బోలో తారా రా రా..
ఉలిక్కిపడి లేచాడు కిట్టు. కల లోంచి తిన్నగా. అమ్మ భుజం మీద తల పెట్టుకుని పడుకున్నట్టు కల. అమ్మ పక్కన పడుకొని, చేతితో అమ్మను నిమురుతూ పడుకోవడం వాడికి అలవాటు. బస్సు సీటు తడిమేస్తున్నాడు కలలో. తల దగ్గర వెచ్చగా ఉన్నట్టుంది, సన్న జాజుల వాసన. ఎక్కడున్నాడు అని తెలియటం లేదు గాఢ నిద్రలోంచి తిన్నగా లేచినట్టు ఉంది.
నిద్ర రాదు అన్నావ్. చొంగ కార్చుకుంటూ పడుకున్నావ్.
వెక్కిరిస్తుంది జానీ.
ఈ పిల్ల ఎవరు. ఒక్క క్షణం తడబడ్డాడు.
వాన్ వెనుక సీట్లో, తను చండీగఢ్ వెళ్ళటం, నవోదయ గ్రూప్ లో ప్రయాణం ఒక్కసారి కళ్ళ ముందు ఫ్లాష్ అయ్యాయి.
చెరకు గెడలు తిన్నాక వాన్ వెనుక సీట్లో కూర్చున్నాడు కిట్టూ. వాన్ అంతా సామానులు చెల్లాచెదురుగా ఉంచారు. కిటికీ నుండి రోడ్డు చూడటం సరదా. అంతా నిద్రలో తూలుతున్నారు. పద్మజ మేడం తల మీద చున్నీ వేసుకుని పడుకున్నారు. మిగిలిన వాళ్ళు అంతే.
జానీ వెనక్కి వచ్చి కూర్చుంది. నీకు నిద్ర రావడం లేదా. ఊహు అన్నాడు. నాకు నిద్ర రాదు. ఎన్ని రోజులైనా ఉండిపోతాను అనడం గుర్తుంది.
మళ్ళీ ఇప్పుడు లేచాడు.
చండీగఢ్ లోపలకి వచ్చేశారు.
రోడ్లు వింతగా కనిపించాయి. పెద్ద వాహనాలు ఒకటి రాను, పోను రోడ్డులు. పక్కన చిన్న చిన్న ఆటోలు, రిక్షాలు లాంటివారికి వేరొక రెండు రోడ్లు. నడిచే వారికి, సైకిళ్లకు వేరే.
మన ఊర్లో ఒక్క రోడ్డు గొప్ప ఇక్కడ ఏకంగా నాలుగు రోడ్డులు, నడిచే వసతి ఉన్నాయి అనుకున్నాడు. ఇండియాలా లేదు. రోడ్లమీద ట్రాఫిక్ లైట్లు లేకుండా గుండ్రంగా వెళ్ళే దారులు ఉన్నాయి. వాటి మధ్యలో ఒక చోట రెండు యుద్ధ విమానాల నమూనాలు పెట్టారు.
ఇంకో చోట, మధ్యలో పార్కు. ఇంకో చోట నీరు పడుతున్న చిన్న ఫౌంటెన్ పక్కన గౌతమ బుద్ధుడు.
ఢిల్లీకి తలదన్నేలా ఉంది అనుకున్నాడు. పిల్లలు పెద్దగా అరుస్తున్నారు, అదిగో మొహాలీ స్టేడియం అని. అక్కడే పెద్ద పెద్ద క్రికెట్ మ్యాచులు అవుతాయి అంట.
చతురస్రానికి త్రికోణం తగిలించినట్టు బోర్డు పెట్టి సెక్టార్ పేర్లు రాసి ఉన్నాయి. తప్పిపోవడం ఇక్కడ కష్టమే అనుకున్నాడు కిట్టు.
ఊరికి అటు చివరన ఉంది సెక్టార్ 25. ఒక వైపు పంజాబ్ యూనివర్సిటీ ఒక వైపు నవోదయ నగర్.
అట్టహాసంగా ఉంది ఎంట్రన్స్.
సామానులు దించి వాన్ ఎటో వెళ్ళిపోయింది. సంచి, ఖాకీ డబ్బా ఎత్తుకునే లోపు.
టింగు టింగు టింగు టింగు అని పెద్ద పంజాబీ పాటల శబ్దాలు.
హాయో రబ్బా, హాయో రబ్బా
బోలో తారా రా రా
పెద్ద పెద్ద డోలు, డప్పులు, వేసుకుని పంజాబీ బట్టల్లో కుర్రాళ్ళు, అమ్మాయిలు డాన్స్ చేస్తున్నారు.
వీళ్లు వాన్ దిగిన క్షణం డప్పులు కొట్టడం మొదలు పెట్టారు.
చేతులు పైకెత్తి డ్రిల్లు చేస్తున్నట్టు డాన్సులు.
అనుకున్నట్టే తనతో వచ్చినవారంతా గెంతులు మొదలెట్టారు.
సామాన్లు పోతాయి అని బెంగ వీడికి. వీడి తువ్వాలు, సబ్బు, సబ్బు డొక్కు, బొమ్మలు, పెన్నులు, రబ్బర్లు, బట్టల సబ్బు, బ్రష్, టూత్ పేస్ట్, డ్రాయర్లు, చివరికి మంచి నీళ్ళు కొట్టేశారు వియ్యంపేటలో. అక్కడి నుండి అదో భయం పట్టింది.
కానీ తనతో వచ్చిన వాళ్ళకి వంటిమీద తెలివి లేదు. తాను కాపలా ఉంటాను అని గట్టిగా నిర్ణయం చేసుకున్నాడు.
ఇంతలో తల మీద చిన్న తెల్ల ముడి వేసుకుని, తన లాంటి ఒకడు తన ముందుకు వచ్చేసాడు.
కళ్ళలోకి చూస్తూ, బుర్ర ఊపుతూ,
బోలో తారారారా
బోలో తారారారా
అంటున్నాడు.
తప్పక వీడు కూడా అన్నాడు
బోలో తారారారా
బోలో తారారారా అన్నాడు ఆ గుంటడు మళ్ళీ
బోలో తారారారా
అన్నాడు.
ఇప్పుడు ఎడమ చెయ్యి ఎత్తి
బోలో తారారారా అన్నాడు ఆ గుంటడు.
వీడూ ఎత్తాడు,
ఎప్పుడు డాన్స్ మొదలయ్యింది తెలీదు
వాళ్ళల్లో కలిసి పిచ్చి పిచ్చిగా గెంతుతున్నాడు.
చమట పడి ఆరిపోతుంటే సుఖంగా ఉంది.
సామాన్లు పోతాయి అని ఆ గుంటడికి చెప్పాడు.
వాడు పక్కన ఉన్న వాళ్ళకు ఏదో అన్నాడు.
కాసేపటికి సామానులు కనిపించటం లేదు.
ఇంతలో ఇంకో బస్సు వచ్చింది.
అందులోంచి జపాన్ దేశీయులు దిగారు.
మళ్ళీ ఇంకా పెద్ద పెద్ద డప్పులు కొడుతూ జనం వాళ్ళని చుట్టుముట్టేసింది.
దగ్గరకి వెళ్ళి చూస్తే వాళ్ళూ నవోదయ పిల్లలే. మణిపూర్, త్రిపుర, అరుణాచల్ నుండి వచ్చిన వాళ్ళు వారు.
తనమీద తనకే చాలా సిగ్గు కోపం వచ్చింది. వాళ్లను జపాన్ దేశీయులనుకోవడం. వాళ్ళకి అక్కడ ఉన్న మిగిలిన వాళ్ళతో కలిసి కిట్టూ కూడా వెల్కమ్ చెప్పడం మొదలు పెట్టాడు, పేర్లు అడిగి తెలుసుకున్నాడు.
ఎవరు ఇక్కడి వాళ్ళో ఎవరు పర్యాటకులో తెలీడం లేదు.
ఒక పిల్ల ఎర్ర నీళ్లు పళ్ళెంలో పెట్టుకుని, సింధూరం పెడుతుంది వచ్చిన వాళ్ళకి. అలా పెడుతుంటే మన నెత్తి మీద మనమే చెయ్యి వేసుకుని కళ్ళు మూసుకుని పెట్టించుకోవాలి.
అదీ చేసేసాడు. బాగా అలిసిపోయాక, ఇందాకటి వాడు డార్మిటరీకి తీసుకువెళ్లాడు.
నా సామాన్లు పోయాయి మొర్రో అని ఎంత చెప్తున్నా వాడు లాక్కు పోతున్నాడు.
నాలుగు అంతస్తులుంది మెయిన్ బిల్డింగ్. ముఖమల్ కర్టెన్లు, వాటర్ కూలర్‌తో ప్రిన్సిపాల్ ఆఫీస్. మూడు అంతస్తులుంది హాస్టల్.
హాస్టల్లో వెళ్లగానే వీడిని మద్రాసీ అని పలకరిస్తున్నారు. నాది ఆంధ్రా అంటే, అదీ మద్రాస్ కదా అని.
రూముకు లాక్కుని తీసుకు వెళ్ళాడు. వీడు రూములోకి వెళ్తుండగా ఇద్దరు పిల్లలు హడావిడిగా బయటి పోతున్నారు.
అక్కడ తన సామానులు పడేసి ఉన్నాయి. ఆరో క్లాసు రాజీవ్ హౌస్ మొదటి వారం లోనే అనుకున్నాడు నవోదయ విద్యాలయాలో తాను రిపీట్ చెయ్యకూడని ఒకే ఒక తప్పు, సామాన్లు వదిలి ఆటకి వెళ్ళి పోవడం.
గాభరా గాభరాగా ఒకొక్కటి లెక్క చూసుకుంటున్నాడు.
(సశేషం)
No comments:
Post a Comment