*సింగ పూరు సెంటు చీర స్టీలు ప్లాంటు గాజువాక ...*
దక్షిణ్ ఎక్స్ప్రెసెస్ ముందుకు పరుగులు పెడుతుంది.
దేశం వెనక్కు వెళుతుంది. చెట్లు గుట్టలు గుళ్ళు కోనేర్లు గాభరా గాభరాగా ముందుకు వచ్చి, తల దించుకుని వెనక్కి పోతున్నాయి.
తెల్లారే ముందే లేచాడు కిట్టు.
చలి చంపుతుంది. భూమ్మీద ఇలాంటి చలి కూడా ఉంటుంది అని తెలియదు కిట్టూకి. నిద్ర అనేది ఆటకి అడ్డంకి అనే వాడి దృడ నమ్మకం.
రాజాయిలో ఎపుడు దూరాడో తెలీదు. నడుము వరకు వెచ్చగా ఉన్నాది , పయిన నవోదయ ఇచ్చిన తెల్లటి కాటన్ బెడ్షీట్ , అస్సలు కాయటం లేదు.
బండి ఆగింది.
సేవాగ్రాం. వార్ధా వెళ్ళడానికి దిగాలి అని బిగ్గరగా చెప్తున్నారు. ఇంకా తెల్లవార లేదు. చలి చంపేస్తుంది. పల్లు కటకటా కొట్టుకుంటున్నాయి. కర్టెన్ లా కట్టిన బెడ్ షీట్ లాగి పైన వేసుకున్నాడు. మళ్ళీ కలలోకి జారిపోయాడు.
కలలో అమ్మా నాన్నతో ప్రయాణం. అదీ ట్రైన్లోనే, గుడికి వెళ్తున్నారు రాయగడ. అక్కడ కూడా చలి. లీలగా బొమ్మలు కొనమని పేచీ పడుతున్నాడు.
ముడుకులతో ఎవరో తన్నినట్టయి లేచాడు. జానీ నిద్రలోనే కాళ్ళూ చేతులు కదుపుతూ పలవరిస్తుంది.
లేచేసరికి నాగపూర్ స్టేషన్ వచ్చింది. స్టేషన్ అంతా నారింజలు. నారింజల వాసన. కోసి అమ్ముతున్నారు, బ్యాగుల్లో వేసి అమ్ముతున్నారు. జ్యూస్ చేసి, ఎండ బెట్టి అలా అన్ని అవతారాల్లో నారింజ.
ఎదురుగా కూర్చుని పద్మజ మేడమ్, జానీ, టీ తాగుతున్నారు. ఇంక లేస్తారా లేక పడుకుంటారా మహారాజు గారు అని నవ్వుతున్నారు.
కిట్టూ కి సిగ్గేసింది తన అవతారం ఊహించుకుని. చక చకా లేచాడు, బ్రష్ చేసుకుని , జుట్టు తడిపి చేతుల్తో దువ్వి వచ్చాడు.
వచ్చేసరికి తన వయస్సులో ఉన్న కుర్రాడు. ఛాయా... ఛాయా .. అని వెళుతుంటే మేడమ్ ఆపి, ఏక్ దేనా చోటూ అన్నారు.
కుట్టు చేతికి కాగితం కప్పు ఇచ్చాడు. పట్టుకునే లోపు పీపా ఎత్తి టాప్ తిప్పాడు. తీరా చూస్తే తెల్లటి నీరు. ఒక పొట్లం వేశాడు. టెట్లే అని రాసి ఉంది. ఇళ్లా మనమే ముంచుకుంటే టీ అవుతుందట.
పద్మజా మేడం రేపటి ప్లాన్ గురించి జానీ చెప్తున్నారు. కిట్టు ని తనకు అప్ప చెప్పినట్టు. తనను ఆటలో అరటి పండులా చూస్తున్నారా అనిపించింది.
బయట చలి ముసుగులో భారత దేశం.
అమ్మ ఫోటో చూట్టానికి, అమ్మను ఎదురుగా చూట్టానికి ఎంత భేదం ఉందో అలా ఉంది భారత దేశాన్ని దగ్గరా చూడటం.
మాపులో ఉన్న నదులు, కొండలు, ఊర్లు ఇప్పుడు నిజంగా ప్రత్యక్షమౌతున్నాయి.
పటంలో ఒక చుక్క లాంటి ఊర్లు , ఇక్కడ ముగ్గులు వేసిన వాకిళ్ళతో, జోడెడ్డు బండ్లతో, కోనేరు, కోవెలలతో ఉన్నాయి. మూడో తరగతి లో చదివాడు మరాఠీ సంస్కృతి గురించి. ఇక్కడ అదే చిలకట్టు కట్టిన మహిళలు, పిరమిడ్ రూపంలోని గుడి గోపురాలు. అక్కడక్కడా జట్కా బళ్ళు ఉన్నాయి. ఉమా మేడం మూడో తరగతిలో నీలం రంగు చీరలో చెప్పిన క్లాసు ఇప్పుడు కళ్ళకు కట్టినట్టు ఉంది.
నాగపూరు దాటాక నారింజ తోటలు. ఒక్కో చెట్టుకి పువ్వులు పోసినట్టు ఎర్రటి పసుపు ఆకుపచ్చ రంగులలో నారింజలు.
అక్కడి మనుషుల వేషభాషలు చూస్తే ఇంకా గాంధీ, తిలక్ ఊళ్ళల్లో తిరుగుతున్నారు అనిపించింది కిట్టూ కి.
దేశాన్ని అడ్డంగా విభజిస్తూ ఉన్నవి వింధ్య పర్వతాలు అని విన్నాడు. ఇప్పుడు కళ్ళ ముందు ప్రత్యక్షం అవుతున్నాయి. పర్వతాలు తన చుట్టూ చెట్ల చీర కట్టుకున్నట్టు ఉన్నాయి.
చుట్టూ అరణ్యం.
ఒక్కో చోట ట్రైను మలుపు తిరుగుతుంటే ఇంజన్ , గార్డ్ పెట్టీ ఒకే సారి కనిపిస్తున్నాయి.
ట్రైను వేగం చాలా తగ్గింది. ప్రతి పావుగంటలో ఆగినట్టు ఉంటుంది. ముఖాల్లో కలవలికలు చాలా మారి పోయాయి. గంపల్లో కూరగాయలు వేసుకుని తన వయసు లోఉన్న పదమూడు పద్నాలుగేళ్ల అమ్మాయిలు అబ్బాయిలు సంతకు పోతున్నారు.
రిజర్వేషన్ అనే మాటే తెలియదు వచ్చి జానీ కిట్టు మధ్యలో కూర్చున్నారు గంపల్తో . కిట్టు వారి పేరు అడిగాడు, అక్క సయాలి, తమ్ముడు సాయ్.
క్లాస్ అడిగాడు. పగలబడి నవ్వుతున్నారు.
ఇస్కూల్ నహి జారీ.
మెడలో పెద్ద రింగు లాంటి సిల్వరు రంగు చక్రం వేసుకుంది సయాలీ. జానీ పట్టుకుని చూస్తుంది. దాని పేరు చెప్పింది అమ్మాయి. అబ్బాయ్ చేతికి దారాలు కట్టి ఉన్నాయి.
హామీ గోండు. అంటే జానీ చెప్పింది ఇక్కడి గిరిజనులు గోండు అంటారు అని.
ఎక్కడకి. అడిగింది జానీ.
సంతకంట.
గంపలో ఏముంది.
గంప మీద గుడ్డ తీసింది.
చింత పండు తొక్కతో ఉన్నాయి. ఈత పళ్ళూ.
ఒకటి జానీకి, వీడికి ఇచ్చింది.
చాలా బాగుంది అన్నాడు. తన
జేబులోని అమ్మ చేసిన బిస్కట్లు ఇచ్చాడు. ఇష్టంగా తిన్నారు.
ట్రైన్ స్లో అయ్యింది, ఆగ కుండానే ఒక్కొక్కరూ దిగిపోయారు.
ఆ ఇద్దరూ దిగి చేతులు ఊపుతున్నారు నవ్వుతున్నారు కులాసాగా.
కొంచెం సేపటి ఆమ్లా స్టేషన్. అక్కడ జుట్టు డిప్ప కటింగ్ తో, ఆకుపచ్చ ట్రంకు పెట్టె తో ఒక కుర్రాడు వచ్చాడు. వాడికి వీడుకోలు చెప్పటానికి పెద్ద మందే వచ్చింది. చంటి పిల్ల అబ్బాయి కి పాప కాబోసు. ఏడుస్తూ ఒక మహిళ భార్య అయి ఉంటుంది. స్టేషన్ చివర వరకూ ట్రైన్ తో పరుగెడుతూ టాటా చెప్పింది ఆవిడ.
వీడ్కోలు లో ఉండే భావాలు ఎన్నో ఎన్నో సార్లు అనుభవించిన కిట్టూ కళ్ళు ఆ మహిళతో ఒక్క క్షణం కలిసాయి, మాట్లాడాయి.
ట్రైన్ బయలు దేరింది. వాడు వీరికి ఎదురుగా ఉన్న సీట్లో కూర్చున్నాడు.
జానీ అడిగింది ఆప్ కహా జా రహే.
తను సియాచిన్ వెళ్తున్నాడు అంట.
ఎలా వెళ్తారు? కిట్టూ వెంటనే అడిగాడు. ఇది తెలుసుకోవాలి ఎలాగయినా.
ఢిల్లీ వెళ్లి.
