ఏ దిల్లీ హై మేరీ జాన్

 ఏ దిల్లీ హై మేరీ జాన్


దక్షిణ ఎక్స్ప్రెస్ ఇప్పుడు భోపాల్ దాటి చాలా సేపు నడిచింది. దేశం చేతులు పైకి ఎత్తి కళ్ళ ముందు వళ్ళు విరుచుకున్నట్టు ఉంది. ఒక్కో ప్రాంతం చూస్తే ఇంకా బ్రిటీష్ రాజ్యంలా కనిపించింది కిట్టు గాడికి. 


రాళ్ళతో చేసిన రైల్వే స్టేషన్, పక్కన వాటర్ ట్యాంక్, ఆనుకుని ఒక చిన్న స్కూలు. ఎక్కడో తప్ప స్లాబు వేసిన ఇళ్ళు లేవు. 


ఇళ్ళకు బయట గోడలు ఇటుక బెడ్డలతో వదిలేసే ఉన్నాయి. అక్కడక్కడా  ట్రైన్ పట్టాల దగ్గర రోడ్డు ట్రాఫిక్ నిలిపి ఉండటం చూసాడు. తన సొంతూరు ఇలా పుట్టిందే ఒక రైలు గేటు పక్కన. 


అక్కడ గేటు పడితేనే వ్యాపారం. అలా గేటుని నమ్ముకుని బతికేవాళ్ళు అక్కడి మంగలి వాడు, అరటి పళ్ళు, తాండ్ర అమ్ముకునే వాళ్ళు. 


ఒక చోట ట్రైన్ పక్కన ఒకామె స్నానం చేస్తుంది చిన్న కొలనులో. జానీ కి చూపించాడు విచిత్రంగా ఆవిడ చీర తెర గా కట్టుకుని, లంగాలో స్నానం చేస్తుంది.  జానీ చెప్పింది,

కిట్టూ ఆవిడకు ఒకటే చీర ఉంది అని. ఆశ్చర్య పోయాడు,  ఆడవాళ్ళ దృక్కోణం అంత వేరేగా ఉంటుందా అని. 


తన మీద తనకు సిగ్గేసింది.


దక్షిణ ఎక్స్ప్రెస్ గ్వాలియర్ దాటింది చంబల్ లోయలోకి ప్రవేశించింది. 


చిన్న సందుల్లాంటి లోయల్లో వేశారు ట్రైన్ పట్టాలు. చుట్టూ బంజరు భూములు. గుర్రాలతో సవారీ చేసే వాళ్ళు ఇంకా కనిపిస్తూనే ఉన్నారు. 


ఇది హైదరాబాద్ చుట్టూ ఉన్న బండ రాళ్ళ భూముల్లా కాదు, గడ్డి భూములు. ఒక మనిషి నిలుచున్నా కనిపించని అంత ఎత్తు గడ్డి. 


మొరీనా అన్న ఊరు వచ్చింది. పోలీసు ఒకడు పెట్టెలో నిల్చున్నాడు. రైలు పెట్టెల తలుపులు మూయించి ఉంచారు. ఇంకా బందిపోటు భయం ఉన్నట్టే. రైలు ఆగినప్పుడు చిన్న చిన్న స్టేషన్లలో పాత కాలం తుపాకీ లు పట్టుకుని, ఖాకీ నిక్కర్లు వేసుకున్న రైల్వే పోలీసులు.


భూమి లోపలకి తవ్వి, వేసినట్టు ఉన్నాయి ట్రైను పట్టాలు. పక్కన ఎత్తు మీద గుర్రం తోలే వాళ్ళు అక్కడక్కడా కనిపించారు. 


చంబల్ దాటింది సాయంత్రానికి. 


ఆగ్రా కంటోన్మెంటు. 

ఇక్కడ దక్షిణ ఎక్స్ప్రెస్ ఒక సామాన్య  రైలు మాత్రమే. ఎక్కడెక్కడి నుంచో రైళ్లు ఇక్కడ కలుస్తాయి. తొమ్మిదో నంబర్ ప్లాట్ఫారం. 


చలి ఎముకలను కొరికేలా ఉంది. కిటికీలు తలుపులు అన్ని మూసే ఉంచారు. జానీ చాలా సేపు కిందనే ఉంది, రాజాయి షేర్ చేస్తూ. 


కిట్టూ అమ్మ ఇచ్చిన స్వెట్టర్ వేశాడు. జానీ పగలబడి పగలబడి నవ్వింది. ఇది లేడీస్ స్వెట్టర్ రా అని.


కిట్టు చెప్పాడు, స్వెట్టర్ ఎలా అప్పుగా వచ్చిందో. 


రాత్రి చాలా పొద్దుపోయాక తను పైకి వెళ్ళిపోయింది.


హస్తిన


నిజాముద్దీన్ స్టేషన్. 

తెల్లవారు జాము మూడు గంటలు. 


సామానులు పట్టుకుని అప్పటికే అందరూ దిగి పోయారు.


చలి ప్రాణం తీసేలా ఉంది. అన్ని చోట్ల ఒకేసారి కత్తులతో పొడిచిన్నట్టు ఉంది. చెవులు తిమ్మిర్లు కట్టేశాయి. చేతి వేళ్ళు నొప్పి పెడుతున్నాయి. 


సామానులు ఎత్తే కూలీలు చాలా డబ్బులు అడిగారు. ఇది డిల్లీ ఇక్కడ అన్నీ ఖరీదే.


పిల్లలు తమ తమ సామాన్లు పట్టుకుని ఓవర్ బ్రిడ్జి ఎక్కడానికి ప్రయత్నించారు. అవ్వలే. 


రెండు మూడు అంతస్తుల ఎత్తులో ఉంది ఓవర్ బ్రిడ్జి. ఇద్దరు కిందన ఉంటే మిగిలిన వాళ్ళు వస్తువులు ఎత్తుకుని పైకి మోసుకు వెళ్ళారు. 


అలా నాలుగు ఐదు పర్యాయాలు వెళ్లాక సామాను పైకి చేరింది. 


అక్కడ నుండి ఏ గేటుకు వెళ్ళడం కనుక్కోవడానికి మేడమ్ వెళ్ళారు. ఇక్కడ ఆవిడ కూడా కొత్తే. 


చాలాసేపటికి మార్గం తెల్సింది. ఇంకా తెల్లవారు కాలేదు. బ్రిడ్జి దిగారు. అక్కడ నుండి నలుపు పసుపు రంగు అంబాసిడర్ కారులో ఇంకో రైల్వే స్టేషన్ కి వెళ్తున్నారు. 


న్యూ ఢిల్లీ రైల్వే స్టేషన్. అక్కడ ఎంట్రన్స్ ఎలా ఉంది అంటే సినిమా వదిలాక జనం ఎలా ఉంటారో అలా. 


మూడు చక్రాల బళ్ళు, రిక్షాలు, ఆటోలు, ఎడ్ల బళ్ళు, చేత్తో లాగే రిక్షాలు చెల్లా చెదురుగా ఉన్నాయి. 


లారీ లాంటి బస్సులు తిన్నగా స్టేషన్ ముందుకు వచ్చి నిలబడ్డాయి. 


ఆకలితో నవోదయ పిల్లలు గొడవ పెడుతున్నారు. మేడంకి మతి పోతుంది. కోపం చిరాకు వచ్చేస్తుంది ఆవిడకి. 



ఆవిడ గొడవా గాభరా చూసి ఒక హోసూరు అబ్బాయ్  గట్టిగా చప్పట్లు కొట్టాడు. అందర్నీ ఆగమన్నాడు. ఒక చోట చేర్చాడు. సామాన్లు మధ్యలో పెట్టి లెక్క పెట్టాడు మొత్తం 13 ఉండాలి. సరిపోయింది. 


నేను బయటి వెళ్లి చూసి వస్తాను. ఇంగ్లీషు లో పొడి పొడి గా. 


మేడమ్ తో ఇక్కడ ఉండాలి. నో  లాయిటరింగ్.


వెళ్ళినట్టు వెళ్ళి వచ్చేశాడు. గోడ అనుకునే ఒక చోటు తెరిచారు అంట. 


అక్కడికక్కడే రైల్వే కొళాయి దగ్గర బ్రెష్ చేశారు. వీళ్లను వింతగా చూస్తున్నారు చుట్టు పక్కల. మొహం కడిగారు. ఇంత గొడవలో కూడా జానీ చక్కగా తయారు అయిపోయింది. కిట్టు వెనక్కి వెళ్ళి మళ్ళీ సబ్బుతో మొహం కడిగి, అంతటి చలిలో జుట్టు కడిగి దువ్వాడు. 


అందరూ అటు వెళ్ళారు పోలో మంటూ సామాను చేతుల్లో ఎత్తుకుని. 


స్టేషన్ గోడకు ఆనుకుని కళాయి. ఒక సర్దార్జీ దుకాణం. 

అయిదు రూపాయలకు రెండు పెద్ద పెద్ద బటూరా. బటూరా  పూరీలు ఏకంగా పళ్ళెం సైజులో ఉన్నాయి. కావలసిన కూర మనమే వేసుకోవాలి. సర్దార్. నవ్వుతూ వేస్తున్నాడు. 


వాహే గురూజీ కా ఖాల్సా, అంటే 

వాహే గురూజీ ఫతే అని జవాబు ఇచ్చుకుంటున్నారు వచ్చి పోయే వాళ్ళు. 


ప్రాణం లేచి వచ్చింది అందరికీ. మేడం మెచ్చుకుంది హోసూరు అబ్బాయిని. ఇంకా ఈ గ్రూప్ కి గ్యాంగ్  లీడర్ నువ్వే అని నవ్వుతూ.


తరువాత ప్రయాణం అంబాల కంటోన్మెంట్.


మొదటి ట్రైన్లో టిక్కెట్లు దొరకలేదు. రెండోది, 

అమృతసర్ శతాబ్ది ఎక్స్ప్రెస్. అందులో టిక్కెట్లు దొరికాయి అందరికీ. 


అంబాలా లో దిగాక అక్కడకి నవోదయ బస్సు వస్తుంది అంట. ఫోను చేసి చెప్పారు. 


ఎండ కాస్తుంది కానీ వేడి లేదు. పొగ పోగా ఉంది. పొయ్యి పొగ లో కి తడి మంచు కలిసిన వాసన. ఇది విచిత్రంగా ఉంది. స్టేషన్ మీద కూలీలు మంట పెట్టారు. అక్కడకి ఒక్కొక్కరూ చేరుకున్నారు. 


అమృతసర్ ట్రైన్ వచ్చేసింది. చాలా మిలిటరీ వాళ్ళు , సర్దార్జీలు ఉన్నారు. 


అందరూ ఒకటే చోట చేరారు. గందర గోళంగా ఉంది. రకరకాల భాషలు. రంగుల రంగుల బట్టలు, తల పాగాలు. 


బండి కదిలింది. 


డిల్లీ దాటుతుంది ట్రైన్. హృదయ వికృతంగా ఉన్నాయి ట్రైన్ చుట్టూ ఉండే బస్తీలు. కల్లమ్మట నీళ్ళు వచ్చేశాయి అక్కడి దృశ్యం చూసి. 


ఆకుపచ్చ డేరాల్లో ఇల్లు. ఇళ్లకు పిచ్చి పిచ్చి తీగలతో కరెంట్ వైర్లు. 


కొన్నిళ్ళకి బయట యాంటెనాలు ఉన్నాయి. అక్కడే స్నానాలు, పానాలు, గుంపులు గుంపులుగా పసి పిల్లలు ఏడుస్తూ, మట్టిలో దొర్లుతూ ఉన్నారు. 


ట్రైన్ పట్టాలు ఒకటి రెండు కాదు, లెక్క పెడితే పద్దెనిమిది దాటి ఉన్నాయి.  కిట్టూ కి వాంతి, ఏడుపు వస్తుంది ఎదుటి దృశ్యం చూసి. ఇక్కడ తను పొరపాటున దిగిపోయి తప్పి పోతే తను కూడా అలాగే ఉండాలా అని. కష్టాలున్నా నవోదయ ఒక స్వర్గం అనుకున్నాడు కిట్టు. 


నవోదయ పిల్లలందరూ అవాక్కయి ఉన్నారు. డిల్లీ అంటే ఇలా అని. చుట్టు పక్కన జనాలు మామూలుగానే చూస్తున్నారు. 


అంబాలా కంటోన్మెంట్ చేరారు.


వేగం వేగంగా దిగారు. దిగిన మరు క్షణంలో ట్రైన్ కదిలింది. 


బయట ఒక పావుగంట లోనే, గ్రే కలర్ వాన్ మీద నీలం రంగు పట్టి, పట్టీ మీద జవహర్ నవోదయ విద్యాలయ, సెక్టార్ 25 , చండీఘడ్.


ఎక్కేసారు. పంజాబ్ మిలిగిన దేశంలా లేదు. సుభిక్షంగా ఉంది. కను చూపు మేర పంట పొలాలు. ట్రాక్టర్లలో రైతులు. పంపు నీరు పక్కన ఆడుకునే పిల్లలు. 


 ఒక చోట ఆగిన చెఱకు లారీల లైన్ కనిపించింది. 


జానీ పేచీ పెడుతుంది పద్మజా మేడం తో. మేడం తిడుతున్నారు. ఆగమని. జానీ గొడవ తట్టుకోలేక. వాన్ ఆగించారు. అందరూ దిగారు. 


జానీ వెళ్ళింది, ఆగిన లారీ పక్కకి వెళ్ళి. 


వాహే గురూజీ కా ఖాల్సా అన్నది. 

వెంటనే వాహే గురూజీ కా ఫతే. జవాబు. 


చెఱకు ఇస్తారా అని అడిగింది.


లారీ వాడు సంతోషంగా కొన్ని చెఱకు గెడలు లాగి ఇస్తున్నాడు. 


కత్తి తో నిలువుగా కొట్టి ముక్కలు చేస్తున్నాడు. జానీ చనువు చూసి నవ్వుతున్నారు అంతా. వాడితో వెళ్ళిపోవే అని మేడమ్ జోక్ చేశారు. 


పంజాబీ లారీ లోంచి, పాటలు వస్తున్నాయి. 


తుమ్ తో టెహరే  పరదేశీ

తుమ్ తో టెహరే పరదేశీ

సాథ్ క్యా నిభావోగే

తుమ్ తో టెహరే పరదేశీ

సాథ్ క్యా నిభావోగే


చెరకు గడలు తింటూ వాన్ వెనుకకి వెళ్ళాడు. వెనుక పెద్ద నవోదయ లోగో వేసి ఉంది.


ఎప్పుడూ ఇంత దగ్గరగా పెద్దదిగా చూళ్ళేదు. 


లోగో బొమ్మలో,

ముగ్గురు పిల్లలు, వెనుక ఇద్దరు పెద్దలు, ఒక కంప్యూటర్, పుస్తకాలు. గడ్డి మొక్కలు. 


లోగో కిందన చిన్న అక్షరాలతో రాసి ఉంది... 


ప్రజ్ఞానం బ్రహ్మ....

No comments: