింది. 


ఇంకో సొరంగం. ఇద్దరి చుట్టూ చిమ్మ చీకటి కమ్ముకుంది. 


కీచు మంటూ ట్రైన్ ఆగిపోయింది. 


(సశేషం)

పచ్చని చిలుకలు తోడుంటే ...

 పచ్చని చిలుకలు తోడుంటే ... 


నాంపల్లి లో దిగారు ఇద్దరూ. సాయంత్రం కావస్తుంది. త్యాగరాజు సార్ ఆటో కట్టించారు. ఆటోవాడితో హిందీ లోనే బేరం.

కిట్టూ కి ఆటో ఎక్కడం అదే మొదటిసారి. 


ఆటో వెళ్తుంది. బయట ఉదృతంగా హైదరాబాదు. రకరకాల గొడవ గా ఉంది రోడ్డు. అక్కడక్కడా ఆకుపచ్చ జెండాలు. కొన్ని చోట్ల విశాలమయిన రోడ్లు ఇలా. 


ఊరికి దూరంలా ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోకి వెళ్లింది ఆటో. ఇంకా లోపల ఉంది నవోదయ సంగారెడ్డి, గచ్చిబౌలి. 


ఇప్పటి దాకా చూసిన స్కూళ్లకి దీనికి పొంతన లేదు. పెద్ద క్రికెట్ మైదానంలో యూనిఫామ్ వేసుకుని క్రికెట్ సామాగ్రి తో ఆడుతున్నారు. నాలుగు అంతస్తుల బిల్డింగ్ లో స్కూలు హాస్టల్స్!! 


సారు బయట ఉంచి ఆఫీసులోకి వెళ్ళారు. అక్కడే తర్ఫీదు ఇస్తారంట కొత్త టీచర్లకి. 


కాసేపటికి పొడువుగా షార్ప్ గా ఉన్న కుర్రాడు వచ్చాడు. నేను కృష్ణా రెడ్డి, 12 క్లాసు. ఇంతలో సార్ వచ్చారు, అరిస్టాటిల్, నిన్ను కృష్ణ రేపటి వరకు చూసుకుంటాడు. ఇక్కడికే ఎస్కార్ట్ వస్తారు రేపు, నీకు తెలిసిన పద్మజా మేడం, పెద్దాపురం నుండి. 


వీలయిన రెస్ట్ తీసుకో. డబ్బులు కావాలా, అన్నారు జేబులో చెయ్యి పెడుతూ. సార్ వద్దు సార్. అప్పటికే ఆయనకు పదకొండు రూపాయలు బాకీ కిట్టు, 7లో హౌస్ మాస్టర్గా ఉన్నప్పుడు. 


కృష్ణా వీడు ట్రైన్ కి వెళ్ళేముందు తినేటట్టు చూడు. గాభరా ఎక్కువ. అదర్ వైస్ ఈసీ కిడ్. ఇంగ్లీషులో పాస్ డౌన్ చెయ్యటం ఒక చనువు కి చిహ్నం అని అర్థం ఔతుంది కిట్టూ కి. 


తంబీ రా. వాడే డబ్బా, బాగు రెండూ వేసుకుని, తనతో చక్కా తీసుకు పోయాడు. మూడో అంతస్తులో రూమ్. రూములు ఖాళీగా విశాలంగా ఉన్నాయి. ఫ్యాన్, టేబుల్ లాంప్ ఇలాంటి కూడా. 


రాత్రి గడిచిపోయింది. ఉదయం లేచాడు. 


ఇంకా తయారు కాక ముందే, త్యాగరాజు సార్ రూమ్ లోకి వచ్చారు. 


ఎదుట కూర్చున్నారు. 


నాన్నా కిట్టూ, నేను ఇంక వెళ్ళాలి. ఫలక్నుమా కి. నీ కోసమే ఇంత దూరం. నువ్వు జాగ్రత్త. నీకు అర్జెంట్ అయితే ఇంటి నంబర్ కి చెయ్యి. మీ ఫాదర్ కి నేను దారిలో చెప్పి వెళ్తాను. ఇంట్లో ఏమయినా చెప్పాలా ? 


లేదు అన్నాడు. 


సరే. 


కృష్ణా రెడ్డిని చూసి. కృష్ణా పద్మజ మేడం మధ్యాహ్నం వస్తారు. ఆవిడకి పాస్ చెయ్యాలి నువ్వు. బోర్డ్ కి బాగా రాయ్ నాన్నా. అని చక్కా వెళ్ళి పోయారు. 


తయార్ అయి వచ్చాడు కిట్టు. అప్పటికే ఏదో రాస్తున్నాడు రెడ్డి. 


మీ స్కూల్ బాగుంది అన్నాడు. 


నా ఎగ్జామ్స్ కదా.  టైమ్ పాస్ కి, నువ్వు క్రికెట్ ఆడుతావా. ఇంకా స్కూల్ సెలవలు , కానీ వాళ్ళు ఇక్కడి కొచ్చి ఆడుతారు. సరే వెళ్ళాడు. 


మైదానం పచ్చగా ఉంది. పొగ మంచు ఇంకా పోలేదు. సెలవుల్లో కూడా స్కూల్ కి వచ్చి ఆడుకునే వారు ఉంటారా అని వింతగా ఉంది కిట్టూ కి. 


తంబి విజయనగరం నుండి నేషనల్కి వెళ్తున్నాడు. మీరు ఆడించండి నేను చదువుకోవాలి. 


రా. నేను కిషన్ రెడ్డి, న్నయింతు క్లాస్. కిట్టు పేరు చెప్పాడు. 


ఏ క్లాస్. 

చెప్పాడు.


ఔనా. 8 లో నేషనల్ కి కూడా పిలుస్తారా. 


బౌలింగ్ వచ్చా. తల అడ్డంగా వూపాడు.


బ్యాట్ ఇచ్చాడు. 

బాలు వెయ్యమన్నాడు. 


కొట్టాడు కిట్టు. చాలా బలంగా ఉంది కార్క్ బాల్. 


సరే. బౌల్ చేస్తావా. 


తల ఊపాడు. 


స్పిన్ ఎలా తిరుగుతుందో చెప్తున్నాడు. దూరంగా పరిగెత్తి కొంత వేగం వచ్చాక, తల మీదుగా వదలాలి బాలు. విసిరితే ఫౌల్.


అర్థం అయింది. 


వేశాడు. స్లో అయినా బాగా పడింది. 


అంతా ఇప్పుడు ఒకే. 

నువ్వు అలాగే ఆరు సార్లు వెయ్యాలి. 


ఒకటి రెండు జీరో బాల్స్ వేశాడు. కమాన్ కమాన్ కిట్టు అని ఫీల్డింగ్ చేస్తున్న వాళ్ళు అరుస్తున్నారు. 


తన వంతు అయిపోయింది.

అంతా గుడ్.. గుడ్ షో అని ప్రోత్సాహంగా అన్నారు. 


వీళ్లు సిటీ పిల్లలు అయినా  కలుపుగోరు అని అర్థం ఔతుంది. నవోదయాల్లో ఉన్న పిల్లలు ఒకేలా ఉంటారు అనుకున్నాడు కిట్టు. 


కీపింగు చేస్తునాడు.


బాగుంది. ఎండ మెల్లగా వస్తుంది. 


టిఫిన్ సమయం అయ్యింది. 

రెండు గుడ్లు, ఒక బ్రెడ్డు , కొంత పచ్చడి. ఇలా కూడా టిఫిన్ పెడతారా అనుకుంటూనే కానిచ్చాడు. 


పది పన్నెండు తరగతులకు మాత్రమే ఉంది మెస్. మిగిలిన వాళ్ళు దగ్గర్లోని ఇళ్లకు వెళ్ళిపోతారు అంట.


లంచ్ సమయానికి 

కృష్ణా రెడ్డి వచ్చాడు. తంబీ పద లంచ్ నీకు మస్తుగా పెట్టాలే . వాడితో పాటు ప్రతాప్ హాష్ కొప్పల్ , ధార్వాడ్ నుండి వెనుకనే ఉన్నాడు. కిట్టూ తను పరిచయం చేసుకున్నారు. 


మెస్సులోకి వెళ్ళాడు. సర్వింగ్ చేస్తున్న కౌంటర్ వెనుకకి అక్కడ స్కూళ్లో రెడ్డికి మంచి పలుకుబడి లా ఉంది. లోపలకి రమ్మన్నాడు. రైస్, కుప్పలాగా బంగాళదుంప కూర , పప్పు , స్టార్ రూమ్ లోంచి వేయించిన వేరుశనగ వేశాడు. 


నిన్న సార్ చెప్పినట్టు చేస్తున్నాడు అని అర్థం అయ్యింది. చాలు అన్నా అంటున్నాడు. తంబీ డిల్లీ పోవాలి అంటే తింటే నే గా. 


ముగ్గురు పెద్ద వల్ల మధ్య తింటున్నాడు. కిట్టు గురించి అడుగుతున్నారు. కొందరు తెలిసిన టీచర్లు పేర్లు చెప్పుకున్నారు. శశికళ మీకు వేశారా, టూ మచ్ ఆవిడ అని అంటున్నారు. 


బయటకి వచ్చేశారు. కిట్టు ప్లేట్ గట్టిగా కడిగి , ప్లేట్లోనే నీళ్ళు వేసుకుని కొళాయి దగ్గర తాగాడు. 


మధ్యాహ్నం అయినా ఎండ సున్నితంగా ఉంది. ఉదయం పడిన పొగ మంచు ఇంకా తడిగా ఉంది గడ్డి మీద. 


తిరిగి వెళ్తున్న సమయంలో, 


ఎదురుగా జానీ... 


తెల్లటి చుడిదార్ 

ఉంగరాల జుత్తు 


మూడు పాయలుగా జుత్తు ఉంది, ఎడమ పాయ , కుడి పాయ ముఖాన్ని కప్పి దోబూచులాడుతున్నాయి. 


ప్రిన్సెస్ లాగ తల మీద కిరీటం లాంటి టియారా.. 


ఏటవాలుగా ఉన్న రోడ్డు మీద ఎత్తు నుండి దిగుతూ


కిట్టూని చూసింది.


కిట్టూ అని జానీ. జానీ అని కొట్టు ఒకే సారి అరిచారు. 


చిన్న గంతు ఒక అంజ వేసి ముందుకు వెళ్లారు. గాజుతో  చేసిన అదృశ్య  గోడ తగిలినట్టు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయారు. 


జానీ మెడలో ఒకే ఒక ముత్యం ఉన్న హారం. అమ్మాయి మొహం కడిగిన ముత్యంలా ఉంది. కళ్ళు వెలిగిపోతున్నాయి. 


చూపుడు వేలు మీద ప్లేటు తిప్పుతూ కిషన్ రెడ్డి కిట్టు వెంట వచ్చాడు. వెనుకనే ప్రతాప్. 


జానీ వెనుక ఇంకో 12వ తరగతి అమ్మాయి. జానకి ఆ అమ్మాయి గైడ్, కిట్టూ కి రెడ్డి లాగా. 


జానీ, జానీ వెనుక వచ్చిన వాళ్ళు మెస్సు లోకి వెళ్ళిపోయారు. 


తంబీ నీకు చాలా నక్రాలుండే అని చక్కిలిగింతలు పెట్టాడు రెడ్డి. 


నీకు ఆ పోరి ఎట్లు తెలుసు. కేరళా రీజినల్ గురించి చెప్పాడు కిట్టు. 8th లో ఎవరికీ రాదు తెలుసా 12th స్టూడెంట్ డ్రాప్ అయితే నీకు ఛాన్స్ వచ్చే. ఔను అన్నా అని ఫోను కాల్ మొత్తం చెప్పాడు కిట్టు. 


పరిచయాల ముచ్చట అయిపోయింది. 


ఇంక వెళ్ళే సమయం వచేసింది. 


స్కూల్ వాన్ లో నేషనల్ కి వెళ్ళే గ్రూప్ బయలుదేరారు. 


కిట్టు, ప్రతాప్ హాస్కోప్పల్, త్రిశూరు నుండి ఇద్దరు, జానీ, ఇంకో అమ్మాయి, పద్మజ మేడం ఇది మొత్తం. 


నాంపల్లి దగ్గర ఎక్కారు.


 పండుగ రోజుల వలన కిక్కిరిసి ఉంది బండి. పిల్లలకు ఆర్. ఏ . సీ లోనే టిక్కెట్లు దొరికాయి. అంటే అంతా ఒక దగ్గర కూర్చునే అవకాశం లేదు. 


గందరగోళంగా ఉంది వాతావరణం. తమ తమ ఎక్సిబిషన్ డబ్బాలు జాగ్రత్తగా ఉంచుకున్నారు పిల్లలు. ఒకే డబ్బాలో వేరు వేరు చోట్ల సీట్లు ఉన్నాయి. 


కిట్టూ జానీ ఒక చోట . మిగిలిన వాళ్ళు వేరే వేరే చోట్ల. మళ్లీ సైడ్ బెర్తు లో ఆర్ ఏ సీ.


ఇద్దరికి కలిపి ఒక బెర్తు . అలా అడ్జస్ట్ అయి వెళ్ళే వారికి ఇస్తారు అంట ఆర్.ఏ.సీ. 


పిచ్చిపిచ్చి వాసనలు, పెద్ద పెద్ద శబ్దాలతో నవ్వులు, గుడ్డి దీపాలు, మహా చిందర వందర గా ఉంది ట్రైను.


 తనను అస్సలు చూడటం లేదు జానీ. ఎర్రటి చుడీ దార్లోకి మారి వచ్చింది. జుట్టు పూర్తిగా విరపోసుకుని ఉంది. చిక్ షాంపూ వాసన గుప్పుమని వస్తుంది. కొంచెం అసహనంగా ఉన్నాడు కిట్టు. తనను చూడదేమిటి అని. 


ఇంతలో రైల్వే పోలీసులు కుక్క తో వస్తున్నారు. అందరూ తప్పుకుంటున్నారు. 


జానీ కిట్టు చెయ్యి పట్టుకుంది గట్టిగా వెనక్కి తూలి కూర్చున్నారు బెర్తు మీద. 


ఆనందం. చెయ్యి పట్టుకుంది కదా. ఇప్పుడు తన వేపు చూసింది. సున్నితంగా ఉంది చూపు ఏదో మార్పు. 


రైలు బయలు దేరింది. 


గాలి చల్లగా వేస్తుంది. ఆహ్లాదంగా ఉంది. ట్రైన్ కదిలితే జీవితం కదిలినట్టే. అందరూ ఉల్లాసంగా ఉన్నారు రద్దీ లో కూడా. 


మేడమ్ వచ్చారు. గుడ్. మీరిద్దరూ ఒక యూనిట్. మేడం, ఇంకో అమ్మాయి 48 దగ్గర. ప్రతాప్, త్రిశూరు పిల్లలు 39. నేను మధ్యలో వచ్చి చూస్తాను మీరిద్దరూ ఒక దగ్గర ఉండండి.


కిట్టు తో అన్నాది, నువ్వు హోమ్ సిక్ అయి రావు అను కున్నాను అని. నువ్వు వచ్చి నేను రాకపోతే అని వచ్చేశాను. 


ఓ హ్యాపీ న్యూ ఇయర్ 1997 అన్నాడు. తను కూడా చెప్పింది. మళ్ళీ ఎగ్జిబిట్ మెరుగు చేసావా అని అడిగాడు. జానీ ఏవేవో పెంచి చేసింది. కిట్టూ కి సిగ్గేసింది , తను కేవలం రంగులు వేసి తెచ్చాడు.


కొంచెం సేపట్లో మళ్ళీ ట్రైన్ ఆగింది సికింద్రాబాదు. అప్పుడు మొదలయింది అసలు ప్రయాణం.


కబుర్లు మీద కబుర్లు చెప్పుకుంటున్నారు. కిట్టు సింధూరం సినిమా కథ చెప్తున్నాడు. చేతులు తిప్పుతూ. 


నవోదయ లో సినిమా కథలు చెప్పటం ఒక కళ. అది ఇంచుమించు అందరు పిల్లలకు వస్తుంది. చూసిన సినిమా కళ్ళకు కట్టినట్లు చెప్పాలి. అప్పుడే ఆనందం.


రాత్రి త్వరగా పొద్దుపోయింది. బెడ్డు పక్కన దుప్పటి కట్టుకుంటున్నారు అందరూ. చలికి అలా అన్నారు. కిట్టు తెచ్చిన పల్చటి దుప్పటి ముడి వేసి కట్టాడు కర్టెన్ లాగా. బాగుంది ఏర్పాటు. వీళ్ల గుస గుసలు బయటకు రాకుండా ఉన్నట్టు. 


లైట్లు ఆపమని పై బెర్తు రిక్వెస్ట్. ఆపే సారు. 


నువ్వు డ్రెస్ ఎందుకు మార్చావు. కిట్టు అడిగాడు. 


అన్నీ చెప్తారా ? 


చెప్పు ఎందుకు మార్చావ్ ? 


తల స్నానం చేశావ్ కదా ? 


ఔను ? 


ఎందుకు చేశావ్ ? ఇంత సాయంత్రం ? 


కిట్టూ అలా అడగ కూడదు. 


ఎందుకు అడగ కూడదు ? 


అడగ కూడదు అంతే! 


జానీ నాకు చెప్పు ఎందుకు చేశావు? 


పుట్టినరోజు కదా ? 


కాదు . 


జానీ జుట్టు దగ్గరకి చేసి క్లిప్పు పెట్టుకుంది. 


కిట్టు క్లిప్పు పెట్టకు వదిలే, అని క్లిప్పు చనువుగా నొక్కి తీసేసాడు జుట్టు లోంచి. 


ఫట్. 


లెంప మీద దెబ్బ. 


కిట్టు చిన్నబోయాడు. 


దూరంగా బెర్తు మీద కాళ్ళు దొంతుగా పెట్టి కూర్చున్నాడు. ముఖం తిప్పుకున్నాడు. 


జానీ కి. అనుకోకుండా చెయ్యి లేచి వచ్చి కొట్టేసింది. 


పిచ్చి పిచ్చి ప్రశ్నలు పడలేక కడుపులో నొప్పి నొప్పిగా ఉంది జానీ కి. 


కిట్టూ నీ చూసి జాలి వేస్తుంది. 


కిట్టూ సారీ రా. 

చెయ్యి తీసి పక్కన పెట్టాడు. 


సారీ చెప్తూనే ఉంది. 


కాజీ పేట వచ్చింది.


 బండి ఆగింది. కిట్టు కడుపు నొప్పిరా అన్నది. 


కిట్టు అర్థం చేసుకున్నాడు. 


ఎక్కడ ? 

చూపించింది? 

ఎప్పుడు నుండి. 

చెప్పింది. 


కడుపు నొప్పిలో తను బాగా సీనియర్ అన్నాడు నవ్వుతూ. ఆగి ఆగి వస్తుంది అంటుంది జానీ. 


రైలు మళ్ళీ బయలుదేరింది. 


బ్యాగ్ లోంచి డైజెన్ చప్పరించే బిళ్ళ ఇచ్చాడు. 


కిట్టు ఇది కాదురా అంటుంది జానీ. అయినా ఒక సారి చూడు అని. తానొకటి తిని తనకొకటి ఇచ్చాడు. 


కిట్టు అన్నాడు. నువ్వు బాత్రూంకి వెళ్ళి చూస్తావా? ఒకే. మెల్లగా నడుస్తుంది. వెనుక కిట్టూ బాత్రూమ్ వరకూ వెళ్ళాడు. మేడమ్ చెప్పాడు కదా ఎక్కడికైనా ఇద్దరు ఇద్దరు వెళ్ళమని. 


నిమిషంలో వచ్చేసింది. 


మళ్ళీ నొప్పి. 


కిట్టు వాళ్ళ నాన్న కిట్టు కి రెండు మూడు రకాల నొప్పి మందులు ఇచ్చి పంపించాడు. అజీర్తి కాకుండా ఆగి ఆగి వచ్చే నొప్పి. 

ఈసారి బాగు లోంచి సైక్లోపామ్ తీసాడు. ఇది వేసుకో.


రాదుగ రాసిన నొప్పి డాక్టరు కథ చెప్తున్నాడు. నేను కూడా ఒక నొప్పి డాక్టర్ని అని. 


మంచిర్యాల. నొప్పి తగ్గింది. 


జానీ నవ్వుతుంది. మేఘం వీడిన పూర్ణ శశిలా ఉంది. మొఖంలో ప్రశాంతత. 


సారీ రా కిట్టు. కొట్టాను.


ఊ..

నొప్పిలో కదా కొట్టావు. ఒకే. 


క్లిప్పు తీయకూడదు కిట్టూ.


మళ్ళీ అడగ బోయాడు ఎందుకు అని. లెంపకాయ్ గుర్తుకు వచ్చింది ఆగాడు.


కుతూహలం మాత్రం ఆగలేదు. రెడ్ డ్రెస్ బాగుంది అన్నాడు. 


తను విషయం చెప్పింది చివరికి సిగ్గుగా.


తన ప్రశ్నలకి సమాధానం దొరికింది. తన ప్రశ్నలతో  జానీని ఎంత ఇబ్బంది పెట్టాడో అప్పుడే అర్థమైంది.


ఇంతలో


రేయ్ నీ ప్రశ్నలకి నిన్ను పీక పిసికి చంపనా ? మెడ చుట్టూ జానీ చల్లటి వేళ్ళు..


రైలు శబ్దం తాళం పడుతుంది. దానికి  రాగం కలిస్తే సంగీతం, అనురాగం కలిస్తే ఆనందం. నిన్న సార్ అన్న మాట అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అయింది. 


దూరం. కలయిక. కోపం. గొడవ. నొప్పి. ప్రమాదం. సమాధానం.  తాళం. రాగం. అనురాగం. పల్లవి. జీవితం. సుందరం.


సిర్పూర్ కాగజ్ నగర్. పేపర్ మిల్లు పక్కనుంచి ట్రైన్ వెళ్తుంది. ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఆఖరి స్టేషన్.


(సశేషం)

అలై పాయుతే ...

 అలై పాయుతే ... 


ఇల్లు చేరాడు శీతాకాలం సెలవులకి. కిట్టూ ఇల్లు కొత్తవలస - కిరండోలు రైలు పట్టాల పక్కనే ఉండేది. రైలు వస్తే వచ్చే కుదుపు, శబ్దానికి కొత్తవాళ్ళు రాత్రి నిద్ర పోయే వారు కాదు. అలవాటుగా అక్కడ ఉండేవాళ్ళు మాత్రం చక్కగా పడుకునే వాళ్ళు. 


సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ట్రైనులను చూడటం, అక్కడ బట్టలు ఆర పెట్టే తీగ ను పట్టుకొని కరెంట్ ట్రైన్లా ఆడుకునేవాడు చిన్నప్పుడు. 


ఇప్పుడు కొన్నాళ్ళో అల్లాంటి ట్రైన్లో వెళ్తాడు. జానీ తో అదీ. ఈసారి సరదాగా వెళ్ళాలి అని అనుకున్నాడు.


అమ్మ హైదరాబాదులో ఉన్న చుట్టాలతో మాట్లాడింది. వాళ్లకి తెలిసిన దూరపు గొప్ప బంధువులు ఒక్కరే. వాళ్ళు చెప్పారంట చలి ఎక్కువగా ఉంటుంది అని.చుట్టాల ఆవిడ బాలింత గా ఉండేప్పుడు వాడిన పెద్ద లేడీస్ స్వెట్టర్ ని అమ్మ తెచ్చింది. కిట్టు వేసుకుంటే ముడుకుల వరకూ వచ్చింది ఆ ఆడవాళ్ళ స్వెట్టర్. ఒక గుండీ కూడా ఉండేది కాదు. అయినా ఒకే అన్నాడు కిట్టు. పుట్టాక స్వెట్టర్ వేసుకుని ఎరుగడు.


 అమ్మ బిస్కట్లు చేసింది. పంచదార పాకంలో. ఒకట్రెండు బిస్కెటు పాకెట్లు. ఒక సిలిండర్ లాంటి సంచి. 150 రూపాయలు పాకెట్ మనీ.


 సంక్రాంతి సాయంత్రాని కే బండి వచ్చేసింది. నవోదయ వాన్ ఇంటి ముందు చూసి చాలా మంది ఆశ్చర్య పోయారు. కిట్టు తన సామాన్లతో ఎక్కాడు. 


బండిలో అన్నయ్య చెప్పాడు. ఈ రోజు రాత్రికి నువ్వు ఒకరి ఇంట్లో పడుకోవాలి అని. 


తీసుకెళ్ళి వైజాగ్ మధ్యలో ఒక బస్తీలో ఒక చిన్న ఇంట్లో దించాడు. రాత్రికి అన్నం ఇక్కడే తిను, వృధా చెయ్యకే అని అన్నయ్య అంటుంటే, కిట్టుకి అర్థం ఔతుంది వారి ఆర్థిక పరిస్థితి. 


అన్నయ్య వెళ్ళక వాళ్ళు అన్నారు. నువ్వు ఇక్కడ ఉండకుండా సెకండ్ షో సినిమాకి వెలిపో , రాత్రి అందరూ పడుకున్నాక ఇక్కడ చాప వేసి పడుకో మని చెప్పారు కటువుగా. 


కిట్టు నొచ్చుకున్నా, తప్పక వెళ్ళిపోయాడు బయటకు. 


ఎదురుగా సినిమా హాల్. సంక్రాంతికి రద్దీగా ఉంది.


 సింధూరం. ఈ రాయి అయితే ఏమిటి పల్లూడ కొట్టుకోటానికి అని వెళ్ళాడు. సినిమా అద్భుతంగా ఉంది. కథలో ఉన్న ప్రతి ఒక్కరూ స్కూళ్లో తెలిసిన పిల్లల్లా ఉన్నారు. హీరో వాడి క్లాసు బంగారయ్య లా కనిపించాడు. 


రాత్రి బాగా పొద్దుపోయాక బస్తీ చేరాడు. చిన్న ఇంట్లో చాలా మంది పడుకున్నారు. ఆ రోజు భోజనం లేదు. అక్కడే చాప మీద ముడుకులు పొట్టలో పట్టుకుని ఆద మరచి పడుకున్నాడు. 


తెల్లారింది. డ్రైవర్ అన్నయ్య వచ్చాడు. గాభరాగా కిట్టుని రైల్వే స్టేట్ కి తీసుకు వెళ్ళాడు. 


అక్కడ ఎదురుగా త్యాగరాజు సార్. మంచి హుషారుగా ఉన్నారు. ఈ ప్రపంచం నిన్న రాత్రి చూసిన ప్రపంచం ఒకే ఊర్లో ఉన్నాయా అనిపించింది కిట్టుకి.


టింగ్ టాంగ్ టింగ్.. 


విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళు.. 7616 విశాఖ.. ఎక్స్ప్రెస్. .. ఒకటవ నంబరు ప్లాట్ఫారం పై బయలు దేరుటకు సిద్ధంగా ఉన్నది. 


సైడ్ బెర్తు మళ్ళీ. 


త్యాగరాజు మాస్టారు ఒక సంచి కూడా మోయనివ్వలేదు కిట్టుని. 


వాటర్ బ్యాటిల్, ఇండియా టుడే. 


అరిస్టాటిల్ .. నువ్వు ఇష్టానుసారంగా చదువుకో అని మ్యాగజైన్ , హిందూ న్యూస్పేపర్ పడే సారు కిట్టు ముందు .


 అనకాపల్లి. తుని. అన్నవరం. సామర్ల కోట. రాజమండ్రి. 


బండి గోదావరి వంతెన మీద నెమ్మ నెమ్మదిగా వెళ్తుంది. అకస్మాత్తుగా ఆగింది కీచు మణి శబ్దం చేస్తూ. పాత వంతెన, బ్రిటిష్ కాలం నాటి రాళ్ళ కట్టడం. ఎండ లో గోదావరి బంగారంలా మెరుస్తుంది. వంతెన కిందన చెక్కతో చేసిన  నీలం ఎరుపు రంగు పడవ.


పడవ వాడి ముఖం స్పష్టం గా కనిపిస్తుంది. వంటిమీద మాసిన తెల్లటి ఖద్దరు చొక్కా, మైకా సంచి మూటలు, ఒక మేక ఉన్నాయి పడవలో. ఆ గోదారి లంకల్లో ఇలా ఉంటారు జనాలు అనుకున్నాడు మనసులో కిట్టూ. దూరంగా  పుష్కర  తీరం. నీటిలోకి  మెట్లు కట్టి ఉన్నాయి. మెట్ల పక్కన  రెండు మూడు గుళ్ళు ఉన్నాయి. పెద్దగా జనం లేరు.


పది ఇరవై పైసల నాణేలు వేస్తున్నారు గోదారిలో. వాటిని ఏరుకునే ఈత కొట్టే పిల్లల మూక వంతెన స్తంభం పక్కనే ఉన్నారు మాట్లాడుకుంటూ. వంతెన మీద ఎవరు ఎలా రాశారో గానీ "నానీ"  అని పెద్ద అక్షరాలతో రాసింది. చిత్రమయిన దృశ్యంలో కిట్టు లీనం అయిపోయాడు. 


ఇంతలో విజిల్ మళ్ళీ ట్రైన్ మొదలయ్యింది. మొదలైన రెండు మూడు నిమిషాలకే మళ్ళీ ఆగింది, వంతెన దాటాక. 


గోదావరి అని  చిన్న స్టేషన్. పక్కనే హై స్కూలు, పిల్లలు బద్దకంగా నడుస్తున్నారు. నవోదయ గుర్తుకు వచ్చింది, మెల్లగా తాపీగా నడిచే అవకాశం ఉండదు కదా మన స్కూళ్లో అనుకున్నాడు.


 కాసేపటికి పెద్ద స్టేషన్ లో ఆగింది బండి. త్యాగరాజు సార్ చలాకి గా కిందకి దిగారు. రెండు చేతుల్లో ఆకుమీద వేసి రెండు రెండు పూరీలు, కూర. వాసన అద్భతం. 


నిన్న సాయంత్రం తిన్నాడు కిట్టు. ఒక్క సారి ఆకలి మెదడు లోకి నమోదు అయ్యింది. థాంక్యూ చెపుతూనే ఆవురావురు మని తిన్నాడు.



ఇక్కడ కొంత జనం చేరారు . చిత్రంగా బండి వెనక్కి వెళ్ళడం మొదలయ్యింది. ఏమిటి సార్ అంటే, ఇప్పుడు మనం హైదరాబాద్ మార్గానికి వెళ్తున్నాం అని, ఇలా చేతుల్తో చూపించి చెప్పారు, ట్రైన్ పెద్ద పెద్ద మలుపులు తిరగాలి అంటే ఇంజను వెనక్కి తిప్పి లాగుతారు అని. 


కిట్టు అడిగాడు సార్ డౌట్ అని.


' మీరు రాగం తాళం కలిస్తే సంగీతం అన్నారు కదా, అవి ఎపుడు కలిశాయి ?'


' అవి కలిసే పుట్టాయి '


ఓహో కలిసి ఎలా పుట్టాయి ?


ట్రైన్ శబ్దం విను. 


విన్నాడు.


మనం మాట్లాడుతున్నాం కదా ? అగి ఆగి? అదే తాళంలో మాట్లాడటం. 


అలగే పాడితే అది తాళంతో పాడటం. 


నచ్చింది జవాబు. 


పక్కన రూము లాంటి చోట్లో, ఒక ముసలావిడ, ఒక ముసలాయన కూర్చున్నారు. 


ఇంకా సార్ గురించి అడగటం మొదలు పెట్టాడు. మీరు ఎందుకు సంగీతం నేర్చుకున్నారు అని. ఆయన ద్వారం వెంకట స్వామి నాయుడు అనే గొప్ప విద్వాంసుని మనవడు అంట . యూజీసీ నుండి పీ ఎచ్ డీ చేస్తూ ఈ ఉద్యోగం చేస్తున్నారు అంట. అలా చెప్పుకుంటూ పోతున్నారు. 


ఆ ముసలావిడ కిట్టు నీ చూసి సార్ ను అడిగారు. నీ అబ్బాయా అని. కాదు మేడం నా స్టూడెంట్, హైదరాబాద్ వరకు నేను తీసుకుని వెళ్తున్నాను అని.


చేగోడీ ఒకటి కిట్టు కి ఇవ్వ బోయారు. సారు మధ్యలోనే తీసుకున్నారు. 


వీడు చాలా సెన్సిటివ్ అంటూ. 


ఆవిడ ఏవిష ? అని అడిగింది. 


చెప్పారు. 


ఒక్క క్షణం ఆగి, కిట్టు ని చూసి. 


బ్రహ్మలా ? అని అడిగింది. 


ఇద్దరికీ మతిపోయింది ఆ ప్రశ్నకు. ఆవిడ పాత రకం కాబోలు అనుకున్నాడు కిట్టు. 


మా స్కూళ్లో అవి పట్టించుకోమని, సార్ జవాబు ఇచ్చారు. 


ముసలాయన అన్నారు. 


మీరు ఏమి అనుకోకండి. 

ఈ వయసు ఉండాల్సింది మా మనవడు అని. శూన్యంలోకి చూస్తూ. 


కిట్టు గుండెలో కలుక్కుమంది. 


ఆవిడ బాబు ఇటు రామ్మా అన్నారు. సార్ అనుమతిగా చూసారు. 


వెళ్ళాడు. ఆవిడ పొదివి కట్టుకుంది. తల మీద చెయ్యి వేసింది. 


ఆవిడ పక్కన అమ్మ వయసు మహిళ. కొంగుతో కళ్ళు తుడుచు కుంటుంది. కిట్టూ కి అర్థం అయ్యింది. 


అరటి ఆకు మీద దద్దోజనం పెట్టారు. బాబు ఒక ముద్ద తిను అని. సార్ వైపు చూసాడు. సరే అన్నట్టు అనుమతి. 


ఒక్క ముద్ద తిన్నాడు. ఎడ బాటు తెలిసిన వారు ఆ నలుగురు. 


రైలులో దేశం ఇలా ఉంటుందా అని కిట్టు ఆశ్చర్యంలో ఉన్నాడు. 


మళ్ళీ సీట్లోకి వెళిపోయాడు. బయట మారిపోతుంది చెట్టు చేమలు. సారా నిషేధం అని అక్కడక్కడా రాసి ఉంది. కొన్ని చోట్ల ఎర్ర జెండాలు కొడవలి గుర్తులు ఉన్న స్తూపాలు చూస్తున్నాడు.


 బయట చిక్కటి సాయంత్రం. కొండలు గుట్టలు పెద్ద పెద్ద బండరాళ్లు ఉన్న ప్రాంతాల్లో వెళ్తుంది బండి. 


సాయంత్రం అద్భుతంగా ఉంది.   సార్ ఈ సమయానికి ఒక మంచి పాట పాడండి అన్నాడు ధైర్యం తెచ్చుకుని. 


పాట గురించి చెప్పి పాడండి సార్. అన్నాడు మళ్ళీ. 


ఏదో చెరువు కట్టమీద వెళ్తుంది ట్రైన్.

ఇది చాలా పాత కృతి నాన్నా. వెంకట సుబ్బయ్యర్ రాసిన కృతి ఇది. 


అలైపాయుతే,

అలై పాయుదే కణ్ణా .. 


కదిత మనత్తిల్ ఉరుత్తి పదత్తై ఎనక్కు అలిత్తు తనిత్త వనత్తిల్ 

కడలికి అలలకు కథాకళి కళలిడు - శశికిరణము వలె చలించవా

చిగురు సొగసులను తలిరుటాకులకు - రవికిరణాలె రచించవా


ట్రైన్ శబ్దానికి సరి పడిన భాగాన్ని చిద్విలాసంగా పాడారు. 

అలా నాంపల్లి చేరాడు కిట్టు, కాలం కడలిలో అలా అలలా


(సశేషం)

వీర్ తుమ్...

 వీర్ తుమ్... 


మరుసటి రోజంతా కాలు కాలిన పిల్లిలా తిరిగాడు ఆఫీసు రూముల చుట్టూ. పోస్టు వస్తుందేమో అని, టెలిగ్రామ్ వస్తుందేమో అని, ఫోను వస్తుందేమో అని. 

మధ్యాహ్నం రెండున్నర కి పోస్టు వచ్చింది. కిట్టూ బెల్లు కొట్టే చోటు మీద ఉన్న వంతెన పై నుండి చూశాడు. పరుగెత్తుకెళ్లాడు. నేషనల్ కి తను సెలెక్ట్ అవ్వలేదు. రెండో స్థానం వరకే. ఈ విషయం జానీ కి చెప్పాలి లేకుంటే తను పాపం వెళ్ళిపోతుంది. డీలాగా భుజాలు దించుకుని వెళ్ళిపోయాడు. 


స్నాక్స్ బెల్లు కొట్టింది రోజక్క. ఎప్పటిలా వేగంగా కాకుండా కాళ్లు ఈడ్చుకుంటూ బయలుదేరాడు. ఆఫీసు గుమ్మం దిగి వెళ్ళే టైముకి ఫోను. స్టాఫ్ ఎవరో మాట్లాడుతున్నారు. స్టెనో అని ఒకరు ఉండేవారు.  తెల్లటి  చొక్కాలు ఇన్సర్ట్ చేసుకుని ఆయనకు యూనిఫాం లా వేసుకునే వారు. 


రేయ్ కిట్టు. నిన్ను నేషనల్ కి రమ్మని ఫోను. మన రీజియన్ లో ఎవరో రావటం లేదు అంట. మంచి ఛాన్సు కొట్టావ్. జనవరి 16-18 తేదీల్లో చండీ గడ్ లో. 


అయోమయం కొంప దీసి జానీ డ్రాప్ అయితే తనకు వచ్చిందా. జైలు లాంటి నవోదయ మీద విపరీతమైన కోపం. ఫోన్ ఎలా. పారిపోయి చేస్తే ? 


పెద్ద గొడవే అవుతుంది. ఎవరికి చెప్పేది. తాతయ్య సార్, అవులిస్తే పేగులు లెక్క పెట్టేస్తారు. కాదు నర్సు మేడమ్. వెళ్ళాడు. మేడమ్ ఇంకో నవోదయ కి ఫోను ఎలా చేస్తారు అని. నాకంత సీను లేదు. వెళ్ళి వైస్ ప్రిన్సిపాల్ నో ప్రిన్సిపాల్నో అడుగు. 


భావ నారాయణ ప్రిన్సిపాల్ . నారాయణ బావ అని కూడా అంటారు కొమ్మాదిలో. ముందటి లాగ వాగ్ధాటి, పిల్లల్తో మమేకం అయ్యే రకం కాదు. ఒక్క రోజు ఎవరితో మాట్లాడుతూ కనిపించలేదు. 


మిగిలింది శ్యామ్ ప్రసాద్ సార్. కొత్త. ఆయన దగ్గర కారు ఉంది. 

కొత్త క్వార్టర్ల బయట తచ్చాడాడు. ఆయన వస్తే చూద్దామని. 


సాయంత్రం ఆరు. పోపు వేసి వంటలు చేస్తున్నారు క్వార్టర్లలో ఉన్న వారు. సువాసనకు అమ్మ గుర్తుకొస్తుంది. కిట్టు కి ఎక్కడలేని దిగులు సాయంత్రం కమ్ముకున్న వర్షపు మేఘంలా కొట్టుకొచ్చేస్తుంది. 


వెనుక

పొంపాయ్. 

పొంపాయ్. 

అంటు హారను. 


ఫియట్ పద్మిని కారులో జల్సాగా శ్యామ్ ప్రసాద్ సార్. 

తప్పుకున్నాడు. చేతులు కట్టుకుని పక్కన నిల బడ్డాడు. 

హుషారుగా ఆయన. 

ఏం కావాలి? 


కిట్టు పేరు తెలీదు. 

కిట్టు ముఖంలో కలత చూసాడు ఆయన. 


ఏం కావాలి బాబు అన్నాడు కారులోనే కిటికీ ఇంకా దించి. 

అది సార్. అర్జెంట్ గా ఫోన్ చేయాలి. 


ఓ వంట్లో బాలేదా బుగ్గ మీద చెయ్యి వెనుక భాగం పెట్టి అడిగాడు ఆయన. 

పరవాలేదు. ఒక్క సారి ఫోను. 


ఓ ఎస్. 

కారు పార్క్ చేశాడు. కం. ఆయన ఇంట్లో కి తీసుకు వెళ్ళాడు. ఈల వేస్తున్నాడు హుషారుగా. 


ఎర్ర రంగు ఫోను. చక్రం తిప్పితే నంబరు కలిసే రకం. 

తన కారు, తన ఫోను ఆయనకు సరదా అని అర్థం అయ్యింది కిట్టుకి. 


కూర్చో. 

నంబర్ చెప్పు. 


నంబర్ తెలీదు సార్.

పెద్దాపురం  నవోదయకు చెయ్యాలి. ఓహ్ ఎస్.


ఇక్కడికి వచ్చాక లాంగ్ డిస్టెన్స్ ఫోన్ చెయ్యనే లేదు. ఏదో వెతుకుతున్నాడు. 

దుక్క లాంటి బుక్కు బయటకి లాగాడు. దీన్ని ఫోను బుక్కు అంటారు. అంటే ఇందులో అందరి నంబర్లను రాసి పెడతారు. తెలియని వారికైనా ఇలా ఫోన్ చేసి మాట్లాడొచ్చు. 


కిట్టు చేతిలో పెట్టి ఇంట్లోకి వెళ్ళిపోయాడు ఆయన. 

కిట్టు వెతికాడు గబ గబా. సాయంత్రం 7 అవుతుంది. అంటే సెల్ఫ్ స్టడీ సమయం. 


దొరికింది. చేతిమీద పెన్నుతో రాసాడు. 

సార్. ఇదిగో. 


ఆయన నంబర్ కొడుతున్నారు.   పెద్దాపురం JNV? 

ఒకే కిట్టు, కుట్టు వైపు చూసి ఎవరికి పిలవాలి అని. 


జానీ పేరు చెప్పటానికి జంకు. పద్మజ మేడమ్, బయాలజీ. అని చెప్పాడు.

మళ్ళీ చెయ్యమని పెట్టేసారు. 


యే క్లాస్. చెప్పాడు. 

మొన్న కేరళ వెళ్ళావు నువ్వేనా. 


ఔను అన్నాడు.

బ్యూటిఫుల్ ప్లేస్. అక్కడే ఫస్ట్ అపాయింట్మెంట్. ఏదో తోటివాడితో మాట్లాడుతున్నట్టు చెప్పుకుంటూ పోతున్నారు. 


ఫోను.

ట్రింగ్...ట్రింగ్...


ఆయన ఎత్తలేదు. 

ఎత్తు. 


కిట్టు ఎత్తాడు. 

ఫోను అవసరానికి చెయ్యడం అదే మొదలు. 


వైస్ ప్రిన్సిపల్ హౌస్ JNV కిక్తంపాలెం అన్నాడు. ఎత్తి.

పద్మజ మేడం. కిట్టూ నువ్వేనా ? ఔను మేడమ్ . 


ఆవిడ వెంటనే. ఇదిగో జానకీ, కిట్టూ.. అని వెళ్ళిపోయింది. 

జానీ. జానీ ముందు నాకు నేషనల్ రాలేదు. మళ్ళీ ఫోన్ చేసి రమ్మని చెప్పారు. 


ఔనా. అయితే నేను కూడా వస్తాను. 

వర్షం కురిశాక మల్లె పందిరి కింద గాలి వీచి నీటి చుక్కలు జల్లినట్టు నవ్వుతుంది. జానీ.. 


బరువు దించినట్టు అయ్యింది. 

నువ్వు నో చెప్పలేదా? 


ఒకే, అంటే ఎవరో రావటం లేదు అన్నమాట. 

ఒకే. నేనుకూడా వస్తాను అయితే. 


వేరే ఒక్క మాట చెప్పే ధైర్యం లేదు. 

గుడ్ న్యూసే. 


కిట్టు మొహంలో ఆనందం. 

శ్యామ్ ప్రసాద్ రిలీవ్ అయ్యారు. 


ఆల్ సెట్ ? అన్నారు. 

కిట్టు ఎస్ సార్. 


గుడ్ చాప్. 

బయటికి వచ్చిన కాసేపటికి. కిట్టు గుండె గట్టిగా కొట్టుకుంది. 


తను చేసిన పని తనకే నమ్మశక్యంగా లేదు. ఇంత పెద్ద వాళ్లింటికి వెళ్లి,  ఫోన్ చేసి, ఇంకో నవోదయతో మాట్లాడాడు.

అలా మళ్ళీ ప్రయాణం పడింది. 


ఇంటికి ఉత్తరం రాసేవాడు కాదు కిట్టు. ఇప్పుడు పసుపు రంగులో పావలా కార్డు మీద రాస్తున్నాడు. 

పూజనీయులైన అమ్మకు నాన్నకు, నన్ను జాతీయ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ కి పిలిచారు. అసలు ఎంపిక కాలేదు అనుకున్నాను, కానీ నన్ను కూడా రమ్మని ఫోను ద్వారా చెప్పారు. సంక్రాంతి తర్వాత చండీగఢ్ వెళ్ళాలి. నాతో కేరళ 

వచ్చిన వారు కూడా వస్తున్నారు. అవసరమయిన బట్టలు, కొంచెం తినే వస్తువులు తయారుగా ఉంచండి.


మళ్ళీ ఎగ్జిబిట్ కి రంగులు వేసుకుని, కిరోసిన్ స్టవ్ వత్తులు, దానికి అవసరమయిన సరంజామ డబ్బాల్లో పెట్టుకుని తయారు అయ్యాడు. 

చివరి రోజు నాన్నని, తనను స్టాఫ్ రూమ్ లోనికి పిలిచారు అన్నమయ్య సారు. రూములో డ్రైవర్ అన్నయ్య కూడా. 


చండీగఢ్ వెళ్ళే ప్రయాణానికి పథకం అన్నమాట. 

కిట్టు శీతాకాలం సెలవులకి ఎగ్జిబిషన్ డబ్బా పట్టుకుని ఇంటికి వెళ్ళాలి. అలా వెళ్ళాకా,  పెద్ద పండుగ మరుసటి రోజు డ్రైవర్ అన్నయ్య స్కూల్ వాన్ లో కిట్టు ను ఇంటి దగ్గర నుండి సార్ ఇంటికి వరకు తీసుకు వెళ్తాడు. సార్ నంబర్ 543465. సున్నా 891 కొట్టాలి లాంగ్ డిస్టెన్స్ అయితే. 


అక్కడ వైజాగులో మ్యూజిక్ సార్ తనను ట్రైన్లో గచ్చి బౌలి నవోదయకు చేరుస్తారు. 

అక్కడ నుండి గ్రూపులో చండీ గడ్ ప్రయాణం. 


అందరికీ అర్థం అయ్యాక. అందరూ ఒప్పుకున్నాక కిట్టు 1996 సెలవులకి తన బట్టలతో పాటు, ఒక కిరోసిన్ పొయ్యి, రెండు గ్లాసు పిప్పెట్లు, రెండు గ్యాసు పొయ్యి రబ్బర్ గొట్టాలు,  ఒక కాగితపు గుజ్జు తో చేసిన కొండ, ఎల్. ఈ.డీ బల్బులు, రెండు నిప్పో బ్యాటరీలు, ఒక బాటిల్ కిరసనాయిలు తో ఇంటికి చేరాడు.


1996 డిసెంబరు 15. 

కథ ఇంక భారతీయ రైలుకు...

*జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా ...*

 *జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా ...*


ఎనిమిదో తరగతి అక్టోబర్. పాల్ఘాట్ నుండి వచ్చాక ఇంటికి వెళ్లి వచ్చిన కిట్టూకి ఎన్నో ఏనుగుల శక్తి వచ్చేసింది. 

మిగతా స్కూళ్లను, మిగతా దేశాన్ని, చూసాక పరకాయ ప్రవేశం చేసినట్టు. తనను, తన స్కూల్ని, దూరంగా చూసాక ఒక కొత్త దృక్పథం. కోస్తా వడ్డున వెళ్ళిన రైలు, దానిని అక్కడక్కడా దాటుతూ వాగులు వంకలు. దేశాన్ని చూసాక తన చుట్టూ ఉన్న చిన్ని లోకం అర్థం అయినట్టుంది.


జానీ ఇచ్చిన ధైర్యం, ఆ కోమలమైన భావాలు జీవితాన్ని కసితోనే కాదు ఆనందిస్తూ దాటొచ్చనే గురి. 


తెలుగు శంకరరావు. హిందీ శశికళ. బయాలజీ తాతయ్య సార్. ఫిజిక్స్ వేరే కొత్త మాస్టారు. లెక్కలు అమ్మాణి . కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిచి న బృందం లాంటి టీచర్లు.


ఉదయానే సూర్యోదయం చూస్తూ ఒక పావు గంట చదవటానికి వెళ్లేవాడు స్కూలుకు. ఎర్రటి సూర్యుడు పైకి ఎక్కుతుంటే, కళ్ళు మూసుకుని ఏదో ఒక విషయం మననం చేసే వాడు.

ఒక చిన్న పుస్తకం పెట్టుకున్నాడు. అందులో రోజూ చదువుకున్న సమయం రాసుకునే వాడు. 5-6 గంటలు చేరడం టార్గెట్. ఇంకా ఏవో నచ్చినవి రాసేవాడు.

'నల్దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న' అని పద్యం తెలుగులో చెప్పారు. అది గుర్తు చేసుకుంటూనే, ఆ రోజు ఉదయం సూర్యోదయం చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చాడు. అందరూ బతికి ఉండగానే అనాథలమా అనే భావంతో కన్నీరు మున్నీరయ్యాడు. అదే మాట పాకెట్ డైరీ లో రాసుకున్నాడు. ఆ పద్యం తన మీదే రాశాడా గుర్రం జాషువా అని.


వెనుకనుండి, కిట్టూ చూపించు అని ఒక అక్క గొంతు. తనను చూసేసింది. అడుగుతుంది బుక్కులో ఏముంది అని చనువుగా అడుగుతుంది వెనక దగ్గరగా వచ్చి. 


ఇవ్వను. కఠినంగా అన్నాడు. 

వెనకనుండి గట్టిగా పట్టుకుని,ఏమిటి అనే లోపు, సీక్రెట్ బుక్కు లాక్కునే ప్రయత్నం.


గింజుకున్నాడు.

స్పర్శ.


ఆమె కుతూహలం.

తనకు భయం. 


ఆమెకు కోపం. 

తనకు సిగ్గు. 


