*జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా ...*

 *జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన ఓ మైనా మైనా ...*


ఎనిమిదో తరగతి అక్టోబర్. పాల్ఘాట్ నుండి వచ్చాక ఇంటికి వెళ్లి వచ్చిన కిట్టూకి ఎన్నో ఏనుగుల శక్తి వచ్చేసింది. 

మిగతా స్కూళ్లను, మిగతా దేశాన్ని, చూసాక పరకాయ ప్రవేశం చేసినట్టు. తనను, తన స్కూల్ని, దూరంగా చూసాక ఒక కొత్త దృక్పథం. కోస్తా వడ్డున వెళ్ళిన రైలు, దానిని అక్కడక్కడా దాటుతూ వాగులు వంకలు. దేశాన్ని చూసాక తన చుట్టూ ఉన్న చిన్ని లోకం అర్థం అయినట్టుంది.


జానీ ఇచ్చిన ధైర్యం, ఆ కోమలమైన భావాలు జీవితాన్ని కసితోనే కాదు ఆనందిస్తూ దాటొచ్చనే గురి. 


తెలుగు శంకరరావు. హిందీ శశికళ. బయాలజీ తాతయ్య సార్. ఫిజిక్స్ వేరే కొత్త మాస్టారు. లెక్కలు అమ్మాణి . కపిల్ దేవ్ వరల్డ్ కప్ గెలిచి న బృందం లాంటి టీచర్లు.


ఉదయానే సూర్యోదయం చూస్తూ ఒక పావు గంట చదవటానికి వెళ్లేవాడు స్కూలుకు. ఎర్రటి సూర్యుడు పైకి ఎక్కుతుంటే, కళ్ళు మూసుకుని ఏదో ఒక విషయం మననం చేసే వాడు.

ఒక చిన్న పుస్తకం పెట్టుకున్నాడు. అందులో రోజూ చదువుకున్న సమయం రాసుకునే వాడు. 5-6 గంటలు చేరడం టార్గెట్. ఇంకా ఏవో నచ్చినవి రాసేవాడు.

'నల్దిక్కులు గల్గు లోకమున దిక్కరియున్న' అని పద్యం తెలుగులో చెప్పారు. అది గుర్తు చేసుకుంటూనే, ఆ రోజు ఉదయం సూర్యోదయం చూస్తూ వెక్కి వెక్కి ఏడ్చాడు. అందరూ బతికి ఉండగానే అనాథలమా అనే భావంతో కన్నీరు మున్నీరయ్యాడు. అదే మాట పాకెట్ డైరీ లో రాసుకున్నాడు. ఆ పద్యం తన మీదే రాశాడా గుర్రం జాషువా అని.


వెనుకనుండి, కిట్టూ చూపించు అని ఒక అక్క గొంతు. తనను చూసేసింది. అడుగుతుంది బుక్కులో ఏముంది అని చనువుగా అడుగుతుంది వెనక దగ్గరగా వచ్చి. 


ఇవ్వను. కఠినంగా అన్నాడు. 

వెనకనుండి గట్టిగా పట్టుకుని,ఏమిటి అనే లోపు, సీక్రెట్ బుక్కు లాక్కునే ప్రయత్నం.


గింజుకున్నాడు.

స్పర్శ.


ఆమె కుతూహలం.

తనకు భయం. 


ఆమెకు కోపం. 

తనకు సిగ్గు. 


అడిగినవన్నీ అమాయకంగా చెప్పే కిట్టు దాయటం అక్కకు నచ్చలేదు. 

కిట్టు తన రహస్యాలు దాచుకునే తపన.

ఆమెకు చూడాలి.


జానీ లా కాక అమ్మాయి స్పర్శ కిట్టుని సతమతం చేస్తుంది. 

బలం తప్పింది.

ఇచ్చేశాడు. 


ఆమె చూసింది పుస్తకం. 

టైమ్ టేబుల్లు. ఏవో రాతలు. 


ఒక చోట జానీ పేరు తన పేరు కలిపి సంతకం చేశాడు. 

తన పేరు. 

సంతకంలో కొబ్బరి చెట్లు. 

వంకలో ఉదయిస్తున్న సూర్యుడు.


అక్షరాలు కలుస్తూ ఆమె పేరుగా మారడం. 

ఇది ఆర్టిస్టు పెట్టే శైలి లోని సంతకం. 

పేజీ నిండా. 


తనను మళ్ళీ చూసింది ఆమె. 

బుక్కు జాగ్రత్త గా కిట్టు జేబులో పెట్టి వెళ్ళిపోయింది.


సూర్యుడు మర్డర్ చేసినట్టు మేఘాలను ఎర్రగా చేసి ఆకాశంలోకి ఎక్కుతున్నాడు.

.... 


ఆ రోజుల్లోనే, వీడి చుట్టూ ఒక బృందం చేరడం మొదలయ్యింది. ఏడో తరగతిలో పాఠం చెప్తూ ఎవరో టీచర్ అన్నారంట, కిట్టూ దగ్గర నేర్చుకోండి చదువుకునే విధానం అని.

కిట్టు లాగే ఒక పుస్తకం జేబులో పెట్టుకుని, వాడి లాగే తొందర తొందరగా పనులు చేసుకుని , వాడిలాగే పరిగెత్తుకుంటూ మెస్సుకు వెళ్లే అనుకరణ బృందం.


