మరుసటి రోజు బెడ్డు మీద లేచే సమయానికి కిటికీ బయట శబ్దాలు వినిపిస్తున్నాయి. కప్పుకోవడానికి పలచటి పరుపు ఇచ్చారు. అందులోంచి లేవటానికి చలి ఎదుర్కోడానికి చాలా తటపటాయించాడు.
ఎర్రటి మంటల వెలుగు మూసిన కిటికీ మీద కనిపిస్తుంది. కిటికీ మెల్లగా తెరిచాడు. ఇంకా చిమ్మ చీకటి, కిందన మంట వేసుకుని, చుట్టూ నోట్లో బ్రష్లు పెట్టుకుని పంజాబీ అబ్బాయిలు.
వీణ్ణి చూశారు. మద్రాసీ నీచే ఆజా అని కేకలు పెడుతున్నారు.
బ్రష్ పట్టుకుని, షూ వేసుకుని కిందకి వెళ్ళాడు. అక్కడ పచ్చి వేరు సెనగలు మంటలో వేసి, వాటితో పాటు గజక్ అనే నువ్వులు కలిపిన బెల్లం కలిపి తింటున్నారు.
చుట్టు పక్కల చుస్తే ఇంకో రెండు మూడు మంటలు ఉన్నాయి. అమ్మాయిల హాస్టల్ దగ్గర కూడా.
అటు వెళ్ళాడు జానీ లేచి ఉంటుంది అని. షరాయి లాంటి స్వెటర్ , మంకీ కాపు, చిన్నా పసుపు రంగు స్క్రాఫ్ లో జానీ కనిపించింది.
కిట్టూ తను తెచ్చినవి ఇవ్వ బోయే లోపు తానే చేతిలో గుప్పెడు ముక్కలు చూపించింది.
ఆరు వెళ్దామా అన్నాడు. సరే. తినుకుంటూ గేటు దగ్గరకి వచ్చారు.
ఇద్దరూ గేటు వరకూ వెళ్ళారు. గేటు తాళం వేసి ఉంది. పక్కన వెళ్ళే తోవ లేదు.
నా వెనకాలే రా, అన్నాడు కిట్టు. ప్రహరీ గోడ అనుకుంటూ నడుస్తున్నారు. గోడ కాస్త దూరం పోయాక కొంత ఎత్తు తగ్గింది. ఇక్కడ పిల్లలు వెళ్ళటానికి బస్తాలు గట్టా వేసే ఉంటారు గోడ దూకడానికి అంటున్నాడు. ఇంకా వెనక్కి వెళ్తున్నారు. ఒక చోటకి వచ్చి గోడ అకస్మాత్తుగా ఆగిపోయింది.
కిట్టూ, హహహ చెప్పానా ? అంటున్నాడు.
గోడ చివరన ముళ్ళ కంపలు వేసి ఉన్నాయి, ఆ తరువాత చెట్లు. కిట్టు కర్రతో దారి చేశాడు.
జాగ్రత్త, రా అని.
జానీ అడిగింది.
నీకు దారి ఉందని ఎలా తెలుసు అని.
ఐదు సార్లు పారిపోయాను. నాకు కొన్ని అలా అనిపిస్తాయి అంతే.
గోడలు ఇంత పెద్దవి ఉంటే, వాటిని జంప్ చేసే మార్గాలు ఉన్నట్టే అనుకోవాలి.
ఇంకా చీకటిగానే ఉంది నేలమీద. ఆకాశంలో నీలం వస్తుంది. వెన్నెల రాత్రి చంద్రుడు ఇంకా పడమట చెట్లలో ఉన్నాడు.
బయట చండీగఢ్ రోడ్లు ఖాళీ గా ఉన్నాయి. రోడ్డు ఊడ్చే మెషిన్ వస్తుంది దూరంగా. వింతగా చూసారు ఇద్దరు.
ఎడమ పక్కన చెట్లతో ఉన్న ప్రహారీ గోడ. అటు దాటి వెళ్ళి ఫుట్ పాత్ మీద నడుస్తున్నారు.
కిట్టు అలవాటుగా జానీ ఎడమ చేతి వేలు పట్టుకున్నాడు.
జానీ కాసేపాగి అన్నాది, నువ్వింకా వేలు పట్టుకుని నడుస్తావా కిట్టు ? అని.
అలవాటు. అన్నాడు.
చటుక్కున వెనక్క తీసుకున్నాడు.
జానీ ఈసారి చెయ్యి లాగి తనే పట్టుకుంది.
నాకు ఇష్టమే, అన్నాది జానీ.
రెండు అడుగులు ముందుకు నడిచి ఒక గెంతు గెంతు మళ్ళీ ఆగింది. మళ్ళీ అలా గెంతుకుంటూ నడుచుకుంటూ వస్తుంది.
కిట్టు అన్నాడు.
నువ్వు చేస్తున్న పనేంటి?, ఇలా చిన్న పిల్లలే నడుస్తారు అని.
జానీ అన్నాది.
సరే చిన్న పిల్లనే అనుకో.
ఇంతలో గేటు కనిపించిది. పంజాబ్ యూనివర్సిటీ.
లోపలికి దూరారు.
రోడ్డు ఖాళీగా ఉంది. గేట్ మూసి ఉన్నా, వాటికి వేసిన చైన్ కావాలని లూసుగా కట్టారు, సైకిళ్ళు మనుషులు వెళ్ళేటట్టు.
ఇటుక బెడ్డలను త్రికోణాకారంలో అమర్చి ఎడమ కుడి వైపులో చిన్న గట్టు వేశారు. అక్కడక్కడా జాతీయ జెండాలు పెట్టి ఉన్నాయి.
నడవటానికి వెళ్ళే దారి. కొంచెం దూరంలో ట్రాక్ సూట్ లో పరుగెత్తున్నారు ముగ్గురు అమ్మాయిలు.
కాస్త ముందుకు వెళితే పంజాబీ అక్షరాల్లో దిక్కులు రాశి ఉన్నాయి. PGIMER హాస్పిటల్ ఎడమకు, జాకీర్ హుస్సేన్ రోస్ గార్డెన్ కుడికి, ఇంకా ఏవేవో బిల్డింగుల దారి.
కుడి వైపు తిరిగారు. దట్టంగా పొగమంచు కమ్ముకు వస్తుంది .ముందుకున్న మార్గం ఒక ఇరవై ముప్పై అడుగుల దూరంi మాత్రమే కనిపిస్తుంది. టీ కొట్టు వాళ్ళు కూడా ఇంకా లేచినట్టు లేరు.
కిట్టు నిన్ను ఒకటి అడగనా. ఆ
అడుగు.
నువ్వు డైరీలో అంత కసిగా, ఉదృతంగా ఎందుకు రాసుకున్నావు.
నేనయితే నీకు సమాధానమిస్తాను. నువ్వు తరువాత నేను అడిగింది చెప్పాలి.
సరే.
నేను మంచి వాడిని కాదు అన్నాడు.
ఔనా. నువ్వు తిరుగు బోతూ, తాగు బోతువని నాకు అప్పుడే అనుమానం9 వచ్చింది. వెక్కిరిస్తూ నవ్వుతుంది.
కానీ నిజంగా చెప్తున్నాను. సీరియస్ గా అన్నాడు.
చెప్పు. నేను వింటున్నాను.
నేను చిన్నప్పుడు దొంగతనం చేశాను. అన్నయ్య దాచుకున్న డబ్బులు తీసి చాక్లెట్లు కొనుక్కునే వాడిని. పెద్ద పెద్ద ఫైవ్ స్టార్, జెమ్స్ అలా. ఒక సారి దొరికి పోయాను. అప్పుడు నుంచి9 నాకు నేను దొంగ అయిపోతానని భయం.
జానీ వింటుంది.
నాలుగులో మాకు శాస్త్రి సార్ అని ఒకాయన జాగ్రఫీ చెప్పేవారు. ఫస్ట్ యూనిట్ లో నాకన్నా విద్యా సాగర్ అనే వాడికి ఎక్కువ మార్కులు వస్తాయని నేను వాడి బుక్ లో పేజీ చింపేసాను. అయినా పరీక్షలో నేను తప్పు రాశాను. వాడు సరిగ్గా990 రాసాడు. అప్పడి నుండి నేను నా పని వరకూ తిన్నగా చెయ్యాలి అని ఉంటాను. ఆ రోజు నేను తుమ్మికాపల్లిలో మేడ మీదకి వెళ్ళి ఏడ్చాను. మళ్ళీ అలా ఏడవకూడదు అని చదువుతాను.