అక్కడి నుండి ?
బస్సులో జమ్మూ. జమ్మూ నుండి కార్గిల్ ఇంకో ఊరు. అక్కడ నుండి సియాచిన్. మూడు వారాలు పడుతుంది అంట.
ఒక ఫోటో తీసి చూపిస్తున్నాడు. తెల్లటి బట్టలతో కూర్చుని స్టౌవ్ మీద నీళ్ళు మరిగిస్తున్నారు. చేతుల్లో తుపాకులు. చుట్టూ మంచు.
తను గర్వంగా చెప్తున్నాడు. అక్కడ తను చేసే పని. కిట్టూ కి గర్వంగా ఉంది, తనూ మిలట్రీ లో చేరతాను అని అనుకున్నాడు. వాడి మాట తీరు, నిటారుగా కూర్చోవడం, బలంగా సామాను ఎత్తడం చూసి.
ట్రైన్ పెద్ద హారన్ మోగిస్తూ , సొరంగం లోకి వెళ్ళింది. అకస్మాత్తుగా చిమ్మ చీకటి. గమ్మత్తుగా ఉంది.
సొరంగం అయిపోయింది. ట్రైన్ కుడి వైపుకు తిరుగుతుంది.
కిట్టు రా. కొంచెం తటపటాయించాడు. ఇలాంటి చోట ఎక్కడకి వెళ్ళడం అని.
రా .. రా... ఇప్పుడు గట్టిగా పిలుస్తుంది.
కొండ చరియల పక్కన జారిపడేట్టు ఉన్న పట్టాలమీద మలుపు తిరుగుతుంది ట్రైన్.
దడ్ దడ్ మంటూ శబ్దం రెండు బోగీలు కలిసే చోట. క్రింద ఉరుకులు పరుగులు తీస్తున్న పట్టాల మీద రాళ్ళు. రాళ్ళు కాకుండా వాటి ఛాయలు సినిమా రీళ్ల లాగ పరుగెడుతున్నాయి.
అక్కడ వరకూ వచ్చి తడబడ్డాడు కిట్టు. జానీ వెనక్కి వచ్చింది చేతులు పట్టుకుంటూ దాటారు.
దాటాక గుండెలో రాయి పడ్డట్టు ఉంది కిట్టూ కి. అంత ధైర్యం ఎలా వచ్చిందో అని.
పక్క బోగీలో పెళ్లి బృందం. మెడలో డబ్బుల నోట్లు దండ గా కట్టి అమ్మాయి, అబ్బాయి. వారి చుట్టూ రక రకాల రంగుల బట్టల్లో జనాలు.
పేక ముక్కలు ఆడుతూ కొందరు. తలకి చీర కప్పుకుని కూర్చున్న ఆడవారు. తల పాగాలు కట్టుకున్న మగ వారు ఒక పెట్టెలో.
ఇంకో పెట్టెలో తలుపు దగ్గర గంప లతో పువ్వులు. సంపంగి లాంటి పువ్వేదో అమ్ముకోవడానికి తీసుకెళ్తున్నారు దారి కడ్డంగా పెట్టి.
ఒకో పెట్టెలో కిట్టు ఊహించని దృశ్యాలు. లైబ్రరీ పుస్తకాల్లో లేని వింతలు ఒక్కో బోగీలో.
రెండు, మూడు, నాలుగు పెట్టెలు దాటాక, వంటలు చేసే భోగీ. గ్యాసు పొయ్యల్లో పెద్ద పెద్ద పాత్రల్లో ఏవో వంటలు.
అక్కడ ఇందాకల టీ ఇచ్చిన అబ్బాయ్, ఇప్పుడు అన్నం తింటున్నాడు. హలో చెప్పాడు , చేయి పైకెత్తి.
వంటల బోగీ అటువైపు ఫస్ట్ క్లాస్.
కుంచెం దూరం ఉన్నాయి బోగీలు. రెంటిని కలిపే ఇనుప రేకులు ఇప్పుడు కాస్త ఎడంగా ఉన్నాయ్. జానీ టక్కున గెంతి దాటేసింది.
గెంతుతూ కళ్ళు మూసేసాడు.
ఒక వైపు పెట్టె లాంటి గదులు. పక్కన నడిచే దారి. ప్రతి గదికి ఒక ఎర్రటి కర్టెన్. దారిలో ఎవ్వరూ లేరు.
ఫస్ట్ క్లాస్ బోగీలో నడిచే గాలరీ దారిలో ఉండగానే
పాయ్.....
పాయ్... అంటూ పెద్దగా ట్రైన్ హారను మోగింది.
ఇంకో సొరంగం. ఇద్దరి చుట్టూ చిమ్మ చీకటి కమ్ముకుంది.
కీచు మంటూ ట్రైన్ ఆగిపోయింది.
(సశేషం)
No comments:
Post a Comment