శిథిలాలు

మనో శిధిలాల 
మట్టి రేణువులు
కాలపు
స్ఫటికాలు

టూ కీ గా

మనస్సు ప్రశ్న
గుండె జాబు
కాలం జవాబు

వరమిస్తే...

నిన్ను ప్రేమించే
మనసు
పుడితే
ఒక మనిషిగా
నువ్వు  ప్రేమిస్తావా
మనిషిగా
ఒక మనసుతో

నీవే కేంద్రమని
నీవే వృత్తమని
నీవే చిత్తమని 
నీదే మొత్తమని
నువ్వు ఓర్వగలవా
మనిషిగా మనసు గా

భూదేవి అంత
బలంగా నిలుస్తావో
అట్లాస్ లా
వంగి భరి స్తావో
శివునిలా ధరిస్తావో

తెలుగు

అ తో అమ్మ 
ఆ తో ఆవు
ఇ తో ఇల్లు
ఇది తెలుగుదనం
అమ్మలాంటి ఆవు
గోవులాంటి అమ్మ

అమ్మ ఆవు ప్రాణం పోస్తే
బిడ్డకు స్వర్గం
ఇదే తెలుగుదనం
మనం రాసినది
ఇదే తెలుగు పదం

ఈ తో ఈగ
ఉ తో ఉడుత
ఊ తో ఊయల
అన్నీ పిల్లల
సహజ పదం

చిన్నా పెద్దా
అందరి వద్దా
హాయిగా పెరి గెను
ఇదే తెలుగుదనం
మనం నేర్చిన
ఇదే తెలుగు పదం

ఎ తోనెలుక
ఏ తో ఏ నుగు
ఐ తో ఐరావతము
చిన్నదైన పెద్దది అయినా
అన్నిటి అర్థం 
ఇదేనొయ్ తెలుగు తనం

ఒ తో ఒంటే
ఓ తో ఓడ
ఔ తో ఔషధం
ఒంటెలు ఓడలు
ఓడలు ఒంటెలు

వెలుగు నీడలు
తెలుగు మృదు 
మనసుకు తెలుగు
ఔ తో ఔషధం
ఇదే తెలుగు భావము

అం తో అంతః పురంమ
మనంకట్టే 
మృదు మేఖల 
అంతరంగ స్వర్గం
తెలుగు పదం
తెలుగు జనం


Sasi: భాషల్లో మొదటి అక్షరాల్లో అతి లోతైన భావజాలాన్ని మొదటి పాఠం లో కలుపుకున్న భాష తెలుగు.

సిస్టర్

కళ్లు ముంజులు
జుట్టు తాటి పీచు
గొంతు మహా పేచీ
ఎవ్వర్రీ షార్ట్ సర్క్యూట్
Eveready బ్యాటరీ

నా రిమోట్

TV Remote 

ఇది నా రిమోట్
ఇలాంటి రిమోట్లు
చాలా ఉంటాయి
కానీ ఇది నా రిమోట్

నేను నా రిమోట్ 
ఒక యూనిట్
నేనే రిమోట్
రిమోట్ నేను

వరదలు వచ్చినా
పిడుగులు పడినా
రిమోట్ నాదగ్గర 
రిమోట్ దగ్గర నేను

ఇది నా రిమోట్
ఛానెల్ మర్చేస్విచ్
నాకు ప్రాణం
సెకండ్ కి ఒక సారి
ఛానెల్ మారిస్తే
రిమోట్ కి ఇష్టం
లేకపోతే బటన్
పాడై పోతుంది

నా రిమోట్ 
మోనోగాముస్
కేవలము నాది
ఎవరి కీ దొరకదు
నేను లేక పోతే
సోఫా సందుల్లో
తలుపు మూలల్లో
దాక్కుని 
నాకోసం ఎదురు
కాస్తుంది

ఇదినా రిమోట్
ఏ చినా దేశంలో
పుట్టిన
పుట్టింది
నాకోసం

ఇది నా రిమోట్
ఆశ్లేషనక్షత్రము లో నేను
మృగశిరా లో
నా రిమోట్
అన్ని శుభ లక్షణాలే

ఇది నా రిమో టు
నాకు pacemaker
ఇది దాకుంటే
నాకు పెరుగును
బీ పీ
పగలొచ్చు
పెళ్ళాం పిల్లల వీపీ

ఇది నా రిమోట్ 
రోజంతా న్యూస్
ఆరో గంట 
ఏ డో గంట
న్యూస్ గుంట
ముసిలయి పోయినా
అదే అదే న్యూస్
గాని ఇది నా రిమోట్

నా రిమోట్
దీనిని
సృష్టించిన
వెధవకి
నా జోహార్లు
మాట వినని
పె ళ్ళా ల్లకు
ఇది సబ్స్టిట్యూట్
నా రిమోట్

నా రిమోట్
మధ్యలో
ప్రకృతి 
పిలిచినా
నాతో
 బాత్రూమ్ తోడు
 వచ్చే
రిమోట్

మా సుపుత్రుడు
మాట వినలేదా
ఛానెల్ మర్చేస్తే
మర్చిపోయాను

ఇది నా రిమోట్
గుండెకు డైరెక్ట్ లైటు
నా రిమోట్

ఎమ్మెల్యే

ఎమ్మెల్యే మీరేగా
నాకు బాపు
నీ బాపు
ఏ లాడు గా
అనాదిగా
మా వీపు

మాకేమో
దుమ్ము రోడ్డు
నీకేమో 
సుమో జీపు

నువ్వెక్కిన ఆడీకున్న
సున్నాలు
మా నెల కూలీ
నీ కూలింగ్ గ్లాసులు కి 
పడలేదే దుమ్ము
ఎందుకురా నీకు
లేదు ముందుకొచ్చే 
దమ్ము
ఎమ్మెల్యే నువ్వేమా
మా బాపు
లేప కుండా 
ఉంటామా
నీ టాపు
నీ సెకండ్ గారి
తిండి ఖర్చులే
మా వీధి బోరింగుకి
రావచ్చులే
 నీ కూతురికి
ఇంగ్లాండు
బొచ్చు కుక్కలు
మా వీధి రోడ్డంతా
మస్తు బొక్కలు
మా సాయంత్రపు
విమానం ముగ్గు
అంత కూడా లేదు
నీకు సిగ్గు

కులం పేరుతో
అడుక్కునే నీకు
కనిపించదు లే
అబ్దుల్ కలాం
చూపు


గుడిలోని నీకు
ఉందిగా సెపరేట్ లైను
కొండమీ దే
తాగుతావు
ఇటాలియన్ వైను
నీకోతురు బీజేపీ
నువ్వేమో టీ డీ పీ
ఫస్ట్ వైఫు వై ఆర్ పీ
కులం పేరుతో
పెంచుంతావు
అందరికీ హై బీపీ

ఎమ్మెల్యే నువ్వేరా

నాకు బాపు

మావూరి కుక్క కు

పుట్టిందో బేపు

లవ్ యూ

మల్లెల లోగి డి
వెన్నెల అలజడి
కవితల వరవడి
లేచా పడి పడి
ఇద్దరు
తడపడి
ముద్దు లే
తదుపరి
అవ్వకు
పొదుపరి
నా మనసుకు 
తొలకరి

ఐ హేట్ యూ..

రంగుల లోకం లో
నువ్వు ఒలిపిన సిరా
ఎండిన కన్నీటి అంతర్వేది

మంచు బాకు

కాలమా కలల కౌగిలిలో
విసిరావు మంచు బాకు
శోకం నాకు
సైలెన్స్ నీకు

*మంచు బాకుతో పొడిస్తే ఆనవాలు ఉండవు. సైలెంట్ గా ఇచ్చే జవాబు అలాంటిది కదా..

ఎవర్తివే

నా గుండెల అలజడి వో
జడివానల లోగిడి వో
కొప్పున కొండమల్లి మొగ్గవో
చౌదవీ చందమామ వో
వరమో వర్ణన నేర్పే సరస్వతి వో
ఎవరే నీవు

చెల్లి

మా చెల్లి కథ చెపితే
ఋతపవనాలు

మా చెల్లి తిండి తింటే
శెనగ నాట్లు

మా చెల్లి వంటింట్లో
దూరితే ఖరీఫ్ 

మా చెల్లి వాకింగ్ చేస్తే
జురాసిక్ పార్క్ 

మా చెల్లి నూడుల్స్ వండితే
వంటింట్లో వుహాన్

మా చెల్లి ముక్తసరిగా
దూరదర్శన్ లో
స్పీల్ బర్గు

కోవిడి వసంతం

వసంతమా ఏమిటి నీ వేళాకోళం
నన్ను ఇంట్లో  బంధించి
నువ్వు కొమ్మల్లో ఊరీగుతావ

నేటి బుడగలు

ఏమిటా బుడగలు ?
అరబిక్కడల్లో నీ
గుండెకు లంగరు వేసి
కన్నీటి సంద్రపు
లోతుల్లో చేరేటప్పుడు
నా గుండె చేసిన చప్పుడు
ఇది గుండెల బుడగల చప్పుడు

వెలుగు నీడలు

నా నయన బాణాలు
నీ కన్నుల్లో చేరలేని 
నిమిషము
చీకటి

నీ కంఠ పుట్టు మచ్చ
నీ ఆధర సువాసన
వెచ్చని మాఘ మాసపు కౌగిలి
వెలుతురు

రాగం

నీ గుండె లబ్ అంటే 
నా గుండె డబ్
అంటుంది
ఇదీ ఆదితాళం

అల్లుకుపోయిన
ఈ గుండెలయల్లో
ప్రవహించే అనురాగ 
అంతర్వేది
మన హిందోళం

*
Let me lace my heart with yours
Every beat to be skipped with my beat
Two rhythms one rhyme
Let me lace my heart

పెద్ద పండుగ

పండిన చేలూ
కళ్ళాపి చల్లిన ముగ్గులు
మృగశిర మాసంలో
భళ్ళున లేచే సూర్యుడు
సూరిడి కుంకుమ బొట్టు
వాకిలిలో గింజలు ఆరగిస్తున పిచ్చుక
పొగ మంచులో పేపర్ అబ్బాయ్
పాలు నింపుకెలుతున్న పాపాయి
గబగబా పేపర్ చదివే తాతగారు
పండుగ వాకిళ్ళు

ఒసే శైలమ్మా

(మా వదిన గారి కోసం, ప్రత్యేకం)

తట్టి కోట వంశం లో
పుట్టావే తల్లీ
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా

మణి పాత్రుని
వంశం లో మెట్టావే
తల్లి
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా

షావుకారూ
బిల్లల 
షావుకారూ
వెనకాలే
తిరిగావే
తల్లీ
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా

ఉడుకున్న
కూతురుకోసం
పాత డ్రెస్సు
వేశావే
తల్లీ
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా

పిసినారి
పిసినారి
సావుకారు
ఓళాలో
తి ప్పా డే
తల్లీ
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా

పరుగు
పరుగు
వంటలోన
కూరగాయ
ఖైమ
కొట్టేవే 
తల్లీ
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా

నరిశీ పట్నం
విశాఖపట్నం
సింగపూరు
చందానగర్
ఆడంబాక్కం
తిరిగావే
తల్లీ

ఎండల్లో
వానల్లో
ఎండల్లో
వానల్లో
స్కూటీలో
తిరిగావే
తల్లీ
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా

తట్టి కోట వంశం లో
పుట్టావే తల్లీ
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా

మణి పాత్రుని
వంశం లో మెట్టావే
తల్లి
ఓ ఓ ఓ ఓ
ఒసే శైలమ్మా


ఆట

వేట 
జీవిత వేట
ఆటగాళ్లు
వేటగాళ్లు
కళ్ళన్నీ
రంగురాల్లు

పుట్టాకే
మొదలయ్యింది
వేట
కడుపంతా
నొప్పయితే
రోజంతా
వేతనలో
పుట్టి పుట్టి 
చచ్చానే

వేట
అడవిలో
వేట
పాలమ్మే
పాలేరుల
సైకిలు పై
పారిపోయిన
వేట

వేట
అడవిలో
వేట
పూల 
మొక్కల్లో
దాక్కుంటే
పాములన్నీ
తాకున్నా
ఇది వేట

పొమ్మని 
రమ్మంటే
వేట
నియాన్
లైట్
నీడల్లో
ఎఱ్ఱని
రంగుల
వేట

రాత్రంతా
నీరులేక
రోజంతా
ఉండలేక
ఒక్కసారిగా
తల్లి అన్న
తండ్రి పోయిన
వియోగ
విరహ వ్యధ

అడవిలో
వేట
సాయం కాలపు
సాయంచేయని
ఎర్రని 
గోధూళి
పొగమారిన
ఆటల్లో
వ్యధ
అడవిలో
వేట

ఆట
అడవిలో
ఆట
వందలున్న
గుంపులో
వంటరి
ఆట

ఆట
అడవిలో
ఆట
సాయంత్రపు
పక్షులు
కూడా
చేరేనే
కాలానికి
దారములేని
ఈ తోరణాల
దొంగాట



సంకురాత్రి

నీవిచ్చే
కౌగిల్లో
నాకు
భోగి
వేడుకలు

కళ్ళల్లో
నువ్వు 
వెలిగించావీ
బాణాసంచా

మళ్ళీ మళ్ళీ
లోగిల్లో
వచ్చే సంబరాలు
నీకైచేసే 
సంక్రాంతులు

రాద్దాంతం

నిన్ను చూస్తే
గుండెల్లో
ర త త తా
ర త త తా

నే నున్న
గెట్టోలో
రోజంతా
ర త త తా
ర త త తా

కళ్లలో
నువ్వద్దిన
రంగుల
రెయిన్బో
ర త త తా
ర త త తా

పాతబస్తీ
గ్యాంగులన్ని
బ్యాంగ్ చేసే
ర త త తా
ర త త తా

నేనుండే 
దారుల్లో
ర త త తా
ర త త తా

నీ అందెల
సవ్వడి
వింటే
మనసంతా
ర త త తా
ర త త తా

అ అంటే

అమ్మ
మొదటి 
పదం
మొదటిశ్వాస
మొదటి
ఒడి
అమ్మే
మొదటి
మిత్రువు
మొదటి
వేదము
మొదటి
గురువు

అమ్మతోనే
మొదటి
యుద్ధం
మొదటి
అలక
మొదటి
స్నేహం
అమ్మే
చివరి
పదం
ఈ రెంటి
మధ్యజరిగే
నాటకమే

సృష్టి

వాకిలి

ఈ కొమ్మకు
పుట్టిన
పువ్వులనడుగు
పువ్వులు
సోకిన
గువ్వలనడుగు
నువ్వస్తే
వసంతమేలే
మనసంతా

మొగ్గలు

 ఎప్పుడెప్పుడు

తప్పెను

గుండెల 

చప్పుడు


ఎప్పుడెప్పుడు

పూసెను

పూవులు

గుప్పుడు

అమృత

సరసిజ వదనా
నీ సొగసు
నీ వైరి కాంతి
లోనే కదా

తథాగథా

ప్రేమ
వియోగం
ప్రేమ
విరహం
ప్రేమ
విరహవియోగ
దగ్ధ స్నిగ్ధ
జ్వాలా
దహన
నౌక

ప్రేమే
ఒంటరి
ప్రేమే
గుండె
దారపు
ఉండల
చరఖా
కాలపు
మగ్గం పై
మనిషి
అల్లే
దుప్పటి
కానీ
దారానికి
రెండు
కొనలు
కొనల్లో
మనస్సులు
మనస్సులు
దారపుండలు
కదా
అయిపోతాయి

ప్రేమే
వీరహవియోగ
మూలం
కన్న ప్రేమ
వియోగాంతం
అనురాగ
ప్రేమ
యవ్వనాంతం
స్నేహ ప్రేమ
కాలాంతం

ప్రేమ నౌకకు
తీరాలు
ఏకాంతపు
నీడలు
ప్రేమేగా
చేరేది
ఎటుపోయినా
దుఃఖపు
రేవుల్లో

ప్రేమే
వియోగం
ప్రేమే
విరహం
ప్రేమేగా
దుఃఖ
రేవుకు
తెరలెత్తిన
చుక్కాని
లేని
తెరచాపల
నౌకా

కోరిక
ప్రేమ
వియోగం
దుఃఖం
అవునా
గౌతమా

అవునా
గౌతమా
సెగలెత్తే
సుగంధపు
వాంఛల్లో
సెగలెత్తే
ఆశయాల
దగ్ధ
కాలాగ్నికి
నువ్వు
గీసిన
క్రీనీడల
జగన్నాటకం


ర త త తా

నే నున్న
గెట్టోలో
రోజంతా
ర త త తా
ర త త తా

* ఇది తుపాకి శబ్దం. ర త త తా : https://www.youtube.com/watch?v=u9uDcpJinYM

పరిభ్రమ

పసిపిల్ల
తల్లిని
వెతికెనె
హంస
మేఘావృత
చంద్రుని
వెతికెనె
భాగ్య శ్రీరాగ
అనురాగవల్లిని
వెతికా

రాగ భాగ్యశ్రీ

తరగని రాత్రుల ఈ వెన్నెలలో
వెతికే మనసు నీ కన్నులను
తలచే నీ కురుల వన్నెలలీ
తరగని రాత్రుల వెన్నెలలు

*భాగ్యశ్రీ రాగానికి శిల్ప ప్రయత్నంhttps://www.youtube.com/watch?v=MHMt-60BZWo

జేజే

మంత్రికి జేజే
డబ్బులు నొక్కే
రాజుకు జేజే
చదువులు అమ్మే
బడులకు జేజే
దెవున్నమ్మే
స్వాములకు జేజే
పొట్టలు కొట్టే
రక్షకభటులకు జేజే
కమ్మని భరత బిడ్డను
మోసం చేసే
సంస్కారులకు జేజే

వడ్డన

కమ్మని రాత్రుల
నేస్తం మనది
మామిడి తోపులో
సఖ్యం మనది

ఆడుకున్న ఆటల్లో
పంచుకున్న బంధాలు
బంధాలను అనుబంధించిన
నేస్తం మనది

నువ్వు రాసిన
లేఖల్లో దాచుకున్న
పాటల్లో ఆటల్లో
ఊహలు మనవి

మోట బావిలో శ్రీధర్ అన్న
సెలవుల్లో మిత్రుడి మరణం
రాత్రంతా మనం చేసిన ప్రార్థన
ఓదార్చిన భుజం మనది

పండిన జీడిపళ్ల సాక్షిగా
దొంగేసిన తాటి కల్లు సాక్షిగా
అల్లరి చేసిన
మూకలు మనవి

అర్థరాత్రిలో పంచుకున్న
మజ్జికన్నం
అందులో కలసి
వడ్డించిన బాల్యం మనది

* బాల్యమిత్రుడు సహ్రుదయుడు అటల వెలది సుధాకరు కోసం

చిలకమ్మా

చిట్టి చిట్టి
కూలీలూ
మోడీ
కొట్టాడా
డబ్బులు
మార్చాడా
బ్యాంకులో
పెట్టావా
వాళ్ళు
గుట్టుకు
మింగారా?

నీవేగా

నీవేగా
ఈ తలపులు
నీవేనా
ఈ వలపులు
నీవేనా

ప్రియా . . . .

నీ గంధపు
తలుపులు
తీసేనా
నాకూ
నీవేనా

ప్రియా . . . .

నీ స్వాశేనా
ఈ వేణుకి
ప్రాణం
పోసేవా

ప్రియా . . .

ఊహలో
ప్రాణ శ్వాసల్లో
కనుసన్నుల
ధారుల్లో

ప్రియా . . .

నీవేనా
ఈ తలపులు
నీవేనా

ప్రియా . . .

ఈ మనసుల
తలపుల
తలుపులు
తీసేవా
నాకై తీసేవా

చెలీ ... ...

నీవేలే
చిక్కటి
రాత్రుల
అలవేణి
నీవేలే

సఖీ . . . .

కాలపు
కౌగిలి
చల్లని
లోగిలి
నీవేలే

సఖీ . . . . 


నీవేగా
ఈ తలపులు
నీవేనా
నీవేనా

ప్రియా .. . .

మైథిలి

కాలమనే
పొలంలో
హలం
పట్టితే
పుట్టిన
హేమవల్లి
మా చెల్లి
మాకు జానకి
చెకుముకి
బులికి
ముద్దులొలుకె
మా చిట్టి తల్లి
చెల్లి

విజన్ 2020

ఎగిరే కార్లూ
స్వర్ణపురాష్ట్రమూ
బస్సుడిపోల్లో
విమానాలు
పోపుడబ్బాలో
ఉచిత మసాలాలు
పైసాకే రైసూ
విజన్ 2020


ఎన్టీఆరూ
బాబుగారూ
కోట్లగారు
యువజన
శ్రామిక తండ్రి గారు
మీరమ్మె 2020 కలల్లో
మెమెందుకులేమే

మీ అన్నదమ్ముడు
వాడి ముగ్గురి
కళత్రయాలు
వారి అన్నదమ్ముల
ఫార్మ్ హౌస్లూ
ఇన్నోవాలు
మీ విజన్ 2020

మీరు మీ
గృహ లక్ష్మిలు
మీ బావమరిది
మూడో కొడుకు
అంతెందుకు
మీ జూలు కుక్కలూ
వీరికే
విజన్ 2020

కూలీలకు
వారుణివాహిని
పిల్లలకు
పప్పుబెల్లాలు
పెళ్లాలకి
పసుపుకుంకుమలు
ఇంటింటా
అక్షరవిజయం
విజన్ 2020

2020 వచ్చిందే
ఎక్కడున్నావయ్యా
తెలుగుంటి
నాయకరత్నా

ముగ్గురుండే
మంత్రి ఇంటిలో
పదునాలుగు
శయన గదులు
మంత్రి గారి
బాత్ టబ్బుకీ
బులెట్ ప్రూఫ్ కాస్టింగ్
సంస్కృతాంద్ర
ఆంగ్లమెరుగని
తమిళ రత్నకు
హెలీ కాఫ్టర్
విజన్ 2020


నా ఆప్తుడు
కష్టజీవి
అతనికి
సచివాలయం
మైకా సంచే

నా తల్లి
తెలుగు తల్లి
పొట్ట రెండుగా
చీల్చినా ఉన్న
ఒకే కోకతో
గతమనే
రైలుబండి
బతుకనే
ప్లాట్ఫారం
పక్కన
నల్లాలో
చేస్తుంది
మళ్ళా
మంగళ
స్నానం

2020 వచ్చిందే
ఎక్కడున్నావయ్యా
తెలుగుంటి
నాయకరత్నా


మరుపు

వేకువ ఝామునే
వెతికినా దొరకలేదు
జ్ఞాపకాల దొంతరలో
దాచుకున్న నీ పేజీ

వర్ణాలు

కాటుక
కళ్ళు
కావేరీ
కురులు
కటిక
రేలు
నలుపు

నవ్వులు
జాజి
పువ్వులు
సరస్వతీ
కోక
శరత్చంద్ర
మైదానాలు
తెలుపు

సాయంత్రపు
గోధూళి
వత్తిన
చెలి
ఆధరాలు
ఎదపై
కోరి పెట్టిన
వలపు
చిహ్నాలు
తెనుగింటి
ఆడపడుచు
నుదుటి
బొట్టు
ఎరుపు

మా ఇంటి
గుమ్మం
మా వదినమ్మ
చిరుదరహాసపు
వదనం
వాకిట్లో
ఉదయ
కిరణం
బాగాముగ్గిన
మామిడి
పసుపు

తలలో
దోపిన
పెరటి
మొరం
పచ్చని
కంచి పట్టు
వోణి
పండుగనాటి
అరటాకు
కోకిల్లమ్మ
తినే మావి
చివుళ్ళు
ఉడుక్కున్న
చెల్లి మొహం
పసివాడి
కళ్ళ మధ్యలో
ఆకు పచ్చ



కాలపు ద్వీపాలు

కాలపు
ద్వీపాలు

మిణుగురుల్లా
మనుషులు

ద్వీపాల మధ్య
తెరచాపల

ఓడల్లో
నీడల్లా

సాగే మనసుల
చుక్కాని

అప్పుడప్పుడూ
వేసిన లంగరు

సుడిగుండాలను
దాటే మనసులు

కాలపు
ద్వీపాలు

ఆగి ఆగి
వీచే గాలి

అంతంతగా
మేఘావృత

ఆకాశంలో
వాన్ గో (van Gogh)
చిత్రంలా

కాంతి
సుడిగుండాలను
తిప్పే

కాలపు
ద్వీపాలు

శోకం

నీ కోసం
నా శోకం

నీ క్లేశం
నను
తాకినప్పుడు

కర్కోట శీతల
గ్రహంపై
పెళ్లుబికిన
మంచు శకలంలా

నా విషాధం
శని గ్రహాన్ని*
తాకితే

ఈ ఏడాది
ధృవ నక్షత్రాన్ని
పట్టుకు తిరిగే

ధరిత్రికంతా
నా శోకం
ఆక్సిల్

మీ కోసం
పాలపుంత
నక్షత్రాలన్నింటికి

ఒక్కో శోకపు
చుక్కా
నే నేడిస్తే

ఆ చుక్కల
నా కన్నీటి
చుక్కల

అణువు లన్నింటికి
పేలిందా
ఒక్కో సూపెర్నోవా

ఆ పగిలే
మరి
మిగిలే

ధూళిరేణువు
నెభ్యులా లన్నింటికి
చెప్పాలి

నేనూ
వస్తున్నాను
పాతాలపు

అగ్ని నదులలో
ప్లూటో యమ
గ్రహాల్లో

మనిషి ఊహలు
కయిపర్ బెల్ట్
చేరే లోపే

నిను
వెతికి
హత్తున

చేరే
కాలం
ఏమాత్రం

ఇంతే కదా
కాలపు
దూరాలు

నైలు నదీ
యాత్రికులా
టైగరిస్ఒడ్డున

చెంఘీజ్ ఖాన్
అశ్వాలా
అతి పూర్వపు
హిమకరులా

అంతరించిన
ర్రాక్షస బల్లులా
తోక చుక్కలా

ఇన్నే కాని
రోజులలోనే
వస్తున్నాను

ఇంతే కదా
కాలపు
దూరాలు

నివ్వు లేని
ఫెమ్టో సెకన్లలో ***
పీకో సెకన్లు ***

నానో సెకన్లు ***
కోటాను కోట్ల
తూటాల్లా

నను పొడిస్తే
విడిచే
నిట్టూర్పుల్లో

కాలం సాగిపోతే
బ్రహ్మాండానికి
విస్ఫోటపు (inflatory)
కాలానికి

శూన్యంలో
జనించే
మెటీరియల్
చిహ్నంగా

వికల్పానికి
సంకల్పానికి
సమీధి నవనీ

ఇంతే కదా
కాలపు
దూరాలు

నీకై బరువు
నిండిన
గుండె

రోదసిని
పంక్చర్
చేస్తే

సూపర్నోవాలా
రోదసీ కాలాన్ని
వంచేస్తే

వెనుకల
మళ్ళీ మళ్ళీ
నీ ఊహల

ప్రతిబింబాల్లో
కాలయాత్ర (time travel)
చేస్తున్నా

కాలపు
దూరపు
తేమలకై

సంకల్ప
యాత్ర
చేస్తున్నా

ఇంతే కదా
కాలపు
దూరాలు

(పితృ దేవత కాలం చేసి సంవత్సరం.
కాలాన్ని అర్థం చేసుకోవాలి అంటే
భౌతిక శాస్త్రం చదవాలి.

ఈ కవిత నిండా ఉన్నది అదే.

అతి భయానక మంచు గ్రహం Enceladus
దాని శీతల గీజార్లో వచ్చే పొగలు
దగ్గర్లో సాటర్న్ ను తాకుతాయి.
భద్ధలయ్యే హృదయాన్ని దానితో పోల్చాలి.

ఏడాది అయిన ఆయన చుట్టూ తిరిగే హృదయాన్ని
ధృవతారతో పోల్చక తప్పదు.

కయిపర్ బెల్ట్ చేరటానికి satellite కి పట్టేది 70 ఏళ్ళు. కాంతికి పట్టేది కొన్ని రోజులు.

తరువాత ఉపమానం ఇంకా క్లిష్టం.
బ్లాక్ హోల్ చుట్టు అనేకానేక బింబాలు
ఏర్పడతాయి. అవి కాంతిని వంచితే
ఏర్పాడిన బింబాలు అన్నమాట.

వెనకలి రోజుల్ని చూసే మార్గం అది.
కానీ ఇక్కడ బ్లాక్ హోల్ భారమయిన
గుండె అన్న మాట.

నానో, ఫెమ్టో సెకన్లు అతి చిన్న సమయాలు.
అలాగే సృష్టిలోజరిగిన కాలం అతి పెద్ద కాలం.
కానీ వాటిని పోలిస్తే మనం మళ్ళీ కలిసే కాలం ఏ
మాత్రం.

తప్పలేదు వివరం రాయక. మన్నించాలి సహృదయంతో.)

టైం ట్రావెల్

ఇంతే కదా
కాలపు
దూరాలు

నివ్వు లేని
ఫెమ్టో సెకన్లలో
పీకో సెకన్లు

నానో సెకన్లు
కోటాను కోట్ల
తూటాల్లా

పొడిచే
విడిచే
నిట్టిర్పుల్లో

కాలం సాగిపోతే
బ్రహ్మాండానికి
కాలానికి

వికల్పానికి
సంకల్పానికి
సమీది నవనీ

ఇంతే కదా
కాలపు
దూరాలు

నీకై బరువు
నిండిన
గుండె

సూపర్నోవాలా
రోదసీ కాలాన్ని
వంచేస్తే

వెనుకల
మళ్ళీ మళ్ళీ
నీ ఊహల

ప్రతిబింబాల్లో
కాలయాత్ర
చేస్తున్నా

కాలపు
దూరపు
తేమలకై

సంకల్ప
యాత్ర
చేస్తున్నా

ఇంతే కదా
కాలపు
దూరాలు

ఊర్మిళ

విరిగే కెరటంలా
తుళ్ళిపడ్డ
నావలా
ఎగిరిపోయే
హంసలా

కొండల్లో
ఓడల్లో
నీ అలివేణీ*
నీలి జడల
నీడల్లో

గుప్పుమన్న
గుండెల్లో
ఎదలో
ఉప్పొంగిన
ఊపిరిలో

ఎప్పుడయినా
చప్పుడయిన
గుప్పెడయిన
గుండెల్లో

ముద్దుకారే
వంపుల్లో
శ్వేతమయిన
కంఠంలో
వంశధారా
ఎదలో
అరబిక్కడలి
పసిఫిక్కుల
దూరంలో

ఆధర
మధుర
ధారల్లో
దారుల్లో
గోదారుల్లో
ఓదార్పుల్లో
రూపుల్లో
కనుపాపల్లో
నిదురించెనా
ఊర్మిళా

* Curly


లక్ష్మీ జననం

పడమటింట పుట్టావా
ఓ చంద్రవంక
నీవంకల్లో
పుట్టెనే
నీరజాక్షి
కంటివంక
చీనీ కనులలో
కటిక కాటుకలు
పోసేవే
పడమటింట
కస్తూరి
పూసేవే
కమలాల్లో
మల్లెల్లో
క్షీరాబ్ది
కన్యకకు
ధవళ వస్త్రధరివై
తళుకులాడే
వరమై
పడమటింట
పుట్టావా
పద్మంలోపుట్టావా
పదంలోపుట్టావా

(క్షీర సాగర మధనం లో పుట్టిన లక్ష్మీ దేవికి)

సినిమా పాట

(ఇది మన తెలుగు
హీరో ఎంట్రీ ఇచ్చే సాంగ్

సినిమా: పోటుగాడు
మొదటి సాంగ్
హీరో: పాత హీరో మనవడి బామ్మర్ది)

అంచులు దాటే
ఊహల్లోకి

ఊహలు దాటే
హద్దుల్లోకి

హద్దులు దాటే
ముద్దుల్లోకి

చెలియా వస్తావా

ముద్దులు దాటే
ఊహల్లోకి

ఊహలు దాటే
లోకంలోకి

చెలియా వస్తావా

లోకం ఎరుగని
ద్వీపంలోకి

ద్వీపం దాటే
హద్దుల్లోకి

చెలియా వస్తావా

వస్తే వాట్సాప్
చేస్తే

లిప్స్ చేసే
గ్రిప్ కోసం

గ్రిప్ చేసే
లిప్స్ కోసం

చెలియా వస్తావా

చూస్తే గిస్తే
వలపులు
ఇస్తే

పెప్సీ ఇస్తే
పాపకి
నస్తే

చెలియా వస్తావా

ముద్దుల బస్తీ
కసికసిగా
కుస్తీ చేస్తే

చెలియా వస్తావా

ఔనే గలీజు
రాజుని

ఔనే గరీబు
మజ్నుని

కానీ
చెలియా వస్తావా

కాదే ఎగిసిన
కెరటం

కాదే విరిచిన
స్వప్నం

చెలియా వస్తావా

ఔనే వీర
జవానుని

కానీ మిల్కీ
మిత్రుడుని

చెలియా వస్తావా

కానీ ఏడు
అడుగుల
సాథీ

ఔనే నీ
స్వప్నపు
సేతువు

చెలియా వస్తావా

ఔనే అజాత
శత్రువు

ఇవ్వాలీ
మరి
ఇవ్వాలి

ముద్దుల
గుమ్మా
ఇవ్వాలి

చెలియా వస్తావా

మనసులు
దాటే

స్వప్నములన్నీ
ఇవ్వాలి

చెలియా వస్తావా




లజ్జ

నల్దిక్కుల లోకంలో
దిక్కులేని
పుట్టినరోజు
పుట్టినిల్లు
తెలియని
బాటసారి

ఆవు దూడయిన
పెంకుటింట నిదరిస్తే
తలపై నీలితెరతోనే
సేద తీరును
బాటసారి

ఇనుప గజ్జెల తల్లి
దీవిస్తే కటిక
పేదరికమున
ఇనుప సామాను
వేరెను బాటసారి

రంగుల అద్దాల
రహదారిలో
తన రూపమే చూసెను
ఏకాంతపు బాటసారి

పొగ మంచు
ఊరిని కమ్మితే
మంచు తెరనే
దుప్పటిగా కప్పెను
బాటసారి

జన్మదినం తెలియని
ఇతనికి జండా పండుగే
రంగుల రోజు
జన్మ నక్షత్రం తెలియని
ఇతనికి ధ్రువ నక్షత్రం
జన్మ నక్షత్రం

ఇతను అంతర్దాన
మహిమా పాత్రుడు
ఇతని గురించే
రోజు వాదించే
నాయకుడికి
బీచ్ రోడ్డులో
ఇతను మాత్రం
కనపడడు

ఇతను దేశం కోసం
చేసే పస్తులు వ్రతాల
ఫలితమేమో మనం
చంద్రుణ్ణి చేరిందే

ఇతని ఇల్లు
నీలితెర
ఇతని బంధువు
ఊరి కుక్క

ఇతను గాంధేయవాధి
ఇతని గుమ్మం
కాకులు వాలే
గాంధీ బొమ్మ

బొమ్మకిందే
గాంధీ వాక్కుల
సాక్షిగా
ఇతని ఆకలి
మనకు సిగ్గు

గీతాంజలి

ఆజాదీ
ఆజాదీ

ఉక్కు నరాలకు
ఆజాదీ

ఎండే పొలాలకు
ఆజాదీ

ఘర్మ జలానికి
ఆజాదీ

తోసే రిక్షాకు
ఆజాదీ

వేలాడే బాలలకు
ఆజాదీ

పొగగొట్టాల్లో కాలే గాలికి
ఆజాదీ

తరిగే గుండెలకు
ఆజాదీ

కోచింగ్ క్లాసులో
నలిగే పసితనానికి
ఆజాదీ

సిగ్గుల గువ్వలకు
నవ్వే
ఆజాదీ

నల్లని భుర్ఖా
తీసి పారేసే
ఆజాదీ

నల్లని భుర్ఖా
నచ్చితే కట్టే
ఆజాదీ

గగన భవంతుల కింద
రోడ్ల పక్కన
పస్తుల నుంచీ
ఆజాదీ

నోటులు మార్చే
నీతులు చెప్పే
దొంగల నుండీ
ఆజాదీ

ఆచారాలు అపచారాలు
శృంఖలాలలో
హృదయాల నుండీ
ఆజాదీ

సంకెళ్లు వీడే
మనసుని ముందుకు
లాగే స్వేచ్ఛ కోసం
ఆజాదీ

- విశ్వకవి జ్ఞాపకాలు 2020 లో కూడా అవసరం కదా ?

పునరపి జననం

పారిజాత
పుష్పాలో
నల్లని
శీతాకాల
రాత్రులో
నీ ఈ
కురుల
నీడల్లో
సాగిపోతే
ప్రతీ
రాత్రి

వసంత
రాత్రుల
మామిడి
చిగురుల
జవ్వన
ఆధరపు
పుల్లని
పెదవులో

కావేరి
ఒడ్డున
ఋతుపవన
గాలుల్లో
చెమ్మని
తొలకరిలో

బ్రహ్మ
గీసిన నీ
కొంటె
కోనల్లో
కలిసి
వేసే
తొలి
నాట్లు

శంఖు
పుష్ప
నారీకేళ
మృదుల
ఎదలలో
కర్కశంగా
కలిసి

కోరుకున్న
ఘాతాల
సాక్షిగా
వదలిపోకు
మిత్రమా

చీమవై
భ్రమరమై
పాల
పిట్టవై
ఎగిరే
హంసవై

నీవు
జన్మనెత్తితే
నీవెనుకే
పీపీలక
కీటక
కౄంచ
పక్కిలా
పుట్టనా
నిను
కుట్టనా

పునరపి
జనణం
నీకై
శయణం

ఒప్పులకుప్పా

పావురాలు
పెంచెనే
శకుంతలను.
దొంగ
రాయలేదా
రసరమ్య
రామాయణము.
లక్షమణుండు
కోసెనే
అబలను.
రాధకు
రావణ
సోదరికి
కుంతికి
గిరిజకు
గంగకు
అంబకు***
యజ్ఞసేనికి
కలిగిందీ
మనసు కాదే ?
మాలి
వాసన
చూస్తేనే
ఆముక్తమాల్యద**
రాముని
భద్రునికే*
అంతుచిక్కని
సత్యం

విరించి
గాధలలో
విధాత
తలపులలో

తప్పుఒప్పులెంచ
సాధ్యమా
ఒప్పులకుప్పా ?

* ఇక్కడ రాముని భద్రుడు ,  రాముడికి సీతపై    తప్పుగా చెప్పిన చాకలి.
** గోదాదేవి పూల వాసన చూసి పెడితేనే దేవుడు గ్రహించే వాడంట !
*** అంబ,   భీష్ముడి చే అపహరింపబడి మోసపడిన అంబ పరసురాముడి శరణం కోరుతుంది.

వలస పక్కి

బైకాల్ సరస్సు
లోతులెరిగి
పులీకాట్
రుచిచూసి

అంటార్కిటికా
అంచుల్లో సేదతీరి
ఎగిరిపోవాలి
టర్న్ పక్షిలా

ఎగిరే  ఆ  వలస
పక్షిని అడుగు
భూమి వ్యాసమెంతో
ఆకలి తీరేటంత

ఆకలి పోటే మిటో
అడుగు టర్న్ పక్షిని
వేల యోజనాలు
సాగేటంత

యోజనాల పొడుగేమిటో
అడుగు వలస పక్షిని
నిద్రలో సయితం
ఎగిరేటంత

నిద్ర మత్తేమిటో
అడుగు వలస పక్షిని
అంతరాళ సువాసన
గుండెల్లో నిండేటంత

మరి బుల్లి గుండెకంత
యాతనెందుకో

కన్న భూమిరా ఇది
వలస పక్షికయిన
భరత భూమిరా
పులికాట్ సరస్సయినా

మీ అనుంగుడు

ఎవరయితే
ఇంటి ముందు
గులాబీ తోట
పెంచగలడో

ఎవరయితే
ద్రాక్ష తీవి
ఒక ఎండు కొమ్మునుంచి
పెంచగలడో

ఎవరయితే
హుమ్మింగ్ పక్షికై
ప్రత్యేకంగా
పుష్పాదులను
పూయించగలడో

ఎవరయితే
సరదాగా మృదంగం
హార్మోనికా
వాయించగలడో

ఎవరయితే
ఇరుగుపొరుగుతో
బాణాలు ఆడించి
శబ్ద భేది చెయ్యగలడో

ఎవరయితే
చెల్లికాయతో
వంట గులాబిజాం
నేర్చుకోగలడో

ఎవరయితే
సన్ గొడుగులో
పార్టీ చేయగలడో

ఎవరయితే
సొంత స్టార్టప్పులో
అర్ధాంగిని
కలుపుకోగలడో

ఎవరయితే అయిదేళ్ళు
ప్రాపకం చేసి నూనుగు
నవబాలుడితో
అణు శాస్త్రం
వల్లింప గలడో

ఎవరిచేత మొక్కగాని
పూవుగాని పిల్లలు గాని
వర్ధిల్లెనో

ఎవరికి శత్రువులు
పుట్టరో పుడితే
క్రమేణా వీర
గంధములు పెట్టెరో

ఎవరి కథలను
భారతీయ వ్యాపార
పాఠసాల (ఐ.ఎస్.బి)
లో కథలుగా చెప్పెరో

ఎవరయితే యువతీ యాతా
నవమృదు కేశావృద్ధి
కళ సృష్టించెనో

ఎవరయితే ఆశువుగా
పెళ్ళాంపై కవితరాసి
ముక్కు చివాట్లు
తినగలడో

అయినా

అతనే శివశక్తి
సమాయోగుడు
అనుంగుడు
మీ కవికటకవి

శకుంతల

వసంతపు మందారాలు
శిశిరపు శశీ
పులకిత తామరలు
ఎండల్లో చెట్టుకే
పండే జీడీ పళ్ళు
రోహిణీ కార్తెలో
భళ్ళున లేచే
సూర్యభగవానుడు
ఆగ్నేయపు ఋతుపవనాలు
మళ్ళీ వచ్చే దీపావళీ

మళ్ళీ మళ్ళీ
వలస వచ్చే
శ్వేత హంసలా
ఈ ఋతువుల సాక్షిగా

కదిలే నీ కళ్ళలోని
రెండు పుష్కరాల
అలల కలల
ఊసులు

శిశిరపు నిశా
రాత్రిని కాటుక
చేసిపెడితే
పొరపాటున
వర్షించిన మేఘంలా
ఒక్క ఒక్క
బొట్టు రాలితే
నీ కాటుక కళ్ళలో
కాశ్మీరపు బోటు
షికారులా
అప్పుడే కొండమల్లె చెండుపై
వర్షించిన తొలకరినై పోదునా

తడిగుడ్డతో
మూసిన మొగ్గలనో
పొగమంచు కప్పుకున్న
కొండల్లా ప్రకృతీ
కన్యపు ఎదనో

నీ విశాల సాగర
నిర్మల ప్రశాంత
మనసుకు
పులీకట్ సరస్సులా
దప్పికిచ్చిన
సుమధుర
ఎదలో
వలస పక్షినై
పుట్టలేనే

కైలాసాన్ని
తప్పించుకున్న
గంగ ఉరకలెత్తినట్టున్న
నీ నల్లటి కురుల
సువాసనలో
డిసెంబర్ వెన్నెల్లో
వీచే ఎడతెరిపి గాలుల్లో
వాగే గుండెలు
నీ కురుల
వాగుల్లో ఆగిపోలేవా

పుట్టతేనె తెచ్చి
కోనసీమ కొబ్బరి లోపోసి
వర్షాల్లో కొండల్లో
కొనల్లో పుట్టే
జలపాతపు
నీటిలో కలిపిన
మాధుర్యాన్ని
నిను చేరే
మేఘంలా
ఎలా చేరాలి

నా కళ్ళలోని
అలల కలల
ఊసులు




చెల్లికాయ్

బల్లివైనా నల్లివైనా
చెల్లివి
వాగినా రబ్బరులా
నీ నోరు సాగినా
చెల్లివి

కొండల్లో పెండల్లో
దుంపలు ఏరుకునే
బంటివి
ప్రజల చెవుల్లో
వాగుడుతో గూడుపెట్టే
కందిరీగవు
అయినా చెల్లివి

నీ మాంసభక్షణకు
కోళ్లూ చేపలు పందులు
అంతరించిపోయినా
అయినా చెల్లివి

నువ్వు మాట్లాడితే
ఋతుపవనాలు
పొట్లాడితే
కోడిపందాలు
అయినా తప్పదు
చెల్లివి

జింపిరి జుట్టు
అగ్గిపుల్ల తగువులు
గంట పెట్టే టీ
అయిన చెల్లివి

నువ్వు నల్లివనో
బల్లివనో కొండ
మల్లి వనో
తుమ్మముల్లు వనో
అనలేదే నువ్వు
కేవలం చెల్లివి

నువ్వు తిండిముచ్చువో
కొండముచ్చువో
పిల్లకాయవో
చెల్లికాయవో
అన్నానా

పేలుతల్లివో
అమ్మతల్లివో
అన్నానా
చెల్లి మాత్రం అన్నాను

ఈ కవిత విని
నన్ను తన్నినా
నాకు దొరికిన ఓన్లీ
బంగారు తల్లివి
కేవలం చెల్లివి

అన్న

ఎవరు మాట్లాడితే
వర్షమా మాటలా
తెలియదో

ఎవరు  రుబ్బురోలులోచెయ్యిపెట్టి
తాండ్ర పాపరాయుడిలా
భావిస్తాడో

ఎవరు అద్దె సైకిలు పై
వన భోజనానికి
వస్తాడో

ఎవరు పావలా
ఐసు బేరమాడి
కొంటాడో

ఎవరు చొక్కా జేబీలో
అప్పడం
దాచుకుంటాడో

ఎవరు పిండొడియానికి
యుద్ధం
ప్రకటిస్తాడో

ఎవరు దమ్ములో
మూలుగు కోసం
తమ్ముణ్ణి కొట్టేదో

ఎవరు దోమ దోమకీ
పావలా ఇచ్చేనో

ఎవరు తల్లిని
బిడ్డనూ శైలూనూ
ఎండల్లో తిప్పెనో

ఎవరు బేరమాడి
రిక్షాలో విమానాశ్రయానికి
వెళ్ళెనో

ఎవరు పక్కింటోల్ని
హౌసీలోదోచెనో

వాడే మా అన్న
శివ సూర్య ప్రకాష్

ఇటాలియన్స్ ఆఫ్ ద ఈస్ట్

చెన్నైలో
చితికిపోయి
కర్నూలులో
ఖంగుతిని
భాగ్యనగరంలో
బోల్తాపడి
అంధ్రులు
పడ్డారు
అమరావతిలో

టంగుటూరు
శ్రీరాములు
సంజీవయ్యాల
కలలు దాయాదుల
పాలు

తెలుగు
ప్రధానికే
దక్కలేదు
రాజసం
తెలుగోడికి
మిగిలింది
అక్కసం

కమలమని
హస్తమని
అందరిని
నమ్మేస్తాం
జుట్టు
చేతికిచ్చి
లాగొద్దని
మొక్కుతాం



శ్రీకాకుళం
 యిజీనారం
యాసమనది
విశాఖ
ఉక్కుమనది

పగో
తూగో
మట్టిమనది

బెజవాడ
బస్తీమనది
ప్రకాశం
పరువుమనది
గుంటూరు
మిర్చిమనది

నెల్లూరి
నేలమనది
కర్నూలు
కలలు
మనవి

కడపలో
కోపాలు
రాయలోరి
రతనాలు
సింహగిరి
సంపెంగలు
రామకృష్ణ
ఇసుకతిన్నెలు

కోటలోని
రాకెట్టులు
చలిత లలిత
చూర్ణ కుంతకాంతలు
మనవికావా
ఆంధ్రుడా

అచ్చంతపు
భాష మనది
హవాయి
ఇటాలియన్
స్థాయి
అచ్చ తెలుగు
ఆంధ్ర భాషది

మాటల్లో
హవాయిలా
చేతల్లో
ఇటాలియన్లా
ఉండాలోయ్
ఆంధ్రుడా

వేసవి

తుమ్మచెట్టు నీడలో
పట్టిమంచం ఓడలో
తాతగారి లోగిడిలో
చిన్ననాటి ఎండాకాలం

తాటిముంజు కన్నులా
కల్లంలో బువ్వలా
తాటి బురుకు బండిలా
చిన్ననాటి ఎండాకాలం

బుల్లి మరదలి అలకలా
అన్నయ్య బాదుడులా
మామయ్య గారాబంలా
చిన్ననాటి ఎండాకాలం

అట్లాసు సైకిల్లా
పాత టైరు ఆటలా
రెండు ఎడ్ల బండిలా
చిన్ననాటి ఎండాకాలం

కోమటి గవ్వల్లా
చెరువు కాడి గువ్వల్లా
మట్టి పొయ్య మీద కోడి కూరల్లా
చిన్ననాటి ఎండాకాలం

తాటి తాండ్ర తీపిలా
తుమ్మ జిగురు పొగరులా
ముంత కల్లు అగరులా
చిన్ననాటి ఎండాకాలం

ఏటిలో గేలంలా
కోనేటి నీటిలా
నూతిపక్క స్నానంలా
చిన్ననాటి ఎండాకాలం

వస్తాను మిత్రమా

తూరుపు కనుమల
తురాయి నీడల్లో
కనుల చెరువుల ఓడల్లో
తెరచాపనెత్తి
వస్తాను మిత్రమా


ఒంటరి

ఎదురు చూస్తోంది
ఒంటరి మేఘం
నెలవంక కోసం

ఒంటరి దీపం
ఎదురు చూస్తోంది
కుశలం చేసే దోసిలికై

ఒంటరి మనసు
ఎదురు చూస్తోంది
లలిత సలిత కవితకై

అంతర్ముఖి

చిందవందర స్మృతులలో
తుఫాను కంటిలోని ఆకాశంలా
ఆప్పుడప్పుడూ నవ్వుతాడు
అంతర్ముఖి

అంతరాళ‌‌పు నిర్మలత్వం
అరేబియన్ సముద్రపు లాలిత్వం
వీచే కొబ్బరి చెట్ల గాలి
అక్కడక్కడా వాకిలిని వేడెక్కించే ఎండచుక్కలు
అంతర్ముఖి మనో వీధికి విండోలు

ఎదురు చూపులూ, వీడ్కోలులూ
అహల్యపు దూరస్పర్శలూ
దివి దూరాన ఆత్మబంధు స్మృతులూ స్పర్శిస్తే
ఎండకు ఎండీ వానకు తుప్పుపట్టిన హిమోగ్లోబిన్
షివరిస్తుంది కంపిస్తుంది
అంతర్ముఖి రక్త ప్రవాహం

వింధ్యా పర్వత అనాధ శ్రేణులూ
తూర్పు కనుమల ఇష్టసఖులూ
ఆవిరినిండిన మేఘ నిట్టూర్పులను ఆపితే
అప్పుడప్పుడూ విశ్రామంగా

సవివరంగా మేఘాలు కొండ ఎలివేటరెక్కితే కరుగుతుంది ఘనీభవించిన అనురాగపు మంచు
మైనపు వైనంలా చుక్క చుక్కగా పిగులుతుంది
అంతర్ముఖి మనోపర్వతం

తీరం మధురం

సాయం మధురం
సాగరం మధురం

దూరాన గోధూలి మధురం
విసిరిన వలలే మధురం

మెరిసిన అలలే మధురం
పసిపిల్లల నవ్వులు మధురం

జొన్నగంటెలు మధురం
నిండిన బుంగలు మధురం

సిగ్గులైన బుగ్గలు మధురం
తెన్నెటి తీరం మధురం

నిదురించిన విశాఖ మధురం

తెరచాప

రాత్రి అమృతం కురిసింది
మూర్తీభవించిన కలలు కరిగితే
అలల కెరటాలపై
దూరపు చంద్రాస్తమయానికి
కాలం తెరచాపలెత్తింది

పుట్టినరోజు

ఎదురుచూసిన
ఎర్ర బస్సున
ప్రేమనిండిన
సంచిలోన

కొత్త బట్టలతో ఎదురుగ
నీవస్తే కోపంతో
ప్రేమతో

ఎక్కబికిన ఏడ్చిన
మంచి రోజులు
మళ్లివస్తే

నిన్ను పట్టి నాన్న అంటూ
ఎక్కబికిన బిక్కచచ్చి
నేను నిన్ను
అంటుకుంటు

ప్రేమ అంటూ
నాన్న అంటూ
మనసు నిండా
కడలి నింపుకు

ఊపిరాపి నిన్ను
చూచే రోజు కోసం
వేచి ఉంటా

ఎర్ర బస్సు మళ్ళీ రాదు
మరో జన్మకి
కాని రాదు

ఎక్కబికిన ఏడ్చిన
మంచిరోజులు
మళ్లివస్తే

మరల కలువు
మారునదికి ఆవతల

ఎక్కబికిన ఏడ్చిన
మంచి రోజులు
మళ్లివస్తే

అహల్య

అణువనువు
నువ్వై నవ్వై
అనువై మనువై
మనసిస్తావా

కృష్ణా

దీవిస్తావా
ఊపిరివై స్వప్నమై
వెచ్చని కౌగిలివై

సొగసు చూడ తరమా?

సొగసు చూడ తరమా?....... ఈ కృతి ఆణిముత్య0!

అమ్మాయి తిన్నగా వెలుతూ.....కాలి పట్టీలు గడ్డి మొక్కకు తగులుకొని, కాలు చిక్కుకు0దనుకొ0డి.... కొ0చె0 చిరు కోప0గా , వ0గి కురులు సవరి0చుకొని, చిక్కు విప్పుతు0ది కదా, అప్పుడు .....ఆ సొగసు చూడ తరమా?

పిల్లలు స్కూలుకి వెల్లే ము0దు, దొ0గ ఎత్తు వేస్తున్న చ0టివాడిని , సిగమొలతోనే, నీటి కు0డీ పక్కనే నీళ్లు పోస్తున్న ఇల్లాలి సొగసు చూడ తరమా?

ము0దు వసారాలో , సన్నజాజులను, ఒకొక్కటిగా తె0పి తలలో , ముడుచుకున్నప్పుడు, ఆ సొగసు చూడ తరమా?

కూని రాగ0 తీస్తూ, చ0టి దాన్ని ఎత్తు కుని, పెన0పై పెసరట్టు తిప్పుతు0టే ఆమె సొగసు చూడ తరమా?

పుస్తక0 పక్కన తోసి, కొ0చె0 అట్లు తిప్ప0డి, వస్తాను అ0టూ చేతిలో అట్లకాడ పెట్టి పారిపోతున్న చెలి సొగసు చూడ తరమా?

కోపమొచ్చినా, అలసటొచ్చినా, అలకొచ్చినా, ఎదురుచూసినా, చమటోర్చినా, ఆన0ద0 ఒలకపోసే చెలి సొగసు చూడ తరమా?

మాటలు



మాటలు రావు
కానీ ఒంటరి మేఘం చిరుచినుకుతో పలకరిస్తే
ఎదురు చూసిన వరిచేనులా పులకరిస్తాను

అప్పుడొస్తాయి మాటలు
చెమర్చిన చిరుపెదవులపై తుమ్మెదలై
మూసిన కనురెప్పల మాటున ఇంద్రధనుస్సులై
అప్పుడొస్తాయి మాటలు

నాన్నా

ఆ ఉదయం
పొగమంచు వేసి
నిన్ను మాయం చేసింది
బ్రహ్మనింపిన ఆదినాదం
భానుడి వెలుగుకిరణం
ఆ ఉదయం
పొగమంచు వేసి
దోచివేసింది

తెలవారింది
నిన్నటి వెలుగుపులుగు
ఈనాడు బల్లెంలా
గుండెల్లో దిగింది
వెలుగులో నిశీధి
వెచ్చదనంలో అతిశీతల
స్నిగ్ధత

నీ ఉచ్ఛ్వాస నిశ్వాసలతో
మారుమోగిన శృతిలయలు
ఆగితే నిశ్శబ్దపు
మౌనం చెవులకు
చిల్లులు పెడుతుంది

ఆ ఉదయం
పొగమంచు వేసి
నిన్ను మాయం చేసింది
ఆ మంచుపొర కరిగి
ఇప్పుడిలా కారుతుంది
కన్నీరుగా

రిమైండర్

ప్రాణదేవతతో
పొరుపెట్టి
కయ్యమాడిన
ఊపిరి
బుగ్గ బుగ్గన
భగ్గు భగ్గుగా
ఆగిపోయెను

గాలిపోయిన
గుండెనిండా
ప్రేమమాత్రం
మిగిలిపోయెను

మాటపోయిన
నోటినిండా
మంచివాక్కులు
మారుమోగెను

కాంతిపోయిన
కనులనిండా
కలలలోకం
నిండి ఉండెను

నీవుపోయిన
లోకమందు నీ
మంచిమాత్రం
నిండిఉండెను

కన్యక

దుఃఖం వస్తే
కోపం వస్తే
మనస్తాపమై నిద్రిస్తే
కాదు సొమ్మ సిల్లితే
కలవచ్చింది కలలో
కన్యక వచ్చింది
నవ శతాబ్ది
కన్యక వచ్చింది
వాకబు చేసింది

ఐంకానమ్మా పాలబుగ్గలపై
మసిబొగ్గుల వైనం
అరబ్బులో వికృత సైన్యం
అమెరికాలొ పిచ్చి తుగ్లక్
లండన్లో చవటల రాజ్యం
డకోటాలో రక్కసి పైపు
దేశంలో చెల్లని రూపీ

అంబానీ అద్దాల కోటలో
జుక్కర్బర్గ్ జూలు కుక్కలో
దుబాయిలో దగాపడి
కొరియాలో ధూళి పట్టాయ్
మానవ సమానవ
బుజబాహుమేధోశక్తులు

లేవగానే ఆవులించి
ఖాళీ కడుపులో
ముడుకులు తన్నుకుని
సొమ్మసిల్లింది
శతాబ్దపు కన్యక

ఆమెను అరుణోదయపు
అంబరాలలో చుట్టి
తెలతెల మెరిసే చమ్కీలు పెట్టే
మహాత్ముడే పుడతాడామ్మా
ఆమెను లేపే వైతాళికమై
కవితా పుడతావామ్మా

వస్తాయా ఆ కన్యకు రెక్కలు
భూగోళం వదిలి అంగారకం దాటి
అంతరాళం అధిగమించే
మంచి రెక్కలు
వస్తాయా ఆ కన్యకు రెక్కలు

కవితా ఇస్తావమ్మా ఆ
కన్యకు రెక్కలు
కవితా ఇస్తావమ్మా ఆ
కన్యకు గళం
లేచే ఈ శతాబ్దపు
కన్యకకు శుభోదయం
కవితా ఇస్తావమ్మా !

(అంకితం: విశ్వంభరుడు శ్రీ సీనారె కు)


















హెచ్చరిక

హెచ్చరిక

ఆకాశం ఆడావృత్తమై ఉన్నది
చెదురు మదురుగా
తిట్లూ ఛీవాట్లు పడవచ్చు
ఇళ్లకు పోయే మగవారు
పువ్వులూ పకోడీలూ
యధాశక్తి తీసుకుని వెళ్లాలి

అతను ఆవిడ

అతను ఆవిడ

ఆవిడ
అజీర్తి చేసిన పెద్ద పులి
అతను
డబుల్ టైఫాయిడ్ పడిన నక్క

హతం

హతం

నిశ్శబ్దం మంచుబాకు
ఒకేలాంటివి
పొడిస్తే దొరకవు
ఆనవాళ్లు

రైలు
(రంగం : రైలు, క్రింది బెర్తు, శరదృతువు)

మరచిపోకు నేస్తమా ...
ఆనాటి స్నిగ్ద శశి బింబానిని
ఆశలు నిండిన ఎర్ర గులాబీ
కిటికీ నిండా నిండిన రాత్రి

నీ కాటుక కళ్ళల్లో మెరిసిన దృశ్యం
చిలిపిగా వణికిన పెదవి
ఎగిరే కురుల సుగంధం
అభిజాత్యపు ఎదలలొ
దొరికిన దప్పిక

ఆ రైలుకి తెలియలేదు దూరం మంచిదని
కలల్లోని కళ్ళల్లోని స్వప్నలోకం తనందే ఉందని
కాలానికి కలలకు కళ్ళకు
నిండుకా రెండు హృదయాలు తీరుతున్నాయి దప్పిక
రెండు జతల కళ్ళు వర్షిస్తున్నాయి తప్పక










ఒకొక్క గడ్డిపోచతో కట్టావు పొదరిల్లు
చల్లగాలులతో వెన్నెలలో
కూనలమ్మ లోగిటిలో
పాలపిట్టల స్నేహంతో
సేదతీరే శ్రమభోగీ !
గిజిగాడా !
ఏమిటి నీజీవన రహస్యం?

మూలం: గుర్రం జాషువా గారి గిజిగాడు

పోటీ






నిన్న 
రాత్రిని పగలు చేసి
ఎగిసాయి సెగలు

నేడు
పగటిని రాత్రి చేస్తున్నాయి
ఆ సెగల పొగలు

విధితోనా
వెలుతురి పోటీ !
విషాధానికి వెలుతురు
ఏమిటి సాటీ !

నీతో బాల్యం

మిత్రమా నీలాకాశం
గాలిపటం జీడిచెట్టు
మామిడి తోపు
నీతో బాల్యం

పచ్చని దృశ్యం
చక్కని పాట
దోచిన చూపు
నీతో బాల్యం

దాచిన లెటరు
ఓదార్చిన దుఃఖం
చిరు గాలిలో చిహ్నం
నీతో బాల్యం

నీతో బాల్యం, స్వప్నపు లోకం
వీడని స్మృతులు
చెరగని నవ్వు
తరగని స్నేహం
నీతో బాల్యం

కాలంతో

కాలంతో
అనుభవాలు జీవనపాఠాలవుతాయి
ఆ జీవనపాఠాలు స్మృతులయి
జీవితపు పుటలలో అరఠావులవుతాయి

మళ్ళీ ఒకరోజు
జ్ఞాపకాల దొంతరలలోనుండి క్రిందకు పడుతుంది ఈపేజీ
అప్పుడు కరిగిన మధురస్మృతులు
గతాన్ని చూస్తున్న కనులలో జారిపడతాయి

ఇవి చాలు

చిరుగాలిలో తెరచాప పడవ, వేగు చుక్క
ఇవి చాలు ప్రయాణానికి

అప్పుడే మొలకెత్తిన పచ్చగడ్డి, గుండెల వరకు బౌన్సయ్యే బాలు
ఇవి చాలు ఆటలకు

ఆటవెలది, తేటగీతి, రఘువంశ సుధ
ఇవి చాలు పాటలకు

ఒక వాడేసిన సబ్బుబిల్ల వ్రేపరు, విరిగిన పెన్సిల్ ముక్క
ఇవి చాలు కవితలకు

(నావి నాలుగు సరదాలు, Sailing, Tennis, Music, Poetry ఆ నాలుగిటిని కలిపి ఇలా)

బందీ

సూర్యుని విడిచే కాంతి కిరణాలు
నీ కన్నుల్లో బందీలు
నీ కన్నుల్లో నా రూపం బందీ
కలసిన మన కన్నుల్లో

మన ప్రతిబింబాలు బందీ
ఆ ప్రతిబింబాలలో
మన కలలు బందీ
మన ఆ కలలో ఈ కాలం బందీ

వీపు విమానం



కళ్ళేమో ద్రాక్షపళ్ళు
బుగ్గలు జాంపళ్ళు
చాచి కొడితే మాత్రం
చెయ్యి అట్లకాడే !

మేఘాలు




మేఘాలు కమ్మితే చంద్రుడు లేదనుకున్నావా ?
బండరాయివై నీ చుట్టుతిరుగుతున్నాడు.
మబ్బులు కమ్మితే వెన్నెలే లేదనుకున్నావా ? 
మేఘాల అంచుల్లో పసిడి రంగులు రాసి  
అవి కరగిపోతే ,సన్నజాజులై కురిసి
మనస్సులను, సరస్సులను, మైమరిపించదా ?

తరచి తరచి


తరచి తరచి విన్నాను
మళ్ళీ వినిపిస్తుందేమోనని
మంచుటెడారిలో
ఆమని గానం

ఆశాలోకం



నా మనసు అద్దంలోనికి
తొంగిచూస్తుంటాను
నిర్మల ప్రశాంత ఆశాలోకం
కనిపిస్తుందేమోనని

ఉగాది


మా ఇల్లు చెరకు తోట
మా ఊరు చంద్రలోకం
ఊరి మద్యలో మర్రిచెట్టు
ఊరి చివరనే వేపతోపు
వరండాలోనే మామిడి పూత
మరి రోజూ ఉగాదే !

మూడు చక్రాల సైకిలు

చందమామ వెన్నెట్లో
నాన్నగారి గుండెలపై నేను.
అమ్మ తినిపించే మజ్జికన్నం.

మీ ఆలన, పాలన, లాలన
నా మూడు చక్రాల సైకిలు.
మీరు చెప్పిన ఏడు చేపల కథలు
ఏడు ఖండాలు నింపే నా ప్రపంచయాత్రలు .

మమతల చిరునవ్వుల చాటు
అనురాగాల పొదివినల్లుకున్నాం.
బాల్యపు లోగిడి నుండి
జీవితపు సాయంత్రాలకు ప్రయాణం.

ఈ నిండు రాత్రిభూగోళానికి అటు మీరున్నా
మీ నిండు ప్రేమ,
ఇటు నిండు వెన్నెలై కురుస్తుంటే,
నాకీ సుఖం చాలు !

ఒప్పుదిద్దిన అక్షరమై

తప్పుచెప్పిన ఏడెక్కంలొ
చిరిగిన పుస్తకపు దొంతరలలొ
సాక్షివై, తల్లీ ఉంటావమ్మా?

ఒప్పుదిద్దిన అక్షరమై
ఊపిరివై, తల్లీ ఉంటావమ్మా?

మంచు పిడుగులు

విశాల విశ్వంలో నువ్వూనేను
స్నిగ్ధసామ్రాజ్యంలో భగ్నహృదయాలు
వన్నెల విను వీధుల మబ్బుల చాటు
భావురు మనే మంచు పిడుగులు
విశాల విశ్వంలో నువ్వు, విశాల విశ్వంలో నేను

గాలి పటం

పొమ్మంటారు
నల్దిక్కుల లోకంలో
దిక్కులేని గాలి పటంలా
పొమ్మంటారు

పొమ్మంటారు
క్రింది వైతరిణీ జ్వాలల్లోనికో
పైని పొగమబ్బుల చాటుకో
పొమ్మంటారు

ఇదో వింతలోకం
సప్తస్వరాల కోకిలకు వర్ణమే ఇవ్వని
ఎగిరే గాలి పటానికి దిక్కులే తోచని
వింతలోకం, నువ్వు పొమ్మన్న లోకం

వస్తావా?

అలల చాటు వర్షిణి వై
కలల చాటు కౌముదివై
కొకిలమ్మ వర్ణమై
జాబిలిలో వెండి మరకవై

కలవై, అలవై
ఎదురుచూడని ప్రశ్నవై
జాబిలివై, వర్ణమై
వసంతమై వస్తావా?

నీటి ఒడ్డున హంసనై
నీలి తారకనై
తొలిమావి చిగురునై
ఈ కవితకు చివరి అక్షరమై ఎదురు చూస్తాను.

కలవై, అలవై
ఎదురుచూడని ప్రశ్నవై
జాబిలివై, వర్ణమై
వసంతమై వస్తావా?

చిరు మరకలు


కళ్ళల్లోని కలలన్నీ కిటికీ అద్దంపైకి చేరుకుంటాయి
ఊహల్లోని ఊసులన్నీ మంచుబిందువులై జారుతాయి
రేపటి ఉదయాన్నే సూర్యుడు వీటిని ఆవిరిచేస్తాడు
అప్పుడు యీ స్మృతులన్నీ చిరుమరకలుగా మిగిలిపోతాయి

గుర్తున్నాయా మిత్రమా?


గుర్తున్నాయా మిత్రమా?
నోటు బుక్కులో మనం రాసిన తీపి కబుర్లు
గోడలపై ఇద్దరి పేర్లు

నా జ్వరంలో జలజల రాలిన నీ కన్నీళ్ళు
జీడిచెట్లకింద నువ్వు దాచి ఇచ్చిన మామిడి పళ్ళు
ఆగి ఆగి పాఠం మద్యలో పంచుకున్న మూగ సైగలు
గుర్తున్నాయా మిత్రమా?

చెట్టుచాటు నీడల్లో

మధురమయిన మౌనంలో
రేపటి గానం కోసం చూస్తుంటే

వెన్నెల రాత్రుల్లో, చెట్టు చాటు నీడల్లో,
ఎగసి పడే సెలయేరు శబ్దంలో వినిపిస్తావు
కనిపిస్తావు, మరిపిస్తావు

సెర్చ్

పోయిన హృదయాన్ని
వెన్నెల్లో వెతికాను, కాని
చీకట్లోనే దొరికింది

వెన్నెలంతా


వెన్నెలంతా సన్నజాజులై వాకిట్లో కురుస్తుంది
నీ కురులతో ఆడుకున్న పిల్ల గాలి అప్పుడప్పడు సన్నజాజులను ఎగరవేస్తుంది

ఒక్కతే ఆకాశంలో ఉన్న మేఘం కూడా ఇటువైపే చూస్తుంది
దూరాన నీలినీడగా నిలుచున్న కొండలు వెన్నెలమ్మ ఇక్కడకు కూడా వస్తుంది కదా అని ఎదురుచూస్తున్నాయి

సన్నజాజుల వాన నీటినంతా పన్నీరుగా మారుస్తుంది

ఈ ఆకాశం, నీలి కొండలు, సన్నజాజులు, నువ్వు-నేను!

సొగసు చూడ తరమా?

సొగసు చూడ తరమా?....... ఈ కృతి ఆణిముత్య0!

అమ్మాయి తిన్నగా వెలుతు0డగా.....కాలి పట్టీలు గడ్డి మొక్కకు తగులుకొని, కాలు చిక్కుకు0దనుకొ0డి.... కొ0చె0 చిరు కోప0గా వ0గి, కురులు సవరి0చుకొని, చిక్కు విప్పుతు0ది కదా, అప్పుడు .....ఆ సొగసు చూడ తరమా?

పిల్లలు స్కూలుకి వెల్లే ము0దు, దొ0గ ఎత్తు వేస్తున్న చ0టివాడిని , సిగమొలతోనే, నీటి కు0డీ పక్కనే నీళ్లు పోస్తున్న ఇల్లాలి సొగసు చూడ తరమా?

ము0దు వసారాలో , సన్నజాజులను, ఒకొక్కటిగా తె0పి తలలో , ముడుచుకున్నప్పుడు, ఆ సొగసు చూడ తరమా?

పుస్తక0 పక్కన తోసి, కొ0చె0 అట్లు తిప్ప0డి, వస్తాను అ0టూ చేతిలో అట్లకాడ పెట్టి పారిపోతున్న తరుణి సొగసు చూడ తరమా?

కోపమొచ్చినా, అలసటొచ్చినా, అలకొచ్చినా, ఎదురుచూసినా, చమటోర్చినా, ఆన0ద0 ఒలకపోసే చెలి సొగసు చూడ తరమా?

ప్రేమలేఖలు

ఈ సెల్ ఫోన్లు, మెస0జర్లు, ఈమెయిల్లు రాని కాల0లో కుర్రాల్లు బుద్దిగా ప్రేమలేఖలు రాసేవారు. ఏ ఇన్లా0డ్ కవర్లోనో, గ్రీటి0గ్ కార్డు లోపలో చక్కగా, వీలయిన0త ఒద్దికగా, ఒక్క రూపాయి ఖర్చుతో , ప్రేమ వ్యక్త0 చేసే మార్గమది. ప్రేమలేఖలు వ్రాయట0లో కొ0దరు బాగా చేయి తిరిగిన వారయితే కొ0దరు పాప0 చాలా తడబడతారు. కొ0దరు నిష్కర్షగా విషయ0 చెప్పగలిగితే మరి కొ0దరు అసలు విషయ0 కాక మిగిలినవన్ని చెబుతారు. అయినా ప్రేమలేఖలు సృష్టి0చే భావాలే వేర0టారు వాటిన వ్రాసినవారయినా , అ0దుకున్న వారయినా...

అ0దుకే ప్రేమలేఖలు ఎలావ్రాయాలి , ఎలా అ0దజేయాలి అని కొన్ని సూచనలు:

1. లేఖని ఎట్టి పరిస్థితి లోనూ మామూలుగా రాయకూడదు. వీలయితే మ0చి సె0టు పెన్నుతోగానీ, ఎక్కడా దొరకని ర0గు ఇ0కుతోగానీ రాయవలెను. ( హెడ్మాష్టరు గారి ఆకుపచ్చ సిరా అయితే ఇ0కా మ0చిది. కానీ అ0దుకు అతని పెన్ను తస్కరి0చాలి అదివేరే స0గతి. )

2 మీ దస్తూరి అ0త0త మాత్రమయితే మ0చి దస్తూరి ఉన్న నమ్మకస్తుడయిన దోస్తుని బతిమాలాలి. మీకు అక్కో, చెల్లో ఉ0టే ఆమెను ఒప్పి0చగలిగితే చాలు.

3. మీకు ఏమాత్ర0 వ్రాయటానికి విషయ0 తోచకపోతే ఒక వార0 రోజులు మన పాత సినిమాలు చూడ0డి. 'ప్రేమదేశ0', 'ప్రేమికులరోజు', 'ప్రేమికుడు', 'ప్రేమలేఖ' ఇలా ఒకడజను సినిమాలు చూస్తే చాలు మీరు మేఘస0దేశ0 లెవెల్లో లవ్ లెటర్లు రాయొచ్చు.

4. ఇక డెలివరీ మార్గాలు......
మాటలు అ0త0త మాత్ర0గా వచ్చిన పిల్లలయితే మేలు. కానీ ఇక్కడ ఒక ప్రమాద0 ఉ0ది. ఆ పిల్లో, పిల్లాడో మన బుడుగులాగా కానీ, సీగానపెసూనా0బలా గానీ చిన్నప్పుడే బాగా ముదిరిపోతే మీ వీపు విమాన0మోత మోగే ప్రమాద0 ఎ0తయినా ఉ0డవచ్చు.

5. ఆమె కానీ లేదా ఆ అబ్బాయిగానీ, ల0చ్ బాక్సు తెచ్చుకు0టే అ0దులో పెడితే సరిపోతు0ది.

6. మీకు మరీ సిగ్గు లేకపోతే తిన్నగా చేతిలో కూడా పెట్టవచ్చు.

7. చివరిగా, కథ అడ్డ0 తిరిగితే దాగోవడానికి ఏర్పాట్లు చాలా ముఖ్య0. ము0దుగానే, ఒక వార0 రోజలు మీ తాత గారి ఇ0టికి పోయే కార్యక్రమ0 పెట్టుకోవట0 చాలా మ0చిది.

ఇట్లు మీ
శ్రేయోభిలాషి
****

సూచన: మీరు లేఖకు అత్తరు పూస్తే ఇ0కా మ0చిది.

కోమలి

కోమలి బుచ్చిబాబు గారి కథానాయక. పల్లెటూరి పిల్ల , కథానాయకుడి ప్రేయసి. బుచ్చిబాబు కోమలిని ఎలా వర్ణిస్తార0టే......

మామిడితోపులో ఆడుకు0టూ ఉ0టు0ది కోమలి, అప్పుడు బుచ్చిబాబు ఏమ0టార0టే...

"...అట్లా గడ్డపోచల మధ్యగ0తులేస్తూ ఆకాశాన్నీ, భూమిని బుజ్జగిస్తూ స్నేహ0 చేసుకు0టూ వు0డవలసిన వ్యక్తి కోమలి. ఆమె నిజస్థాన0 అది.

పుట్టినిల్లు పచ్చగడ్డి, అత్తిల్లు ఆకాశ0. పిట్టలు, పువ్వులు స0తాన0. మనుషుల మధ్య యి0డ్లల్లో వు0డవల్సిన మనిషికాదు. కొ0దరు కొన్ని వాతావరణాలకోస0 ఉద్దేశి0పబడతారు. ఆ వాతావరణ0 మధ్యనే వారికి పరిపూర్ణత వు0టు0ది. స్వేచ్ఛా జీవనానికి ఆలయాలు వాతావరణమే. అ0దులో0చి తొలగిస్తే వారు నీరు విడిచిన చేపలు - శృ0ఖలాలు లేని బానిసలు. "

కాసేపటికి చెట్లనీడలో కూర్చు0టు0ది కోమలి,

"సర్వీచెట్లు వానాకాల0లో పీల్చుకున్న వర్ష0 నీటిన ఈనాడు మెల్ల మెల్లగా వొదులుతూ కోమలిని మధ్య కూచోబెట్టి తల0టుపోస్తు0ది. గాలి సిగ్గులేని పిచ్చి పువ్వుని బలవ0త0గా తల్లో అమరుస్తు0ది. వానకి చలి0చిన వేడి భూమిలో మైక0 చె0ది సుగ0ధ పరిమళ0 కి0ద ఆమెని ఆక్రమిస్తు0ది. ఎర్రపువ్వులను బ0ధి0చుతున్న గడ్డిపోచలు , గాలికి ఎ0డలో మెరుస్తూ, లయగా ఆరబెట్టిన ఆకుపచ్చ పట్టుచీరలా , ఎ0డుకుని, కోమల్ని చుట్టుకు0టాయి ! "

నువ్వు వస్తే

నువ్వు ఎర్రటి మందారం గానో, తెల్లటి పావురం గానో, నల్లటి మేఘం గానో వస్తే
తుమ్మెదనై, చిరు గాలినై, పిల్ల కాలువనై నీకోసం ఉంటాను

నువ్వు కరువులో చినుకులా, అమావాశ్యలో వెన్నెలలా, ఎడారిలో వర్షంలా రాకపోతే మాత్రం
కన్నీటినై , చీకటినై, వేడి నిట్టూర్పునై, వెనక్కిరాని దిక్కులలో దాగి పోతాను

యుద్ధం


అప్పుడెప్పుడో పడిన పిడుగు ఇంకా గుండెల్లో ప్రతిద్వనిస్తుంది
విషాదం రెక్కలు విప్పుకొని ఉషోదయాన్ని అల్లంత దూరంలో నిలబెట్టింది
నిశ్శబ్దంతో, నా గుండె చప్పుడు, మొన్నటి నీ నవ్వు, కాసేపు క్రితం గర్జంచిన మేఘం మాత్రం యుద్ధం చేస్తున్నాయి!

పాదాలు

అందాల నయగారాలు విషాదాల జలపాతాలు
కదిలే మేఘాల అంచుల్లో నీ కనురెప్పల కాంతులు
రాలిపడే చినుకుల్లో నీ కంటి కిరణాలు

ఎగసిపడే కెరటాల్లో నిన్నుతాకి నేలకొరిగిన గులాబీలు
పాదాలకు కూడా దేముడు కళ్ళిచ్చాడేమో
మెత్తగా వర్షిస్తున్నాయి కన్నీళ్ళని

కాలం చెప్తుంది

నిజానికి చెప్పాల్సింది ఎంతో ఉంటుంది.
మాటలు సరే,
కన్నీళ్ళూ చెప్పవు.
కాలం చెప్తుంది కానీ
అప్పటికి అమృతం విషమవుతుంది.

(ఎన్. గోపి గారి వంతెన నుంచి)

మడిసైపుట్టాక కుసింత కళాపోసనుండాల!

బాపు, రమణ కలిసి సృష్టించిన అద్భుతమయిన సినిమాలలో ‘ముత్యాల ముగ్గు’ ఒకటి. రావుగోపాలరావు తెలుగు సినిమాలలో ఎన్నటికీ నిలిచిపోయే డైలాగులతో విలన్ పాత్ర పోషించారు ఈ సినిమాలో. మచ్చుకి ఒక సన్నివేశం.

(అప్పుడే తెల్లవారుతూ ఉంటుంది. ఎర్రటి అకాశంలో సూర్యుడు ఉదయిస్తుంటాడు. పరకడుపునే చుట్టకాలుస్తూ సూర్యోదయం చూస్తుంటాడు విలన్ రావుగోపాలరావు.

సెగట్రీ: నారాయుడొచ్చాడండి.
రావు: వచ్చాడా తీసుకొచ్చావా?
సెగట్రీ: యెస్సర్. తీసుకొచ్చాను చూస్తారా?
(నారాయుడిని మర్డర్ చేయిస్తాడు రావుగోపాలరావు. నారాయుడి బాడీని రావుగోపాలరావుకి చూపించటానికి తెచ్చాడు సెక్రెట్రీ.)
రావు: అబ్బా సెగట్రీ ఎప్పుడూ పనులూ బిజినెస్సేనా? యే? పరగడుపునే కుసుంత పచ్చిగాలి పీల్చి ఆ పత్యక్షనారాయుడి సేవ చేసుకోవద్దూ?
సెగట్రీ: యెస్సర్
రావు: యెస్సర్ గాదు. కళ్ళెట్టుకు సూడు…..పైనేదో మర్డర్జరిగినట్టు లేదూ? ఆకాసంలో సూర్రుడు నెత్తురు గడ్డలా లేడూ?
సెగట్రీ: అద్భుతం సార్!
రావు: మడిసన్నాక కాసింత కళా పోసనుండాలయ్యా! ఉత్తినే తిని తొంగుంటే మడిసికీ గొడ్డుకీ తేడా యేటుంటాది? !
అలా మన అధునికాంధ్ర విలన్లను కూడా కళాభిమానులు చేస్తారు, బాపు, రమణ.