జానీ ఏమి అనటం లేదు. వింటుంది.
నేను స్వాతి పుస్తకంలో వచ్చే పెద్దల కథలు కూడా చదివాను చాలా సార్లు.
జానీ ఒక్కసారి ఆగి కళ్ళల్లోకి చూసింది. మళ్ళీ నడుస్తుంది.
సెలవుల్లో కటిక పుల్లలతో సిగరెట్ లాగ కాల్చాను.
మనసులోని వన్నీ తన్నుకు వస్తున్నట్టు తనకి చెప్పేస్తున్నాడు. తన అసలు రూపం తెలిస్తే తన మీద ఉన్న మంచి అభిప్రాయం పోతుంది అని ముందే చెప్తున్నాడు. p
జానీ తనను ఆప లేదు. వింటుంది.
నాకు సీనియర్లు చెప్పేవారు, చిన్న క్లాసుల్లో బాగా చదివి వెనక పడిన వెంకటేష్ రెడ్డి, దినకర్, ఇలా ఎంతమందో ఉన్నారు అని. వాళ్ళు చెప్పినట్టే నేను 7లో వెనక పడ్డాను. ఆ రోజు రాత్రి నా జీవితంలో పెద్ద ఘట్టం జరిగింది.
నా టాలెంట్ మీద, బుర్ర మీద ఎప్పుడూ ఆధారపడి ఉండకూడదు అని. కష్ట పడితేనే టాలెంట్ ఉంటుంది అని. అందుకే రాశాను , విరామ0i మెరుగక శ్రమించు, విజయాన్ని కైవసించు, అని.
ఆ రోజు రాత్రి నేను మళ్ళీ పుట్టినట్టయ్యింది జానీ.
నడక ఆపింది జానకి.
నువ్వు చెప్పినవన్నీ చేశావ్ అంటే నేను నమ్మలేను. కానీ నీకు తప్పు అనిపిస్తే మళ్ళీ చెయ్యకుండా ఉంటావు అంటే మాత్రం నేను నిజంగా నమ్ముతాను అన్నాది.
తన మనసులోని పెద్ద బరువు తగ్గినట్టయ్యింది కిట్టూకి.
నేను ఇంత వెధవని తెలిసినా నీకు కోపం రావటం లేదా. అడిగాడు.
లేదు. నీకు రాధా కృష్ణులు మొదటిసారి కలిసిన కథ తెలుసా.
ఊహు..
భాగవతంలో చెప్పారు. బీవీకే లో. ఏమో గుర్తు లేదు.
చెప్పు. అడిగాడు కిట్టు.
నేను నిన్ను మొదటి సారి చూసినప్పుడు. నీ కళ్ళల్లో ఏమున్నాయి.
ఏమో.
ఏడుస్తున్నావ్. బెర్తు మీద కూర్చుని.
ఔను.
నేను నీతో మాట్లాడాక.
నవ్వుంటాను. నవ్వుతూ అన్నాడు కిట్టూ.
నవ్వావు. నిన్ను కళ్ళలోకి నిజంగా చూసిన క్షణమే ఏదో పాతవి గుర్తు కొచ్చినట్టు అయ్యింది.
రాధ కృష్ణుణ్ణి కలిసినప్పుడు ఇలా అయింది అంట. రాధ లాగే నేను నీ కంటే పెద్ద కూడాను. పగల బడి నవ్వుతుంది.
మరి నేను చేసిన దొంగ పనులు విన్నాక నా మీద కోపం రాలేదా. అడిగాడు కిట్టు.
నువ్వేం చేసినా నాకు దొంగతనం కాదు చిలిపితనం కనిపిస్తుంది కిట్టు.
నడుస్తూ అడిగింది జానీ,
సరే. నేను అడగనా ?
అడుగు.
నా పేరు నీ పేరు కలిపి సంతకం ఎందుకు చేశావ్ డైరీ లో ? జానీ అడిగింది.
ఆ రోజు నన్ను ట్రైన్లో ముద్దు ఎందుకు పెట్టావు? , కిట్టు టక్ మని ఎదురు ప్రశ్న అడిగాడు.
నువ్వు నన్ను
మర్చిపోకుండా ఉండటానికి.
నేను కూడా అందుకే కలిపి రాసాను. ఇంక నా సంతకం నీ సంతకం కలిపే ఉంటుంది.
నిశ్శబ్దం. చేతులు వదలలేదు ఇన్ని మాటల్లోనూ.
ఈసారి, అన్ని వేళ్ళు కలిసేలా అర చేతిలో చెయ్యి వేసుకుని పట్టుకుంది.
జాకీర్ హుస్సేన్ గులాబీ తోటలోకి వచ్చారు. ఎర్రటి గులాబీలు ఇంకా మొగ్గలలా ఉన్నాయి. అడవి గులాబీలు చిన్న చిన్నవి ముళ్ళ పొదల్లా కిందన వేశారు.
చిన్న మడుగు పక్కన నడుస్తున్నారు.
సూర్యోదయం ఔతుంది ఎట్టకేలకు. చంద్రుడు చివరకు గుడ్బాయ్ ఎపుడు చెప్పి వెళ్ళిపోయాడో తెలీదు. ఎర్రగా సూర్యుడు.
పొగ మంచు కొంచెం కొంచెం గా వెనక్కి వెళ్తుంది.
జానీ, నన్ను అన్నీ చెప్పిస్తున్నావ్ నువ్వు నా డైరీ చూసాక నీ మనసులోనిది చెప్తావ్ అన్నావ్ కదా.
చెప్పు. నీ మనసులో ఏముందో , కక్కు. అన్నాడు కిట్టు.
నేను నీకు ఆ రోజే చెప్పాను కిట్టూ.
ఎక్కడ !! ఆశ్చర్యంగా అడిగాడు.
పాట విన్నావు కదా ?
పాట లో ఏం చెప్పావ్ జానీ ?
నీకు అన్ని పచ్చి గానే చెప్పాలా?
లేదు. స్పష్టంగా చెప్పాలి.
నడక ఆపి,
చెవిలో చెప్పింది,
"
నా ఆశలా ఊసులే చెవిలోన చెబుతానే.
నీ అందెలలో చిక్కుకుంది అదే.
"
వెచ్చగా ఉంది జానీ ఊపిరి చెవి దగ్గర.
కిట్టు : ఔనా ?
జానీ : ఔను.
తిన్నగా చెప్పు జానీ. ఏమిటి ఈ డొంక తిరుగుడు నాకు.
జానీ: నీకు సిగ్గూ ఎగ్గూ లేవు గానీ. నేను ఆడ పిల్లనిరా.
పోనీ
కళ్ళు మూసుకుంటాను చెప్పు.
కళ్ళు మూసుకున్నాడు.
...... ఆరు క్షణాల నిశ్శబ్దం....
తను అమాంతం కిట్టుని రెండు చేతులతో చుట్టుకుంది , చేతులు కిట్టు వెనుక పెట్టి.
తొలి కిరణాలు పడుతున్నాయి కిట్టు మొహం మీద.
ధియోయోనః ప్రచోదయాత్ అని మొక్కుకున్నాను. ఇదే మార్గం ఇచ్చాడు సూర్యుడు అనుకున్నాడు.
కిట్టు ఒక్క క్షణం ఆగాడు. వారం దాటింది ఇంకో మనిషి తనను స్పృశించి. జానీ నింపిన చైతన్యం ఆపాదమస్తకం నిండిపోయింది.
తన చేతులు జానీ మేను మీద వాలాయి. అక్కడి వరకూ ఉంది జానీ పొడవాటి జుట్టు.
జానీ మనసు కిట్టూలో కరిగిపోతున్నట్టుంది.
నిలబడే శక్తి లేనట్టు కిట్టూ మీద వాలిపోతుంది తను. తన గుండెలోని శక్తిని కూడా అమాంతం లాక్కొని కిట్టు గుండె ఇప్పుడు మంద్రంగా మోగుతునట్టుంది.
చుట్టూ కిచ్ కీచ్ అంటూ పక్షులు విజృంభిస్తున్నాయి.
ఒక క్షణం చలి.
మరు క్షణం వేడి.
చెట్ల మధ్యనుండి బాణాల్లా కిరణాలు.
తెల్లారే వరకు వేరే వేరే గా ఉన్న
మంచు బిందువులు రెండు ఎండకి కలిసినట్టు అయిపోయారు.
తొలి సూర్య కిరణాల్లో పొగ మంచులా కరిగిపోతున్నారు.
1997, జనవరి 25, శనివారం. చండీఘర్
No comments:
Post a Comment