అడిగినవన్నీ అమాయకంగా చెప్పే కిట్టు దాయటం అక్కకు నచ్చలేదు. 

కిట్టు తన రహస్యాలు దాచుకునే తపన.

ఆమెకు చూడాలి.


జానీ లా కాక అమ్మాయి స్పర్శ కిట్టుని సతమతం చేస్తుంది. 

బలం తప్పింది.

ఇచ్చేశాడు. 


ఆమె చూసింది పుస్తకం. 

టైమ్ టేబుల్లు. ఏవో రాతలు. 


ఒక చోట జానీ పేరు తన పేరు కలిపి సంతకం చేశాడు. 

తన పేరు. 

సంతకంలో కొబ్బరి చెట్లు. 

వంకలో ఉదయిస్తున్న సూర్యుడు.


అక్షరాలు కలుస్తూ ఆమె పేరుగా మారడం. 

ఇది ఆర్టిస్టు పెట్టే శైలి లోని సంతకం. 

పేజీ నిండా. 


తనను మళ్ళీ చూసింది ఆమె. 

బుక్కు జాగ్రత్త గా కిట్టు జేబులో పెట్టి వెళ్ళిపోయింది.


సూర్యుడు మర్డర్ చేసినట్టు మేఘాలను ఎర్రగా చేసి ఆకాశంలోకి ఎక్కుతున్నాడు.

.... 


ఆ రోజుల్లోనే, వీడి చుట్టూ ఒక బృందం చేరడం మొదలయ్యింది. ఏడో తరగతిలో పాఠం చెప్తూ ఎవరో టీచర్ అన్నారంట, కిట్టూ దగ్గర నేర్చుకోండి చదువుకునే విధానం అని.

కిట్టు లాగే ఒక పుస్తకం జేబులో పెట్టుకుని, వాడి లాగే తొందర తొందరగా పనులు చేసుకుని , వాడిలాగే పరిగెత్తుకుంటూ మెస్సుకు వెళ్లే అనుకరణ బృందం.


వీడి దగ్గర జీవన సిద్ధాంతాలను అడిగి నేర్చుకునే తల మాసిన వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు చేరేవారు. వాళ్ళ చేత నీళ్ళు తెప్పించుకోవడం, మెస్ లైన్లో స్థలం ఉంచడం, బట్టలు ఉతికించడం ఇలా నానా పనులు చేయించుకునే వాడు..

అందరూ ఆ బుక్కులో ఏముంది అని అడిగే వారే. 

..

హాఫ్ ఇయర్లీ సర్క్యులర్ వచ్చింది. 

కొత్తవలస నుండి కిరండోల్ వెళ్ళే ఇనుప ఖనిజం తీసుకువెళ్ళే ఎలెక్ట్రిక్ ట్రైన్లా తయారు అవ్వటం మొదలు పెట్టాడు. అరులో 564/600 తో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు, కేవలం రెండు మూడు మార్కులతో ఫస్ట్ తెచ్చుకున్నాడు. 7 లో 576/600 అయినా మహా అయితే అయిదారు మార్కుల తేడా. ప్రతి ఏడాది ఈ ఉత్కంఠ భరించలేకుండా ఉండేది.  ఇంక ఈ సంవత్సరం ఎలా అయినా మార్జిన్ పెంచాలి అని పట్టుదల. 

'అద్భుతాల ఋతువు' అని రాసుకున్నాడు డైరీ లో. 

99/100/98/99/99 హిందీ తప్ప అన్ని మార్కులు ఇచ్చేశారు. 99% తో ఇన్నాళ్ళ కష్టానికీ రానన్ని మార్కులు  వచ్చాయి. అంటే తన కొత్త పద్ధతి పనిచేసినట్టే ! 


ఇంకా రావాల్సింది హిందీ ఒక్కటే. ఇంచుమించు 10 మార్కుల మార్జిన్ ఉంది. అయినా కొంత భయం. 

శశికళ మేడం రూమ్ కి రమ్మని పిలుపు. వెళ్ళాడు. సాయంత్రం ఆరు. ఆ సమయంలో పిలవటం వింతే. కొంత భయం మొదలయ్యింది. 


కిట్టు, నీ పేపర్ కరెక్ట్ చేసాను అని. పేరు మార్చుకోమన్నాను కదా అయినా నా పేరు రాసావ్ . 

అది నా పేరు కూడా. 


ఔనా, 10 మార్క్స్ కట్. 

అలా అని తల ఎత్తి హాయిగా నవ్వుతున్నారు ఆమె. పాలు కారినట్టు ఆమె కంఠం. 


కిట్టు కళ్ళంట నీళ్ళు. 

ఇంతలో నర్స్ మేడమ్ వచ్చారు. 


ఏమే శాడిస్టు, మళ్ళీ చిన్న పిల్లలని ఏడిపిస్తున్నావా ? 

వీడు ఎక్కడ చిన్న పిల్లాడు.


కిలకిలా నవ్వులు మళ్ళీ. 

రారా చూడు. 99. నేనేమీ శాడిస్ట్ కాదులే. 


పో. 

కిట్టు గాల్లో తేలినట్టుంది. హిందీ లో 99 రావడం ఇదే తొలిసారి . 594/600. కిట్టు అనుకోని టార్గెట్ అది. 

మంచి హుషారుగా ఉంది సాయంత్రం. ఇంక చలికాలం సెలవులు వచ్చేస్తున్నాయ్. ఇంటికి వెళ్ళడమే తరువాయి. 


స్కూల్ బిల్డింగ్ రెండు భాగాలుగా ఉండేది. ఆ రెండిటిని కలుపుతూ చిన్న వంతెన. వంతెన కిందన స్కూల్ బెల్లు కొట్టేది రోజక్క. మొదటి అంతస్తులో వంతెన మీద కిట్టు బాల్యంలో ప్రతి రోజు గడిపేవాడు. 


సాయంత్రం అక్కడ చేరాడు. నిండు వెన్నల రోజు. 

తాచు పాములా కొత్త రోడ్లు. ఎదురుగా చక్కటి సాయంత్రం. 


సెల్ఫ్ స్టడీ అయిపోయే సమయం. 

రోజక్క పిలుస్తుంది కిట్టూ. ఉన్నావా ? 


ఆ.. 

నీకు పెద్దాపురం నుండి ఫోను. 


నాకా? 

నీకే? 


వెళ్ళాడు ఉరుక్కుంటూ

స్టాఫ్ రూంలో ఫోను 


ఎత్తాడు

పద్మజ మేడం


వీడికి పాల్ఘాట్ తీసుకు వెళ్ళిన టీచర్. 

గుడ్ ఈవెనింగ్ చెప్పాడు. 


ఆవిడ, ఇదుగో అని ఫోన్ ఎవరికో ఇచ్చారు.. 

కిట్టూ నేను. 


జానీ! 

నీకు ఫోన్ ఎలా అని అడిగాడు. 


కిట్టూ , నన్ను నేషనల్ కి పిలిచారు. చండీగడ్. నీక్కూడా వచ్చిందా అని. 

నాకు రాలేదే ? 


అడుగు. ఇది ఆప్షనల్ అంట. నువ్వు వస్తే నేను వస్తాను. 

నాకు తెలీదు. 


కనుక్కో. మాకు టెన్త్ సిలబస్ మొదలు పెట్టేస్తారు అంట జనవరిలో. నీకు రాకపోతే నేను వెళ్ళను. అందుకే చేసాను. 

(సశేషం)