వీడి దగ్గర జీవన సిద్ధాంతాలను అడిగి నేర్చుకునే తల మాసిన వాళ్ళు ఒక ముగ్గురు నలుగురు చేరేవారు. వాళ్ళ చేత నీళ్ళు తెప్పించుకోవడం, మెస్ లైన్లో స్థలం ఉంచడం, బట్టలు ఉతికించడం ఇలా నానా పనులు చేయించుకునే వాడు..

అందరూ ఆ బుక్కులో ఏముంది అని అడిగే వారే. 

..

హాఫ్ ఇయర్లీ సర్క్యులర్ వచ్చింది. 

కొత్తవలస నుండి కిరండోల్ వెళ్ళే ఇనుప ఖనిజం తీసుకువెళ్ళే ఎలెక్ట్రిక్ ట్రైన్లా తయారు అవ్వటం మొదలు పెట్టాడు. అరులో 564/600 తో చావు తప్పి కన్ను లొట్ట పోయినట్టు, కేవలం రెండు మూడు మార్కులతో ఫస్ట్ తెచ్చుకున్నాడు. 7 లో 576/600 అయినా మహా అయితే అయిదారు మార్కుల తేడా. ప్రతి ఏడాది ఈ ఉత్కంఠ భరించలేకుండా ఉండేది.  ఇంక ఈ సంవత్సరం ఎలా అయినా మార్జిన్ పెంచాలి అని పట్టుదల. 

'అద్భుతాల ఋతువు' అని రాసుకున్నాడు డైరీ లో. 

99/100/98/99/99 హిందీ తప్ప అన్ని మార్కులు ఇచ్చేశారు. 99% తో ఇన్నాళ్ళ కష్టానికీ రానన్ని మార్కులు  వచ్చాయి. అంటే తన కొత్త పద్ధతి పనిచేసినట్టే ! 


ఇంకా రావాల్సింది హిందీ ఒక్కటే. ఇంచుమించు 10 మార్కుల మార్జిన్ ఉంది. అయినా కొంత భయం. 

శశికళ మేడం రూమ్ కి రమ్మని పిలుపు. వెళ్ళాడు. సాయంత్రం ఆరు. ఆ సమయంలో పిలవటం వింతే. కొంత భయం మొదలయ్యింది. 


కిట్టు, నీ పేపర్ కరెక్ట్ చేసాను అని. పేరు మార్చుకోమన్నాను కదా అయినా నా పేరు రాసావ్ . 

అది నా పేరు కూడా. 


ఔనా, 10 మార్క్స్ కట్. 

అలా అని తల ఎత్తి హాయిగా నవ్వుతున్నారు ఆమె. పాలు కారినట్టు ఆమె కంఠం. 


కిట్టు కళ్ళంట నీళ్ళు. 

ఇంతలో నర్స్ మేడమ్ వచ్చారు. 


ఏమే శాడిస్టు, మళ్ళీ చిన్న పిల్లలని ఏడిపిస్తున్నావా ? 

వీడు ఎక్కడ చిన్న పిల్లాడు.


కిలకిలా నవ్వులు మళ్ళీ. 

రారా చూడు. 99. నేనేమీ శాడిస్ట్ కాదులే. 


పో. 

కిట్టు గాల్లో తేలినట్టుంది. హిందీ లో 99 రావడం ఇదే తొలిసారి . 594/600. కిట్టు అనుకోని టార్గెట్ అది. 

మంచి హుషారుగా ఉంది సాయంత్రం. ఇంక చలికాలం సెలవులు వచ్చేస్తున్నాయ్. ఇంటికి వెళ్ళడమే తరువాయి. 


స్కూల్ బిల్డింగ్ రెండు భాగాలుగా ఉండేది. ఆ రెండిటిని కలుపుతూ చిన్న వంతెన. వంతెన కిందన స్కూల్ బెల్లు కొట్టేది రోజక్క. మొదటి అంతస్తులో వంతెన మీద కిట్టు బాల్యంలో ప్రతి రోజు గడిపేవాడు. 


సాయంత్రం అక్కడ చేరాడు. నిండు వెన్నల రోజు. 

తాచు పాములా కొత్త రోడ్లు. ఎదురుగా చక్కటి సాయంత్రం. 


సెల్ఫ్ స్టడీ అయిపోయే సమయం. 

రోజక్క పిలుస్తుంది కిట్టూ. ఉన్నావా ? 


ఆ.. 

నీకు పెద్దాపురం నుండి ఫోను. 


నాకా? 

నీకే? 


వెళ్ళాడు ఉరుక్కుంటూ

స్టాఫ్ రూంలో ఫోను 


ఎత్తాడు

పద్మజ మేడం


వీడికి పాల్ఘాట్ తీసుకు వెళ్ళిన టీచర్. 

గుడ్ ఈవెనింగ్ చెప్పాడు. 


ఆవిడ, ఇదుగో అని ఫోన్ ఎవరికో ఇచ్చారు.. 

కిట్టూ నేను. 


జానీ! 

నీకు ఫోన్ ఎలా అని అడిగాడు. 


కిట్టూ , నన్ను నేషనల్ కి పిలిచారు. చండీగడ్. నీక్కూడా వచ్చిందా అని. 

నాకు రాలేదే ? 


అడుగు. ఇది ఆప్షనల్ అంట. నువ్వు వస్తే నేను వస్తాను. 

నాకు తెలీదు. 


కనుక్కో. మాకు టెన్త్ సిలబస్ మొదలు పెట్టేస్తారు అంట జనవరిలో. నీకు రాకపోతే నేను వెళ్ళను. అందుకే చేసాను. 

(సశేషం)

No comments: