పచ్చని చిలుకలు తోడుంటే ...
నాంపల్లి లో దిగారు ఇద్దరూ. సాయంత్రం కావస్తుంది. త్యాగరాజు సార్ ఆటో కట్టించారు. ఆటోవాడితో హిందీ లోనే బేరం.
కిట్టూ కి ఆటో ఎక్కడం అదే మొదటిసారి.
ఆటో వెళ్తుంది. బయట ఉదృతంగా హైదరాబాదు. రకరకాల గొడవ గా ఉంది రోడ్డు. అక్కడక్కడా ఆకుపచ్చ జెండాలు. కొన్ని చోట్ల విశాలమయిన రోడ్లు ఇలా.
ఊరికి దూరంలా ఉంది. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోకి వెళ్లింది ఆటో. ఇంకా లోపల ఉంది నవోదయ సంగారెడ్డి, గచ్చిబౌలి.
ఇప్పటి దాకా చూసిన స్కూళ్లకి దీనికి పొంతన లేదు. పెద్ద క్రికెట్ మైదానంలో యూనిఫామ్ వేసుకుని క్రికెట్ సామాగ్రి తో ఆడుతున్నారు. నాలుగు అంతస్తుల బిల్డింగ్ లో స్కూలు హాస్టల్స్!!
సారు బయట ఉంచి ఆఫీసులోకి వెళ్ళారు. అక్కడే తర్ఫీదు ఇస్తారంట కొత్త టీచర్లకి.
కాసేపటికి పొడువుగా షార్ప్ గా ఉన్న కుర్రాడు వచ్చాడు. నేను కృష్ణా రెడ్డి, 12 క్లాసు. ఇంతలో సార్ వచ్చారు, అరిస్టాటిల్, నిన్ను కృష్ణ రేపటి వరకు చూసుకుంటాడు. ఇక్కడికే ఎస్కార్ట్ వస్తారు రేపు, నీకు తెలిసిన పద్మజా మేడం, పెద్దాపురం నుండి.
వీలయిన రెస్ట్ తీసుకో. డబ్బులు కావాలా, అన్నారు జేబులో చెయ్యి పెడుతూ. సార్ వద్దు సార్. అప్పటికే ఆయనకు పదకొండు రూపాయలు బాకీ కిట్టు, 7లో హౌస్ మాస్టర్గా ఉన్నప్పుడు.
కృష్ణా వీడు ట్రైన్ కి వెళ్ళేముందు తినేటట్టు చూడు. గాభరా ఎక్కువ. అదర్ వైస్ ఈసీ కిడ్. ఇంగ్లీషులో పాస్ డౌన్ చెయ్యటం ఒక చనువు కి చిహ్నం అని అర్థం ఔతుంది కిట్టూ కి.
తంబీ రా. వాడే డబ్బా, బాగు రెండూ వేసుకుని, తనతో చక్కా తీసుకు పోయాడు. మూడో అంతస్తులో రూమ్. రూములు ఖాళీగా విశాలంగా ఉన్నాయి. ఫ్యాన్, టేబుల్ లాంప్ ఇలాంటి కూడా.
రాత్రి గడిచిపోయింది. ఉదయం లేచాడు.
ఇంకా తయారు కాక ముందే, త్యాగరాజు సార్ రూమ్ లోకి వచ్చారు.
ఎదుట కూర్చున్నారు.
నాన్నా కిట్టూ, నేను ఇంక వెళ్ళాలి. ఫలక్నుమా కి. నీ కోసమే ఇంత దూరం. నువ్వు జాగ్రత్త. నీకు అర్జెంట్ అయితే ఇంటి నంబర్ కి చెయ్యి. మీ ఫాదర్ కి నేను దారిలో చెప్పి వెళ్తాను. ఇంట్లో ఏమయినా చెప్పాలా ?
లేదు అన్నాడు.
సరే.
కృష్ణా రెడ్డిని చూసి. కృష్ణా పద్మజ మేడం మధ్యాహ్నం వస్తారు. ఆవిడకి పాస్ చెయ్యాలి నువ్వు. బోర్డ్ కి బాగా రాయ్ నాన్నా. అని చక్కా వెళ్ళి పోయారు.
తయార్ అయి వచ్చాడు కిట్టు. అప్పటికే ఏదో రాస్తున్నాడు రెడ్డి.
మీ స్కూల్ బాగుంది అన్నాడు.
నా ఎగ్జామ్స్ కదా. టైమ్ పాస్ కి, నువ్వు క్రికెట్ ఆడుతావా. ఇంకా స్కూల్ సెలవలు , కానీ వాళ్ళు ఇక్కడి కొచ్చి ఆడుతారు. సరే వెళ్ళాడు.
మైదానం పచ్చగా ఉంది. పొగ మంచు ఇంకా పోలేదు. సెలవుల్లో కూడా స్కూల్ కి వచ్చి ఆడుకునే వారు ఉంటారా అని వింతగా ఉంది కిట్టూ కి.
తంబి విజయనగరం నుండి నేషనల్కి వెళ్తున్నాడు. మీరు ఆడించండి నేను చదువుకోవాలి.
రా. నేను కిషన్ రెడ్డి, న్నయింతు క్లాస్. కిట్టు పేరు చెప్పాడు.
ఏ క్లాస్.
చెప్పాడు.
ఔనా. 8 లో నేషనల్ కి కూడా పిలుస్తారా.
బౌలింగ్ వచ్చా. తల అడ్డంగా వూపాడు.
బ్యాట్ ఇచ్చాడు.
బాలు వెయ్యమన్నాడు.
కొట్టాడు కిట్టు. చాలా బలంగా ఉంది కార్క్ బాల్.
సరే. బౌల్ చేస్తావా.
తల ఊపాడు.
స్పిన్ ఎలా తిరుగుతుందో చెప్తున్నాడు. దూరంగా పరిగెత్తి కొంత వేగం వచ్చాక, తల మీదుగా వదలాలి బాలు. విసిరితే ఫౌల్.
అర్థం అయింది.
వేశాడు. స్లో అయినా బాగా పడింది.
అంతా ఇప్పుడు ఒకే.
నువ్వు అలాగే ఆరు సార్లు వెయ్యాలి.
ఒకటి రెండు జీరో బాల్స్ వేశాడు. కమాన్ కమాన్ కిట్టు అని ఫీల్డింగ్ చేస్తున్న వాళ్ళు అరుస్తున్నారు.
తన వంతు అయిపోయింది.
అంతా గుడ్.. గుడ్ షో అని ప్రోత్సాహంగా అన్నారు.
వీళ్లు సిటీ పిల్లలు అయినా కలుపుగోరు అని అర్థం ఔతుంది. నవోదయాల్లో ఉన్న పిల్లలు ఒకేలా ఉంటారు అనుకున్నాడు కిట్టు.
కీపింగు చేస్తునాడు.
బాగుంది. ఎండ మెల్లగా వస్తుంది.
టిఫిన్ సమయం అయ్యింది.
రెండు గుడ్లు, ఒక బ్రెడ్డు , కొంత పచ్చడి. ఇలా కూడా టిఫిన్ పెడతారా అనుకుంటూనే కానిచ్చాడు.
పది పన్నెండు తరగతులకు మాత్రమే ఉంది మెస్. మిగిలిన వాళ్ళు దగ్గర్లోని ఇళ్లకు వెళ్ళిపోతారు అంట.
లంచ్ సమయానికి
కృష్ణా రెడ్డి వచ్చాడు. తంబీ పద లంచ్ నీకు మస్తుగా పెట్టాలే . వాడితో పాటు ప్రతాప్ హాష్ కొప్పల్ , ధార్వాడ్ నుండి వెనుకనే ఉన్నాడు. కిట్టూ తను పరిచయం చేసుకున్నారు.
మెస్సులోకి వెళ్ళాడు. సర్వింగ్ చేస్తున్న కౌంటర్ వెనుకకి అక్కడ స్కూళ్లో రెడ్డికి మంచి పలుకుబడి లా ఉంది. లోపలకి రమ్మన్నాడు. రైస్, కుప్పలాగా బంగాళదుంప కూర , పప్పు , స్టార్ రూమ్ లోంచి వేయించిన వేరుశనగ వేశాడు.
నిన్న సార్ చెప్పినట్టు చేస్తున్నాడు అని అర్థం అయ్యింది. చాలు అన్నా అంటున్నాడు. తంబీ డిల్లీ పోవాలి అంటే తింటే నే గా.
ముగ్గురు పెద్ద వల్ల మధ్య తింటున్నాడు. కిట్టు గురించి అడుగుతున్నారు. కొందరు తెలిసిన టీచర్లు పేర్లు చెప్పుకున్నారు. శశికళ మీకు వేశారా, టూ మచ్ ఆవిడ అని అంటున్నారు.
బయటకి వచ్చేశారు. కిట్టు ప్లేట్ గట్టిగా కడిగి , ప్లేట్లోనే నీళ్ళు వేసుకుని కొళాయి దగ్గర తాగాడు.
మధ్యాహ్నం అయినా ఎండ సున్నితంగా ఉంది. ఉదయం పడిన పొగ మంచు ఇంకా తడిగా ఉంది గడ్డి మీద.
తిరిగి వెళ్తున్న సమయంలో,
ఎదురుగా జానీ...
తెల్లటి చుడిదార్
ఉంగరాల జుత్తు
మూడు పాయలుగా జుత్తు ఉంది, ఎడమ పాయ , కుడి పాయ ముఖాన్ని కప్పి దోబూచులాడుతున్నాయి.
ప్రిన్సెస్ లాగ తల మీద కిరీటం లాంటి టియారా..
ఏటవాలుగా ఉన్న రోడ్డు మీద ఎత్తు నుండి దిగుతూ
కిట్టూని చూసింది.
కిట్టూ అని జానీ. జానీ అని కొట్టు ఒకే సారి అరిచారు.
చిన్న గంతు ఒక అంజ వేసి ముందుకు వెళ్లారు. గాజుతో చేసిన అదృశ్య గోడ తగిలినట్టు ఒక్క అడుగు దూరంలో ఆగిపోయారు.
జానీ మెడలో ఒకే ఒక ముత్యం ఉన్న హారం. అమ్మాయి మొహం కడిగిన ముత్యంలా ఉంది. కళ్ళు వెలిగిపోతున్నాయి.
చూపుడు వేలు మీద ప్లేటు తిప్పుతూ కిషన్ రెడ్డి కిట్టు వెంట వచ్చాడు. వెనుకనే ప్రతాప్.
జానీ వెనుక ఇంకో 12వ తరగతి అమ్మాయి. జానకి ఆ అమ్మాయి గైడ్, కిట్టూ కి రెడ్డి లాగా.
జానీ, జానీ వెనుక వచ్చిన వాళ్ళు మెస్సు లోకి వెళ్ళిపోయారు.
తంబీ నీకు చాలా నక్రాలుండే అని చక్కిలిగింతలు పెట్టాడు రెడ్డి.
నీకు ఆ పోరి ఎట్లు తెలుసు. కేరళా రీజినల్ గురించి చెప్పాడు కిట్టు. 8th లో ఎవరికీ రాదు తెలుసా 12th స్టూడెంట్ డ్రాప్ అయితే నీకు ఛాన్స్ వచ్చే. ఔను అన్నా అని ఫోను కాల్ మొత్తం చెప్పాడు కిట్టు.
పరిచయాల ముచ్చట అయిపోయింది.
ఇంక వెళ్ళే సమయం వచేసింది.
స్కూల్ వాన్ లో నేషనల్ కి వెళ్ళే గ్రూప్ బయలుదేరారు.
కిట్టు, ప్రతాప్ హాస్కోప్పల్, త్రిశూరు నుండి ఇద్దరు, జానీ, ఇంకో అమ్మాయి, పద్మజ మేడం ఇది మొత్తం.
నాంపల్లి దగ్గర ఎక్కారు.
పండుగ రోజుల వలన కిక్కిరిసి ఉంది బండి. పిల్లలకు ఆర్. ఏ . సీ లోనే టిక్కెట్లు దొరికాయి. అంటే అంతా ఒక దగ్గర కూర్చునే అవకాశం లేదు.
గందరగోళంగా ఉంది వాతావరణం. తమ తమ ఎక్సిబిషన్ డబ్బాలు జాగ్రత్తగా ఉంచుకున్నారు పిల్లలు. ఒకే డబ్బాలో వేరు వేరు చోట్ల సీట్లు ఉన్నాయి.
కిట్టూ జానీ ఒక చోట . మిగిలిన వాళ్ళు వేరే వేరే చోట్ల. మళ్లీ సైడ్ బెర్తు లో ఆర్ ఏ సీ.
ఇద్దరికి కలిపి ఒక బెర్తు . అలా అడ్జస్ట్ అయి వెళ్ళే వారికి ఇస్తారు అంట ఆర్.ఏ.సీ.
పిచ్చిపిచ్చి వాసనలు, పెద్ద పెద్ద శబ్దాలతో నవ్వులు, గుడ్డి దీపాలు, మహా చిందర వందర గా ఉంది ట్రైను.
తనను అస్సలు చూడటం లేదు జానీ. ఎర్రటి చుడీ దార్లోకి మారి వచ్చింది. జుట్టు పూర్తిగా విరపోసుకుని ఉంది. చిక్ షాంపూ వాసన గుప్పుమని వస్తుంది. కొంచెం అసహనంగా ఉన్నాడు కిట్టు. తనను చూడదేమిటి అని.
ఇంతలో రైల్వే పోలీసులు కుక్క తో వస్తున్నారు. అందరూ తప్పుకుంటున్నారు.
జానీ కిట్టు చెయ్యి పట్టుకుంది గట్టిగా వెనక్కి తూలి కూర్చున్నారు బెర్తు మీద.
ఆనందం. చెయ్యి పట్టుకుంది కదా. ఇప్పుడు తన వేపు చూసింది. సున్నితంగా ఉంది చూపు ఏదో మార్పు.
రైలు బయలు దేరింది.
గాలి చల్లగా వేస్తుంది. ఆహ్లాదంగా ఉంది. ట్రైన్ కదిలితే జీవితం కదిలినట్టే. అందరూ ఉల్లాసంగా ఉన్నారు రద్దీ లో కూడా.
మేడమ్ వచ్చారు. గుడ్. మీరిద్దరూ ఒక యూనిట్. మేడం, ఇంకో అమ్మాయి 48 దగ్గర. ప్రతాప్, త్రిశూరు పిల్లలు 39. నేను మధ్యలో వచ్చి చూస్తాను మీరిద్దరూ ఒక దగ్గర ఉండండి.
కిట్టు తో అన్నాది, నువ్వు హోమ్ సిక్ అయి రావు అను కున్నాను అని. నువ్వు వచ్చి నేను రాకపోతే అని వచ్చేశాను.
ఓ హ్యాపీ న్యూ ఇయర్ 1997 అన్నాడు. తను కూడా చెప్పింది. మళ్ళీ ఎగ్జిబిట్ మెరుగు చేసావా అని అడిగాడు. జానీ ఏవేవో పెంచి చేసింది. కిట్టూ కి సిగ్గేసింది , తను కేవలం రంగులు వేసి తెచ్చాడు.
కొంచెం సేపట్లో మళ్ళీ ట్రైన్ ఆగింది సికింద్రాబాదు. అప్పుడు మొదలయింది అసలు ప్రయాణం.
కబుర్లు మీద కబుర్లు చెప్పుకుంటున్నారు. కిట్టు సింధూరం సినిమా కథ చెప్తున్నాడు. చేతులు తిప్పుతూ.
నవోదయ లో సినిమా కథలు చెప్పటం ఒక కళ. అది ఇంచుమించు అందరు పిల్లలకు వస్తుంది. చూసిన సినిమా కళ్ళకు కట్టినట్లు చెప్పాలి. అప్పుడే ఆనందం.
రాత్రి త్వరగా పొద్దుపోయింది. బెడ్డు పక్కన దుప్పటి కట్టుకుంటున్నారు అందరూ. చలికి అలా అన్నారు. కిట్టు తెచ్చిన పల్చటి దుప్పటి ముడి వేసి కట్టాడు కర్టెన్ లాగా. బాగుంది ఏర్పాటు. వీళ్ల గుస గుసలు బయటకు రాకుండా ఉన్నట్టు.
లైట్లు ఆపమని పై బెర్తు రిక్వెస్ట్. ఆపే సారు.
నువ్వు డ్రెస్ ఎందుకు మార్చావు. కిట్టు అడిగాడు.
అన్నీ చెప్తారా ?
చెప్పు ఎందుకు మార్చావ్ ?
తల స్నానం చేశావ్ కదా ?
ఔను ?
ఎందుకు చేశావ్ ? ఇంత సాయంత్రం ?
కిట్టూ అలా అడగ కూడదు.
ఎందుకు అడగ కూడదు ?
అడగ కూడదు అంతే!
జానీ నాకు చెప్పు ఎందుకు చేశావు?
పుట్టినరోజు కదా ?
కాదు .
జానీ జుట్టు దగ్గరకి చేసి క్లిప్పు పెట్టుకుంది.
కిట్టు క్లిప్పు పెట్టకు వదిలే, అని క్లిప్పు చనువుగా నొక్కి తీసేసాడు జుట్టు లోంచి.
ఫట్.
లెంప మీద దెబ్బ.
కిట్టు చిన్నబోయాడు.
దూరంగా బెర్తు మీద కాళ్ళు దొంతుగా పెట్టి కూర్చున్నాడు. ముఖం తిప్పుకున్నాడు.
జానీ కి. అనుకోకుండా చెయ్యి లేచి వచ్చి కొట్టేసింది.
పిచ్చి పిచ్చి ప్రశ్నలు పడలేక కడుపులో నొప్పి నొప్పిగా ఉంది జానీ కి.
కిట్టూ నీ చూసి జాలి వేస్తుంది.
కిట్టూ సారీ రా.
చెయ్యి తీసి పక్కన పెట్టాడు.
సారీ చెప్తూనే ఉంది.
కాజీ పేట వచ్చింది.
బండి ఆగింది. కిట్టు కడుపు నొప్పిరా అన్నది.
కిట్టు అర్థం చేసుకున్నాడు.
ఎక్కడ ?
చూపించింది?
ఎప్పుడు నుండి.
చెప్పింది.
కడుపు నొప్పిలో తను బాగా సీనియర్ అన్నాడు నవ్వుతూ. ఆగి ఆగి వస్తుంది అంటుంది జానీ.
రైలు మళ్ళీ బయలుదేరింది.
బ్యాగ్ లోంచి డైజెన్ చప్పరించే బిళ్ళ ఇచ్చాడు.
కిట్టు ఇది కాదురా అంటుంది జానీ. అయినా ఒక సారి చూడు అని. తానొకటి తిని తనకొకటి ఇచ్చాడు.
కిట్టు అన్నాడు. నువ్వు బాత్రూంకి వెళ్ళి చూస్తావా? ఒకే. మెల్లగా నడుస్తుంది. వెనుక కిట్టూ బాత్రూమ్ వరకూ వెళ్ళాడు. మేడమ్ చెప్పాడు కదా ఎక్కడికైనా ఇద్దరు ఇద్దరు వెళ్ళమని.
నిమిషంలో వచ్చేసింది.
మళ్ళీ నొప్పి.
కిట్టు వాళ్ళ నాన్న కిట్టు కి రెండు మూడు రకాల నొప్పి మందులు ఇచ్చి పంపించాడు. అజీర్తి కాకుండా ఆగి ఆగి వచ్చే నొప్పి.
ఈసారి బాగు లోంచి సైక్లోపామ్ తీసాడు. ఇది వేసుకో.
రాదుగ రాసిన నొప్పి డాక్టరు కథ చెప్తున్నాడు. నేను కూడా ఒక నొప్పి డాక్టర్ని అని.
మంచిర్యాల. నొప్పి తగ్గింది.
జానీ నవ్వుతుంది. మేఘం వీడిన పూర్ణ శశిలా ఉంది. మొఖంలో ప్రశాంతత.
సారీ రా కిట్టు. కొట్టాను.
ఊ..
నొప్పిలో కదా కొట్టావు. ఒకే.
క్లిప్పు తీయకూడదు కిట్టూ.
మళ్ళీ అడగ బోయాడు ఎందుకు అని. లెంపకాయ్ గుర్తుకు వచ్చింది ఆగాడు.
కుతూహలం మాత్రం ఆగలేదు. రెడ్ డ్రెస్ బాగుంది అన్నాడు.
తను విషయం చెప్పింది చివరికి సిగ్గుగా.
తన ప్రశ్నలకి సమాధానం దొరికింది. తన ప్రశ్నలతో జానీని ఎంత ఇబ్బంది పెట్టాడో అప్పుడే అర్థమైంది.
ఇంతలో
రేయ్ నీ ప్రశ్నలకి నిన్ను పీక పిసికి చంపనా ? మెడ చుట్టూ జానీ చల్లటి వేళ్ళు..
రైలు శబ్దం తాళం పడుతుంది. దానికి రాగం కలిస్తే సంగీతం, అనురాగం కలిస్తే ఆనందం. నిన్న సార్ అన్న మాట అప్పుడు అర్థం కాలేదు ఇప్పుడు అర్థం అయింది.
దూరం. కలయిక. కోపం. గొడవ. నొప్పి. ప్రమాదం. సమాధానం. తాళం. రాగం. అనురాగం. పల్లవి. జీవితం. సుందరం.
సిర్పూర్ కాగజ్ నగర్. పేపర్ మిల్లు పక్కనుంచి ట్రైన్ వెళ్తుంది. ఇదే ఆంధ్రప్రదేశ్ లో ఆఖరి స్టేషన్.
(సశేషం)
No comments:
Post a Comment