మరుపు

వేకువ ఝామునే
వెతికినా దొరకలేదు
జ్ఞాపకాల దొంతరలో
దాచుకున్న నీ పేజీ

వర్ణాలు

కాటుక
కళ్ళు
కావేరీ
కురులు
కటిక
రేలు
నలుపు

నవ్వులు
జాజి
పువ్వులు
సరస్వతీ
కోక
శరత్చంద్ర
మైదానాలు
తెలుపు

సాయంత్రపు
గోధూళి
వత్తిన
చెలి
ఆధరాలు
ఎదపై
కోరి పెట్టిన
వలపు
చిహ్నాలు
తెనుగింటి
ఆడపడుచు
నుదుటి
బొట్టు
ఎరుపు

మా ఇంటి
గుమ్మం
మా వదినమ్మ
చిరుదరహాసపు
వదనం
వాకిట్లో
ఉదయ
కిరణం
బాగాముగ్గిన
మామిడి
పసుపు

తలలో
దోపిన
పెరటి
మొరం
పచ్చని
కంచి పట్టు
వోణి
పండుగనాటి
అరటాకు
కోకిల్లమ్మ
తినే మావి
చివుళ్ళు
ఉడుక్కున్న
చెల్లి మొహం
పసివాడి
కళ్ళ మధ్యలో
ఆకు పచ్చ



కాలపు ద్వీపాలు

కాలపు
ద్వీపాలు

మిణుగురుల్లా
మనుషులు

ద్వీపాల మధ్య
తెరచాపల

ఓడల్లో
నీడల్లా

సాగే మనసుల
చుక్కాని

అప్పుడప్పుడూ
వేసిన లంగరు

సుడిగుండాలను
దాటే మనసులు

కాలపు
ద్వీపాలు

ఆగి ఆగి
వీచే గాలి

అంతంతగా
మేఘావృత

ఆకాశంలో
వాన్ గో (van Gogh)
చిత్రంలా

కాంతి
సుడిగుండాలను
తిప్పే

కాలపు
ద్వీపాలు

శోకం

నీ కోసం
నా శోకం

నీ క్లేశం
నను
తాకినప్పుడు

కర్కోట శీతల
గ్రహంపై
పెళ్లుబికిన
మంచు శకలంలా

నా విషాధం
శని గ్రహాన్ని*
తాకితే

ఈ ఏడాది
ధృవ నక్షత్రాన్ని
పట్టుకు తిరిగే

ధరిత్రికంతా
నా శోకం
ఆక్సిల్

మీ కోసం
పాలపుంత
నక్షత్రాలన్నింటికి

ఒక్కో శోకపు
చుక్కా
నే నేడిస్తే

ఆ చుక్కల
నా కన్నీటి
చుక్కల

అణువు లన్నింటికి
పేలిందా
ఒక్కో సూపెర్నోవా

ఆ పగిలే
మరి
మిగిలే

ధూళిరేణువు
నెభ్యులా లన్నింటికి
చెప్పాలి

నేనూ
వస్తున్నాను
పాతాలపు

అగ్ని నదులలో
ప్లూటో యమ
గ్రహాల్లో

మనిషి ఊహలు
కయిపర్ బెల్ట్
చేరే లోపే

నిను
వెతికి
హత్తున

చేరే
కాలం
ఏమాత్రం

ఇంతే కదా
కాలపు
దూరాలు

నైలు నదీ
యాత్రికులా
టైగరిస్ఒడ్డున

చెంఘీజ్ ఖాన్
అశ్వాలా
అతి పూర్వపు
హిమకరులా

అంతరించిన
ర్రాక్షస బల్లులా
తోక చుక్కలా

ఇన్నే కాని
రోజులలోనే
వస్తున్నాను

ఇంతే కదా
కాలపు
దూరాలు

నివ్వు లేని
ఫెమ్టో సెకన్లలో ***
పీకో సెకన్లు ***

నానో సెకన్లు ***
కోటాను కోట్ల
తూటాల్లా

నను పొడిస్తే
విడిచే
నిట్టూర్పుల్లో

కాలం సాగిపోతే
బ్రహ్మాండానికి
విస్ఫోటపు (inflatory)
కాలానికి

శూన్యంలో
జనించే
మెటీరియల్
చిహ్నంగా

వికల్పానికి
సంకల్పానికి
సమీధి నవనీ

ఇంతే కదా
కాలపు
దూరాలు

నీకై బరువు
నిండిన
గుండె

రోదసిని
పంక్చర్
చేస్తే

సూపర్నోవాలా
రోదసీ కాలాన్ని
వంచేస్తే

వెనుకల
మళ్ళీ మళ్ళీ
నీ ఊహల

ప్రతిబింబాల్లో
కాలయాత్ర (time travel)
చేస్తున్నా

కాలపు
దూరపు
తేమలకై

సంకల్ప
యాత్ర
చేస్తున్నా

ఇంతే కదా
కాలపు
దూరాలు

(పితృ దేవత కాలం చేసి సంవత్సరం.
కాలాన్ని అర్థం చేసుకోవాలి అంటే
భౌతిక శాస్త్రం చదవాలి.

ఈ కవిత నిండా ఉన్నది అదే.

అతి భయానక మంచు గ్రహం Enceladus
దాని శీతల గీజార్లో వచ్చే పొగలు
దగ్గర్లో సాటర్న్ ను తాకుతాయి.
భద్ధలయ్యే హృదయాన్ని దానితో పోల్చాలి.

ఏడాది అయిన ఆయన చుట్టూ తిరిగే హృదయాన్ని
ధృవతారతో పోల్చక తప్పదు.

కయిపర్ బెల్ట్ చేరటానికి satellite కి పట్టేది 70 ఏళ్ళు. కాంతికి పట్టేది కొన్ని రోజులు.

తరువాత ఉపమానం ఇంకా క్లిష్టం.
బ్లాక్ హోల్ చుట్టు అనేకానేక బింబాలు
ఏర్పడతాయి. అవి కాంతిని వంచితే
ఏర్పాడిన బింబాలు అన్నమాట.

వెనకలి రోజుల్ని చూసే మార్గం అది.
కానీ ఇక్కడ బ్లాక్ హోల్ భారమయిన
గుండె అన్న మాట.

నానో, ఫెమ్టో సెకన్లు అతి చిన్న సమయాలు.
అలాగే సృష్టిలోజరిగిన కాలం అతి పెద్ద కాలం.
కానీ వాటిని పోలిస్తే మనం మళ్ళీ కలిసే కాలం ఏ
మాత్రం.

తప్పలేదు వివరం రాయక. మన్నించాలి సహృదయంతో.)

టైం ట్రావెల్

ఇంతే కదా
కాలపు
దూరాలు

నివ్వు లేని
ఫెమ్టో సెకన్లలో
పీకో సెకన్లు

నానో సెకన్లు
కోటాను కోట్ల
తూటాల్లా

పొడిచే
విడిచే
నిట్టిర్పుల్లో

కాలం సాగిపోతే
బ్రహ్మాండానికి
కాలానికి

వికల్పానికి
సంకల్పానికి
సమీది నవనీ

ఇంతే కదా
కాలపు
దూరాలు

నీకై బరువు
నిండిన
గుండె

సూపర్నోవాలా
రోదసీ కాలాన్ని
వంచేస్తే

వెనుకల
మళ్ళీ మళ్ళీ
నీ ఊహల

ప్రతిబింబాల్లో
కాలయాత్ర
చేస్తున్నా

కాలపు
దూరపు
తేమలకై

సంకల్ప
యాత్ర
చేస్తున్నా

ఇంతే కదా
కాలపు
దూరాలు

ఊర్మిళ

విరిగే కెరటంలా
తుళ్ళిపడ్డ
నావలా
ఎగిరిపోయే
హంసలా

కొండల్లో
ఓడల్లో
నీ అలివేణీ*
నీలి జడల
నీడల్లో

గుప్పుమన్న
గుండెల్లో
ఎదలో
ఉప్పొంగిన
ఊపిరిలో

ఎప్పుడయినా
చప్పుడయిన
గుప్పెడయిన
గుండెల్లో

ముద్దుకారే
వంపుల్లో
శ్వేతమయిన
కంఠంలో
వంశధారా
ఎదలో
అరబిక్కడలి
పసిఫిక్కుల
దూరంలో

ఆధర
మధుర
ధారల్లో
దారుల్లో
గోదారుల్లో
ఓదార్పుల్లో
రూపుల్లో
కనుపాపల్లో
నిదురించెనా
ఊర్మిళా

* Curly


లక్ష్మీ జననం

పడమటింట పుట్టావా
ఓ చంద్రవంక
నీవంకల్లో
పుట్టెనే
నీరజాక్షి
కంటివంక
చీనీ కనులలో
కటిక కాటుకలు
పోసేవే
పడమటింట
కస్తూరి
పూసేవే
కమలాల్లో
మల్లెల్లో
క్షీరాబ్ది
కన్యకకు
ధవళ వస్త్రధరివై
తళుకులాడే
వరమై
పడమటింట
పుట్టావా
పద్మంలోపుట్టావా
పదంలోపుట్టావా

(క్షీర సాగర మధనం లో పుట్టిన లక్ష్మీ దేవికి)

సినిమా పాట

(ఇది మన తెలుగు
హీరో ఎంట్రీ ఇచ్చే సాంగ్

సినిమా: పోటుగాడు
మొదటి సాంగ్
హీరో: పాత హీరో మనవడి బామ్మర్ది)

అంచులు దాటే
ఊహల్లోకి

ఊహలు దాటే
హద్దుల్లోకి

హద్దులు దాటే
ముద్దుల్లోకి

చెలియా వస్తావా

ముద్దులు దాటే
ఊహల్లోకి

ఊహలు దాటే
లోకంలోకి

చెలియా వస్తావా

లోకం ఎరుగని
ద్వీపంలోకి

ద్వీపం దాటే
హద్దుల్లోకి

చెలియా వస్తావా

వస్తే వాట్సాప్
చేస్తే

లిప్స్ చేసే
గ్రిప్ కోసం

గ్రిప్ చేసే
లిప్స్ కోసం

చెలియా వస్తావా

చూస్తే గిస్తే
వలపులు
ఇస్తే

పెప్సీ ఇస్తే
పాపకి
నస్తే

చెలియా వస్తావా

ముద్దుల బస్తీ
కసికసిగా
కుస్తీ చేస్తే

చెలియా వస్తావా

ఔనే గలీజు
రాజుని

ఔనే గరీబు
మజ్నుని

కానీ
చెలియా వస్తావా

కాదే ఎగిసిన
కెరటం

కాదే విరిచిన
స్వప్నం

చెలియా వస్తావా

ఔనే వీర
జవానుని

కానీ మిల్కీ
మిత్రుడుని

చెలియా వస్తావా

కానీ ఏడు
అడుగుల
సాథీ

ఔనే నీ
స్వప్నపు
సేతువు

చెలియా వస్తావా

ఔనే అజాత
శత్రువు

ఇవ్వాలీ
మరి
ఇవ్వాలి

ముద్దుల
గుమ్మా
ఇవ్వాలి

చెలియా వస్తావా

మనసులు
దాటే

స్వప్నములన్నీ
ఇవ్వాలి

చెలియా వస్తావా




లజ్జ

నల్దిక్కుల లోకంలో
దిక్కులేని
పుట్టినరోజు
పుట్టినిల్లు
తెలియని
బాటసారి

ఆవు దూడయిన
పెంకుటింట నిదరిస్తే
తలపై నీలితెరతోనే
సేద తీరును
బాటసారి

ఇనుప గజ్జెల తల్లి
దీవిస్తే కటిక
పేదరికమున
ఇనుప సామాను
వేరెను బాటసారి

రంగుల అద్దాల
రహదారిలో
తన రూపమే చూసెను
ఏకాంతపు బాటసారి

పొగ మంచు
ఊరిని కమ్మితే
మంచు తెరనే
దుప్పటిగా కప్పెను
బాటసారి

జన్మదినం తెలియని
ఇతనికి జండా పండుగే
రంగుల రోజు
జన్మ నక్షత్రం తెలియని
ఇతనికి ధ్రువ నక్షత్రం
జన్మ నక్షత్రం

ఇతను అంతర్దాన
మహిమా పాత్రుడు
ఇతని గురించే
రోజు వాదించే
నాయకుడికి
బీచ్ రోడ్డులో
ఇతను మాత్రం
కనపడడు

ఇతను దేశం కోసం
చేసే పస్తులు వ్రతాల
ఫలితమేమో మనం
చంద్రుణ్ణి చేరిందే

ఇతని ఇల్లు
నీలితెర
ఇతని బంధువు
ఊరి కుక్క

ఇతను గాంధేయవాధి
ఇతని గుమ్మం
కాకులు వాలే
గాంధీ బొమ్మ

బొమ్మకిందే
గాంధీ వాక్కుల
సాక్షిగా
ఇతని ఆకలి
మనకు సిగ్గు

గీతాంజలి

ఆజాదీ
ఆజాదీ

ఉక్కు నరాలకు
ఆజాదీ

ఎండే పొలాలకు
ఆజాదీ

ఘర్మ జలానికి
ఆజాదీ

తోసే రిక్షాకు
ఆజాదీ

వేలాడే బాలలకు
ఆజాదీ

పొగగొట్టాల్లో కాలే గాలికి
ఆజాదీ

తరిగే గుండెలకు
ఆజాదీ

కోచింగ్ క్లాసులో
నలిగే పసితనానికి
ఆజాదీ

సిగ్గుల గువ్వలకు
నవ్వే
ఆజాదీ

నల్లని భుర్ఖా
తీసి పారేసే
ఆజాదీ

నల్లని భుర్ఖా
నచ్చితే కట్టే
ఆజాదీ

గగన భవంతుల కింద
రోడ్ల పక్కన
పస్తుల నుంచీ
ఆజాదీ

నోటులు మార్చే
నీతులు చెప్పే
దొంగల నుండీ
ఆజాదీ

ఆచారాలు అపచారాలు
శృంఖలాలలో
హృదయాల నుండీ
ఆజాదీ

సంకెళ్లు వీడే
మనసుని ముందుకు
లాగే స్వేచ్ఛ కోసం
ఆజాదీ

- విశ్వకవి జ్ఞాపకాలు 2020 లో కూడా అవసరం కదా ?

పునరపి జననం

పారిజాత
పుష్పాలో
నల్లని
శీతాకాల
రాత్రులో
నీ ఈ
కురుల
నీడల్లో
సాగిపోతే
ప్రతీ
రాత్రి

వసంత
రాత్రుల
మామిడి
చిగురుల
జవ్వన
ఆధరపు
పుల్లని
పెదవులో

కావేరి
ఒడ్డున
ఋతుపవన
గాలుల్లో
చెమ్మని
తొలకరిలో

బ్రహ్మ
గీసిన నీ
కొంటె
కోనల్లో
కలిసి
వేసే
తొలి
నాట్లు

శంఖు
పుష్ప
నారీకేళ
మృదుల
ఎదలలో
కర్కశంగా
కలిసి

కోరుకున్న
ఘాతాల
సాక్షిగా
వదలిపోకు
మిత్రమా

చీమవై
భ్రమరమై
పాల
పిట్టవై
ఎగిరే
హంసవై

నీవు
జన్మనెత్తితే
నీవెనుకే
పీపీలక
కీటక
కౄంచ
పక్కిలా
పుట్టనా
నిను
కుట్టనా

పునరపి
జనణం
నీకై
శయణం

ఒప్పులకుప్పా

పావురాలు
పెంచెనే
శకుంతలను.
దొంగ
రాయలేదా
రసరమ్య
రామాయణము.
లక్షమణుండు
కోసెనే
అబలను.
రాధకు
రావణ
సోదరికి
కుంతికి
గిరిజకు
గంగకు
అంబకు***
యజ్ఞసేనికి
కలిగిందీ
మనసు కాదే ?
మాలి
వాసన
చూస్తేనే
ఆముక్తమాల్యద**
రాముని
భద్రునికే*
అంతుచిక్కని
సత్యం

విరించి
గాధలలో
విధాత
తలపులలో

తప్పుఒప్పులెంచ
సాధ్యమా
ఒప్పులకుప్పా ?

* ఇక్కడ రాముని భద్రుడు ,  రాముడికి సీతపై    తప్పుగా చెప్పిన చాకలి.
** గోదాదేవి పూల వాసన చూసి పెడితేనే దేవుడు గ్రహించే వాడంట !
*** అంబ,   భీష్ముడి చే అపహరింపబడి మోసపడిన అంబ పరసురాముడి శరణం కోరుతుంది.

వలస పక్కి

బైకాల్ సరస్సు
లోతులెరిగి
పులీకాట్
రుచిచూసి

అంటార్కిటికా
అంచుల్లో సేదతీరి
ఎగిరిపోవాలి
టర్న్ పక్షిలా

ఎగిరే  ఆ  వలస
పక్షిని అడుగు
భూమి వ్యాసమెంతో
ఆకలి తీరేటంత

ఆకలి పోటే మిటో
అడుగు టర్న్ పక్షిని
వేల యోజనాలు
సాగేటంత

యోజనాల పొడుగేమిటో
అడుగు వలస పక్షిని
నిద్రలో సయితం
ఎగిరేటంత

నిద్ర మత్తేమిటో
అడుగు వలస పక్షిని
అంతరాళ సువాసన
గుండెల్లో నిండేటంత

మరి బుల్లి గుండెకంత
యాతనెందుకో

కన్న భూమిరా ఇది
వలస పక్షికయిన
భరత భూమిరా
పులికాట్ సరస్సయినా

మీ అనుంగుడు

ఎవరయితే
ఇంటి ముందు
గులాబీ తోట
పెంచగలడో

ఎవరయితే
ద్రాక్ష తీవి
ఒక ఎండు కొమ్మునుంచి
పెంచగలడో

ఎవరయితే
హుమ్మింగ్ పక్షికై
ప్రత్యేకంగా
పుష్పాదులను
పూయించగలడో

ఎవరయితే
సరదాగా మృదంగం
హార్మోనికా
వాయించగలడో

ఎవరయితే
ఇరుగుపొరుగుతో
బాణాలు ఆడించి
శబ్ద భేది చెయ్యగలడో

ఎవరయితే
చెల్లికాయతో
వంట గులాబిజాం
నేర్చుకోగలడో

ఎవరయితే
సన్ గొడుగులో
పార్టీ చేయగలడో

ఎవరయితే
సొంత స్టార్టప్పులో
అర్ధాంగిని
కలుపుకోగలడో

ఎవరయితే అయిదేళ్ళు
ప్రాపకం చేసి నూనుగు
నవబాలుడితో
అణు శాస్త్రం
వల్లింప గలడో

ఎవరిచేత మొక్కగాని
పూవుగాని పిల్లలు గాని
వర్ధిల్లెనో

ఎవరికి శత్రువులు
పుట్టరో పుడితే
క్రమేణా వీర
గంధములు పెట్టెరో

ఎవరి కథలను
భారతీయ వ్యాపార
పాఠసాల (ఐ.ఎస్.బి)
లో కథలుగా చెప్పెరో

ఎవరయితే యువతీ యాతా
నవమృదు కేశావృద్ధి
కళ సృష్టించెనో

ఎవరయితే ఆశువుగా
పెళ్ళాంపై కవితరాసి
ముక్కు చివాట్లు
తినగలడో

అయినా

అతనే శివశక్తి
సమాయోగుడు
అనుంగుడు
మీ కవికటకవి

శకుంతల

వసంతపు మందారాలు
శిశిరపు శశీ
పులకిత తామరలు
ఎండల్లో చెట్టుకే
పండే జీడీ పళ్ళు
రోహిణీ కార్తెలో
భళ్ళున లేచే
సూర్యభగవానుడు
ఆగ్నేయపు ఋతుపవనాలు
మళ్ళీ వచ్చే దీపావళీ

మళ్ళీ మళ్ళీ
వలస వచ్చే
శ్వేత హంసలా
ఈ ఋతువుల సాక్షిగా

కదిలే నీ కళ్ళలోని
రెండు పుష్కరాల
అలల కలల
ఊసులు

శిశిరపు నిశా
రాత్రిని కాటుక
చేసిపెడితే
పొరపాటున
వర్షించిన మేఘంలా
ఒక్క ఒక్క
బొట్టు రాలితే
నీ కాటుక కళ్ళలో
కాశ్మీరపు బోటు
షికారులా
అప్పుడే కొండమల్లె చెండుపై
వర్షించిన తొలకరినై పోదునా

తడిగుడ్డతో
మూసిన మొగ్గలనో
పొగమంచు కప్పుకున్న
కొండల్లా ప్రకృతీ
కన్యపు ఎదనో

నీ విశాల సాగర
నిర్మల ప్రశాంత
మనసుకు
పులీకట్ సరస్సులా
దప్పికిచ్చిన
సుమధుర
ఎదలో
వలస పక్షినై
పుట్టలేనే

కైలాసాన్ని
తప్పించుకున్న
గంగ ఉరకలెత్తినట్టున్న
నీ నల్లటి కురుల
సువాసనలో
డిసెంబర్ వెన్నెల్లో
వీచే ఎడతెరిపి గాలుల్లో
వాగే గుండెలు
నీ కురుల
వాగుల్లో ఆగిపోలేవా

పుట్టతేనె తెచ్చి
కోనసీమ కొబ్బరి లోపోసి
వర్షాల్లో కొండల్లో
కొనల్లో పుట్టే
జలపాతపు
నీటిలో కలిపిన
మాధుర్యాన్ని
నిను చేరే
మేఘంలా
ఎలా చేరాలి

నా కళ్ళలోని
అలల కలల
ఊసులు




చెల్లికాయ్

బల్లివైనా నల్లివైనా
చెల్లివి
వాగినా రబ్బరులా
నీ నోరు సాగినా
చెల్లివి

కొండల్లో పెండల్లో
దుంపలు ఏరుకునే
బంటివి
ప్రజల చెవుల్లో
వాగుడుతో గూడుపెట్టే
కందిరీగవు
అయినా చెల్లివి

నీ మాంసభక్షణకు
కోళ్లూ చేపలు పందులు
అంతరించిపోయినా
అయినా చెల్లివి

నువ్వు మాట్లాడితే
ఋతుపవనాలు
పొట్లాడితే
కోడిపందాలు
అయినా తప్పదు
చెల్లివి

జింపిరి జుట్టు
అగ్గిపుల్ల తగువులు
గంట పెట్టే టీ
అయిన చెల్లివి

నువ్వు నల్లివనో
బల్లివనో కొండ
మల్లి వనో
తుమ్మముల్లు వనో
అనలేదే నువ్వు
కేవలం చెల్లివి

నువ్వు తిండిముచ్చువో
కొండముచ్చువో
పిల్లకాయవో
చెల్లికాయవో
అన్నానా

పేలుతల్లివో
అమ్మతల్లివో
అన్నానా
చెల్లి మాత్రం అన్నాను

ఈ కవిత విని
నన్ను తన్నినా
నాకు దొరికిన ఓన్లీ
బంగారు తల్లివి
కేవలం చెల్లివి

అన్న

ఎవరు మాట్లాడితే
వర్షమా మాటలా
తెలియదో

ఎవరు  రుబ్బురోలులోచెయ్యిపెట్టి
తాండ్ర పాపరాయుడిలా
భావిస్తాడో

ఎవరు అద్దె సైకిలు పై
వన భోజనానికి
వస్తాడో

ఎవరు పావలా
ఐసు బేరమాడి
కొంటాడో

ఎవరు చొక్కా జేబీలో
అప్పడం
దాచుకుంటాడో

ఎవరు పిండొడియానికి
యుద్ధం
ప్రకటిస్తాడో

ఎవరు దమ్ములో
మూలుగు కోసం
తమ్ముణ్ణి కొట్టేదో

ఎవరు దోమ దోమకీ
పావలా ఇచ్చేనో

ఎవరు తల్లిని
బిడ్డనూ శైలూనూ
ఎండల్లో తిప్పెనో

ఎవరు బేరమాడి
రిక్షాలో విమానాశ్రయానికి
వెళ్ళెనో

ఎవరు పక్కింటోల్ని
హౌసీలోదోచెనో

వాడే మా అన్న
శివ సూర్య ప్రకాష్

ఇటాలియన్స్ ఆఫ్ ద ఈస్ట్

చెన్నైలో
చితికిపోయి
కర్నూలులో
ఖంగుతిని
భాగ్యనగరంలో
బోల్తాపడి
అంధ్రులు
పడ్డారు
అమరావతిలో

టంగుటూరు
శ్రీరాములు
సంజీవయ్యాల
కలలు దాయాదుల
పాలు

తెలుగు
ప్రధానికే
దక్కలేదు
రాజసం
తెలుగోడికి
మిగిలింది
అక్కసం

కమలమని
హస్తమని
అందరిని
నమ్మేస్తాం
జుట్టు
చేతికిచ్చి
లాగొద్దని
మొక్కుతాం



శ్రీకాకుళం
 యిజీనారం
యాసమనది
విశాఖ
ఉక్కుమనది

పగో
తూగో
మట్టిమనది

బెజవాడ
బస్తీమనది
ప్రకాశం
పరువుమనది
గుంటూరు
మిర్చిమనది

నెల్లూరి
నేలమనది
కర్నూలు
కలలు
మనవి

కడపలో
కోపాలు
రాయలోరి
రతనాలు
సింహగిరి
సంపెంగలు
రామకృష్ణ
ఇసుకతిన్నెలు

కోటలోని
రాకెట్టులు
చలిత లలిత
చూర్ణ కుంతకాంతలు
మనవికావా
ఆంధ్రుడా

అచ్చంతపు
భాష మనది
హవాయి
ఇటాలియన్
స్థాయి
అచ్చ తెలుగు
ఆంధ్ర భాషది

మాటల్లో
హవాయిలా
చేతల్లో
ఇటాలియన్లా
ఉండాలోయ్
ఆంధ్రుడా

వేసవి

తుమ్మచెట్టు నీడలో
పట్టిమంచం ఓడలో
తాతగారి లోగిడిలో
చిన్ననాటి ఎండాకాలం

తాటిముంజు కన్నులా
కల్లంలో బువ్వలా
తాటి బురుకు బండిలా
చిన్ననాటి ఎండాకాలం

బుల్లి మరదలి అలకలా
అన్నయ్య బాదుడులా
మామయ్య గారాబంలా
చిన్ననాటి ఎండాకాలం

అట్లాసు సైకిల్లా
పాత టైరు ఆటలా
రెండు ఎడ్ల బండిలా
చిన్ననాటి ఎండాకాలం

కోమటి గవ్వల్లా
చెరువు కాడి గువ్వల్లా
మట్టి పొయ్య మీద కోడి కూరల్లా
చిన్ననాటి ఎండాకాలం

తాటి తాండ్ర తీపిలా
తుమ్మ జిగురు పొగరులా
ముంత కల్లు అగరులా
చిన్ననాటి ఎండాకాలం

ఏటిలో గేలంలా
కోనేటి నీటిలా
నూతిపక్క స్నానంలా
చిన్ననాటి ఎండాకాలం

వస్తాను మిత్రమా

తూరుపు కనుమల
తురాయి నీడల్లో
కనుల చెరువుల ఓడల్లో
తెరచాపనెత్తి
వస్తాను మిత్రమా


ఒంటరి

ఎదురు చూస్తోంది
ఒంటరి మేఘం
నెలవంక కోసం

ఒంటరి దీపం
ఎదురు చూస్తోంది
కుశలం చేసే దోసిలికై

ఒంటరి మనసు
ఎదురు చూస్తోంది
లలిత సలిత కవితకై

అంతర్ముఖి

చిందవందర స్మృతులలో
తుఫాను కంటిలోని ఆకాశంలా
ఆప్పుడప్పుడూ నవ్వుతాడు
అంతర్ముఖి

అంతరాళ‌‌పు నిర్మలత్వం
అరేబియన్ సముద్రపు లాలిత్వం
వీచే కొబ్బరి చెట్ల గాలి
అక్కడక్కడా వాకిలిని వేడెక్కించే ఎండచుక్కలు
అంతర్ముఖి మనో వీధికి విండోలు

ఎదురు చూపులూ, వీడ్కోలులూ
అహల్యపు దూరస్పర్శలూ
దివి దూరాన ఆత్మబంధు స్మృతులూ స్పర్శిస్తే
ఎండకు ఎండీ వానకు తుప్పుపట్టిన హిమోగ్లోబిన్
షివరిస్తుంది కంపిస్తుంది
అంతర్ముఖి రక్త ప్రవాహం

వింధ్యా పర్వత అనాధ శ్రేణులూ
తూర్పు కనుమల ఇష్టసఖులూ
ఆవిరినిండిన మేఘ నిట్టూర్పులను ఆపితే
అప్పుడప్పుడూ విశ్రామంగా

సవివరంగా మేఘాలు కొండ ఎలివేటరెక్కితే కరుగుతుంది ఘనీభవించిన అనురాగపు మంచు
మైనపు వైనంలా చుక్క చుక్కగా పిగులుతుంది
అంతర్ముఖి మనోపర్వతం

తీరం మధురం

సాయం మధురం
సాగరం మధురం

దూరాన గోధూలి మధురం
విసిరిన వలలే మధురం

మెరిసిన అలలే మధురం
పసిపిల్లల నవ్వులు మధురం

జొన్నగంటెలు మధురం
నిండిన బుంగలు మధురం

సిగ్గులైన బుగ్గలు మధురం
తెన్నెటి తీరం మధురం

నిదురించిన విశాఖ మధురం

తెరచాప

రాత్రి అమృతం కురిసింది
మూర్తీభవించిన కలలు కరిగితే
అలల కెరటాలపై
దూరపు చంద్రాస్తమయానికి
కాలం తెరచాపలెత్తింది