అలై పాయుతే ...
ఇల్లు చేరాడు శీతాకాలం సెలవులకి. కిట్టూ ఇల్లు కొత్తవలస - కిరండోలు రైలు పట్టాల పక్కనే ఉండేది. రైలు వస్తే వచ్చే కుదుపు, శబ్దానికి కొత్తవాళ్ళు రాత్రి నిద్ర పోయే వారు కాదు. అలవాటుగా అక్కడ ఉండేవాళ్ళు మాత్రం చక్కగా పడుకునే వాళ్ళు.
సాయంత్రం సూర్యుడు అస్తమించే సమయంలో ట్రైనులను చూడటం, అక్కడ బట్టలు ఆర పెట్టే తీగ ను పట్టుకొని కరెంట్ ట్రైన్లా ఆడుకునేవాడు చిన్నప్పుడు.
ఇప్పుడు కొన్నాళ్ళో అల్లాంటి ట్రైన్లో వెళ్తాడు. జానీ తో అదీ. ఈసారి సరదాగా వెళ్ళాలి అని అనుకున్నాడు.
అమ్మ హైదరాబాదులో ఉన్న చుట్టాలతో మాట్లాడింది. వాళ్లకి తెలిసిన దూరపు గొప్ప బంధువులు ఒక్కరే. వాళ్ళు చెప్పారంట చలి ఎక్కువగా ఉంటుంది అని.చుట్టాల ఆవిడ బాలింత గా ఉండేప్పుడు వాడిన పెద్ద లేడీస్ స్వెట్టర్ ని అమ్మ తెచ్చింది. కిట్టు వేసుకుంటే ముడుకుల వరకూ వచ్చింది ఆ ఆడవాళ్ళ స్వెట్టర్. ఒక గుండీ కూడా ఉండేది కాదు. అయినా ఒకే అన్నాడు కిట్టు. పుట్టాక స్వెట్టర్ వేసుకుని ఎరుగడు.
అమ్మ బిస్కట్లు చేసింది. పంచదార పాకంలో. ఒకట్రెండు బిస్కెటు పాకెట్లు. ఒక సిలిండర్ లాంటి సంచి. 150 రూపాయలు పాకెట్ మనీ.
సంక్రాంతి సాయంత్రాని కే బండి వచ్చేసింది. నవోదయ వాన్ ఇంటి ముందు చూసి చాలా మంది ఆశ్చర్య పోయారు. కిట్టు తన సామాన్లతో ఎక్కాడు.
బండిలో అన్నయ్య చెప్పాడు. ఈ రోజు రాత్రికి నువ్వు ఒకరి ఇంట్లో పడుకోవాలి అని.
తీసుకెళ్ళి వైజాగ్ మధ్యలో ఒక బస్తీలో ఒక చిన్న ఇంట్లో దించాడు. రాత్రికి అన్నం ఇక్కడే తిను, వృధా చెయ్యకే అని అన్నయ్య అంటుంటే, కిట్టుకి అర్థం ఔతుంది వారి ఆర్థిక పరిస్థితి.
అన్నయ్య వెళ్ళక వాళ్ళు అన్నారు. నువ్వు ఇక్కడ ఉండకుండా సెకండ్ షో సినిమాకి వెలిపో , రాత్రి అందరూ పడుకున్నాక ఇక్కడ చాప వేసి పడుకో మని చెప్పారు కటువుగా.
కిట్టు నొచ్చుకున్నా, తప్పక వెళ్ళిపోయాడు బయటకు.
ఎదురుగా సినిమా హాల్. సంక్రాంతికి రద్దీగా ఉంది.
సింధూరం. ఈ రాయి అయితే ఏమిటి పల్లూడ కొట్టుకోటానికి అని వెళ్ళాడు. సినిమా అద్భుతంగా ఉంది. కథలో ఉన్న ప్రతి ఒక్కరూ స్కూళ్లో తెలిసిన పిల్లల్లా ఉన్నారు. హీరో వాడి క్లాసు బంగారయ్య లా కనిపించాడు.
రాత్రి బాగా పొద్దుపోయాక బస్తీ చేరాడు. చిన్న ఇంట్లో చాలా మంది పడుకున్నారు. ఆ రోజు భోజనం లేదు. అక్కడే చాప మీద ముడుకులు పొట్టలో పట్టుకుని ఆద మరచి పడుకున్నాడు.
తెల్లారింది. డ్రైవర్ అన్నయ్య వచ్చాడు. గాభరాగా కిట్టుని రైల్వే స్టేట్ కి తీసుకు వెళ్ళాడు.
అక్కడ ఎదురుగా త్యాగరాజు సార్. మంచి హుషారుగా ఉన్నారు. ఈ ప్రపంచం నిన్న రాత్రి చూసిన ప్రపంచం ఒకే ఊర్లో ఉన్నాయా అనిపించింది కిట్టుకి.
టింగ్ టాంగ్ టింగ్..
విశాఖపట్నం నుండి హైదరాబాద్ వెళ్ళు.. 7616 విశాఖ.. ఎక్స్ప్రెస్. .. ఒకటవ నంబరు ప్లాట్ఫారం పై బయలు దేరుటకు సిద్ధంగా ఉన్నది.
సైడ్ బెర్తు మళ్ళీ.
త్యాగరాజు మాస్టారు ఒక సంచి కూడా మోయనివ్వలేదు కిట్టుని.
వాటర్ బ్యాటిల్, ఇండియా టుడే.
అరిస్టాటిల్ .. నువ్వు ఇష్టానుసారంగా చదువుకో అని మ్యాగజైన్ , హిందూ న్యూస్పేపర్ పడే సారు కిట్టు ముందు .
అనకాపల్లి. తుని. అన్నవరం. సామర్ల కోట. రాజమండ్రి.
బండి గోదావరి వంతెన మీద నెమ్మ నెమ్మదిగా వెళ్తుంది. అకస్మాత్తుగా ఆగింది కీచు మణి శబ్దం చేస్తూ. పాత వంతెన, బ్రిటిష్ కాలం నాటి రాళ్ళ కట్టడం. ఎండ లో గోదావరి బంగారంలా మెరుస్తుంది. వంతెన కిందన చెక్కతో చేసిన నీలం ఎరుపు రంగు పడవ.
పడవ వాడి ముఖం స్పష్టం గా కనిపిస్తుంది. వంటిమీద మాసిన తెల్లటి ఖద్దరు చొక్కా, మైకా సంచి మూటలు, ఒక మేక ఉన్నాయి పడవలో. ఆ గోదారి లంకల్లో ఇలా ఉంటారు జనాలు అనుకున్నాడు మనసులో కిట్టూ. దూరంగా పుష్కర తీరం. నీటిలోకి మెట్లు కట్టి ఉన్నాయి. మెట్ల పక్కన రెండు మూడు గుళ్ళు ఉన్నాయి. పెద్దగా జనం లేరు.
పది ఇరవై పైసల నాణేలు వేస్తున్నారు గోదారిలో. వాటిని ఏరుకునే ఈత కొట్టే పిల్లల మూక వంతెన స్తంభం పక్కనే ఉన్నారు మాట్లాడుకుంటూ. వంతెన మీద ఎవరు ఎలా రాశారో గానీ "నానీ" అని పెద్ద అక్షరాలతో రాసింది. చిత్రమయిన దృశ్యంలో కిట్టు లీనం అయిపోయాడు.
ఇంతలో విజిల్ మళ్ళీ ట్రైన్ మొదలయ్యింది. మొదలైన రెండు మూడు నిమిషాలకే మళ్ళీ ఆగింది, వంతెన దాటాక.
గోదావరి అని చిన్న స్టేషన్. పక్కనే హై స్కూలు, పిల్లలు బద్దకంగా నడుస్తున్నారు. నవోదయ గుర్తుకు వచ్చింది, మెల్లగా తాపీగా నడిచే అవకాశం ఉండదు కదా మన స్కూళ్లో అనుకున్నాడు.
కాసేపటికి పెద్ద స్టేషన్ లో ఆగింది బండి. త్యాగరాజు సార్ చలాకి గా కిందకి దిగారు. రెండు చేతుల్లో ఆకుమీద వేసి రెండు రెండు పూరీలు, కూర. వాసన అద్భతం.
నిన్న సాయంత్రం తిన్నాడు కిట్టు. ఒక్క సారి ఆకలి మెదడు లోకి నమోదు అయ్యింది. థాంక్యూ చెపుతూనే ఆవురావురు మని తిన్నాడు.
ఇక్కడ కొంత జనం చేరారు . చిత్రంగా బండి వెనక్కి వెళ్ళడం మొదలయ్యింది. ఏమిటి సార్ అంటే, ఇప్పుడు మనం హైదరాబాద్ మార్గానికి వెళ్తున్నాం అని, ఇలా చేతుల్తో చూపించి చెప్పారు, ట్రైన్ పెద్ద పెద్ద మలుపులు తిరగాలి అంటే ఇంజను వెనక్కి తిప్పి లాగుతారు అని.
కిట్టు అడిగాడు సార్ డౌట్ అని.
' మీరు రాగం తాళం కలిస్తే సంగీతం అన్నారు కదా, అవి ఎపుడు కలిశాయి ?'
' అవి కలిసే పుట్టాయి '
ఓహో కలిసి ఎలా పుట్టాయి ?
ట్రైన్ శబ్దం విను.
విన్నాడు.
మనం మాట్లాడుతున్నాం కదా ? అగి ఆగి? అదే తాళంలో మాట్లాడటం.
అలగే పాడితే అది తాళంతో పాడటం.
నచ్చింది జవాబు.
పక్కన రూము లాంటి చోట్లో, ఒక ముసలావిడ, ఒక ముసలాయన కూర్చున్నారు.
ఇంకా సార్ గురించి అడగటం మొదలు పెట్టాడు. మీరు ఎందుకు సంగీతం నేర్చుకున్నారు అని. ఆయన ద్వారం వెంకట స్వామి నాయుడు అనే గొప్ప విద్వాంసుని మనవడు అంట . యూజీసీ నుండి పీ ఎచ్ డీ చేస్తూ ఈ ఉద్యోగం చేస్తున్నారు అంట. అలా చెప్పుకుంటూ పోతున్నారు.
ఆ ముసలావిడ కిట్టు నీ చూసి సార్ ను అడిగారు. నీ అబ్బాయా అని. కాదు మేడం నా స్టూడెంట్, హైదరాబాద్ వరకు నేను తీసుకుని వెళ్తున్నాను అని.
చేగోడీ ఒకటి కిట్టు కి ఇవ్వ బోయారు. సారు మధ్యలోనే తీసుకున్నారు.
వీడు చాలా సెన్సిటివ్ అంటూ.
ఆవిడ ఏవిష ? అని అడిగింది.
చెప్పారు.
ఒక్క క్షణం ఆగి, కిట్టు ని చూసి.
బ్రహ్మలా ? అని అడిగింది.
ఇద్దరికీ మతిపోయింది ఆ ప్రశ్నకు. ఆవిడ పాత రకం కాబోలు అనుకున్నాడు కిట్టు.
మా స్కూళ్లో అవి పట్టించుకోమని, సార్ జవాబు ఇచ్చారు.
ముసలాయన అన్నారు.
మీరు ఏమి అనుకోకండి.
ఈ వయసు ఉండాల్సింది మా మనవడు అని. శూన్యంలోకి చూస్తూ.
కిట్టు గుండెలో కలుక్కుమంది.
ఆవిడ బాబు ఇటు రామ్మా అన్నారు. సార్ అనుమతిగా చూసారు.
వెళ్ళాడు. ఆవిడ పొదివి కట్టుకుంది. తల మీద చెయ్యి వేసింది.
ఆవిడ పక్కన అమ్మ వయసు మహిళ. కొంగుతో కళ్ళు తుడుచు కుంటుంది. కిట్టూ కి అర్థం అయ్యింది.
అరటి ఆకు మీద దద్దోజనం పెట్టారు. బాబు ఒక ముద్ద తిను అని. సార్ వైపు చూసాడు. సరే అన్నట్టు అనుమతి.
ఒక్క ముద్ద తిన్నాడు. ఎడ బాటు తెలిసిన వారు ఆ నలుగురు.
రైలులో దేశం ఇలా ఉంటుందా అని కిట్టు ఆశ్చర్యంలో ఉన్నాడు.
మళ్ళీ సీట్లోకి వెళిపోయాడు. బయట మారిపోతుంది చెట్టు చేమలు. సారా నిషేధం అని అక్కడక్కడా రాసి ఉంది. కొన్ని చోట్ల ఎర్ర జెండాలు కొడవలి గుర్తులు ఉన్న స్తూపాలు చూస్తున్నాడు.
బయట చిక్కటి సాయంత్రం. కొండలు గుట్టలు పెద్ద పెద్ద బండరాళ్లు ఉన్న ప్రాంతాల్లో వెళ్తుంది బండి.
సాయంత్రం అద్భుతంగా ఉంది. సార్ ఈ సమయానికి ఒక మంచి పాట పాడండి అన్నాడు ధైర్యం తెచ్చుకుని.
పాట గురించి చెప్పి పాడండి సార్. అన్నాడు మళ్ళీ.
ఏదో చెరువు కట్టమీద వెళ్తుంది ట్రైన్.
ఇది చాలా పాత కృతి నాన్నా. వెంకట సుబ్బయ్యర్ రాసిన కృతి ఇది.
అలైపాయుతే,
అలై పాయుదే కణ్ణా ..
కదిత మనత్తిల్ ఉరుత్తి పదత్తై ఎనక్కు అలిత్తు తనిత్త వనత్తిల్
కడలికి అలలకు కథాకళి కళలిడు - శశికిరణము వలె చలించవా
చిగురు సొగసులను తలిరుటాకులకు - రవికిరణాలె రచించవా
ట్రైన్ శబ్దానికి సరి పడిన భాగాన్ని చిద్విలాసంగా పాడారు.
అలా నాంపల్లి చేరాడు కిట్టు, కాలం కడలిలో అలా అలలా
(సశేషం)
No comments:
Post a Comment