గంగోత్రి
(1994, పాత క్యాంపస్ లో జాయిన్ అయిన రెండో నెలలో కిట్టూ పారిపోయాడు ఇంటికి.)
తిరిగి నవోదయలోకి బిక్కు బిక్కు మంటూ వచ్చారు కిట్టు + వాళ్ళ అమ్మ. అభిమానవంతుడు తండ్రి రాలేదు. కిట్టు దసరా రోజు పారిపోయినప్పుడు బట్టల్లో ఒక యూనిఫాం కూడా పెట్టుకున్నాడు ఉతికించడానికి.
అదే వేసుకుని వచ్చాడు. బయట రోజక్క కనిపించింది. పారిపోయి ఇంటి తిరిగొచ్చిన కొడుకుని ఎలా చూడాలో అలా చూస్తుంది. అక్క మొహంలో కోపం ఉందేమో అని బాగా ఆవలోకించి చూసాడు. ఒక్క పాలు కూడా లేదు.
బయట నిలబడ్డారు. కిట్టు మనసులో తుఫాను. ఒక వైపు ఇంటికి వెనక్కి వెళ్ళిపోదామనే కోరిక. ఇంకో వైపు అమ్మ నాన్న తన చదువుకోసం పడే తాపత్రయం. ఇక్కడ మానేస్తే వెళ్ళాల్సింది ఎదురుగా ఉన్న జెడ్పీ హై స్కూల్. అది పాతాళం ఇది బ్రహ్మ లోకం..
ప్రభుత్వ ఆఫీసులో ఉండేట్టు సగం తలుపులు ఉన్నాయి. కిందనుండి చూడొచ్చు.
కిట్టు పొట్టి కదా కొంచెం వంగితే కనిపించింది. ఛాంబర్లో ఉన్నారు అధిపతి.
బయట పాలిష్ చేసిన చెక్క మీద ఇంగ్లీష్, తెలుగుల్లో ఒద్దిక గా రాసిన పేరు "ముళ్ళపూడి కోటేశ్వరరావు" ముళ్ళపూడి పేరు ఎక్కడో చూశాడు, ఆదివారం బుడుగు రాసేది ఇంకో రమణ కూడా ముళ్ళపూడే అనుకున్నాడు. ఇతను మాత్రం కాదు, ఏ దూరపు చుట్టమో అయ్యి ఉంటారు అని.
డిగ్రీలు దండిగా ఉన్నాయి ఏం. ఏ, ఎం. ఏడీ, బ్రాకెట్లోలో ఏదో లండన్ అని. అంత చదువా అనుకున్నాడు. డాక్టర్ తెన్నేటి సుబ్బారావు దగ్గర చూసాడు ఎం. బి. బి. ఎస్ అని అంత కన్నా ఇదే ఎక్కువగా ఉంది. అంత చదువు చదివి ఇలా సంతకాలు పెట్టే ఉద్యోగం ఏమిటి అని సందేహం.
బెల్లు వినిపించింది. గుండెల్లో రాయి పడినట్టుంది అమ్మకి. అమ్మని ఎప్పుడూ అలా చూడలేదు. ఈ రోజు పాత చీర కట్టుకుని వచ్చింది అమ్మ. తను చేసినది తప్పు అని ఎవ్వరూ అనలేదు , అమ్మ మొఖంలో మాత్రం తెలుస్తుంది.
ఆఫీసుల్లో బాసులు కొట్టే బెల్లు అది. అక్క లోపలికి వెళ్ళింది. మళ్ళీ బెల్లు.
పక్క తలుపు నుండి మనీలాల్, క్లాస్ టీచర్, హనుమాన్లు. అందరూ అర్థం అయ్యారు హనుమాన్లు తప్ప. ఆయన గుర్రుగా చూసి వెళ్ళాడు లోపలకి. హౌస్ మాస్టర్ మనీలాల్ ముఖములో ఏమాత్రం కోపం లేదు. హర్యానా నుండి ఇంత దూరం వచ్చారు ఆయన. మళ్ళీ రాజీవ్ హౌస్ లోకి వెళ్తే నాకు దెబ్బలు తప్పవేమో అని భయం.
ఇప్పుడు లోపలికి రమ్మన్నారు. అమ్మ బిక్కు బిక్కుమనడం మొదటి సారి. ఇంట్లో తనను కొట్టలేదు విచిత్రంగా ఎవ్వరూ.
లోపలికి వెళ్లేటప్పుడు, బ్రూస్లీ , ఎంటర్ థీ డ్రాగన్ సినిమా గుర్తు కొచ్చింది.
లోపలి అడుగు వేశాడు. ఏవేవో ఉన్నాయి రూములో. ట్రోఫీలు, కప్పులు, పుస్తకాలు. ఒక కరుడు కట్టిన మహా సంస్థ లా ఉంది ఛాంబర్.
అనాలోచితంగా బూట్లు స్టాంప్ కొట్టి, రైట్ చేత్తో సెల్యూట్ కొట్టాడు.
ఎదురుగా నలుగురు ఉన్నారు. తిట్లు చివాట్లు తినడానికి సిద్ధం అయ్యాడు అమ్మ మొఖం చూసి. అమ్మ అంటుంది , చిన్నవాడి తప్పు మన్నించి ఈ సారికి మళ్ళీ పెట్టుకోమని. అమ్మ మీద కోపం , జాలి కలిసి వస్తున్నాయి.
అందరి ముఖాల్లో గాంభీర్యం కనిపించింది కానీ కోపం కనిపించలేదు. వారికి కిట్టు ఒక సమస్య. వారి కళ్ళల్లో పిల్లలు శిల్పికి దొరికిన పాల రాళ్ళు. ఎదుట బాల్యం కనిపించింది కాని నేరం కనిపించలేదు.
కిట్టు దృష్టిలో వాడికి వారి ఉలి మాత్రం కనిపిస్తుంది. అందరూ కలిసి తనలోని స్వేచ్ఛను పీల్చి పారేస్తారేమో అని భయం.
పిన్సిపల్ ఆవధానిలా రోజుకొక డజను సమస్యలు పూరణ చేసేవారు. కిట్టు కంటే ముందు ఆ రోజు ఆయన పూరించిన సమస్య అక్కడ ఉన్నవారెవరికీ తెలియదు, అలా సమస్య తెలిసే ముందే పూరించడమే ఆయన పని.
ఫైల్లోంచి పైకి చూశారు. కిట్టు కొట్టిన నమస్కార బాణాలు , అర్జునుడు తన గురువులకు వేసిన శరాల్లా పనిచేశాయి. కోపం రాకుండా ఎంత లాఘవంగా వాడు కొట్టిన నమస్కారం, వాడి వాలకం చూసి ముచ్చట రాకుండా ఉండలేదు.
కిట్టు..
ఎందుకు పారిపోయావ్ ?
అని కోటేశ్వరరావు ప్రశ్న వేశారు.
కిట్టు అవాక్కయ్యాడు. ఆలోచనలో పడ్డాడు. తను నిజంగా ఎందుకు పారిపోయాడో ఆలోచనలో పడ్డాడు. తనని ఆ ప్రశ్న అడిగిన మొదటి వ్యక్తి.
(అసలు కారణం కిట్టుకి కూడా ఇంకా ముప్పై ఏళ్లు గడిచిన తర్వాతే తెలియబోతోంది. అతనికి ఉన్న మెకెల్ సిండ్రోమ్ అనే జన్మ లోపం వల్ల నొప్పి మొదలైనప్పుడు, తెలియకుండానే ఇంటికి పరుగెత్తేవాడు. ఆ రోజు ఆ గదిలో ఉన్న ఎవరికీ, సృష్టికర్త కి తప్ప, ఆ సత్యం తెలియదు.)
ఆలోచిస్తున్నాడు కిట్టు.
నాకు బాగా బోరు కొట్టింది సార్. అన్నాడు.
ఏం అన్ని చదివేశావా? మార్కులు ఎలా వస్తున్నాయి. క్లాస్ టీచర్ వైపు చూస్తూ అడిగారు.
క్లాస్ టీచర్ 149.5/150 అన్నారు. ఫస్ట్ ర్యాంక్ సిక్స్త్ లో. అది ఆ స్కూళ్లో అరుదుగా వచ్చే మార్కులు. అందరూ
ఎంపిక చేసిన మెరిట్ స్టూడెంట్స్ అయినవలన పేపర్లు గట్టిగానే ఇచ్చేవారు.
అర మార్కు ఎక్కడ పోయింది. కాస్త గద్దించి అడిగారు మొదటి సారిగా ! నవోదయలో ఉన్న తేడా అదే. ఎక్స్ లెన్స్ ఒక అలవాటు గా మారే వరకూ ఆగరు. శ్రేష్టత అలవాటు అయ్యాక మరో దిక్కులో పిల్లలను ఇంకా ముందు తోస్తారు.
సైన్స్ లో తాతయ్య సార్ ఉత్తుత్తినే తీసేసారు అన్నాడు.
ఐ సీ.
బోర్ కొడితే తాతయ్య సార్ దగ్గర లైబ్రరీ బుక్స్ తీసుకోవచ్చు కదా ? తాతయ్య సార్ స్కూల్ గ్రంథాలయాధికారి పాత్ర కూడా చేస్తున్నారు.
లైబ్రరీ లేదు కదా, టప్ మని సమాధానం. ఫకాల్ మని నవ్వారు హనుమాన్లు. సహీ అని అనుకోకుండా మనీలాల్ నోట్లోనుంచి మాట వచ్చేసింది.
వియ్యంపేట లో ఉన్న రద్దీ, లైబ్రరీ, లాబులు లేని లోటు వారికి తెలుసు. పిల్లల స్వభావంమీద తర్ఫీదు పొందిన వారే అక్కడ ఉన్న టీచర్లు అంతా.
తాతయ్యను రమ్మని చెప్పు. నంబూరి తాతయ్య. ఆదివారం ఆదివారం కాథలిక్ చర్చి లో పని చేసి, M.Sc చేసి, నవోదయకు వచ్చిన ఉపాధ్యాయుడు. స్కూళ్లో అధిపతికి ఎదురు సమాధానం చెప్ప గలిగిన యంగ్ గన్. పరిపాలనకు విమర్శ ఉండాలి, ఆ విధి చేసేది తాతయ్య సార్.
ఆయన వచ్చారు. ఇలా ఒకరు పారి పోయారు అని తెలుసు. క్లాస్ మధ్యలో తనను తీసుకురావటం కొంత చిరాకు.
ఏమిటి?
చెప్పారు.
మీరు బుక్స్ ఇవ్వలేదా..
ఇచ్చాను. లైబ్రరీ లేకుండా ఏంది చేసేది.
ఇచ్చింది వీడు చదివేసే ఉంటాడు ఒకరోజులో. ఖరాఖండిగా జవాబు.
ఏలాంటి స్టూడెంట్ ?
చాలా షార్ప్ ఉండేది. తెలంగాణా యాసలో.
అడగని చాలా ఈక్వేషన్స్ రాసాడు మొన్న పరీక్షలో.
గాంధీ జయంతికి మీరే అంటుంటి వీడు మన విద్యాలయకు వరం అని.
కిట్టు గాంధీ జయంతి కి ఇచ్చిన ప్రసంగం టూకీగా ఇది. గాంధీ ప్రేమించమని చెప్పారు, ప్రేమ అంటే కరుణ, కరుణతో కలిగేది అహింస. ఈ మూడు ముక్కలు చెప్పి దిగిపోయాడు ఆరోజు. చప్పట్లు చాలా సేపు పడ్డాయి.
ముళ్ళపూడి కోటేశ్వరరావు కి ఎదురుగా పారిపోయిన నేరం కాదు, సరిదిద్దే ఒక మంచి ఉదాహరణ కనిపిస్తుంది.
నీకు కావలసిన పుస్తకాలు ఇస్తే ఉంటావా?
కిట్టు సమాధానం ఇవ్వలేదు.
చెప్పు కిట్టు, రోజక్క ప్రోత్సహిస్తు అంది.
సార్, లైట్లు లేవు బెడ్డు దగ్గర. టిఫిన్ చాలట్లేదు. లైన్లు చాలా వెయిటింగ్ ఉన్నాయ్.
కిట్టూ బాగా ఆలోచించి చెప్పు.
*"నీకు నేను మూడు వరాలు ఇస్తాను ! "*
అక్కడ ఉన్న స్టాఫ్, ఇప్పుడు చారిత్రాత్మక ఘట్టం చూసే అవస్థలోకి వచ్చేశారు. ఒక ఆరో తరగతి అబ్బాయ్ పారిపోవడం ఏమిటి, వారితో ముళ్ళపూడి కోటేశ్వరరావు వరాలిచ్చి బేరం పెట్టడం ఏమిటి. ఇది ఎక్కడా జరగని వింత. అచంచల హిమవత్పర్వతాన్ని హిమనదము గుద్దుకున్నట్టు ఉంది, వీరి సంభాషణ.
"అవి తీరిస్తే నువ్వు నవోదయలో ఉండడమే కాదు. విద్యాలయకి గౌరవం తెచ్చేటట్టు ఉండాలి. కావాలా వరాలు అన్నారు !!! "
పసిపిల్లల మనస్సును అర్థం చేసుకుని. ఉన్న ఫలాన ఆన్ ది స్పాట్ సమస్య పూరణ జరుగుతుంది.
సరే.
బాగా ఆలోచిస్తున్నాడు.
ఒకటి, బెడ్డు గాలి వేసే, వెలుతురు ఉన్న ప్రదేశానికి మార్చాలి.
సరే. మనీలాల్ అడగక ముందే ఓ కే. అనేశారు.
ఎన్ని పుస్తకాలు అయినా లైబ్రరీ లోంచి ఇవ్వాలి. తాతయ్య వైపు చూసారు అధిపతి.
ఒక్కో సారి 5 ఇద్దాం, అయిపోయాక వచ్చి పట్టుకుని పో అన్నారు తాతయ్య సార్. నీకు కావాలంటే ఇదిగో కీస్. లయిబ్రరీ తాళాలను బయటికి తీసి చూపిస్తూ. తాతయ్యను ఉత్సాహంగా చూసారు ప్రిన్సిపాల్.
మూడు, నా రోల్ నెంబర్ 31 నుండి 14 కి మార్చాలి. వింతగా చూసారు అందరూ. అదేంటి అని. అబ్బాయిల్లో మొదటి నంబర్. లైన్లో చాలా ఇబ్బంది పడుతున్నాను సార్. కడుపు తిప్పేస్తుంది అన్నాడు. ఒక్కో సారి టిఫిన్ కూడా చాలదు.
క్లాస్ టీచర్ వైపు చూసారు. అయోమయంగా ఆవిడ ఏదో అనబోయే లోపు.
ఎవరు 14 ఇప్పుడు?
లోతేటి లోకేష్.
ఒకే వాడిని 31 కి, పెట్టి వీడిని 14 చెయ్యి. ఐ విల్ స్పీక్ టు హిం, అన్నారు పెద్దాయన.
సమస్య పూరణ అయినట్టే.
అంతా ఒక నవ్వు నవ్వపోయారు.
సార్ టిఫిన్ అన్నాడు.
ఏమిటి ?
2 ఇడ్లీ చాలా తక్కువ సార్ అని. ఇడ్లీ పాత్రల మీద ఇంతకు ముందే చాలా ఇబ్బంది పడ్డారు స్కూళ్లో. ఇది కష్టమే.
సరే నీకు ఇడ్లీ రోజు ఒకటి ఎక్కువే వెయ్యమంటాను అన్నారు ప్రిన్సిపాల్. ఇక్కడ ఇచ్చిన వరాల్లో జరగని వరం ఇది ఒక్కటే.
అందరూ ఒక నవ్వు నవ్వారు. గట్టోడివేరా అని హనుమాన్లు. కిట్టూ పారిపోయినందుకు ఆయనకి, మనీలాల్ కీ పడిన షోకాజ్ నోటీస్ గురించి మర్చిపోయి.
లాఘవంగా సమస్యని సమస్యగా గుర్తించి పూరించారు ఆ నాలుగు టీచర్లు ఆరోజు. క్రమశిక్షణ ఉండీ పారిపోయిన వాడికి శిక్ష అవసరం లేదు కదా.
అలా కిట్టు, నవోదయలో చేరిన రెండో నెలకే పారిపోయి కూడా, ఇంట్లోనూ స్కూల్లోనూ తన్నులు తినకుండా బతికి పోయాడు !!
No comments:
Post a Comment